నేర జీవితం నుంచి నిరీక్షణగల జీవితానికి
నేర జీవితం నుంచి నిరీక్షణగల జీవితానికి
కోస్టా కూలాపీస్
నేనున్న జైలు గదిలోని మురికి గోడల్ని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాను, ఎలాగైనా పెద్ద మొత్తంలో సొమ్మును సంపాదించి, ప్రస్తుతం నేను కూరుకుపోయివున్న నా నేరజీవితం నుంచి విడుదల పొంది అటుతర్వాత ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను.
నేనక్కడ నిరాశా నిస్పృహలతో కూర్చుని, కేవలం గత ఒక్క సంవత్సరంలోనే నా స్నేహితుల్లో 11 మంది ఎలా చనిపోయారో జ్ఞాపకం చేసుకున్నాను. హత్య చేసినందుకు ఒకరిని ఉరి తీస్తే, మరొక వ్యక్తి హత్యా కేసు విచారణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు, ముగ్గురు మాదకద్రవ్యాలను విపరీతంగా తీసుకుని చనిపోయారు, ఇద్దరు వీధి కొట్లాటల్లో చనిపోయారు, నలుగురు ఏక్సిడెంట్లలో చనిపోయారు. ఇంకా అనేకమంది స్నేహితులు పెద్ద పెద్ద నేరాలు చేసినందుకు వివిధ జైళ్ళలో మగ్గుతున్నారు.
అందుకని నేనా జైలు గదిలోని విషాద వాతావరణంలో, దేవునికి—ఆయనెవరో తెలీదు గానీ—నేనీ నేర ప్రపంచం నుంచి తప్పించుకునే మార్గాన్ని నాకు చూపించమని తీవ్రంగా ప్రార్థించాను. ఆ ప్రార్థనకు ఎంతో కాలం తర్వాత గాని జవాబు దొరకలేదు. ఈలోపల నేను, శారీరక హాని తలపెట్టే ఉద్దేశంతో దాడి చేశానన్న గంభీరమైన ఆరోపణను తప్పించుకోగల్గాను. అందుకు క్షమాభిక్ష కోరడం సహాయపడింది, అలా నాకు తక్కువ శిక్షే విధించబడింది. ముందు నేనీ ఘోరమైన స్థితిలోకి ఎలా వచ్చానో చెప్పనివ్వండి.
నేను 1944లో దక్షిణ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టి, అక్కడే పెరిగాను. నా బాల్యం చాలా విషాదంగా గడిచింది. మా నాన్నగారి విపరీతమైన కోపం, దానికి తాగుడు తోడవ్వటంతో మా కుటుంబ జీవితం చాలా హీనమైన స్థితిలో ఉండేది. పైగా ఆయన గొప్ప జూదగాడు, ఆయన మానసిక స్థితి స్థిమితంగా ఉండదు, ఫలితంగా మా అందర్నీ మాటలతోనూ, శారీరకంగానూ హింసిస్తూ ఉండేవారు, ప్రత్యేకించి మా అమ్మను ఎక్కువగా అలా చేసేవారు. ఈ ఎడతెగని కొట్లాటలవల్ల నేను వీధుల్లో తిరగడం ప్రారంభించాను.
నేర కూపంలోకి
ఫలితంగా, చాలా చిన్న వయస్సులోనే నాకు లౌక్యం బాగా అలవడింది. ఉదాహరణకు నాకు ఎనిమిది సంవత్సరాలప్పుడు, నేను రెండు పాఠాలు నేర్చుకున్నాను. మొదటిది ఎప్పుడంటే, నేనొకసారి మా పొరుగింటిలో నుంచి దొంగతనంగా తీసుకువస్తున్న ఆటబొమ్మలతో పట్టుబడ్డాను. మా నాన్నగారు నన్ను బాగా కొట్టారు. “ఇంకొకసారి ఇలా దొంగతనం చేసిన వస్తువులతో కనపడ్డావంటే, నిన్ను చంపేస్తాను” అని ఆయన కోపంతో బెదిరించడం ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే ఉంది. నేను ఎప్పటికీ దొంగతనం చేయనని కాదుగానీ, ఎప్పుడూ పట్టుబడకూడదని తీర్మానించుకున్నాను. ‘ఈసారి వాటిని కనపడనివ్వకుండా దాచేస్తాను’ అని నేను నా మనస్సులో నిశ్చయించుకున్నాను.
