నేను ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా?
యువత ఇలా అడుగుతోంది . . .
నేను ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా?
“నాకు పదహారేండ్లున్నప్పుడు, నాకు మొదటిసారిగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ తపాలాలో వచ్చింది. . . . నాకు 18 ఏండ్లు వచ్చేసరికి, నా అప్పు 60,000 డాలర్ల దాకా అయ్యింది.”—క్రిస్టన్.
తన క్రెడిట్ కార్డ్‌ను అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని—నిర్దిష్ట సందర్భంలో అవసరమైన వస్తువులు డబ్బు పెట్టి కొనలేనప్పుడు మాత్రమే ఉపయోగించాలని క్రిస్టన్ మొదట్లో అనుకుంది. కానీ తర్వాత పరిస్థితి చెయ్యి దాటిపోయింది. “నేను నియంత్రణ లేకుండా షాపింగ్ చేయడం మొదలుపెట్టాను. కేటలాగ్‌లను చూసి కొనడానికి ఉత్సాహం చూపించనారంభించాను. నాకు అంతగా ఇష్టంలేని వస్తువులను కూడా కొన్నాను” అని క్రిస్టన్ ఒప్పుకుంటుంది. క్రెడిట్ కార్డ్‌లను గురించి క్రిస్టన్ దృక్కోణం ఇప్పుడు భిన్నంగా ఉంది. “ఆ చిన్న ప్లాస్టిక్ ముక్క నా జీవితాన్ని ఇంత తారుమారు చేస్తుందని నాకు అప్పట్లో ఏ మాత్రం తెలియదు” అని ఆమె అంటోంది.—టీన్ పత్రిక.
క్రిస్టన్ విషయంలో మాత్రమే అలా జరగడం లేదు. క్రెడిట్ కార్డ్ అనే ఆ చిన్న ప్లాస్టిక్ ముక్కను ఉపయోగిస్తూ, ఆర్థిక విపత్తు వైపుకు పయనిస్తున్న యౌవనస్థుల సంఖ్య పెరిగిపోతోంది. కొన్నిసార్లు కంపెనీలు యౌవనస్థులనే గురిగా పెట్టుకుంటున్నాయి. ఆర్థిక సలహాదారురాలైన జేన్ బ్రయంట్ క్విన్ అంటున్నట్లు, క్రెడిట్ కార్డ్‌ను ఎంతో ఆతురతతో ఉపయోగించేవారికి, అది, “ఒక ఆర్థిక మత్తుమందు”గా మారగలదని కంపెనీవాళ్ళకు తెలిసే ఉంటుంది. “వాటిని ఉపయోగిస్తున్న కొలది, మానుకోవడం మరింత కష్టమౌతుంది” అని ఆమె అంటోంది.
నిజమే, క్రెడిట్ కార్డ్ ఉండడం ప్రయోజనకరంగా ఉండగలదు. ఉదాహరణకు, ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా, డబ్బును వెంట తీసుకువెళ్ళడం వివేకం కానప్పుడు అది ప్రయోజనకరం కాగలదు. అమెరికాలోను మరితర దేశాల్లోను క్రెడిట్ కార్డ్ ఇంత ఆదరణను పొందడానికి అది ఒక కారణం. అయితే, దాన్ని బాధ్యతగా ఉపయోగించకపోతే అప్పుల్లో కూరుకుపోతారు. అలా, “ఋణగ్రస్థులై సహాయం కోసం, టొరొంటోలోని క్రెడిట్ కౌన్సిలింగ్ సర్వీస్ వైపుకు మళ్ళుతున్న 20 నుండి 23 ఏండ్ల వారి సంఖ్యలో” మూడు రెట్ల పెరుగుదల ఉందని టొరొంటోలోని గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది. చాలా మంది 25,000 డాలర్ల మేరకు ఋణస్థులయ్యారనీ, దానికి ఒక ముఖ్య కారణం క్రెడిట్ కార్డ్ బిల్లులేననీ ఆ నివేదిక పేర్కొంది.
