కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టి ఎలా వచ్చిందో మీరెలా తెలుసుకోవచ్చు?

సృష్టి ఎలా వచ్చిందో మీరెలా తెలుసుకోవచ్చు?

‘విశ్వానికి శూన్యం నుండి పుట్టే సామర్థ్యం ఉంది, నిజానికి విశ్వం శూన్యం నుండే వచ్చింది.’ —స్టీఫెన్‌ హాకింగ్‌, లియోనార్డ్‌ మ్లోడినౌ, భౌతిక శాస్త్రవేత్తలు.

“దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.”—బైబిలు, ఆదికాండం 1:1.

విశ్వాన్ని, జీవాన్ని దేవుడు సృష్టించాడా? లేదా వాటంతటవే శూన్యం నుండి వచ్చాయా? ఈ ప్రశ్నకు, పైన ప్రస్తావించిన ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు ఇచ్చిన జవాబు, అలాగే బైబిలు ఇస్తున్న జవాబు పూర్తి వేరుగా ఉంది. ఆ శాస్త్రవేత్తలు చెప్పిందే నిజమని కొంతమంది నమ్ముతున్నారు. ఇంకొంతమంది, బైబిలు చెప్పింది నిజమని నమ్ముతున్నారు. కానీ, ఇంకా చాలామంది ఏది నమ్మాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ విషయం మీద తమ అభిప్రాయాన్ని సమర్థిస్తూ చాలామంది పుస్తకాలు రాశారు, ఇంకొంతమంది టీవీ షోలు చేశారు.

బహుశా మీ టీచర్లు విశ్వం, జీవం వాటంతటవే వచ్చాయని, సృష్టికర్తే లేడని బల్లగుద్ది చెప్పివుంటారు. మరి, సృష్టికర్త లేడని చెప్పడానికి వాళ్లు రుజువులు ఏమైనా చూపించారా? ఇంకోవైపు మతబోధకులు, సృష్టికర్త ఉన్నాడని బోధించడం మీరు వినేవుంటారు. పోనీ వీళ్లైనా రుజువులు చూపించారా? లేదా ‘మేం చెప్తున్నాం కాబట్టి మీరు నమ్మాల్సిందే’ అంటున్నారా?

ఒక సృష్టికర్త ఉన్నాడా? అనే సందేహం మీకు ఎప్పుడోకప్పుడు వచ్చే ఉంటుంది. కాకపోతే ఆయన ఉన్నాడని గానీ, లేడని గానీ ఎవ్వరూ నిరూపించలేరని మీకు అనిపించి ఉంటుంది. ‘అసలు దాని గురించి తెలుసుకోవడం నిజంగా ప్రాముఖ్యమా?’ అనే సందేహం కూడా మీకు రావచ్చు.

చాలామంది, సృష్టికర్త ఉన్నాడని ఏ రుజువుల్ని బట్టి నమ్ముతున్నారో ఈ తేజరిల్లు! పత్రిక తెలియజేస్తుంది. భూమ్మీద జీవం ఎలా వచ్చిందో తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా వివరిస్తుంది.