మంచి జీవితాన్వేషణలో
మంచి జీవితాన్వేషణలో
“20వ శతాబ్దం ప్రారంభం నుంచి సంవత్సరాలు గడుస్తుండగా అనేక మంది ప్రజల దైనందిన జీవితాలు . . . వైజ్ఞానిక సాంకేతిక పురోభివృద్ధుల మూలంగా మారిపోయాయి.”—ది ఆక్స్‌ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ.
ఈ శతాబ్దంలోని అతి గొప్ప మార్పుల్లో ఒకటి జనాభా పెరుగుదలకు సంబంధించినది. ప్రపంచ జనాభా విషయానికి వస్తే ఏ ఇతర శతాబ్దంలోనూ ఇంత తీవ్రగతిన పెరుగుదల సంభవించలేదు. ప్రపంచ జనాభా 1800ల తొలి భాగంలో వంద కోట్లకు చేరుకుంది, 1900 కల్లా 160 కోట్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 1999వ సంవత్సరంలో 600 కోట్లకు చేరుకుంది ! ఈ జనాభాలో అధిక శాతం, తమ జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తాయనుకున్న మిథ్యా వస్తువుల్నే కోరుకున్నారు.
వైద్య రంగంలో పురోభివృద్ధుల మూలంగా, ఆరోగ్య సంరక్షణ మరింత అందుబాటులో ఉండటం మూలంగా జనాభాలో పెరుగుదల సంభవించింది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో సగటు సంభవనీయ జీవితకాలం పెరిగింది—శతాబ్దారంభంలో 50 సంవత్సరాలుగా ఉన్న సంభవనీయ జీవితకాలం ఇప్పుడు 70 సంవత్సరాలకు పెరిగింది. అయితే ఈ మంచి మార్పు వేరెక్కడా కన్పించటం లేదు. కనీసం 25 దేశాల్లో, ప్రజల సగటు జీవితకాలం 50 సంవత్సరాలు, లేదా అంతకన్నా తక్కువగా ఉంది.
‘మునుపు మీరేం చేసేవారు . . . ?’
తమ తాత ముత్తాతలు విమానాలు, కంప్యూటర్లు, టీవీలు లేకుండా ఎలా జీవించేవారో నేటి కొంతమంది యౌవనస్థులకు అర్థం కాదు—అటువంటివి వారికిప్పుడు సర్వసాధారణమైపోయాయి, కొన్ని సంపన్న దేశాల్లోని వారికైతే అవి అత్యవసర వస్తువులాయె. ఉదాహరణకు మోటారు వాహనాలు మన జీవితాల్ని ఎలా మార్చేశాయో పరిశీలించండి. అది 19వ శతాబ్దాంతంలో కనిపెట్టబడింది, కానీ ఇటీవల టైమ్ పత్రిక ఇలా అన్నది: “20వ శతాబ్దానికి ప్రారంభం నుంచి చివరికంటా ఒక నిర్వచనాన్నిచ్చిన ఆవిష్కరణల్లో మోటారు వాహనం ఒకటి.”
ఒకవేళ ఈ మోటారు వాహనాలు అకస్మాత్తుగా
మాయమైపోతే యూరప్‌లోని కార్మికుల్లో పదిశాతం మంది నిరుద్యోగులుగా మారిపోతారని 1975లో అంచనా వేయబడింది. మోటార్లను తయారుచేసే పరిశ్రమలపై పడే ప్రభావాలకు తోడు, దూరప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులపై ఆధారపడే బ్యాంకులు, పెద్ద పెద్ద దుకాణాలు, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్లు, మరితర వ్యవస్థాపనలు మూతబడిపోతాయి. వ్యవసాయదారులు తమ పంటలను మార్కెట్టుకి తరలించే మార్గం లేక ఆహార పంపిణీ వ్యవస్థలు నెమ్మదిగా కూలిపోతాయి. నగర శివార్లలో నివసిస్తూ నగరాల్లో పనిచేసే వారు తమ ఉద్యోగాలను కోల్పోతారు. భూతలంపై జాలరి వలల్లా అల్లుకుపోయి ఉండే సూపర్‌హైవేలు నిరుపయోగమైపోతాయి.మోటారు వాహనాల ఉత్పత్తిని ఎక్కువ చేయటానికీ ఖర్చుల్ని తక్కువ చేయటానికీ 20వ శతాబ్దారంభంలో అసెంబ్లీ లైన్‌లు ప్రవేశపెట్టబడ్డాయి, ఇప్పుడివి అనేక పరిశ్రమల్లో సర్వసాధారణం. (రకరకాల యంత్రాల్ని ఒకే పెద్ద వరుసలో ఉంచి, వివిధ వస్తువులను వాటిగుండా పంపిస్తూ చివరికి తయారైన ఒక ఉత్పాదనను బయటికి తీసుకువస్తారు, ఈ వ్యవస్థను అసెంబ్లీ లైన్ అంటారు. ఈ వ్యవస్థల మూలంగా వంటగదిలో ఉపయోగించే ఉపకరణాలతో సహా అనేక ఉత్పత్తులను పెద్దమొత్తంలో తయారుచేయటం సాధ్యమౌతుంది.) 20వ శతాబ్దారంభంలో మోటారు వాహనాలు చాలా కొద్ది దేశాల్లో ధనవంతులకు ఖరీదైన ఆటవస్తువులుగా ఉండేవి, కానీ అవిప్పుడు ప్రపంచమంతటిలో సామాన్యమానవుడికి సైతం రవాణా మాధ్యమాలుగా ఉన్నాయి. “20వ శతాబ్దాంతంలో మోటారు వాహనాలు లేని జీవితాల్ని ఊహించుకోవడమే అసాధ్యం” అని ఒక రచయిత చెప్పాడు.
