కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అసాధారణమైన మార్పులు’

‘అసాధారణమైన మార్పులు’

‘అసాధారణమైన మార్పులు’

“మానవ చరిత్రలో మునుపు ఏ శతాబ్దంలోనూ జరగని అసాధారణమైన, విస్తృతమైన మార్పులు 20వ శతాబ్దంలో జరిగాయి.”—ద టైమ్స్‌ అట్లాస్‌ ఆఫ్‌ ద ట్వంటీయత్‌ సెంచురీ.

చాలామంది 20వ శతాబ్దాన్ని గురించి తలపోసినప్పుడు, టైమ్‌ పత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ అయిన వాల్టర్‌ ఐజక్‌సన్‌తో నిస్సందేహంగా ఏకీభవిస్తారు, ఆయనిలా అన్నాడు: “శతాబ్దాలన్నింటినీ పోల్చి చూసినప్పుడు ఈ శతాబ్దం అత్యంత అసాధారణమైనదిగా, ఎంతో ప్రేరణాత్మకమైనదిగా, కొన్నిసార్లు భయవిహ్వలుల్ని చేసేదిగా ఉంటుంది, ఇది నిత్యమూ అచ్చెరువొందిస్తుంది.”

అదేవిధంగా నార్వేకు ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న గ్రూ హార్లెమ్‌ బ్రూయెంట్‌లాంట్‌, ఈ శతాబ్దాన్ని “అతివృష్టి అనావృష్టిలతో కూడిన, . . . మానవుల దౌష్ట్యం నీచాతి నీచమైన స్థాయికి దిగజారిన” శతాబ్దం అని పిలిచింది. ఇది “గొప్ప పురోభివృద్ధులు సాధించబడిన శతాబ్దం, [కొన్ని ప్రాంతాల్లో] అనూహ్యమైన ఆర్థిక అభివృద్ధులు జరిగిన శతాబ్దం” అని కూడా ఆమె అంటుంది. అయితే అదే సమయంలో, నగరాల్లోని బీద ప్రాంతాల్లో “జనాభా పెరుగుదల సమస్యా, బీదరికం మూలంగా అనారోగ్యకర పరిసరాల మూలంగా రాగల వ్యాధుల సమస్యలూ” భవిష్యత్తులో అధికమయ్యే సూచనలు ఉన్నాయి.

రాజకీయ అల్లకల్లోలం

20వ శతాబ్దం ప్రారంభంలో, చైనాలోని మంఛూ సామ్రాజ్యం, ఆటోమన్‌ సామ్రాజ్యం, యూరప్‌లోని అనేక ఇతర సామ్రాజ్యాలు ఈ ప్రపంచంలోని అధికశాతాన్ని అదుపుచేస్తూ ఉన్నాయి. ఒక్క బ్రిటీష్‌ సామ్రాజ్యమే, భూగోళంలో పావువంతును తన చెప్పుచేతల్లో పెట్టుకుంది, భూమ్మీది ప్రతి నలుగురిలో ఒకరిపైన ఆధిపత్యం చెలాయించింది. ఆ శతాబ్దాంతానికి ఎంతో పూర్వమే ఈ సామ్రాజ్యాలన్నీ చరిత్రపుటలకే పరిమితమైపోయాయి. “1945లోనే సామ్రాజ్యవాద యుగం అంతమైంది” అని ద టైమ్స్‌ అట్లాస్‌ ఆఫ్‌ ద ట్వంటీయత్‌ సెంచురీ చెబుతుంది.

సామ్రాజ్యవాదం అంతం కావడంతో, 17 నుండి 19 శతాబ్దాల మధ్యకాలంలో యూరప్‌లో వీచిన జాతీయవాద పవనాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. “రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లోని అనేక దేశాల్లో జాతీయవాద స్ఫూర్తి తగ్గిపోయింది. . . . అయితే సామ్రాజ్యవాదానికి విరుద్ధమైన ప్రతిస్పందనగా ఆసియా, ఆఫ్రికాల్లో జాతీయవాదం తీవ్రగతిన పెరిగింది” అని ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతుంది. చివరికి ద కాలిన్స్‌ అట్లాస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ చెబుతున్నదాని ప్రకారం, “చరిత్ర తెర మీద వర్ధమాన దేశాలు ప్రత్యక్షమయ్యాయి, అలా, ఐదు శతాబ్దాల క్రితం యూరోపియన్ల విస్తరణతో ప్రారంభమైన ఒక యుగం సమాప్తమైంది.”

