బాధాకరమైన పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడడాన్ని మేము నేర్చుకున్నాం
బాధాకరమైన పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడడాన్ని మేము నేర్చుకున్నాం
రోజీ మేజర్ చెప్పినది
నేను మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు, ఐదు నెలలప్పుడు, అంటే, 1992 మార్చి నెలలోని ఒకరోజున నా కాళ్ళు బాగా వాచి ఉండడాన్ని మా అత్తగారు చూశారు. నేనూ, నా భర్త జోయీ యెహోవాపై ఎంత ఆధారపడతాం అన్నది పరీక్షించబడబోతోంది అని ఆ రోజున మాకు తెలియదు.
నాకు బి.పి. చాలా ఎక్కువగా ఉందని నన్ను పరీక్షచేసి చూసిన మా డాక్టరమ్మ చెప్పారు. నాకు ఇతర పరీక్షలు చేసి చూసేందుకు, నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వమని చెప్పినప్పుడు, సహజంగానే నాకు చింత మొదలైంది. నాకు ప్రీఎక్లామ్‌ప్సియా ఉంది అని పరీక్షలు చూపించాయి. గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఒక ప్రమాదకరమైన పరిస్థితి అది. *
ఆసుపత్రిలో ఉన్న డాక్టరు, నన్నూ, కడుపులో ఉన్న నా బిడ్డనూ కాపాడేందుకు, వెంటనే బిడ్డ జన్మించేలా చేయాలని సిఫారసు చేశారు. నేనూ, నా భర్తా ఆశ్చర్యపోయాం. “గర్భంలో ఉన్న బిడ్డకు కనీసం 24 వారాలు కూడా లేవే ! గర్భం వెలుపల మా బిడ్డ ఎలా పెరుగగలదు?” అని బాధతో అతి కష్టం మీద ఊపిరి పీల్చుకున్నాను. “సరే ఇంకొంత కాలం చూస్తాను. మీ పరిస్థితి విషమిస్తే, పాప బయటికి వచ్చేలా చేయవలసి ఉంటుంది” అని డాక్టరుగారు దయాపూర్వకంగా జవాబిచ్చారు. పదమూడు రోజులు గడిచాయి. అకస్మాత్తుగా నా పరిస్థితి మరింత విషమించింది. ఆ డాక్టరుగారు నా భర్తను లోపలికి పిలిచారు. ఎలాగోలా బిడ్డను బయటికి తీయాలన్న బాధాకరమైన నిర్ణయానికి వచ్చాము.
పాప పుట్టడం
పాప పుట్టడానికి ముందటి రాత్రి, డా. మ్యాక్‌నెయిల్ అనే పిల్లల వైద్యుడు మమ్మల్ని కలిసి, సమయానికి ముందే జన్మించిన బిడ్డ ఎదుర్కోవలసి వచ్చే సమస్యలను ఫిలిప్పీయులు 4:7) మరుసటి రోజు సిజేరియన్ చేసి మా పాపను బయటికి తీశారు. పాప కేవలం 700 గ్రాములు మాత్రమే ఉంది. మేము పాపకు జోఅన్ షెల్లీ అని పేరు పెట్టాం.
