కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆహ్లాదభరితులైన యుగళ గాయకులు

ఆహ్లాదభరితులైన యుగళ గాయకులు

ఆహ్లాదభరితులైన యుగళ గాయకులు

కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి

ఇద్దరు గాయనీ గాయకులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. తమ కళా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు. నాయకత్వం వహిస్తున్న గాయకుడు కొద్దిగా క్రిందికి వంగి, స్పష్టంగా మృదువుగా స్వరమెత్తాడు. ఆ ప్రభాత వేళలో ఎంతో శ్రావ్యంగా మృదుమధురంగా ఉన్న ఆ స్వరం గాలిలో అలా సుదూరాల వరకు వినిపిస్తుంది. గాయకురాలు, ఎంతో ఆకర్షణీయమైన తీరులో తలవంచి, సరిగ్గా తను మొదలుపెట్టవలసిన సమయంలో, మరింత పిచ్‌లో అంతే శ్రావ్యంగా గళమెత్తి పాడడం మొదలుపెట్టింది. ఆ యుగళ గీతం ఒక్కసారి ఊపందుకోగా, రెండు స్వరాలు కలిసి ఒకే స్వరంలా వినిపించసాగింది. నేను ఊపిరిబిగపట్టుకుని భావోద్వేగంతో వినడం మొదలుపెట్టాను, ఆ కళా నైపుణ్యాన్నీ, స్వర మాధుర్యాన్ని విని ఆశ్చర్యపోయాను.

అపూర్వమైన ఈ కళాప్రదర్శన జరిగినది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయన ఏ సంగీత సభలోనో కాదు. ఇక్కడే కెన్యాలో, మా ఇంటి దగ్గర ఉన్న ఒక చెట్టు కొమ్మపై రెండు పక్షులు చేసిన గాన కచేరి అది. అవి పాట పాడడం ముగిసిన తర్వాత, నిటారుగా నిలబడి తమ రెక్కలను చాచి ఎగిరిపోయాయి.

“ఒకే జాతి పక్షులు ఒకే చోటికి చేరుతాయి” అని నానుడి. అయితే, కొన్ని పక్షులు, కలిసి పాడడానికి కూడా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. అదీ ఏ మాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకే విధంగా పాడతాయి! ఆ యుగళ గీతంలో ఎంత స్వరసామరస్యం ఉంటుందంటే, వాటిని చూడకపోతే ఆ సంగీతాన్ని సృష్టిస్తున్నది రెండు పక్షులని వినేవాళ్ళు ఎవరూ అనుకోరు! శాస్త్రజ్ఞులు సహితం అపార్థం చేసుకున్నారు. యుగళ గీతాలు పాడడం పక్షుల నైజమని ఇటీవలి సంవత్సరాల్లోనే గ్రహించారు.

గంటానాదపు పక్షులు

ఉదాహరణకు, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతంలో ఉండే బూబూ ప్రావీణ్యంగల సంగీతజ్ఞురాలు. ఆఫ్రికా ఖండంలో కనిపించే బూబూ పాట, వేణువు రవళిని పోలి ఉంటుంది. రెండు లోహపు ముక్కలను ఒక దానికొకటి తాటించినప్పుడు వచ్చే శబ్దంలా దాని స్వరం అపూర్వంగా ఉంటుంది. కనుక దాన్ని గంటానాదపు పక్షి (బెల్‌ బర్డ్‌) అంటారు. బూబూ తలపై భాగమూ, మెడ వెనుక భాగమూ రెక్కలూ నల్లని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి, దాని మెడ క్రింది నుండి పొట్ట భాగం తెల్లగా ఉంటుంది, దాని రెక్కల పొడవునా తెల్లని చార ఉంటుంది. అలా అది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. బూబూలు ఎల్లప్పుడూ జంటలుగా కనిపిస్తాయి. ఆడా మగా రంగూ రూపూ ఒకేలా ఉంటుంది.

దట్టమైన అడవిలో గుండా లేదా పొదల గుండా నడుస్తున్నప్పుడు, బూబూలు కనిపించక ముందే వాటి ఉనికిని గ్రహించవచ్చు. మగ బూబూ గంట మ్రోతలాంటి మూడు స్వరాలను వెంటవెంటనే ఆలపిస్తుంది. ఆ రాగాలకు సమాధానంగా ఆడ బూబూ వెంటనే క్వీ అనే స్వరంతో సమాధానమిస్తుంది. కొన్నిసార్లు ఒక పక్షే కొంతసేపటి వరకూ కొన్ని రాగాలను పాడుతుంది, దాని భాగస్వామి మధ్యలో ఒక రాగాన్ని అందుకుంటుంది. ఆ విధంగా సంగీతస్వరాలతో ఆ పాట ఏ మాత్రం అంతరాయం లేకుండా శ్రావ్యంగా సాగుతుంది.

ఇంత సమన్వయం ఎలా జరుగుతుందన్నది, శాస్త్రజ్ఞులు ఇప్పటి వరకూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. “సాధన సంపూర్ణతను సాధించిపెడుతుంది” అనే మాట కనీసం కొన్ని సందర్భాల్లో నిజం కావచ్చని కొందరు అనుకుంటారు. ఆడా మగా పక్షులు ప్రతి రోజూ కలిసి పాడతాయి. ఆ విధంగా, అవి ఉన్నతమైన నిర్దిష్టమైన స్థాయిలో గాన కచేరీ చేయగల్గుతాయి.