ఆనందాల అన్వేషణలో
మునుపు, వెళ్ళవలసిన ప్రాంతాలకే ప్రయాణాలు చేసేవారు. కానీ 20వ శతాబ్దంలో పరిస్థితులు మారాయి—ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన దేశాల్లో. చక్కని జీతాలొచ్చే ఉద్యోగాలు మరింత ఎక్కువగా దొరకటంతో, అలాగే వారానికి 40 గంటలకు లేదా అంతకన్నా తక్కువకు పనిగంటలు తగ్గటంతో ప్రజలు ప్రయాణాలు చేయటానికి డబ్బులే కాదు, సమయమూ దొరికింది. ఇప్పుడు ప్రయాణానికి నిర్వచనం, వెళ్లాలనుకునే ప్రాంతాలకు వెళ్ళటం అని మారిపోయింది. కార్లు, బస్సులు, విమానాలు ఉండటం మూలంగా ఆహ్లాదం కోసం సుదూర తీరాలకు ప్రయాణించటం సులభతరమైంది. టూరిజం ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
ద టైమ్స్ అట్లాస్ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ ప్రకారం టూరిజం, “పర్యాటకులు ఏ దేశాల నుంచి వస్తారో ఆ దేశాలపైనా, వారు సందర్శించే దేశాలపైనా గొప్ప ప్రభావాన్ని చూపింది.” ఈ ప్రభావంలో కొంత చెడు ఉంది. పర్యాటకులు తమను ఆకర్షించిన ప్రాంతాలనే నాశనం చేసేందుకు తరచు కారణమయ్యారు.
ఇప్పుడు క్రీడల్లో అత్యంతాసక్తి చూపటానికి కూడా ప్రజలకు ఎక్కువ సమయం ఉంటోంది. చాలామంది క్రీడల్లో పాల్గొంటూ ఉండగా, మరితరులు క్రీడాభిమానులుగానే ఉంటూ సంతృప్తిపడ్డారు. ఫలానిది తమ అభిమాన జట్టు అనీ, ఫలానివ్యక్తి తమ అభిమాన క్రీడాకారుడనీ అనేకులు అత్యుత్సాహాన్నీ కొన్నిసార్లు రౌడీయిజాన్నీ ప్రదర్శించారు. టీవీ ప్రవేశంతో క్రీడారంగం దాదాపు ప్రతి ఇంట్లోకీ వచ్చేసింది. దేశీయ, అంతర్జాతీయ క్రీడలు లక్షలాదిమంది ఔత్సాహిక టీవీక్షకులను ఆకర్షించాయి.
“కాలక్షేపం కోసం ఏమి చేయాలన్నదాన్ని క్రీడా రంగమూ, చిత్ర పరిశ్రమలూ నిర్వచించాయి. ఇప్పుడీ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యా, వీరు ఆర్జించేంత డబ్బూ వేరే ఎక్కడా కన్పించవు” అని ద టైమ్స్ అట్లాస్ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ చెబుతుంది. ప్రజలు సాలీనా వినోద పరిశ్రమలపై కోట్లాది డాలర్లను ఖర్చుచేస్తున్నారు. అనేకమందికి ఒక రకమైన అభిమాన వినోదంగా ఉన్న జూద పరిశ్రమ వీటిలో ఒకటి. ఉదాహరణకు, 1991లో జరిపిన ఒక అధ్యయనం, జూదం యూరప్‌లోని
12వ అతి పెద్ద పరిశ్రమ అని చూపిస్తోంది, సాలీనా దాని టర్నోవరు చూస్తే కనీసం 57 బిలియన్ డాలర్లుగా ఉంది.అటువంటి వినోదకార్యకలాపాలు సర్వత్రా వ్యాపిస్తుండగా ప్రజలు మరిన్ని క్రొత్త థ్రిల్‌ల కోసం అన్వేషించటం ప్రారంభించారు. ఉదాహరణకు మాదకద్రవ్యాలతో ప్రయోగాలు ఎంత విస్తృతంగా జరుగుతాయంటే 1990ల మధ్య కాలానికల్లా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వాణిజ్యం సాలీనా 500 బిలియన్ డాలర్లుగా ఉందని అంచనాలు ఉన్నాయి. దీనితో అది “ప్రపంచంలో ఏకైక అత్యంత లాభసాటియైన వ్యాపారంగా ఉంది” అని ఒక సమాచార మూలం నివేదిస్తుంది.
