కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ఆధ్యాత్మిక జ్ఞానోదయానికై అన్వేషణ

“శతాబ్దాంతం సమీపిస్తుండగా బ్రిటన్‌ దేశస్థులు తమ జీవితాల్లో ఆధ్యాత్మికత కోసం అన్వేషిస్తున్నారు. ఆ విషయం వేదాంతం, అతీంద్రియం, మానవాతీతం అనే విషయాలను చర్చించే పుస్తకాలపట్ల వారు చూపిస్తున్న ప్రీతిని బట్టి అవగతమౌతుంది” అని ద టైమ్స్‌ వార్తాపత్రిక చెబుతుంది. సాంస్కృతిక వైఖరులులో (ఆంగ్లం) ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో మతపరమైన శీర్షికలున్న పుస్తకాల అమ్మకం 83 శాతం పెరిగింది. న్యూ ఏజ్‌ మతంపైనా, అతీంద్రియవాదంపైనా వచ్చిన పుస్తకాల్లో దాదాపు 75 శాతం పెరుగుదల కన్పించింది. దీనికి భిన్నంగా, విజ్ఞానశాస్త్రంపైన ప్రచురించే పుస్తకాల సంఖ్య తగ్గింది, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రాలపై ప్రచురించే పుస్తకాల్లో 27 శాతం తరుగుదల కన్పించింది. ఈ గణాంకాలను గురించి విచారిస్తూ, సాంస్కృతిక వైఖరులులోని ఈ నివేదికకు సంపాదకురాలిగా ఉన్న సారా సెల్‌వుడ్‌, “శతాబ్దాంతంలో ప్రజలు జీవితపరమార్థాన్ని గురించి ఎక్కువగా ఆలోచించటం ప్రారంభిస్తారు” అని అంటుంది. అయితే అట్లాసులూ, భూగోళశాస్త్రంపై పుస్తకాలూ 185 శాతం ఎందుకు పెరిగాయి? బహుశ అది ప్రజల్లోని “పలాయనవాదాన్ని” సూచిస్తుండవచ్చు అని ఆమె అంటుంది.

యూరప్‌లో మతస్వాతంత్ర్యం భంగపర్చబడింది

“మతస్వాతంత్ర్యాల్ని భంగపర్చినందుకు యూరప్‌లోని 19 దేశాలపై” ఇంటర్నేషనల్‌ హెల్సింకీ ఫెడరేషన్‌ “నిందారోపణలు చేసింది” అని క్యాథలిక్‌ ఇంటర్నేషనల్‌ అనే పత్రిక నివేదిస్తుంది. ముఖ్యంగా ఛాందసవాదులున్న దేశాల్లో మైనారిటీ మతాలపై ఒత్తిడి ఎక్కువ ఉన్నట్లు ఆ ఫెడరేషన్‌ గమనించింది. దీనికి తోడు, యూరోపియన్‌ యూనియన్‌లోని అనేక సభ్యదేశాలు, “సాంప్రదాయిక మతాల స్థానాన్ని పటిష్ఠం చేసే చట్టాలను రూపొందిస్తూ, [యెహోవాసాక్షులు] వంటి చిన్న గుంపులపై నిర్బంధాలను విధించే అనేక చట్టాలను రూపొందిస్తున్నాయి” అని ఆ పత్రిక పేర్కొంటుంది. ఫెడరేషన్‌ డైరెక్టర్‌ అయిన ఆరోన్‌ రోడ్స్‌ ఇలా చెబుతున్నాడు: “పాశ్చాత్య దేశాల్లోని సమాజాలకు ‘మతతెగల దాడి’ అనే విపరీతమైన భయం పట్టుకుంది, దాంతో ఆ సమాజాలవారు మైనారిటీ మతాలపై నిర్బంధాలను విధించేందుకు ఉన్ముఖులౌతున్నారు. మతవిశ్వాసాల స్వాతంత్ర్యం, సమాజపు విలువలూ నియమాల్లో ఒక భాగమనీ, ఈ విలువలూ నియమాల్ని ప్రతి ఒక్కరికీ సమానంగా వర్తింపజేయాలనీ ప్రజలు గుర్తించనంత వరకూ ఈ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూనే ఉంటుంది.”