సామ్రాజ్యాలు కూలడంతో, స్వతంత్ర దేశాలు ఉద్భవించాయి—వీటిలో అనేకం ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తరచు గట్టి వ్యతిరేకత ఎదురైంది, ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్‌లోనూ ఆసియాలోనూ ఉన్న శక్తివంతమైన నిరంకుశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిరంకుశ పరిపాలనలు వ్యక్తిగత స్వేచ్ఛను నిర్బంధించి, ఆర్థిక వ్యవస్థపైనా, సమాచార వ్యవస్థపైనా, సైనిక బలగాలపైనా గట్టి పట్టును సాధించాయి. ప్రపంచాధిపత్యం సంపాదించాలన్న వారి ప్రయత్నాలు చివరికి నిష్ఫలమయ్యాయి, కానీ ఈలోగా ఎంతో డబ్బు వృధా అయిపోయింది, ఎన్నో ప్రాణాలు బలయ్యాయి.

యుద్ధాలతో అతలాకుతలమైన శతాబ్దం

నిజంగా, మునుపటి ఏ శతాబ్దంతో పోల్చినా 20వ శతాబ్దం పూర్తి భిన్నంగా ఉంటుంది, దానికి కారణం యుద్ధమే. మొదటి ప్రపంచ యుద్ధం గురించి జర్మన్‌ చరిత్రకారుడైన గీడో నాప్‌ ఇలా వ్రాస్తున్నాడు: “1914, ఆగస్టు 1: యూరోపియన్లకు సుదీర్ఘమైన శాంతిని ప్రసాదించిన 19వ శతాబ్దం ఆ రోజున అంతమౌతుందని ఎవరూ ఊహించలేదు; నిజానికి అప్పుడే 20వ శతాబ్దం ప్రారంభమైనదని ఎవరూ గమనించలేదు కూడా—ఆ సమయంలో మూడు దశాబ్దాలపాటు కొనసాగిన యుద్ధం ప్రారంభమైంది, ఆ సమయంలో మానవుడు తోటి మానవునికి ఏమి తలపెట్టగలడో నిరూపణ అయ్యింది.”

హిస్టరీ ప్రొఫెసర్‌ అయిన హ్యూ బ్రోగన్‌, “ఆ యుద్ధం అమెరికాపై చూపించిన ప్రభావం విపరీతమైనది, ఘోరమైనది, అది నేటికీ [1998లో కూడా] తెలుస్తుంది” అని మనకు గుర్తుచేస్తున్నాడు. హార్వర్డ్‌ యూనివర్శిటీ వద్ద హిస్టరీ ప్రొఫెసర్‌గా ఉన్న అకైరా ఈరీ ఇలా వ్రాస్తున్నాడు: “అనేక రీతుల్లో మొదటి ప్రపంచ యుద్ధం అటు తూర్పు ఆసియా చరిత్రలోనూ ఇటు అమెరికా చరిత్రలోనూ ఒక పెద్ద సంఘటన.”

ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, మొదటి రెండు ప్రపంచ యుద్ధాలను “20వ శతాబ్దపు భౌగోళిక రాజకీయ చరిత్రలో గొప్ప మలుపురాళ్ళు” అని పేర్కోవడం అర్థం చేసుకొనదగినదే. “మొదటి ప్రపంచ యుద్ధం మూలంగా నాలుగు గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యాయి . . . , రష్యాలో బోల్షెవిక్‌ విప్లవం చెలరేగింది, అంతేగాక . . . రెండవ ప్రపంచ యుద్ధానికి పునాది వేయబడింది” అని అది చెబుతుంది. ఈ రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగినంత విస్తారమైన “మారణహోమం, హత్యాకాండ, వినాశనం మునుపెన్నడూ జరగలేదు” అని కూడా అది మనకు చెబుతుంది. గీడో నాప్‌ కూడా అదే పంథాలో మాట్లాడుతూ, “ఈ యుద్ధాల్లో కనిపించిన క్రూరత్వం, పాశవికం ఏ మానవ తలంపుకీ అందనిది. మానవుల్ని వ్యక్తులుగా కాక వస్తువులుగా దృష్టించే ఒక యుగానికి . . . ఈ యుద్ధరంగాల్లో బీజం పడింది” అన్నాడు.

