మంచివైపుకి గమనార్హమైన మార్పు
మంచివైపుకి గమనార్హమైన మార్పు
“1900లో, ప్రపంచం మానవ చరిత్రలో అత్యంత గమనార్హమైన మార్పుకై సిద్ధంగా ఉంది. పాత యుగం పరిసమాప్తమైంది, క్రొత్త యుగం ప్రారంభం కానైయుంది.”—ద టైమ్స్ అట్లాస్ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ.
ఇరవయ్యవ శతాబ్దం తొలి భాగంలో, “ప్రపంచం అత్యంత సంక్షుభితమైన, హింసాత్మకమైన యుగంలోకి ప్రవేశించింది” అని పైన పేర్కొన్న అట్లాస్ చెబుతుంది. ఏ ఇతర శతాబ్దమూ ఎరుగనన్ని యుద్ధాల్ని 20వ శతాబ్దం చూసింది, యుద్ధాల్లో 10 కోట్లమందికి పైగా చనిపోయారు.
మునుపెన్నడూ లేనంతగా ఈ యుగంలోని యుద్ధాలు సైనికులకన్నా ఎక్కువగా పౌరజనాన్ని పొట్టనబెట్టుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినవారిలో 15 శాతంమంది పౌరులే. కానీ రెండవ ప్రపంచ యుద్ధానికొస్తే కొన్ని దేశాల్లో చనిపోయిన పౌరుల సంఖ్య, చనిపోయిన సైనికుల సంఖ్యను మించిపోయింది. అటుతర్వాత జరిగిన యుద్ధాల్లో చనిపోయిన లక్షలాదిమందిలో అనేకులు పౌరులే. ఈ హింసాకాండ అంతా, “ఎఱ్ఱనిదైన . . . గుఱ్ఱము” మీద స్వారీ చేస్తున్న రౌతు గురించిన బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చింది, “భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను” అని ఆ ప్రవచనం చెబుతుంది.—విలువల్లో మార్పులు
20వ శతాబ్దం 2 తిమోతి 3:1-5 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చింది, అక్కడిలా ఉంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”
కొంతమేరకు, అపరిపూర్ణ మానవులు ఈ లక్షణాల్ని చరిత్రంతటిలోనూ ప్రదర్శించారు. కానీ 20వ శతాబ్దంలో అలాంటి లక్షణాలు విపరీతంగా కన్పించటమేకాక, సర్వవ్యాప్తమైపోయాయి. పైన వర్ణించబడిన రీతిలో ప్రవర్తించే ప్రజల్ని ఒకప్పుడు సమాజానికి పీడగా చూసేవారు, చివరికి దుష్టులుగా దృష్టించేవారు. ఇప్పుడు “భక్తిగలవారివలె” ఉన్నవారు కూడా అటువంటి ప్రవర్తనను సాధారణమైన విషయంగా దృష్టిస్తున్నారు.
ఒకప్పుడు మతనిష్ఠగల ప్రజలకు, ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోకుండా కలిసి జీవించడమనేది తలంపుకి కూడా అందని విషయం. పెండ్లి కాకుండా తల్లి కావడం అనేది సిగ్గుకరమైన విషయంగా పరిగణించబడేది, స్వలింగ సంపర్కం ఘోరమైన విషయంగా దృష్టించబడేది. అనేకుల దృక్పథంలో గర్భస్రావం తలంపుకి కూడా వచ్చేది కాదు, విడాకులు కూడా అలానే దృష్టించబడేవి. వ్యాపారంలో నిజాయితీ లేకపోవటం పెద్ద అపరాధంగా ఎంచేవారు. కానీ నేడు చూస్తే, ఒక సమాచార మూలం చెబుతున్నట్లుగా “ఏం చేసినా ఎలా చేసినా పర్వాలేదు” అనే వైఖరి ప్రబలిపోయివుంది. ఎందుకు? ఒక స్పష్టమైన కారణం ఏమిటంటే, “ఏమి చెయ్యకూడదనేది ఇతరులు తమకు చెప్పనవసరం లేదనుకునే స్వార్థపరుల అభీష్టం నెరవేరుతుంది.”
20వ శతాబ్దంలోని ప్రజలు ఉన్నతమైన నైతిక ప్రమాణాల్ని విడనాడటం మూలంగా, వారి జీవితపు ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చాయి. ద టైమ్స్ అట్లాస్ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ ఇలా వివరిస్తోంది: “1900లో దేశాలూ ప్రజలూ తమ విలువని ఇంకా డబ్బుతో కొలవడం ప్రారంభించలేదు. . . . శతాబ్దం ముగింపుకల్లా దేశాలు తమ విజయాల్ని పూర్తిగా ఆర్థిక పరిభాషలోనే కొలిచారు. . . . ధనసంపదల గురించిన ప్రజల ఆలోచనా విధానంలోనూ అలాంటి మార్పులే సంభవించాయి.” నేడు సర్వవ్యాప్తంగా ఉన్న జూదం ప్రజల్లో ధనాశను పెంపొందిస్తుంది, ఇదిలా ఉండగా రేడియో, టీవీ, సినిమాలు, వీడియోలూ అన్నీ వస్తుసంపదల పట్ల అభిలాషను పెంపొందిస్తున్నాయి. చివరికి టీవీల్లోని క్విజ్ పోటీల వంటి కార్యక్రమాలూ, వాణిజ్య ప్రకటనల ద్వారా నిర్వహించే పోటీలు కూడా డబ్బే సమస్తం అన్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నాయి.