భూగోళవ్యాప్తంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సంవత్సరం

1860వ సంవత్సరం తర్వాత 1998వ సంవత్సరం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా ఉందని సైన్స్‌ న్యూస్‌ నివేదిస్తుంది. 1961 నుండి 1990 సంవత్సరాల మధ్యకాలంలో, భూమి ఉపరితలంపైని మాధ్యమ ఉష్ణోగ్రత, సగటు ఉష్ణోగ్రత కన్నా 0.58 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగింది అని అంచనాలు వేస్తున్నారు. “ఒక్క డిగ్రీలో వందవ వంతు హెచ్చుతగ్గులు ఏర్పడినా హడావుడి పడిపోయే వాతావరణ శాస్త్రజ్ఞులకు గత సంవత్సరపు ఉష్ణోగ్రతలో పెరుగుదల హిమాలయ పర్వతంలా కన్పిస్తుంది” అని ఆ పత్రిక చెబుతుంది. 1990 తర్వాత, అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ఏడు సంవత్సరాలు వచ్చాయనీ, అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన పది సంవత్సరాలు 1983 తర్వాతవేననీ కూడా ఆ నివేదిక చెబుతుంది. అమెరికాలోని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన జోనాథన్‌ ఓవర్‌పెక్‌ అభిప్రాయం ప్రకారం బహుశ గత 1,200 సంవత్సరాల్లో గత రెండు దశాబ్దాలు అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనవి అయివుంటాయి. యూరప్‌, ఆసియాల్లోని ఉత్తర ప్రాంతాల్లో మాత్రమే ఈ పెరుగుదల సంభవించలేదని వరల్డ్‌ మీటియోరాలాజికల్‌ ఆర్గనైజేషన్‌ నివేదిస్తుంది. అమెరికాలోని దక్షిణ ప్రాంతం వేసవిలోని మండుటెండల్లో మగ్గిపోయింది. మధ్య రష్యాలో జూన్‌ నెలలో విపరీతమైన ఎండల మూలంగా 100 మంది చనిపోయారు, అనేక ప్రాంతాల్లో పెద్ద అగ్ని ప్రమాదాలు సంభవించాయి.

క్రొత్త తరహా ‘కోల్డ్‌ వార్‌’

“స్లొవేనియన్లు అందుబాటులో ఉన్న అన్ని రకాల, అన్ని రుచుల ఐస్‌క్రీమ్‌లపై దాడిచేసి స్వాహా చేస్తుండగా దుకాణదారులు తమ ఫ్రిడ్జ్‌లలో ఎప్పుడూ స్టాకు ఉండేలా చూసుకుంటున్నారు” అని లీయూబ్లీయానాలోని డేలో అనే వార్తా పత్రిక నివేదిస్తుంది. ఈ వార్తాపత్రిక ప్రకారం స్లొవేనియన్లకు ఐస్‌క్రీమ్‌ పట్ల మక్కువ ఎక్కువౌతుంది; ఇటీవల ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తిదారులు తమ వార్షిక అమ్మకాల్లో 22 శాతం పెరుగుదల జరిగినట్లు రికార్డు చేశారు. పెరుగుదల ఈ లెక్కన కొనసాగుతూపోతే, ప్రస్తుతం ప్రతి వ్యక్తి సంవత్సరానికి కొనుగోలు చేసే 4.3 లీటర్లు కాస్తా పెరిగి చివరికి పశ్చిమ యూరప్‌లోని 5.5 లీటర్లను మించిపోతుంది. అయితే, యూరప్‌లోని ఈ ఐస్‌క్రీమ్‌ పోటీలో స్వీడన్‌ దేశస్థులు ఇప్పటికీ చాలా ముందున్నారు. యూరోమానిటర్‌ అనే మార్కెట్‌ విశ్లేషణ గ్రూప్‌ ప్రకారం స్వీడన్‌లో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 16 లీటర్ల ఐస్‌క్రీమ్‌ని స్వాహా చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికన్లు అందరికన్నా ముందున్నారు, అక్కడ ప్రతి వ్యక్తి నోట్లో సగటున సంవత్సరానికి 20 లీటర్ల ఐస్‌క్రీమ్‌ కరిగిపోతుంది.

“అదృశ్య వ్యాధి”

“అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు కోటీ 50 లక్షల నుండి కోటీ 80 లక్షల మంది పిల్లలకు రక్తంలో లెడ్‌ (సీసం) హెచ్చైన మోతాదుల్లో ఉన్నది” అని ఎన్విరాన్‌మెంట్‌ న్యూస్‌ సర్వీస్‌ నివేదిస్తుంది. ఉదాహరణకు ఇండియాలో, పిల్లలు లోపలికి తీసుకున్న లెడ్‌ మోతాదుకీ వారి మేధాశక్తికీ సంబంధం ఉన్నట్లు నిర్ధారించబడింది. డా. అబ్రహాం జార్జ్‌ ప్రకారం పిల్లలు, “లెడ్‌ని వివిధ రూపాల్లో శరీరం లోపలికి తీసుకోవటం మూలంగా మెదడు దెబ్బతింటుంది . . . అలా వారు తమ తెలివితేటల్ని కోల్పోతారు” అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదిస్తుంది. ఇండియాలోని నగరాల్లో లెడ్‌ పాయిజనింగ్‌కు మూల కారణం, ఇప్పటికీ లెడ్‌ ఉన్న పెట్రోలును ఉపయోగించే మోటారు వాహనాలే. బీదరికం క్షుద్బాధ వంటి సమస్యల్తో పోల్చినప్పుడు లెడ్‌ పాయిజనింగ్‌ వెంటనే అవధానాన్ని ఆకర్షించదు కాబట్టి, డా. జార్జ్‌ దీన్ని “అదృశ్య వ్యాధి” అని పిలుస్తున్నాడు.