ఇలాంటి విపత్కరమైన యుద్ధాలు భవిష్యత్తులో జరగకుండా నివారించాలన్న ఉద్దేశంతో 1919లో నానాజాతి సమితి ఏర్పడింది. ప్రపంచ శాంతిని పరిరక్షించే తన సంకల్పంలో వైఫల్యం చెందటం కారణంగా 1946లో ఐక్యరాజ్య సమితి దాని స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఐక్యరాజ్య సమితి మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించటంలో విజయవంతంగా ఉంటున్నప్పటికీ, దశాబ్దాలపాటు అణుయుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని మాత్రం అది నివారించలేకపోయింది. అంతేకాదు, బాల్కన్‌ రాష్ట్రాల విషయంలో జరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా చిన్న చిన్న యుద్ధాల్ని కూడా అది నివారించలేకపోయింది.

ఒక ప్రక్క ప్రపంచంలోని దేశాల సంఖ్య పెరుగుతూ ఉంటే, మరో ప్రక్క వాటిమధ్య శాంతిని పరిరక్షించటం మరింత కష్టతరంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం ఉన్న ప్రపంచపటాన్ని నేటి ప్రపంచపటంతో పోలిస్తే, కనీసం 51 ఆఫ్రికా దేశాలు, 44 ఆసియా దేశాలు 20వ శతాబ్దారంభంలో అసలు స్వతంత్ర దేశాలుగానే ఉనికిలో లేవని అర్థమౌతుంది. ప్రస్తుతమున్న 185 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 116 దేశాలు, సమితి స్థాపితమైన 1945లో స్వతంత్ర దేశాలుగానే లేవు !

“అత్యంత నాటకీయమైన సంఘటన”

19వ శతాబ్దం ముగింపుకి వస్తుండగా రష్యా సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. కానీ అది అప్పటికల్లా శీఘ్రగతిన తన మద్దతుని కోల్పోతూ ఉంది. జెఫ్రీ పోన్టన్‌ అనే రచయిత అభిప్రాయం ప్రకారం, చాలామంది ప్రజలు “సంస్కరణ సరిపోదు, విప్లవమే రావాలి” అని తలంచారు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “కానీ అసలైన విప్లవం చెలరేగటానికి ఒక పెద్ద యుద్ధమే—మొదటి ప్రపంచ యుద్ధమే కావల్సివచ్చింది, అటుతర్వాత ఏర్పడిన అరాచక పరిస్థితే ఆ విప్లవానికి దారితీసింది.”

ఆ కాలంలో బోల్షెవిక్కులు రష్యాలో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో ఒక క్రొత్త సామ్రాజ్యానికి పునాది వేయబడింది—అదే సోవియట్‌ యూనియన్‌ పురికొల్పిన ప్రపంచస్థాయి కమ్యూనిజం. సోవియట్‌ సామ్రాజ్యం భూగోళవ్యాప్త యుద్ధంలోనే పుట్టినప్పటికీ అది యుద్ధంతోపాటుగా అంతమొందలేదు. మైఖెల్‌ డాబ్స్‌ వ్రాసిన పుస్తకమైన డౌన్‌ విత్‌ బిగ్‌ బ్రదర్‌ ప్రకారం, 1970వ దశకం చివరికల్లా, సోవియట్‌ యూనియన్‌ అధఃపాతాళానికి “దిగజారిపోతూ ఉన్న బహుళజాతి సామ్రాజ్యంగా ఉంది.”