వివరించారు. మస్తిష్కం పాడు కావచ్చు, శ్వాసనాళాలు సరిగా పని చేసేంతగా పరిపక్వం అయ్యుండకపోవచ్చు, మరనేకానేక సమస్యలు రావచ్చు అని ఆయన మాకు వివరించారు. “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” కోసం, ఏమి జరిగినా వాటినన్నింటినీ స్వీకరించి సహించే బలం కోసం నేను ప్రార్థించాను. (నేను ఐదు రోజులు తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాను. మా పసిపాప తన మనుగడ కొరకైన పోరాటంలో ఆసుపత్రిలోని స్పెషల్ ఇన్‌ఫెంట్ కేర్ యూనిట్‌లోనే ఉంది. రెండు వారాల తర్వాత, పాపకి న్యూమోనియా వచ్చింది. పాప కాస్త గట్టిపడినప్పుడు మా హృదయాలు ఎంతో కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. కానీ కొన్ని రోజుల తర్వాత, పాపకు ప్రేగులో ఇన్‌ఫెక్షన్ అవ్వడంతో, ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి మార్చవలసి వచ్చింది. మరో ఆరు రోజుల్లో, పాప కొంత కోలుకుంది, కొంచెం బరువు కూడా పెరగడం మొదలుపెట్టింది. మేము పరవశించిపోయాం ! కానీ మా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పాపకు అనీమియా ఉందని డా. మ్యాక్‌నెయిల్ మాకు తెలియజేశారు. పాపలో ఎర్ర రక్త కణాలు పునరుత్పత్తి అయ్యేందుకు, సింథెటిక్ హార్మోన్ ఎరిత్రోపోయిటిన్ (EPO) సంపాదించే ప్రయత్నం చేయమని ఆయన సూచించారు. ఇక్కడ బహమాస్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీస్, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న హాస్పిటల్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ ప్రతినిధులను సంప్రదించింది. ఆ ప్రతినిధులు, EPO లభ్యమయ్యేది ఎక్కడ, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేవాటిని గురించిన తాజా సమాచారాన్ని డా. మ్యాక్‌నెయిల్‌కు వెంటనే తెలియజేశారు, అలా ఆయన దానితో చికిత్స చేయడం మొదలుపెట్టారు.
ముందుముందు సమస్యలు
అనేక వారాలు ఎంతో చింతతో గడిచిపోయాయి. అప్పటికి, ప్రేగులో ఇన్‌ఫెక్షన్‌తో పాప పెనుగులాడుతుంది, అపస్మారం వచ్చి అప్పుడప్పుడు ఆప్నియా వస్తోంది (అప్పుడప్పుడు శ్వాస పీల్చుకోలేకపోవడం), హెమోగ్లోబిన్ తక్కువగా ఉంది, శ్వాసనాళ సంబంధ న్యూమోనియా కూడా ఉంది. వీటిలో ఏవైనా పాప మరణానికి దారి తీస్తాయేమోనని మేము భయపడ్డాం. కానీ పాప కొంచెం కొంచెం కోలుకుంది. మూడు నెలల వయస్సులో కూడా ఆసుపత్రిలోనే ఉంది, ఒక కేజీ 400 గ్రాముల బరువే ఉంది. కానీ, తన జీవితంలో మొదటిసారిగా, సప్లిమెంటరీ ఆక్సిజన్ లేకుండా తనంతట తాను గాలిపీల్చుకోవడం ప్రారంభించింది. హెమోగ్లోబిన్ సాధారణ స్థాయికి పెరిగింది. పాప మరో 500 గ్రాములు పెరిగితే, ఇంటికి తీసుకువెళ్ళవచ్చని డాక్టర్ చెప్పారు.
మూడు వారాల తర్వాత పాపకు తీవ్రమైన ఆప్నియా వచ్చింది. దానికి కారణం ఏమిటో పరీక్షల్లో తేలలేదు. తరచూ ఆప్నియా రావడం మొదలైంది. ఆమెకు తినిపిస్తున్నప్పుడు అది వస్తోంది. పాపకు జీర్ణకోశములోనికి వెళ్ళిన ఆహారం తిరిగి వస్తుందని చివరికి కనుగొన్నారు. తిన్న తర్వాత, అన్నవాహిక మూసుకోవడం లేదు. కనుక కడుపులో ఉన్నది తిరిగి ఆమె గొంతులోకి వస్తోంది. ఇలా జరిగినప్పుడు, అది గొంతుకకు అడ్డం పడుతుంది. అలా ఊపిరి ఆడడం లేదు.