నేను నేర్చుకున్న రెండవ పాఠం నేనింకా చిన్నగా ఉన్నప్పటిది, నేరాలకూ దానికీ ఏమాత్రం సంబంధం లేదు. స్కూల్లోని బైబిలు తరగతిలో, దేవునికి ఒక సొంత పేరు ఉందని మా టీచర్ చెప్పారు. “దేవుని పేరు యెహోవా, మీరు తన కుమారుడైన యేసు ద్వారా ప్రార్థిస్తే ఆయన మీ ప్రార్థనలను వింటాడు” అని ఆమె చెప్పింది, మేము ఆశ్చర్యపోయాము. నేర జీవితంలో కొట్టుకుపోకుండా నన్ను ఆపనప్పటికీ నా లేత మనస్సులో అది చాలా గొప్ప ప్రభావాన్ని చూపింది. నేను హైస్కూల్‌కి వచ్చేసరికి ఇళ్ళల్లోను దుకాణాల్లోను దొంగతనాలు చేయడంలో నేను అనుభవజ్ఞుడనైపోయాను. నేను సరైన మార్గంలో నడవటానికి స్కూల్లోని నా స్నేహితుల నుంచి ఎటువంటి సహాయమూ అందేది కాదు, ఎందుకంటే వారిలో అనేకులు అప్పటికే వివిధ నేరాలు చేసినందుకు సంస్కరణా స్కూళ్ళలో ఉండాల్సివచ్చింది.
సంవత్సరాలు గడుస్తుండగా నేను క్రమంగా నేరానికి అలవాటు పడిపోయాను. నా టీనేజ్‌లో ఉన్నప్పుడే, దారికాసి దెబ్బతీయడం, ఇంటి దొంగతనాలు, కారు దొంగతనాలు చేయడం, హింసాత్మకంగా దాడులు చేయడం వంటి అనేకానేక నేరాల్లో పాల్గొన్నాను. నేనెప్పుడు చూసినా బిలియర్డ్స్ ఆడేచోట్ల, బార్‌ల దగ్గర ఉండేవాణ్ని. వ్యభిచార గృహాలు నడిపేవారి కోసం, వ్యభిచారిణుల కోసం, నేరస్థుల కోసం నేను చిన్న చిన్న పనులు చేసిపెట్టేవాణ్ని, అందుకని నేను నా సాంకేతిక విద్య మొదటి సంవత్సరం కూడా ముగించలేకపోయాను.
తమను మోసం చేసిన ఎవరినైనా సరే వికలాంగులను చేయడానికి వెనుకాడని కఠినులైన నేరస్థులతో నేను సహవసించాను. నేను నా నోరు మూసుకుని ఉంటూ, చేసిన ఘనకార్యాల గురించి ఎక్కడా ప్రగల్భాలు పలకకుండా, డబ్బుని నీళ్ళలా ఖర్చుపెట్టకుండా ఉండటం మంచిదని తెల్సుకున్నాను. అలా చేసినట్లైతే, ఎక్కడో ఏదో నేరం జరిగిపోయిందని చాటింపు వేయించుకున్నట్లే, దాంతో పోలీసుల దృష్టి ఇటు మళ్ళి ఇబ్బందికరమైన ప్రశ్నలకు దారితీస్తుంది. అంతకన్నా ఘోరం ఏమిటంటే, అలా చేస్తే దొంగసొమ్మును పంచుకోవటానికి వేరే నేరస్థుల నుంచి సందర్శనాలు ప్రారంభం కావచ్చు కూడాను.
అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నానన్న అనుమానంతో నేను కొన్నిసార్లు పోలీసు నిఘా క్రిందికి వచ్చాను. కానీ నేరాన్ని నిరూపించేవి గానీ లేదా నేను నేరస్థుడనని నిరూపించేవిగానీ ఏవీ నా దగ్గర లేకుండా నేను జాగ్రత్త తీసుకున్నాను. ఒకసారి పోలీసులు మా ఇంటిని ఉదయం మూడు గంటలకు ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక హోల్‌సేలర్ స్టాకు దొంగిలించబడటంతో, ఆ ఎలక్ట్రిక్ సామాను కోసం మా ఇంటినంతటినీ రెండు సార్లు వెదికారు. వాళ్ళకేమీ కనపడలేదు. నన్ను వ్రేలి ముద్రల కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు, కానీ ఎటువంటి ఆరోపణలూ నా మీద పడలేదు.
మాదకద్రవ్యాల్లోకి
మానసిక అస్థిరత్వాన్ని కలిగించే మందులను నేను 12వ ఏట నుండే ఉపయోగించడం ప్రారంభించాను. అలాంటి అలవాటు వల్ల నా ఆరోగ్యం పాడవడం ప్రారంభించింది, అనేకసార్లు డోసు ఎక్కువయ్యేది. కొంతకాలానికి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలున్న ఒక వైద్యునితో నాకు పరిచయం అయ్యింది. దీంతో నేను మాదకద్రవ్యాల డీలర్‌నయ్యాను. అతికొద్దిమంది పంపిణీదారులకే సప్లై చేస్తూ, వారే రిస్క్ తీసుకుంటుండగా నేను తెర వెనుక ఉండవచ్చు కాబట్టి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని గ్రహించాను.
విచారకరంగా, మాదకద్రవ్యాలకు సంబంధించి నాతో
డీలింగ్స్ ఉన్నవాళ్ళు కొంతమంది, అతిగా తీసుకుని చనిపోవడమో లేక ఆ మాదకద్రవ్యాల ప్రభావం ఉన్నప్పుడు తీవ్రమైన నేరాలకు పాల్పడటమో జరిగింది. ఒక పేరు పొందిన వైద్యుడిని ఒక “స్నేహితుడు” హత్య చేశాడు. ఇది దేశమంతటిలో పెద్ద వార్తగా అయిపోయింది. ఆ తర్వాత అతడు నాపై నేరారోపణ చేయడం మొదలుపెట్టాడు, కానీ పోలీసులు నా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేంత వరకూ జరిగిన ఈ విషయం గురించి నేను వినలేదు కూడా. వాస్తవానికి, పోలీసులు తరచూ వచ్చి, జరిగిన ఇతర నేరాల గురించి నన్ను ప్రశ్నిస్తూండేవారు.ఒకరోజు, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. నేనొకసారి వారం రోజుల పాటు మాదకద్రవ్యాలు, మత్తుపానీయాల్లో మునిగి తేలాను. తర్వాత నాకూ మరిద్దరికీ మధ్య అపార్థాలు ఏర్పడటంతో నేను వాళ్ళని చాలా గాయపరిచాను. ఆ తర్వాత ఉదయం వాళ్ళని గాయపరచింది నేనేనని వాళ్ళు నన్ను గుర్తుపట్టారు, తీవ్రమైన శారీరక దాడి తలపెట్టాలని ప్రయత్నించానన్న ఆరోపణపై నన్ను బంధించారు. అలా నేను జైలుకు వచ్చాను.
డబ్బు సంపాదించు, తర్వాత ముక్కుసూటిగా పో
జైలు నుంచి విడుదల పొందిన తర్వాత, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో స్టాక్ కంట్రోలర్‌గా ఉద్యోగావకాశం ఉందని విన్నాను. నేను దానికి దరఖాస్తు పెట్టి, ఆ ఉద్యోగానికి నేను అర్హుడనేనని ఒప్పించాను. ఆ కంపెనీలోనే పని చేస్తున్న ఒక స్నేహితుని సిఫారసు వల్ల నాకు ఆ ఉద్యోగం దొరికింది. ఎక్కువ డబ్బు సంపాదించి, పరిశుభ్రమైన జీవితాన్ని ప్రారంభించేందుకు ఎక్కడికైనా వెళ్లిపోడానికి ఇది మార్గమని నేను తలంచాను. ఈ వ్యాపారంలోని అన్ని రంగాలను ఎంత త్వరగా నేర్చుకోగలిగితే అంత త్వరగా నేర్చుకోవడానికి గట్టిగా కృషిచేశాను, అన్ని మందుల పేర్లనూ చదువుతూ రాత్రులు చాలా పొద్దుపోయేదాక ఉండేవాణ్ని. ఇది కచ్చితంగా క్రొత్త జీవితానికి ఒక మార్గం కాబోతుందని నేను భావించాను.
