కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక సృష్టికర్త ఉన్నాడా? తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఒక సృష్టికర్త ఉన్నాడా? తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?

ఒక సృష్టికర్త ఉన్నాడా అనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? కనిపిస్తున్న రుజువుల్ని చూసి సర్వశక్తిగల దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే, బైబిల్ని ఆయనే రాయించాడని నిరూపించే రుజువుల్ని కూడా తెలుసుకోవాలని మీకు అనిపించవచ్చు. ఆ తర్వాత, బైబిలు చెప్పే విషయాలు నిజమనే నమ్మకం మీకు కుదిరితే, మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. అవేంటో తెలుసుకోవాలని ఉందా?

మీరు ఇంకా ఎక్కువ ఆనందంగా జీవిస్తారు

బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన [అంటే, దేవుడు] ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ, ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.”—అపొస్తలుల కార్యాలు 14:17.

దానర్థం: ప్రకృతిలో మీరు ఆనందించే ప్రతీది సృష్టికర్త ఇచ్చిన బహుమతే. వాటిని ఇచ్చిన దేవునికి మీపై ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకుంటే, ఆయనిచ్చిన బహుమతుల మీద మీకున్న కృతజ్ఞత ఇంకా ఎక్కువ పెరుగుతుంది.

మీకు ప్రతీరోజు ఉపయోగపడే తెలివైన సలహాలు పొందుతారు

బైబిలు ఇలా చెప్తుంది: “నువ్వు నీతి, న్యాయం, నిష్పక్షపాతం అంటే ఏంటో అర్థం చేసుకుంటావు, ఏది మంచి మార్గమో గ్రహిస్తావు.”—సామెతలు 2:9.

దానర్థం: మిమ్మల్ని సృష్టించింది దేవుడే కాబట్టి, సంతోషంగా ఉండడానికి మీకేమి అవసరమో ఆయనకు తెలుసు. బైబిలు చదివితే, మీకు జీవితంలో ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటారు.

మీ ప్రశ్నలకు జవాబు పొందుతారు

బైబిలు ఇలా చెప్తుంది: “దేవుని గురించిన జ్ఞానం నీకు దొరుకుతుంది.”—సామెతలు 2:5.

దానర్థం: సృష్టికర్త ఉన్నాడని మీరు రుజువుల్ని పరిశీలించి తెలుసుకున్నప్పుడు, ‘జీవితం అంటే ఏంటి? ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? చనిపోయాక మనకు ఏమౌతుంది?’ లాంటి ముఖ్యమైన ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. ఆ జవాబులు మరెక్కడో కాదు బైబిల్లోనే ఉన్నాయి.

మీకు భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది

బైబిలు ఇలా చెప్తుంది: “‘నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను. మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’ అని యెహోవా అంటున్నాడు.”—యిర్మీయా 29:11.

దానర్థం: భవిష్యత్తులో చెడుతనం, కష్టాలు, ఆఖరికి మరణం లేకుండా చేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకుంటాడనే నమ్మకం మీకు కుదిరితే, ప్రతీరోజు ఎదురయ్యే కష్టాల్ని ధైర్యంగా తట్టుకుంటారు. అంతేకాదు, భవిష్యత్తు కోసం ఆశతో ఎదురుచూస్తారు.