దగ్గరగా ఉన్నా దూరంగానే
20వ శతాబ్దం ప్రారంభంలో చాలామంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవించేవారు. 21వ శతాబ్దం తొలి భాగంలో సగానికన్నా ఎక్కువ జనాభా నగరాల్లో జీవిస్తారని అంచనా వేయడం జరిగింది. గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కనీస జీవన ప్రమాణాన్ని భావి తరాలకు అందించే విషయం ప్రక్కన పెడితే, నేటి నగరవాసులకు దాన్ని అందించటమే గొప్ప సమస్యల్ని తెచ్చిపెడుతుంది.” వరల్డ్ హెల్త్ అనే ఐక్యరాజ్య సమితి పత్రిక ఇలా చెబుతుంది: “నగరాల్లో జీవించే ప్రపంచ ప్రజల నిష్పత్తి పెరుగుతూ పోతుంది. . . . లక్షలాదిమంది . . . ప్రస్తుతం ఆరోగ్యానికి హానికలుగజేసే పరిస్థితుల్లో, ప్రాణాలకు ముప్పువాటిల్లజేసే పరిస్థితుల్లో జీవిస్తున్నారు.”
ప్రజలు నగరాల్లో దగ్గరగా జీవిస్తున్నా ఒకరికొకరు దూరమై పోవటం ఎంత హాస్యాస్పదం ! టీవీలు, టెలిఫోన్లు, ఇంటర్‌నెట్ వంటివి ఉపయోగకరంగా ఉంటున్నా, షాపింగ్ చేసేందుకు ఇవి సౌకర్యంగా ఉంటున్నా, వీటిమూలంగా ముఖాముఖిగా సంబంధాలు స్థాపించుకోవటం శూన్యమైపోతుంది. అందుకని జర్మన్ వార్తాపత్రిక బెర్లినర్ సైటుంగ్ ఇలా ముగింపుకొస్తుంది: “20వ శతాబ్దం జనాభా పెరుగుదల శతాబ్దమే కాదు. అది ప్రజల జీవితాల్లో ఘోరమైన ఒంటరితనాన్ని తీసుకువచ్చిన శతాబ్దం కూడాను.”
దీని మూలంగా ఎటువంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయో చూడండి. జర్మనీలోని హామ్‌బర్గ్‌లో ఒక
వ్యక్తి చనిపోయిన ఐదు సంవత్సరాలకు ఆయన శవం ఆయన అపార్ట్‌మెంటులో దొరికింది ! “ఆయన కన్పించటం లేదని ఎవరికీ అన్పించలేదు, ఆయన బంధువులకీ అన్పించలేదు, ఇరుగుపొరుగువారికీ అన్పించలేదు, అధికారులకీ అన్పించలేదు” అని డేర్ ష్పీగెల్ పత్రిక చెబుతుంది, అదింకా ఇలా చెబుతుంది: “చాలామంది పౌరులు ఒకరికొకరు పూర్తి అపరిచితులుగానే ఉంటున్నారనీ, పెద్ద నగరాల్లోని ప్రజలు ఒకరితో మరొకరు ఏమాత్రం సంబంధాలు లేకుండా జీవిస్తున్నారనీ దీన్నిబట్టి అర్థం అవుతుంది.”ఇలాంటి శోచనీయమైన పరిస్థితులకు కారణం సైన్సు టెక్నాలజీలు మాత్రమే కాదు, పొరబాటు ప్రాథమికంగా ప్రజలది. ఏ ఇతర శతాబ్దంలోకన్నా ఎక్కువగా 20వ శతాబ్దంలో “స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . కృతజ్ఞతలేనివారు . . . అనురాగరహితులు అతిద్వేషులు . . . సజ్జనద్వేషులు . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” ఉన్నారు.—2 తిమోతి 3:1-5.
1914, ప్రాముఖ్యమైన సంవత్సరం
విన్‌స్టన్ చర్చిల్ ప్రకారం “20వ శతాబ్దారంభం, ఉజ్జ్వలమైనదిగా ప్రశాంతంగా కన్పించింది.” పూర్వమెన్నడూ ఎరుగని శాంతి సౌభాగ్యాలను అది తెస్తుందని చాలామంది తలంచారు. అయితే, 1905లో సెప్టెంబరు 1 కావలికోట (ఆంగ్లం) ఇలా హెచ్చరించింది: “చాలా త్వరలోనే పెద్ద యుద్ధాలు జరుగుతాయి.” 1914లో “గొప్ప విపత్తు” ప్రారంభమౌతుందని కూడా అది పేర్కొంది.