నేను సరైన సమయం కోసం వేచివుంటూ, నా యజమానుల నమ్మకాన్ని చూరగొనాలన్నది నా పథకం. తర్వాత మంచి అవకాశాన్ని చూసుకుని, బ్లాక్ మార్కెట్లో చాలా ధర పలికే కొన్ని మందులు నాకు తెలుసు కాబట్టి, వాటిని పెద్ద మొత్తంలో దొంగతనం చేసి, వాటిని అమ్మేసి రాత్రికి రాత్రే ధనవంతుణ్ని అయిపోవాలి. స్వేచ్ఛవైపుకి నూతన జీవితంవైపుకి నా దారిని సుగమం చేసుకునేందుకు ఎవరూ సందేహించని ఎలిబీని సృష్టించుకున్నాను కూడా.
నేను వేసిన పథకాన్ని అమలులో పెట్టే సమయం వచ్చింది. ఒకరాత్రి, చాలా జాగ్రత్తగా గిడ్డంగిలోకి ప్రవేశించిన అనంతరం, షెల్ఫుల్లో ఉన్న లక్షల డాలర్లు విలువ చేసే మందుల స్టాక్‌ని చూశాను. అక్కడ, నేరం, దౌర్జన్యం నుంచి విడుదల పొందిన క్రొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నాకున్న అవకాశాన్ని చూశాను. కానీ, ఎప్పుడూ లేనిది మొదటిసారి నా మనస్సాక్షి నన్ను బాధపెట్టడం మొదలుపెట్టింది. నాకు మనస్సాక్షి ఉందన్న విషయాన్ని కూడ నేను పూర్తిగా మర్చిపోయిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా నా మనస్సాక్షి నన్ను బాధపెట్టడానికి గల కారణమేమిటి? ఇది ఎలా జరిగిందో చెప్పనివ్వండి.
దీనికి కొన్ని వారాల ముందు మేనేజరూ నేనూ జీవితార్థాన్ని గూర్చి చర్చించుకున్నాము. ఆయనేదో చెప్పాడు దానికి ప్రతిస్పందనగా నేను, ఒకరు చిట్టచివరి సహాయంగా ప్రార్థన చేయవచ్చు అని సమాధానమిచ్చాను. “ఎవరికి” అని అడిగాడు. “దేవునికి” అని చెప్పాను. “కానీ ప్రజలు ప్రార్థన చేస్తున్న దేవుళ్ళు అనేకమంది ఉన్నారు” అని, “మరి నీవు ఎవరికి ప్రార్థన చేస్తావు?” అని అడిగాడు. “సర్వశక్తిమంతుడైన దేవునికి” అని నేను సమాధానమిచ్చాను. “ఓహ్, ఆయన పేరేంటి?” అని అడిగాడు. “మీ ఉద్దేశమేమిటీ?” అని నేను అడిగాను. “నీలాగే, నాలాగే, అందరిలాగే సర్వశక్తిమంతునికి కూడా ఒక సొంత పేరు ఉంది” అన్నది ఆయన సమాధానం. అది తర్కబద్ధంగా ఉన్నప్పటికీ, నాకు కోపం వస్తూ ఉంది. “సరే, దేవుని పేరు ఏమిటి?” అని చిరాగ్గా అడిగాను. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు: “ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పేరు యెహోవా!”
సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన హఠాత్తుగా నా మదిలో మెదిలింది, నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సులో క్లాస్‌రూమ్‌లో జరిగిన ఆ పాఠం నాకు గుర్తుకు వచ్చింది. మేనేజరుతో చేసిన ఆ చర్చ నాపై చాలా ప్రభావాన్ని చూపింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఆ లోతైన చర్చను కొనసాగించేందుకు గంటల కొద్ది కూర్చున్నాము. ఆ తర్వాత రోజు నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని నాకోసం తీసుకువచ్చాడు. * ఆ రాత్రి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివేసి, నేను సత్యాన్ని కనుగొన్నాననీ, జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొన్నాననీ ఒప్పుకున్నాను. ఆ తర్వాత రెండు వారాలు ఆశ్చర్యాన్ని గొలిపే ఆ నీలం పుస్తకాన్నుండి రకరకాల విషయాలను చర్చించేందుకు చాలా సమయాన్ని వెచ్చించాము.
కాబట్టి, చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న ఆ గిడ్డంగిలో నేను కూర్చున్నప్పుడు, నేను దొంగతనంగా మందులు తీసుకొని వాటిని అమ్ముకోవడం చాలా తప్పు అని నా మనస్సాక్షి నాకు చెప్పింది. వాటిని అలా విడిచిపెట్టి నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాను, అప్పటినుండి ఇంక దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను.
పూర్తి మార్పు
ఆ తర్వాత రోజుల్లో, నేను ఒక క్రొత్త జీవిత మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నానని మా ఇంటిలో చెప్పాను, నేను నేర్చుకున్న కొన్ని బైబిలు సత్యాలను వారితో చెప్పడం ప్రారంభించాను. మా నాన్నగారు నన్ను ఇంటిలో నుంచి బైటికి గెంటివేయాలనుకున్నారు. కానీ, “కోస్టా తన జీవితంలో నేరానికి సంబంధించని వాటిలో పాల్గోవడం ఇదే మొదటిసారి, ఇప్పుడు వాడిని ఇంటిలో నుంచి గెంటివేయాలనుకుంటున్నారా? నేను వీటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను” అని మా తమ్ముడు నన్ను సమర్థించాడు. నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నన్ను తనతో బైబిలు పఠనం చేయమని జాన్ అడిగాడు. అప్పటి నుంచి మందుల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ మందుల బదులు సత్యము పుస్తకాన్ని తీసుకొనేవారు ! చాలా త్వరలో ఆ పుస్తకం సహాయంతో నేను 11 బైబిలు పఠనాలను చేశాను.
ఆ తర్వాత ఆ కంపెనీ మేనేజరు యెహోవాసాక్షి కాడని తెలుసుకున్నాను. 18 సంవత్సరాలుగా ఆయన భార్య యెహోవాసాక్షి, కానీ ఈయనకు మాత్రం “సత్యము గురించి ఏమైనా చేయడానికి సమయం దొరకలేదు.” కాబట్టి, నేను క్రమంగా బైబిలు అధ్యయనం చేసేందుకు ఆయనొక అనుభవజ్ఞుడైన సాక్షిని ఏర్పాటు చేశాడు. నా జీవితంలో అప్పటి కొన్ని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని నా పఠనం ద్వారా త్వరలోనే తెలుసుకున్నాను. దేవుని వాక్య సత్యం ఈ లోక విధానాల నుంచి నన్ను స్వతంత్రుణ్ని చేయటం ప్రారంభించింది.—యోహాను 8:32.
అయినప్పటికీ, కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే పరిస్థితులు అంత త్వరగా మారిపోవడంతో నాకు ఊపిరి ఆడనట్టుగా అయ్యింది. పెద్ద మార్పులు నా ఎదురుగా ఉన్నాయి. నేను చేస్తున్న బైబిలు పఠనాలు నిర్దేశిస్తున్న దిశవైపుకి పయనిస్తే, నా శరీరానికీ ఆత్మకీ గొప్ప పోరాటం జరుగుతుందని గ్రహించాను. మరోప్రక్క, ఇప్పటి వరకూ నేను గడుపుతున్న ఈ జీవితాన్ని కొనసాగిస్తే, చనిపోవడం గానీ, కనీసం నా జీవితమంతా జైలులో గడపడంగానీ నా భవిష్యత్తు అవుతుందన్న విషయాన్ని నేను గ్రహించాను. దాని గురించి చాలా ఆలోచించిన తర్వాత తీవ్రమైన ప్రార్థన అనంతరం సత్యమార్గాన్ని అనుసరించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆరు నెలల తర్వాత, 1971 ఏప్రిల్ 4న నేను యెహోవాకు సమర్పించుకున్నట్లు గుర్తుగా నీటి బాప్తిస్మం పొందాను.