మీరు ఒక కార్డ్ తీసుకోవాలా? అది మీ తల్లిదండ్రులు నిర్ణయించవలసిన విషయం. మీరు ఇంకా కొంతకాలం వేచి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నట్లయితే, ఓపికపట్టండి. మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో వివేకంగా ఉంటారని రుజువు చేసుకుంటే, బహుశా త్వరలోనే మీ తల్లిదండ్రులు మీకు ఇంకా ఎక్కువ ఆర్థిక బాధ్యతలను అప్పజెప్పవచ్చు. (పోల్చండి లూకా 16:10.) వాహనాన్ని నడపడం వల్ల ప్రయోజనాలూ, ప్రమాదాలూ ఉన్నట్లే, క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనాలూ, ప్రమాదాలూ ఉంటాయని ఈలోగా మీరు తెలుసుకోవాలి.
చెల్లించవలసి వచ్చే మూల్యాన్ని లెక్కలోకి తీసుకోవడం
క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేయడమంటే, డబ్బు అప్పు తీసుకోవడంలాంటిదే. అప్పు తీసుకున్నప్పుడు ఎలాగైతే తిరిగి చెల్లిస్తారో, అలాగే క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు కూడా తిరిగి చెల్లించాలి. (సామెతలు 22:7) అయితే మీరు క్రెడిట్ కార్డ్‌తో కొనుక్కున్న వస్తువుల మూల్యాన్ని తిరిగి ఎలా చెల్లిస్తారు?
సాధారణంగా, మీరు ఈ కార్డ్‌తో ఏమేమి కొన్నారు, మీరు మొత్తం ఎంత అప్పు ఉన్నారు అనే విషయాలను తెలియజేసే ఒక ముద్రిత స్టేట్‌మెంట్‌ను నెలాఖరు దగ్గరపడుతున్నప్పుడు మీకు పంపిస్తారు. మీరు వెంటనే ఎంత డబ్బు చెల్లించాలని నిరీక్షించబడుతుంది అన్న విషయాన్ని కూడా ఆ స్టేట్‌మెంట్ చూపిస్తుంది. సాధారణంగా, వెంటనే చెల్లించాలని నిరీక్షించబడే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు, ‘ఇది బానే ఉందే. ప్రతి నెలా నేను చిన్న మొత్తాన్ని చెల్లిస్తే సరిపోయేటట్లయితే, కాలక్రమంగా మొత్తం అప్పును తీర్చగలను’ అని మీరు తర్కించుకోవచ్చు. అయితే సమస్య ఏమిటంటే, మీరు చెల్లించవలసి ఉన్న మిగిలిన మొత్తానికి గ్రేస్ పీరియడ్ తర్వాత చార్జ్ లేదా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌పై చార్జ్ చేసే వడ్డీ చాలా ఎక్కువగా ఉండగలదు. *
జోసఫ్ విషయమే తీసుకోండి. ఒక నెల ఆయనకు వచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉన్న మొత్తం అప్పు 1,000 డాలర్లు. అయితే ఆ నెల జోసఫ్ చెల్లించాలని నిరీక్షించబడిన మొత్తం చాలా తక్కువ, కేవలం 20 డాలర్లు. కానీ ఆయన తన స్టేట్‌మెంట్‌ని జాగ్రత్తగా చూసినప్పుడు, తను వెంటనే చెల్లించవలసిన మొత్తంలో తనకోసం క్రెడిట్ కార్డ్ కంపెనీ చెల్లించిన మొత్తంపై చార్జ్ చేసిన వడ్డీ కూడా చేర్చబడి ఉంది. ఆ వడ్డీ 17 డాలర్లు ! అంటే, జోసఫ్ ఇప్పుడు చెల్లించాలని నిరీక్షించబడుతున్న కనిష్ఠ మొత్తాన్ని అంటే, 20 డాలర్లను చెల్లించినప్పటికీ, ఆయన తన 1,000 డాలర్ల అప్పులో కేవలం మూడు డాలర్లే తీర్చినట్లవుతుందన్నమాట !
