కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసం

విశ్వాసం

విశ్వాసం

కొంతమంది దేవుని మీద భక్తి ఉందని చెప్తారు, కానీ “విశ్వాసం” అంటే ఏమిటని అడిగినప్పుడు వాళ్లు సరిగ్గా చెప్పలేరు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎందుకు ముఖ్యం?

విశ్వాసం అంటే ఏంటి?

కొంతమంది ఏమంటారు?

నిజమైన ఆధారాలు లేకపోయినా ఒక విషయాన్ని నమ్మడమే విశ్వాసం అని చాలామంది అనుకుంటారు. ఉదాహరణకు, దేవుని మీద భక్తి ఉన్నవాళ్లు “నేను దేవుని నమ్ముతున్నాను” అంటారు. “ఎందుకు నమ్ముతున్నారు?” అని అడిగితే, “చిన్నప్పటి నుండి అలా పెరిగాను,” “నాకు అదే నేర్పించారు,” అని జవాబు ఇవ్వవచ్చు. అలాంటి జవాబులు విన్నప్పుడు విశ్వాసానికి, అమాయకంగా అన్ని నమ్మేయడానికి పెద్ద తేడా లేదని అనిపిస్తుంది.

దేవుడు ఏమంటున్నాడు . . .

మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే విశ్వాసం; అంతేకాదు, మనం నమ్మేవి కంటికి కనిపించకపోయినా అవి నిజంగా ఉన్నాయనడానికి రుజువే విశ్వాసమని బైబిల్లో ఉంది. (హెబ్రీయులు 11:1) ఏదైన ఒక విషయం తప్పక జరుగుతుందని నమ్మాలంటే, బలమైన ఆధారాలు కావాలి. ‘తప్పక జరుగుతాయని బలంగా నమ్మడం’ అనే మాటలకు మూల భాషలో ఉన్న పదాన్ని గమనిస్తే, అవి కేవలం మన ఉద్దేశాలు లేక కోరికలు మాత్రమే కావని అర్థమౌతుంది. విశ్వాసం అంటే రుజువుల ఆధారంగా కలిగే బలమైన నమ్మకం.

“ఆయన [దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.”రోమీయులు 1:20.

విశ్వాసం పెంచుకోవడం ఎందుకు ముఖ్యం?

దేవుడు ఏమంటున్నాడు . . .

“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”—హెబ్రీయులు 11:6.

ముందు చూసినట్లు చాలామందికి అలా నేర్పించారు కాబట్టే వాళ్లు దేవున్ని నమ్ముతారు. ‘చిన్నప్పటి నుండి నాకు అలాగే నేర్పించారు,’ అని వాళ్లు చెప్పవచ్చు. కానీ దేవుడు ఆయనను ఆరాధించేవాళ్లు ఆయన ఉన్నాడని, ఆయనకు మనమీద ప్రేమ ఉందని నిజంగా నమ్మాలని కోరుకుంటున్నాడు. అందుకే, దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలని అనుకునేవాళ్లు ఆయనను హృదయపూర్వకంగా వెదకాలని బైబిలు చెప్తుంది.

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”యాకోబు 4:8.

విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి?

దేవుడు ఏమంటున్నాడు . . .

“వినుట వలన విశ్వాసము కలుగును,” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 10:17) కాబట్టి దేవుని మీద విశ్వాసం పెంచుకోవడానికి వేయాల్సిన మొదటి అడుగు ఆయన గురించి బైబిలు చెప్తున్న వాస్తవాలను ‘వినడం.’ (2 తిమోతి 3:16) బైబిలు గురించి బాగా తెలుసుకున్నప్పుడు, “దేవుడు ఎవరు?, దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఏంటి?, దేవుడు నన్ను నిజంగా పట్టించుకుంటాడా?, భవిష్యత్తు విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటి?” లాంటి ముఖ్యమైన ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు దొరుకుతాయి.

దేవుడు ఉన్నాడని చెప్పడానికి మనచుట్టూ ఎన్నో రుజువులు ఉన్నాయి

బైబిలు గురించి నేర్పించడానికి యెహోవాసాక్షులు మీకు సహాయం చేస్తారు. మా వెబ్‌సైట్‌ jw.org చెప్తున్నట్లు, “యెహోవాసాక్షులు బైబిలు గురించి ప్రజలకు బోధించడానికి సంతోషిస్తారు, కానీ మేము ఎప్పుడూ మా మతంలో కలవమని ఎవ్వరినీ బలవంతం చేయం. దేన్ని నమ్మాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకు లేదా అతనికి ఉందని గుర్తిస్తూ బైబిలు ఏమి చెబుతుందో గౌరవపూర్వకంగా వివరిస్తాం.”

చివరిగా చెప్పాలంటే, ముందు మీరు బైబిల్లో చదివిన విషయాల్లో ఉన్న నిజాన్ని గ్రహించాలి. మీరు గమనించిన ఆధారాలను బట్టి మీ విశ్వాసం ఉండాలి. అప్పుడు, మీరు దాదాపు 2,000 సంవత్సరాల క్రితం బైబిలు గురించి నేర్చుకున్న వాళ్లను అనుసరిస్తారు. వాళ్లు, “ఆసక్తితో వాక్యమును అంగీకరించి, . . . చెప్పిన సంగతులు ఆగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.”—అపొస్తలుల కార్యములు 17:11. ◼ (g16-E No. 3)

ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.యోహాను 17:3.