నిజానికి 1879లోనే ఆ ప్రచురణ 1914 ఒక ప్రాముఖ్యమైన సంవత్సరమని పేర్కొంది. పరలోకంలో దేవుని రాజ్యం అదే సంవత్సరంలో స్థాపించబడిందని దానియేలు పుస్తకంలోని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయని అటుతర్వాతి సంవత్సరాల్లో అది చెప్పింది. (మత్తయి 6:10) 1914 దేవుని రాజ్యం భూమ్మీది వ్యవహారాలపై పూర్తి అదుపును సాధించవలసిన సమయం కాకపోయినా, ఆ సంవత్సరం అది తన పరిపాలనను ప్రారంభించ వలసిన సమయం.
బైబిలు ప్రవచనం ఇలా ముందే చెప్పింది: “ఆ రాజుల కాలములలో [అంటే మన నేటి రాజుల కాలంలో] పరలోకమందున్న దేవుడు [పరలోకంలో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు.” (దానియేలు 2:44) క్రీస్తు రాజుగా ఉన్న ఆ రాజ్యం, దాని క్రింద నివసించాలనే కోరికగల దైవభక్తిగల ప్రజల్ని ఇదే భూమిపై సమకూర్చటం ప్రారంభించింది.—యెషయా 2:2-4; మత్తయి 24:14; ప్రకటన 7:9-15.
పరలోకంలో జరిగిన సంఘటనలకు సమాంతర కాలంలోనే 1914లో ‘అంత్యదినములు’ ప్రారంభమయ్యాయి. ఈ అంత్యదినములు అనేవి ఒక నిర్దిష్టమైన కాలంపాటు ఉంటాయి, చివరికి ఇప్పుడున్న లోకవిధానం నాశనంతో ఇవి ముగుస్తాయి. ఈ కాలం ప్రారంభం ప్రపంచ యుద్ధాలు, ఆహారకొరతలు, వ్యాధులు, వినాశకరమైన భూకంపాలు, అన్యాయం విస్తరించటం, అలాగే దేవునిపట్లా తోటి మానవునిపట్లా ప్రేమ చల్లారిపోవటం వంటి వాటిచే సూచించబడుతుందని యేసు ముందే చెప్పాడు. ఇవన్నీ “వేదనలకు ప్రారంభము” అని ఆయన చెప్పాడు.—మత్తయి 24:3-12.
పూర్తిగా నూతనమైన లోకం త్వరలోనే
‘అంత్యదినములు’ ప్రారంభమై ఇప్పటికి 85 సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రస్తుతపు అసంతృప్తికరమైన విధానం అంతమయ్యే సమయాన్ని మనం చాలా త్వరగా సమీపిస్తున్నాము. త్వరలోనే దేవుని రాజ్యం క్రీస్తు ఆధిపత్యంలో “ముందు చెప్పిన [అంటే, ప్రస్తుతం ఉన్న] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44; 2 పేతురు 3:10-13.
అవును, దేవుడు భూమి మీది నుంచి దుష్టత్వాన్ని తుడిచిపెట్టి, నీతియుక్తమైన హృదయం గలవారిని పూర్తిగా నూతనమైన లోకంలోనికి ప్రవేశపెడ్తాడు. “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుంచి పెరికివేయబడుదురు.”—సామెతలు 2:21, 22.
ఎంతటి ఆనందకరమైన సందేశం—దీన్ని తప్పక భూమి నలుమూలలా ప్రకటించాల్సిందే ! 20వ శతాబ్దంలో దిగజారిపోయిన పరిస్థితుల్ని దేవుని రాజ్యం త్వరలోనే చక్కదిద్దుతుంది: యుద్ధాలు, బీదరికం, వ్యాధులు, అన్యాయాలు, విద్వేషాలు, అసహనాలు, నిరుద్యోగాలు, నేరాలు, విషాదాలు, మరణాలు అన్నీ నిర్మూలించబడతాయి.—కీర్తన 37:10, 11; 46:8, 9; 72:12-14, 16; యెషయా 2:4; 11:3-5; 25:6, 8; 33:24; 65:21-23; యోహాను 5:28, 29; ప్రకటన 21:3, 4 చూడండి.
నీతియుక్తమైన లోకంలో వర్ణనాతీతమైన ఆనందాలతో నిరంతరమూ జీవించటం అనే ఈ తలంపు మీ మనస్సును ఆకట్టుకుంటుందా? మరింత సమాచారం కోసం యెహోవాసాక్షుల్ని అడగండి. 20వ శతాబ్దపు సంక్లిష్టమైన సంవత్సరాల్లో జరిగిన విశిష్టమైన మార్పులు త్వరలోనే ఇక ఉండకుండా పోతాయనీ, మీరు అంతులేని ఆశీర్వాదాల్ని అనుభవించగలరనీ మీ స్వంత బైబిలులో నుంచి వారు మీకు చూపిస్తారు!
[10వ పేజీలోని చిత్రం]
పూర్తిగా నూతనమైన లోకం త్వరలోనే