అయినా దాని పతనం హఠాత్తుగా సంభవించింది. నార్మన్‌ డేవిస్‌ వ్రాసిన యూరప్‌—ఎ హిస్టరీ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తుంది: “యూరప్‌ చరిత్రలో మునుపెన్నడూ చూడనంత అకస్మాత్తుగా అది కూలిపోయింది,” అంతేకాదు “సహజ కారణాల మూలంగానే అది జరిగింది.” నిజంగానే, “సోవియట్‌ యూనియన్‌ ఉత్థానం, దాని అభివృద్ధి, దాని పతనం, 20వ శతాబ్దపు అత్యంత నాటకీయమైన సంఘటనల్లో ఒకటి” అని పోన్టన్‌ చెబుతున్నాడు.

నిజానికి 20వ శతాబ్దంలో, అత్యంత విస్తృతమైన పర్యవసానాలను కలుగజేసిన ఎన్నో అసాధారణమైన మార్పుల్లో సోవియట్‌ యూనియన్‌ పతనం కేవలం ఒకటి మాత్రమే. రాజకీయమైన మార్పులు క్రొత్తేమీ కావన్నది నిజమే. అవి వేలాది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి.

అయితే, 20వ శతాబ్దంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి జరిగిన ఒక మార్పు చాలా ప్రాముఖ్యమైనది. ఈ మార్పు ఏమిటి, అది మీపై వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది అన్నవి తర్వాత చర్చించబడతాయి.

దానికి ముందు, 20వ శతాబ్దంలో విజ్ఞానశాస్త్రం సాధించిన కొన్ని పురోభివృద్ధులు చూద్దాము. వీటి గురించి ప్రొఫెసర్‌ మైఖేల్‌ హోవర్డ్‌ ఈ అభిప్రాయానికి వస్తున్నాడు: “మానవజాతి చరిత్రలో ఒక క్రొత్త యుగాన్నీ మరింత ఆనందకరమైన యుగాన్నీ 20వ శతాబ్దం ఆవిష్కరించిందని పశ్చిమ యూరప్‌లోని ప్రజలు అలాగే ఉత్తర అమెరికాలోని ప్రజలు భావించటానికి యుక్తమైన కారణాలు ఉన్నట్లు అనిపిస్తుంది.” ఈ పురోభివృద్ధులన్నీ మంచి జీవితం అని కొందరు పిలిచే జీవితానికి దారితీస్తాయా?

[2-7వ పేజీలోని చార్టు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

1901

64 ఏండ్ల పరిపాలనానంతరం విక్టోరియా రాణి మరణం

ప్రపంచ జనాభా 160 కోట్లకు చేరుకుంది

1914

అర్క్‌డ్యూక్‌ ఫెర్డినాండ్‌ హత్య. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం

చివరి జార్‌ అయిన నికోలస్‌ II, ఆయన కుటుంబము

1917

లెనిన్‌ రష్యాని విప్లవంలోకి నడిపించాడు

1919

నానాజాతి సమితి ఏర్పడింది

1929

అమెరికా స్టాక్‌ మార్కెట్‌ కూలిపోవడంతో గ్రేట్‌ డిప్రెషన్‌ ఏర్పడింది

ఇండియా స్వాతంత్ర్యం కోసమైన తన సమరాన్ని గాంధీ కొనసాగించాడు

1939

అడాల్ఫ్‌ హిట్లర్‌ పోలండ్‌పై ఆక్రమణ, రెండవ ప్రపంచ యుద్ధారంభం

విన్‌స్టన్‌ చర్చిల్‌ 1940లో గ్రేట్‌ బ్రిటన్‌కు ప్రధాని అయ్యాడు

నాజీ మారణకాండ

1941

పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ బాంబు దాడి

1945

హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ఆటంబాంబులు వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమాప్తం

1946

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మొదటి సమావేశం జరిగింది

1949

పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ఏర్పడిందని మావో సే-టుంగ్‌ ప్రకటించాడు

1960

పదిహేడు క్రొత్త ఆఫ్రికా దేశాలు ఏర్పడ్డాయి

1975

వియత్నాం యుద్ధం ముగిసింది

1989

కమ్యూనిజం పట్టుకోల్పోతూ ఉండగా బెర్లిన్‌ గోడ కూలింది

1991

సోవియట్‌ యూనియన్‌ ముక్కలైంది