అక్టోబర్ నెల మొదటి భాగంలో, పిల్లల వార్డులో ఉన్నప్పుడు జోఅన్‌కి వైరస్ సోకింది. నెలల నిండక ముందు పుట్టిన చాలా మంది పసిబిడ్డలు వైరస్ మూలంగా చనిపోయారు. అంత బలహీనమైన పరిస్థితిలో, పాపకి మునుపెన్నడూ రానంతటి పెద్ద ఆప్నియా వచ్చింది. పాప ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైద్యుడు, పాప చనిపోయిందని చెప్పబోతుండగా, పాప ఎలాగో మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. కానీ వెంటనే అపస్మారం వచ్చేసింది. మరొకసారి రెస్పిరేటర్‌ను పెట్టారు. జోఅన్ ఈ సారి చనిపోతుందనే మేమనుకున్నాం. కానీ ఎలాగో బ్రతికిపోయింది. అందుకు మేము యెహోవాకు కృతజ్ఞులం.
యెహోవాపై మరెక్కువ నమ్మకముంచడాన్ని నేర్చుకోవడం
మేము జోఅన్ పుట్టక ముందు మాకు ఎదురైన సమస్యలను—ఈది ఒడ్డుకు చేరుకోగలిగేంత దూరంలో పడవలోంచి నీట్లోకి పడిపోవడంతో పోల్చవచ్చు. ఇప్పటి పరిస్థితిని—కనుచూపు మేరలో ఎక్కడా తీరప్రాంతం కనిపించని సముద్ర మధ్యంలో ఓడ పడిపోవడంతో పోల్చవచ్చు. గతాన్ని వెనుదిరిగి చూస్తే, పాప పుట్టక ముందు కొన్నిసార్లు మేము మాపైనే అతిగా ఆధారపడినట్లు అనిపిస్తుంది. పాపతో మాకు కలిగిన అనుభవం ద్వారా మానవులు పరిష్కరించలేని పరిస్థితుల్లో యెహోవాపై నమ్మకముంచుకోవడాన్ని నేర్చుకున్నాం. యేసు సలహా ఇచ్చినట్లు, ఏ రోజు సమస్యను ఆరోజు ఎదుర్కోవడాన్ని నేర్చుకున్నాం. మత్తయి 6:34) కొన్నిసార్లు దేని కోసం ప్రార్థించాలో కూడా మాకు తెలియకపోయినప్పటికీ మేము యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాం. బైబిలు ద్వారా మాకు వివేకాన్నిచ్చినందుకూ, అలాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన “బలాధిక్యము”నిచ్చినందుకూ మేము ఇప్పుడు యెహోవాకు కృతజ్ఞతలు చెబుతున్నాం.—2 కొరింథీయులు 4:7.
(సంక్షోభ సమయాల్లో, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం నాకు కష్టంగా ఉన్నట్లుగా కనుగొన్నాను. నేను జోఅన్‌ను గురించి తప్ప మరేమీ ఆలోచించలేకపోయేదాన్ని. నేను ఆధ్యాత్మిక సమతుల్యతతో ఉండేందుకు నా భర్త జోయీ చెప్పలేనంత సహాయాన్ని అందించారు. అందుకు నేను ఆయనకు చాలా కృతజ్ఞురాలిని.
జోఅన్ ఇంటికి వచ్చింది
జోఅన్ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడింది. ఒక రోజు ఆమె రెస్పిరేటర్‌ని అక్షరార్థంగానే నోట్లో నుండి లాగేసుకుంది. ఇప్పుడు జోఅన్ ఇంటికి రాగలదని డా. మ్యాక్‌నెయిల్ భావించారు. మేము పరవశించిపోయాం ! ఆమెను ఇంటికి తీసుకొచ్చే సిద్ధపాటులో భాగంగా, ఆమెకు ట్యూబ్ ద్వారా తినిపించడం ఎలాగో నేర్చుకున్నాం. ఇంట్లో ఆక్సిజన్ సప్లైని కూడా అమర్చాం. హార్ట్ అండ్ బ్రీతింగ్ మోనిటర్‌ని అద్దెకు తీసుకున్నాం. అపస్మారం వస్తే చేయవలసిన వాటి గురించి తర్ఫీదు పొందాం. చివరికి, 1992 అక్టోబర్ 30న, జోఅన్‌ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆమె స్పెషల్ ఇన్‌ఫెంట్ కేర్ యూనిట్‌లో 212 రోజులు ఉంది. మేము కూడా ఆమెతో పాటు అక్కడే ఉన్నాం.