మీరు చెల్లించవలసిన ఆ కనిష్ఠ మొత్తాన్నే ప్రతి నెలా చెల్లించుకుంటూ పోతే, మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును తీర్చడానికి ఎంత కాలం పడుతుంది? వాస్తవాలను తెలియజేసే ఒక ఉదాహరణను ఉటంకిస్తూ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అండ్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఒక పుస్తకం ఇలా పేర్కొంది: “మీరు అప్పు తీర్చాల్సిన మొత్తం 2,000 డాలర్లూ, వడ్డీ 18.5 శాతమూ, ప్రతి నెల చెల్లించవలసినది చిన్న మొత్తమూ అయితే, మీరు ఆ అప్పు తీర్చేందుకు 11 సంవత్సరాల కన్నా ఎక్కువే పడుతుంది, దానికి తోడు మీరు అదనంగా 1,934 డాలర్లను కేవలం వడ్డీగా చెల్లిస్తారు, అంటే మీరు చెల్లించేది కొనుగోలుకైన అసలు మొత్తం కన్నా దాదాపు రెండింతలన్నమాట.”
మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు క్రెడిట్ కార్డ్‌తో ఒక పెద్ద ఆర్థిక గుంటను మీకై మీరు త్రవ్వుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. “నిజానికి, నేను ప్రతిదానికి రెండింతలు చెల్లిస్తున్నానన్న మాట. నేను చెల్లించవలసిన మొత్తాన్ని ఇవ్వలేనప్పుడెల్లా అప్పు ఇచ్చినవారు ఆలస్య రుసుమును చార్జ్ చేస్తూ వచ్చారు. ఏం చేయాలో నాకు ఇక అర్థం కాలేదు” అని క్రిస్టన్ అంటోంది.
క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతగా ఉపయోగించడం
షాపింగ్ చేస్తున్నప్పుడు, “ఇప్పుడు కొందాం, తర్వాత చెల్లించవచ్చు” అనుకోవడం ఎంత ప్రమాదకరమో క్రిస్టన్ అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అప్పు పెరిగిపోగలదు, ప్రతి నెలా
మీరు చెల్లిస్తున్న కనిష్ఠ మొత్తంలో ఎక్కువ శాతం వడ్డీయే అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. కార్డ్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించేవాళ్ళు అలాంటి ఆర్థిక ఇబ్బందిలో పడకుండా ఎలా నివారించుకుంటారు?● తాము క్రెడిట్ కార్డ్‌తో ఏమేమి కొనుక్కున్నారో అప్పటికప్పుడు వ్రాసిపెట్టుకుంటారు, తాము కొనుగోలు చేసినవాటికి మాత్రమే చార్జ్ చేశారా అన్నది నిశ్చయపరచుకునేందుకు ప్రతి నెలా స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
● క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడంలో మంచి రికార్డ్ ఉండడం భవిష్యత్తులో సహాయకరంగా ఉంటుంది—బహుశా, ఒక ఉద్యోగం కోసమో, ఇన్స్యూరెన్స్ కోసమో దరఖాస్తు పెట్టుకునేటప్పుడు సహాయపడుతుంది, లేదా ఒక కారును కొనుక్కోవడానికి లేదా ఒక ఇంటిని కొనుక్కోవడానికి డబ్బు అప్పు తీసుకునేందుకు సహాయపడుతుంది—అని గ్రహిస్తూ, వాళ్ళు తమ బిల్లులను వెంటనే చెల్లించేస్తారు.
● సాధ్యమైతే, వాళ్ళు ఋణపడివున్న మొత్తం అప్పును చెల్లిస్తారు. ఆ విధంగా, అధిక వడ్డీని నివారించుకుంటారు.
