కుటుంబం కోసం | తల్లిదండ్రులు
ఇంటి పనులు చేయడం ఎంత ముఖ్యం?
సమస్య
కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఇంటి పనుల్లో సహాయం చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలు కూడా ఎలాంటి పేచీ పెట్టకుండా సహాయం చేస్తుంటారు. ఇంకొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ పనులు చెప్పరు, పిల్లలు కూడా పనులు చేయాలని అనుకోరు.
ఇలాంటి పద్ధతి ఎక్కువగా ప్రాచ్య దేశాల్లో కనిపిస్తుంది అని పరిశోధకులు అంటున్నారు. అక్కడ పిల్లలు తీసుకునేవాళ్లే కానీ ఇచ్చేవాళ్లు కాదు. స్టీవెన్ అనే ఒక తండ్రి ఇలా అంటున్నాడు: “ఈ రోజుల్లో, పిల్లల్ని వీడియో గేమ్‌లు ఆడుకోవడానికి, ఇంటర్నెట్, టీవీ చూడడానికి వదిలేస్తున్నారు. వాళ్లకు ఏదైన పని చెప్పాలని కూడా అనుకోరు.”
మీకు ఏమనిపిస్తుంది? ఇంట్లో పనులు చేయడం నిజంగా ముఖ్యమేనా? పిల్లలు పనులు చేయడం ఇల్లు చక్కగా ఉండడానికే కాదు పిల్లలు సరిగ్గా ఎదగడానికి అవసరమా?
మీరు తెలుసుకోవాల్సినవి
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో పనులు చెప్పడానికి ఇష్టపడరు. రోజూ స్కూల్ నుండి వచ్చాక పిల్లలకు చాలా హోమ్‌వర్క్, లేదా స్కూల్ పనులు ఉంటాయి కాబట్టి వాళ్లకు అస్సలు ఖాళీ ఉండదని ఇంట్లో పనులు చెప్పరు. కానీ, పనులు చెప్పడం వల్ల ప్రయోజనాలను చూద్దాం.
పిల్లలు బాధ్యతగా పెరగడానికి ఇంటి పనులు సహాయం చేస్తాయి. ఇంట్లో పనులు చేసే పిల్లలు స్కూల్‌లో బాగా చదువుతారని అంటారు. అది నిజమే, ఎందుకంటే ఇంట్లో సహాయం చేయడం వల్ల పిల్లలకు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం పెరుగుతుంది. అంతేకాదు వాళ్లలో మనో ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణ లాంటి మంచి లక్షణాలు వస్తాయి. ఇవన్నీ చక్కగా నేర్చుకోవడానికి చాలా అవసరం.
వేరేవాళ్లకు సహాయం చేసేలా ఇంటి పనులు పిల్లలకు నేర్పిస్తాయి. పిల్లలుగా ఇంట్లో పనులు చేసినవాళ్లు పెద్దయ్యాక సమాజ సేవలో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది గమనించారు. వాళ్లు అంటున్నది నిజమే ఎందుకంటే ఇంట్లో పనులు చేసినప్పుడు పిల్లలు వాళ్ల అవసరాల కంటే వేరేవాళ్ల అవసరాలు ముందుంచడం నేర్చుకుంటారు. ఇంతకుముందు చూసిన స్టీవెన్ ఈ విషయం గురించి ఇలా అంటున్నాడు: “పిల్లలకు ఏ పనులు చెప్పకుండా ఉంటే, వాళ్లు సేవలు చేయించుకోవడానికే ఉన్నామని అనుకుంటారు. పెరిగే కొద్దీ, జీవితంలో వాళ్ల బాధ్యతల విషయంలో, కష్టపడి పని చేసే విషయంలో వాళ్లకు తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి.”