మొదటి నుండీ కూడా, కుటుంబ సభ్యులూ, యెహోవాసాక్షుల స్థానిక సంఘ సభ్యులూ యెహోవా ఇచ్చిన బహుమానంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇల్లూ వాకిలీ శుభ్రం చేసేవారు, వంట చేసేవారు, మేము ఆసుపత్రికి చేరుకోవడానికి సహాయం చేసేవారు, నేను కాసేపు నిద్రపోయేందుకని వాళ్ళు జోఅన్‌ను చూసుకునేవారు. అలా, వాళ్ళలో ఉన్న మేము మునుపు చూడని సుగుణాలను చూడగలిగాం. ఉదాహరణకు, తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమకు సహాయపడిన ఆధ్యాత్మిక తలంపులను వాళ్ళు మాతో పంచుకునేవారు.
నేడు మా జీవితం
జోఅన్‌కున్న అనేక సమస్యలకు సాధ్యమైనంత మంచి చికిత్సనూ మందులనూ ఇచ్చేందుకు మేము చాలా ప్రయత్నం చేశాం. మస్తిష్కం కొంత దెబ్బ తిన్న ఫలితంగా, పాపకు మస్తిష్క పక్షవాతం ఉందని పాపకు 19 నెలలు ఉన్నప్పుడు మేము తెలుసుకున్నాం. తర్వాత, జీర్ణకోశంలోని ఆహారం తిరిగి రావడాన్ని అరికట్టడానికి 1994 సెప్టెంబరులో పెద్ద సర్జరీ చేయించాం. 1997లో, జోఅన్‌కు ప్రాణాంతక అపస్మారం రావడం మొదలైంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆహారంలో సర్దుబాట్లు చేయడం ద్వారా, అపస్మారం రావడం ఆగిపోయింది. పాపకు ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల, శారీరక ఎదుగుదల కాస్త ఆలస్యమైంది. కానీ పాప ఇప్పుడు స్పెషల్ స్కూల్‌కి వెళ్తుంది, మెరుగుపడుతూ ఉంది. పాప నడవలేదు, ఎక్కువగా మాట్లాడలేదు, కానీ మాతోపాటు క్రైస్తవ కూటాలకన్నింటికీ వస్తుంది, ఇంటింటి పరిచర్యకు వస్తుంది. సంతోషంగా కనిపిస్తుంది.
మా ఓర్పును పరీక్షించిన సమయాల్లో యెహోవా మాకు ఎంతో సాంత్వననిచ్చాడు. ఊహించని కష్టాలు వచ్చినప్పటికీ, యెహోవాపై నమ్మకముంచడంలోను, ‘యెహోవాయందు సంతోషించ’డంలోను కొనసాగాలి అన్నదే మా నిర్ణయం. (హబక్కూకు 3:17, 18; ప్రసంగి 9:11) మా ముద్దుల కూతురు జోఅన్ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండగల దేవుడు వాగ్దానం చేసిన భూపరదైసు కోసం మేము ఆశతో ఎదురు చూస్తున్నాం.—యెషయా 33:24.
[అధస్సూచీలు]
^ ప్రీఎక్లామ్‌ప్సియా అంటే, గర్భిణి యొక్క రక్తనాళాల్లో ప్రతిబంధం ఏర్పడి, ఆమె అవయవాలకూ జరాయువుకూ పెరుగుతున్న భ్రూణానికీ రక్త ప్రసరణ చాలా తక్కువగా జరుగుతుంది. ఈ రోగానికి కారణం ఏమిటో తెలియకపోయినప్పటికీ, ఇది పారంపర్యంగా సంక్రమిస్తుంది అని ఋజువులు చెబుతున్నాయి.
[25వ పేజీలోని చిత్రం]
మా పాప జోఅన్
[27వ పేజీలోని చిత్రం]
కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ జోఅన్ సంతోషంగల బిడ్డే