● తమ క్రెడిట్ కార్డ్ నెంబరునూ, దాని ఎక్స్‌పైరీ తేదీనీ తమకు తెలిసిన వ్యక్తికి లేదా తమతో వ్యవహారాలు ఉన్న కంపెనీవాళ్ళకు తప్ప, ఇంకెవరు ఫోన్ చేసి అడిగినా సరే చెప్పరు.
● క్రెడిట్ కార్డ్ వారికే సొంతం. వారు దాన్ని ఎవరికీ అరువుకు ఇవ్వరు, చివరికి తమ స్నేహితులకైనా సరే. ఎందుకంటే, ఎవరైనా ఆ కార్డ్‌ను దుర్వినియోగం చేస్తే, అది దాని సొంతదారుడ్నే బాధిస్తుంది.
● క్రెడిట్ కార్డ్‌ను, బ్యాంకు కార్డ్‌లా త్వరగా డబ్బు చేతికి వచ్చే మార్గంగా ఉపయోగించుకోవల్సి వచ్చే పరిస్థితిని నివారించుకుంటారు. క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసినదానికి చార్జ్ చేసే వడ్డీ కన్నా, అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బుకు ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకుంటారు.
● క్రెడిట్ కార్డ్‌ల కోసం తమకు అందిన ప్రతి దరఖాస్తును పూరించి పంపరు. చాలా మటుకు యౌవనస్థులకు ఒక క్రెడిట్ కార్డ్ సరిపోతుంది.
● క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తున్నామంటే, నోటును, నాణెములను ఉపయోగించకపోయినప్పటికీ, నిజంగా డబ్బునే ఉపయోగిస్తున్నామని గుర్తిస్తూ, చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు.
దాని ప్రయోజనాలను అనుభవించడం
మీకు ఇప్పటికే క్రెడిట్ కార్డ్ ఉన్నా, లేదా సమీప భవిష్యత్తులోనే ఒక క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవాలని అనుకుంటున్నా దాని వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రమాదాలను గురించి పూర్తిగా తెలుసుకోండి. నాకు ఒక కార్డ్ అవసరమని నేనెందుకు అనుకుంటున్నాను? వస్తువులను సొంతం చేసుకునేందుకా? నా స్నేహితుల మన్ననలను అందుకోవడానికి లేటెస్ట్ ఫ్యాషన్ ఏదైతే దాన్ని సొంతం చేసుకునేందుకా? అపొస్తలుడైన పౌలు అన్నట్లు ప్రాథమిక విషయాలతో, “అన్నవస్త్రములతో” తృప్తి పొందడాన్ని నేను నేర్చుకోవాలా? (1 తిమోతి 6:8) క్రెడిట్ కార్డ్‌లతో చేసే అప్పుల మూలంగా, జీవితంలో మరింత ప్రాముఖ్యమైన విషయాలపై దృష్టి నిలపలేనంతగా చేసేంతటి ఆర్థిక భారాలు వచ్చిపడగలవా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.—మత్తయి 6:33; ఫిలిప్పీయులు 1:8-11.
ఈ ప్రశ్నలను ధ్యానించుకుని, వాటిని మీ తల్లిదండ్రులతో చర్చించండి. మీరు అలా చర్చించుకోవడం మూలంగా, మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఉన్నా లేకున్నా, డబ్బు మూలంగా అనేకులు కొని తెచ్చుకున్నటువంటి వేదనను నివారించుకుంటారు.—సామెతలు 22:3.
[అధస్సూచీలు]
^ మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఎంత వడ్డీ తీసుకుంటుంది అన్నది తెలుసుకునేందుకు, క్రెడిట్ కార్డ్ కోసమైన దరఖాస్తుపైన గానీ ప్రతి నెల పంపే స్టేట్‌మెంట్‌పైన గానీ చూపించబడే వార్షిక వడ్డీ రేటును (ఆన్యువల్ పర్సెంటేజ్ రేట్) (APR) చూడవచ్చు.