ముక్కుసూటిగా పోతే లభించే ప్రతిఫలాలు
సింహావలోకనం చేసుకుంటూ, నేను నేర జీవితం విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి అనుభవించిన ఆశీర్వాదాలను గురించి తలంచినప్పుడు కొన్నిసార్లు నాలో భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. ఆ మొదటి సంక్షుభిత వారాల్లో నేను అధ్యయనం చేసిన 11 మందిలో 5 గురు ఇప్పటికీ సత్య మార్గంలో నడుస్తున్నారు. మా అమ్మ కూడా బైబిలు పఠనాన్ని స్వీకరించి బాప్తిస్మం పొందిన సాక్షి అయ్యింది. తను 1991లో చనిపోయేంతవరకు దేవునికి విశ్వసనీయంగా సేవ చేసింది. నా ఇద్దరు తమ్ముళ్లూ తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకుని ఇప్పుడు సంఘ పెద్దలుగా సేవచేస్తున్నారు. మా పిన్ని కూడా సత్యం తెలుసుకునేందుకు నేను సహాయం చేయగలిగాను, ఆమె పూర్తికాల పరిచర్యలో 15 సంవత్సరాలపాటు సేవచేసింది.
నేను పనిచేసిన ఫార్మస్యూటికల్ కంపెనీ మేనేజరు నేను నా జీవితంలో చేసుకున్న మార్పులను చూసి ఎంత ప్రోత్సాహాన్ని పొందాడంటే బైబిలు సత్యాన్ని మరింత గంభీరంగా తీసుకోవడం ప్రారంభించాడు. నేను బాప్తిస్మం పొందిన ఒక సంవత్సరం తర్వాత, ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న సూచనగా నీటిలో బాప్తిస్మం పొందాడు. తర్వాత ఆయన ప్రిటోరియాలోని ఒక యెహోవాసాక్షుల సంఘంలో ఎన్నో సంవత్సరాలుగా పెద్దగా సేవచేశాడు.
నేనిప్పుడు ఒక సమర్పిత క్రైస్తవ సహోదరిని పెండ్లిచేసుకున్నాను. 1978లో నేనూ నా భార్య లియోని ఆస్ట్రేలియాకు తరలివెళ్ళాము. అక్కడ మా ఇద్దరు కుమారులు ఇలైజా, పాల్‌లు పుట్టారు. నా కుటుంబం నుంచి నాకు అందే ప్రోత్సాహం నాకు నిజంగా ఒక బలం. ఆస్ట్రేలియా రాజధానియైన కాన్‌బెర్రాలోని ఒక సంఘంలో పెద్దగా సేవచేసే ఆధిక్యత నాకు ఉంది. ప్రతిరోజు యెహోవా పట్ల కృతజ్ఞతతో నా హృదయం నిండివుంటుంది, ఆయన సంక్షుభితమైన, మరణంవైపు దారితీస్తున్న అర్థరహితమైన నా నేర జీవితం నుంచి నన్ను కాపాడాడు. అంతకన్నా ఎక్కువగా ఆయన నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చాడు, నాకూ నా ప్రియమైన వారికీ ఒక నిజమైన నిరీక్షణనిచ్చాడు.
[అధస్సూచీలు]
^ వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[18వ పేజీలోని చిత్రం]
నాకు పన్నెండేళ్ళు ఉన్నప్పుడు
[18వ పేజీలోని చిత్రం]
నేడు నా భార్యా నా ఇద్దరు పిల్లలతో