ఇంట్లో పనులు కుటుంబంలో ఐక్యత పెంచుతాయి. పిల్లలు ఇంట్లో కష్టపడి పనిచేసినప్పుడు, కుటుంబంలో వాళ్లు విలువైన భాగమని, కుటుంబంలో వాళ్లకు కూడా బాధ్యత ఉందని తెలుసుకుంటారు. ఇంటి పనుల కన్నా తల్లిదండ్రులు చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పిల్లలు ఈ విషయాన్ని నేర్చుకోరు. ఒకసారి ఇలా ప్రశ్నించుకోండి: “నా పిల్లలు వాళ్ల సమయమంతా
స్కూల్‌కే ఇచ్చి, కుటుంబంతో ఉన్న సంబంధాన్ని కోల్పోతే ఏంటి ఉపయోగం?”ఏమి చేయవచ్చు
చిన్న వయసులోనే మొదలుపెట్టండి. మూడు సంవత్సరాలు నుండే తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో పనులు చెప్పాలి అని కొంతమంది అంటారు. ఇంకొంతమందైతే, రెండు సంవత్సరాలు లేదా ఇంకా తక్కువైనా ఫర్లేదు అంటారు. ఎందుకంటే బాగా చిన్న పిల్లలకు అమ్మానాన్నలతో కలిసి పని చేస్తూ వాళ్లలా ఉండాలంటే చాలా ఇష్టం.—మంచి సలహా: సామెతలు 22:6.
వయసుకు తగ్గట్టుగా పనులు చెప్పండి. ఉదాహరణకు మూడు సంవత్సరాల బాబు లేదా పాప ఆటవస్తువుల్ని సర్దవచ్చు, ఏమైనా కింద పడితే శుభ్రం చేయవచ్చు, బట్టలు సర్దడానికి సహాయం చేయవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు ఇల్లు ఊడ్వవచ్చు, కారు కడగవచ్చు, వంట కూడా చేయవచ్చు. మీ పిల్లల శక్తిని బట్టి పనులు చెప్పండి. ఇంటి పనులు చేయడం వాళ్లకు ఎంత ఇష్టమో చూసినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు.
ఇంటి పనులు ముఖ్యమని చెప్పండి. ప్రతిరోజు కుప్పలుకుప్పలు హోమ్‌వర్క్ ఉన్నప్పుడు పిల్లలకు పనులు చేయడం కష్టమే. కానీ, ఎక్కువ మార్కులు రావాలని ఇంట్లో పనులు చెప్పకుండా ఉంటే “సరైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వనట్లే” అని ద ప్రైస్ ఆఫ్ ప్రివ్‌లెజ్ అనే పుస్తకంలో ఉంది. ముందే చెప్పినట్లు, ఇంట్లో పనులు చేసినప్పుడు పిల్లలు ఇంకా బాగా చదవగలుగుతారు. ఇప్పుడు వాళ్లు నేర్చుకున్న పాఠాలు రేపు వాళ్లకు సొంత కుటుంబం వచ్చినప్పుడు సహాయం చేస్తాయి.—మంచి సలహా: ఫిలిప్పీయులు 1:10.
ఫలితాల కన్నా మీ ముఖ్య ఉద్దేశం గురించి ఆలోచించండి. ఒక పని పూర్తి చేయడానికి మీరు అనుకున్నదాని కంటే మీ పిల్లలు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఆ పనిని ఇంకా బాగా చేయవచ్చని కూడా మీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు, వాళ్లు చేస్తున్నది ఆపమని చెప్పి మీరే ఆ పనిని చేసేయకండి. పెద్దవాళ్లు చేసినంత బాగా చేయాలి అనే ఉద్దేశంతో కాదుగానీ మీ పిల్లలు బాధ్యతలు గురించి, పనులు చేయడం వల్ల వచ్చే సంతోషం గురించి నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేయించండి.—మంచి సలహా: ప్రసంగి 3:22.
నిజమైన బహుమానాన్ని ఇవ్వండి. పనులు చేసినందుకు డబ్బులు ఇవ్వడం ద్వారా పిల్లలకు బాధ్యత నేర్పించవచ్చు అని కొంతమంది అంటారు. కానీ, అలా చేయడం వల్ల పిల్లలు ఇంట్లోవాళ్ల నుండి వాళ్లకు ఏం వస్తుంది అనే ఆలోచిస్తారు గానీ వాళ్లు కుటుంబానికి ఎలా సహాయపడవచ్చు అని ఆలోచించలేరని ఇంకొంతమంది అంటారు. పిల్లల దగ్గర సరిపడా డబ్బు వచ్చేశాక ఇంట్లో పనులు చేయము అని కూడా చెప్పే అవకాశం ఉందని వాళ్లు చెప్తున్నారు. అంటే వాళ్లకు పనులు చెప్పడంలో మీ ముఖ్య ఉద్దేశం విఫలం అయినట్లే. మరేం చేయాలి? పిల్లలకు పనులు చెప్పడానికి, వాళ్ల ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుకు ఏ సంబంధం లేకుండా చూసుకోవాలి.