వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయండి
సమస్య
మనకు ఎవరి మీదైతే చెడు అభిప్రాయం ఉందో, ఆ ప్రజలతో కలవకుండా దూరంగా ఉంటే మనలో వివక్ష మరింత పెరగవచ్చు. అంతేకాదు మనలాంటి వాళ్లతోనే స్నేహం చేస్తే మనం ఆలోచించే, భావించే, ప్రవర్తించే విధానమే సరైనదని అనుకునే ప్రమాదం ఉంది.
బైబిలు సలహా
“మీ హృదయాల్ని విశాలం చేసుకోండి.”—2 కొరింథీయులు 6:13.
అంటే . . . ‘హృదయం’ అనే పదం మన భావాల్ని, భావోద్వేగాల్ని సూచించవచ్చు. మనలాంటి ప్రజల్నే ఇష్టపడితే, మన హృదయం ఇరుగ్గా తయారై మూసుకుపోవచ్చు. అలా అవ్వకూడదంటే, వేరే వర్గాల ప్రజలతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడాలి.
వేరే వర్గాల ప్రజలతో స్నేహం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
మనం వేరే వర్గాల ప్రజలతో స్నేహం చేసినప్పుడు, వాళ్లు కొన్ని పనుల్ని ఎందుకు భిన్నంగా చేస్తారో అర్థంచేసుకుంటాం. వాళ్లతో స్నేహం బలపడే కొద్దీ వాళ్లూ మనలాంటి వాళ్లే అని గుర్తిస్తాం. వాళ్లను మరింత విలువైన వాళ్లుగా చూస్తాం; వాళ్ల సంతోషాన్ని మన సంతోషంలా, వాళ్ల బాధను మన బాధలా భావిస్తాం.
నజరీ ఉదాహరణ పరిశీలించండి. ఒకప్పుడు ఆమె వలసవచ్చిన వాళ్ల మీద వివక్ష చూపించేది. ఆ వివక్షను ఎలా తీసేసుకుందో ఆమె చెప్తోంది: “నేను వాళ్లతో సమయం గడిపాను, వాళ్లతో కలిసి పనిచేశాను. అప్పుడు వాళ్ల గురించి మిగతా ప్రజలు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని నాకు అర్థమైంది. మీరు వేరే సంస్కృతికి చెందిన వాళ్లతో స్నేహం చేసినప్పుడు, వాళ్లు అచ్చం మీలానే ఉండాలని కోరుకునే బదులు వాళ్లను వాళ్లలానే చూడడం, ప్రేమించడం మొదలుపెడతారు.”
మీరేం చేయవచ్చు?
వేరే దేశం, జాతి, లేదా భాషకు చెందిన ప్రజలతో మాట్లాడే అవకాశాల కోసం చూడండి. బహుశా మీరు . . .
-
వాళ్ల గురించి ఏదైనా చెప్పమని అడగవచ్చు.
-
వాళ్లను భోజనానికి పిలవవచ్చు.
-
వాళ్ల అనుభవాలు విని, వాళ్లకు ఏవి ప్రాముఖ్యమో తెలుసుకోవచ్చు.
వాళ్ల అనుభవాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ వర్గానికి చెందిన ప్రజల మీద మీకు మంచి అభిప్రాయం ఏర్పడవచ్చు.