[24వ పేజీలోని బాక్సు]
తల్లిదండ్రుల అనుమతిని తీసుకోవడంలో ఉన్న విలువ
అనేక మంది యౌవనస్థులు, క్రెడిట్ కార్డ్ కోసమైన తమ దరఖాస్తును తపాలాలో పంపించినప్పుడు, సొంతగా ఒక క్రెడిట్ కార్డ్‌ను సంపాదించుకునే అవకాశం వాళ్ళకు ఇవ్వబడింది. వాస్తవానికి, కొంతమందికి కొంత కాలంలోనే అనేక దరఖాస్తులు అందుతుంటాయి. “యౌవనస్థుల చేతికి క్రెడిట్ కార్డులను అందించడంలో క్రెడిట్ కార్డ్‌లను ఇచ్చే కంపెనీల మధ్యన పోటీలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే, మనం క్రెడిట్ కార్డులను ఒకసారి మొదలుపెడితే, వాటిని వాడుతూ ఉండడానికే మొగ్గు చూపుతామని అధ్యయనాలు చూపిస్తున్నాయి” అని జేన్ బ్రయంట్ క్విన్ అంటున్నారు.
సాధారణంగా, అప్పు చేస్తే తప్పకుండా తీర్చుతారనే పేరున్న తండ్రి/తల్లి సంతకం లేదా పెద్దవయస్సులోని ఎవరిదైనా సంతకం క్రెడిట్ కార్డు కొరకైన దరఖాస్తుపైన ఉండడం తప్పనిసరి. అలాగైతేనే చేసిన కొనుగోళ్ళకు డబ్బు చెల్లించబడుతుందన్న భరోసా క్రెడిట్ కార్డును ఇచ్చే కంపెనీకి ఉంటుంది. విచారకరమైన విషయమేమిటంటే, చాలా మంది యౌవనస్థులు ఈ మెట్టును తప్పించుకునేందుకు పెద్దవాళ్ళను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక యౌవనస్థురాలు, తన క్రెడిట్ కార్డులో ప్రైమరీ ఆప్లికంట్‌గా తన నాయనమ్మ పేరునూ, జాయింట్ ఆప్లికంట్‌గా తన పేరునూ వ్రాసింది. ఇదంతా తన నాయనమ్మకు తెలియకుండానే చేసింది. తను వేలాది డాలర్లు ఋణపడి ఉందని ఆ నాయనమ్మ తెలుసుకున్నప్పుడు ఎంత ఖంగు తిని ఉండవచ్చో ఊహించండి!
క్రెడిట్ కార్డు కొరకైన దరఖాస్తు మీద తమ తండ్రి/తల్లి లేదా పెద్ద వయస్సులో ఎవరైనా పెట్టవలసిన సంతకానికి బదులు దొంగ సంతకం పెట్టడమంటే మోసం చేయడమే. మోసం చేయడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. (సామెతలు 11:1; హెబ్రీయులు 13:18) కనుక, మీకు ఒక క్రెడిట్ కార్డు కావాలంటే, మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. వాళ్ళ అనుమతి తీసుకోవడం భవిష్యత్తులో కూడా మీకు క్షేమకరం. అప్పులను తీర్చడంలో మీ తల్లిదండ్రులకు అనుభవం ఉంటుంది, కనుక వాళ్ళు మీకు మంచి సలహా ఇవ్వగలరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళతో మాట్లాడండి. ఒక క్రెడిట్ కార్డును సంపాదించుకోవడం కోసం మోసం చేయడానికి ప్రయత్నించకండి.
[23వ పేజీలోని చిత్రం]
క్రెడిట్ కార్డును నిర్లక్ష్యంగా ఉపయోగించడం ఆర్థిక విపత్తుకు దారితీయగలదు