మంచినీటికి సంబంధించి మరిన్ని చింతలు

“మనం త్రాగే నీరు క్రిమిసంహారకాలతో నిండి ఉండటమే కాక, వాటిలో మందులు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇప్పుడు కన్పిస్తోంది” అని న్యూ సైంటిస్ట్‌ చెబుతుంది. ఈ మందులు వేర్వేరు మూలల నుండి వస్తున్నాయి. కొన్నిసార్లు అవసరం లేని మందుల్ని టాయ్‌లెట్‌లో వేసి నీళ్ళు కొట్టేయటం జరుగుతుంది. అంతేకాక, మందులు మూత్రం ద్వారా కూడా విసర్జించబడతాయి. “మానవులకీ జంతువులకీ ఇచ్చే మందుల్లో 30 నుండి 90 శాతం యాంటీబయాటిక్‌లు మూత్రం ద్వారానే విసర్జించబడుతున్నాయి” అని రాయల్‌ డానిష్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీకి చెందిన హాలింగ్‌-సోరెన్సన్‌ చెబుతున్నాడు. వ్యవసాయదారులు తమ పొలాల్లో జంతువుల మూత్రాన్నీ, ఎరువుల్నీ విధిగా ఉపయోగిస్తుంటారు. మందులు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు, అవి వాటి మూల రూపంలోనే ఉండవచ్చు, లేదా మానవ శరీరంలో అవి మార్పులు చెంది మరింత సులభంగా రియాక్ట్‌ అయ్యేవిగా విషయుక్తమైనవిగా తయారుకావచ్చు. అవి తరచు నీటిలో సులభంగా కలిసిపోయేవిగా కూడా తయారుకావచ్చు. “నీట్లో ఉండే, మనం సాధారణంగా పట్టించుకోని రసాయనాల్లో ఈ మందులు కొన్ని” అని బ్రిటన్‌లోని ఎన్విరాన్‌మెంట్‌ ఏజెన్సీకి చెందిన స్టీవ్‌ కిలీన్‌ అంటున్నాడు.

పిల్లలపై దురాచారాన్ని గుర్తిస్తున్నారా?

కారకాస్‌లోని ఒక వార్తాపత్రిక అయిన ఎల్‌ యూనివర్సాల్‌ ప్రకారం, వెనిజ్యులాలో 1980లో ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు లైంగిక దురాచారానికి గురయ్యారు, నేటి పరిస్థితి చూస్తే ప్రతి 10 మంది పిల్లల్లో ముగ్గురు పిల్లలు దురాచారానికి గురౌతున్నారు. 1980లో దురాచారానికి గురైన పిల్లల సగటు వయస్సు 12 నుండి 14గా ఉంది. నేడు చూస్తే అధిక శాతం మూడేండ్లకన్నా తక్కువ వయస్సులోని పిల్లలే. ఇలాంటి ఘోరమైన కృత్యాల్ని రేపేది ప్రధానంగా ఎవరు? స్కూలు క్రీడామైదానాల చుట్టూ తచ్చట్లాడుతూ, పిల్లలకు చాక్లెట్లు ఇవ్వజూపే అనుమానాస్పద అపరిచితులేనన్న తలంపు ఏమాత్రం వాస్తవికం కాదు. ఈ విధమైన నేరస్థుల్లో 70 శాతం బంధువులు లేక కుటుంబ స్నేహితులేనని ఎల్‌ యూనివర్సాల్‌ వివరిస్తుంది. ఈ 70 శాతంలో సగానికిపైగా మారుటి తండ్రులే ఉన్నారు, మిగతావారు సాధారణంగా అన్నలు, దగ్గరి బంధువుల్లోని వయస్సులో పెద్దవారు, లేదా ఉపాధ్యాయులు వంటి అధికారంలో ఉన్నవారే.

విద్యా సంక్షోభం

“అభివృద్ధి చెందుతున్న దేశాలు 12 కోట్ల 50 లక్షలమంది పిల్లల విషయంలో ఒక విద్యా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీరిలో అనేకులు స్కూలుకు హాజరుకాలేని బాలికలే; అంతేకాదు, చదువను వ్రాయను నేర్చుకోవటానికి ముందే స్కూలు విడిచిపెట్టేసే 15 కోట్ల మంది పిల్లల విషయంలో కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి” అని ఇంగ్లాండ్‌లోని న్యూస్‌ అన్‌లిమిటెడ్‌ నివేదిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు అంటే, 87 కోట్ల 20 లక్షలమంది వయోజనులు నిరక్షరాస్యులు. అంతేగాక, నిరక్షరాస్యత అత్యధికంగా ఉన్న దేశాలు సంపన్న దేశాల నుండి అప్పుల్ని తీసుకున్నప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారౌతుంది. ఎందుకు? విద్యా బోధనకు ఎంతో అవసరమైన ఆ డబ్బు తరచూ ఈ అప్పుల్ని తీర్చటానికి మళ్ళించబడుతుంది గనుక. ఈ విధంగా ఈ నిరక్షరాస్యతా చక్రం తిరుగుతునే ఉంటుంది, అలా బీదరికం పెరుగుతునే ఉంటుంది.