ఆసక్తికరమైన ఒక విషయమేమిటంటే, బూబూలు ఉండే ప్రాంతాన్ని బట్టి వాటి “ఉచ్చారణ” వేరుగా ఉంటున్నట్లు అనిపిస్తుంది. స్థానికంగా వినిపించే స్వరాలను లేదా మరితర పక్షుల పాటలను అవి అనుకరించడం వల్లే ఇలా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పద్ధతిని స్వర అనుకరణం అంటారు. దాని ఫలితంగా, దక్షిణ ఆఫ్రికాలో ఎక్కువగా పొదలు ఉన్న దేశంలోని బూబూల పాటలకూ, తూర్పు ఆఫ్రికాలోని గ్రేట్‌ రిఫ్ట్‌ వ్యాలీలోని బూబూల పాటలకూ చాలా తేడా ఉంటుంది.

జీవితాంతపు భాగస్వాములు

“యుగళ గీతాలు పాడే జంటలు, ఎన్ని ఋతువులు గడిచినా కలిసి ఉండడాన్ని, జీవితాంతం కలిసి ఉండడాన్ని చూడడం హృదయాన్ని స్పర్శిస్తుంది” అని ద ట్రయల్స్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే పుస్తకంలో డేవిడ్‌ అటన్‌బరో అంటున్నారు. వాటి మధ్య ఉండే ఆ బలమైన అనుబంధానికి ఏది కారణమౌతుంది? సామరస్యంగా పాడేందుకు “ఒక పద్ధతిని పెంపొందించుకుని దాని ప్రకారం సాధన చేయడం ద్వారా, వాటి మధ్య ఉన్న అనుబంధం మరింత బలమైనదౌతుంది. ఒకే కొమ్మపై ప్రక్కప్రక్కనే కూర్చుని సంక్లిష్టమైన యుగళ గీతాలను పాడుకుంటాయి; కొన్నిసార్లు, జంటలోని ఒకటి లేకపోయినా, ఒంటరిగా ఉన్న పక్షి తాము కలిసే పాడే ఆ పాటను పూర్తిగా పాడుతుంది, తన జత పాడవలసిన భాగాన్ని కూడా తనే పాడుతుంది” అని కూడా అటన్‌బరో అంటున్నారు.

దట్టమైన ఆ చెట్ల మధ్య తాను ఎక్కడుందో తన జత పక్షికి తెలిపేందుకు కూడా ఆ పాటలు తోడ్పడతాయి. మగ పక్షి తన జత ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు, వివిధ స్వరాల పరంపరను పాడడం మొదలుపెడుతుంది. ఆడ పక్షి చాలా దూరంలో ఉన్నా కూడా గళాన్ని కలుపుతుంది. అవి సరిగ్గా తమ వంతుల ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి ఎంత ఖచ్చితంగా పాడుతాయంటే, అవి ముందే పథకం వేసుకున్నాయా అన్నట్లుగా ఉంటుంది.

అవి పనిచేసేటప్పుడు ఈలవేస్తాయి

సంగీతాన్ని వింటూ పనిచేయడాన్ని మీరు ఆస్వాదిస్తారా? అనేక పక్షులు అలా చేయడాన్ని ఆస్వాదిస్తాయి అని స్పష్టమౌతుంది. ఇతర పక్షులు పాడుతుండగా విన్న తర్వాత, “ఆడా మగ పక్షుల గుండె కొట్టుకునే రేటు పెరిగింది” అని చెబుతూ, పక్షుల పాటలు, వాటిని వింటున్న మిగతా పక్షులపై శారీరకంగా ప్రభావం చూపిస్తున్నాయనీ అంతేకాక, కొన్ని ఆడ పక్షులు, మగపక్షుల పాటలను వింటున్నప్పుడు “గూళ్ళను వేగంగా కట్టుకుంటాయి” అనీ, “ఎక్కువ గుడ్లను పెడతాయి” అనీ మైకిల్‌ బ్రైట్‌ వ్రాసిన ద ప్రైవెట్‌ లైఫ్‌ ఆఫ్‌ బర్డ్స్‌ అనే పుస్తకం పేర్కొంటోంది.

ఉష్ణమండలంలోని బూబూల్లాగా యుగళ గీతాలను పాడే పక్షులను గురించిన ఆసక్తికరమైన విషయాలను శాస్త్రజ్ఞులు ఇంకా కనుక్కుంటూనే ఉంటారనడంలో సందేహం లేదు. పులకరింతను కలుగజేసే వాటి పాటలకు ఎలాంటి ఉపయోగకరమైన విలువ ఉన్నా, అవి మరొక ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయన్న విషయాన్ని మనం విస్మరించకుండా ఉందాం. వాటిని మెచ్చుకునే వాళ్ళ వీనులకు విందుగా ఉంటాయి! నిజానికి, అలాంటి ఆశ్చర్యకరమైన సంగీతం, “ఆకాశపక్షుల” సృష్టికర్తను స్తుతించేందుకు మనల్ని కదిలిస్తాయి.—కీర్తన 8:7.