“చచ్చేంత వినోదకాలక్షేపం”
టెక్నాలజీ మూలంగా లోకం ఒక భౌగోళిక కుగ్రామంగా కుదించుకుపోయింది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు ఇప్పుడు ప్రపంచంలోని ప్రజల్ని తక్షణమే ప్రభావితం చేస్తాయి. “యుగాలకే నిర్వచనాలనిచ్చిన అల్లకల్లోలాలు మునుపటి జీవితకాలాల్లో జరిగాయన్నది నిజమే” అని 1970లో ఫ్యూచర్ షాక్ రచించిన ప్రొఫెసర్ ఆల్విన్ టోఫ్లర్ అన్నాడు. ఆయనింకా ఇలా జతచేశాడు: “కానీ ఈ షాక్‌లూ, అల్లకల్లోలాలూ కేవలం ఒకే సమూహపు సరిహద్దులకే లేదా వాటి చుట్టుప్రక్కలకే పరిమితంగా ఉండేవి. వాటి ప్రభావాలు ఈ సరిహద్దులను దాటడానికి, తరాలు శతాబ్దాలే పట్టేవి. . . . నేడు చూస్తే సామాజిక సంబంధాలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒకే రోజు జరిగే సంఘటనల పరిణామాలు అదే రోజు ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తుంటాయి.” శాటిలైట్ టీవీ, ఇంటర్‌నెట్‌లు కూడా ప్రపంచం మొత్తంమీది ప్రజలను ప్రభావితం చేయడంలో ప్రముఖమైన పాత్రను కల్గివున్నాయి.
20వ శతాబ్దంలో టీవీ అత్యంత ప్రభావాన్ని చూపిన వార్తా మాధ్యమం అని కొందరు అంటారు. ఒక రచయిత్రి ఇలా వ్యాఖ్యానించింది: “కొందరు దాన్లో ప్రసారమయ్యే కార్యక్రమాలను విమర్శిస్తారు, అయితే ఎవరూ టీవీకి శక్తి ఉందన్న విషయాన్ని విభేదించరు.” అయితే టీవీ కార్యక్రమాల్ని నిర్మించే వ్యక్తులు ఎలాంటివారో ఆ కార్యక్రమాలూ అలానే ఉంటాయి. కాబట్టి మంచి ప్రభావాల్ని కనపర్చే శక్తికి తోడు, టీవీకి చెడు ప్రభావాల్ని చూపించే శక్తి కూడా ఉంది. లోతులేని కథావస్తువులపై ఆధారపడిన కార్యక్రమాలూ, హింసా అనైతికతలతో నిండిన కార్యక్రమాలూ, వాటిని ఆశించే ప్రజల అభిరుచుల్ని మెప్పించినా అటువంటివి మానవ సంబంధాల్ని మెరుగుపర్చలేకపోయాయి, చాలాసార్లు వాటిని దిగజార్చడం తప్పించి.
చచ్చేంత వినోదకాలక్షేపం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో నీల్ పోస్ట్‌మన్ ఇలా చెబుతూ మరో ప్రమాదం గురించి పేర్కొంటున్నాడు: “సమస్య, మన టీవీలు వినోదకరమైన విషయాల్ని అందిస్తున్నాయన్నది కాదు, అది సమస్త విషయాల్నీ వినోదకరంగా అందించటమే సమస్య . . . ఏమి చూపించబడినా, ఎవరి ఆలోచనా దృక్కోణంలో చూపించబడినా, సర్వత్రా ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏమిటంటే—చూపించబడేదంతా మన వినోదం కోసమే మన ఆనందం కోసమే.”
ప్రజలు ఆనందానికి అతి ప్రాధాన్యతనిస్తూపోయే సరికి, ఆధ్యాత్మిక విలువలు నైతిక విలువలు దిగజారిపోయాయి. “లోకంలో చాలా మట్టుకు 20వ శతాబ్దంలో వ్యవస్థీకృత మతం తన పట్టును కోల్పోయింది” అని ద టైమ్స్ అట్లాస్ ఆఫ్ ద ట్వంటీయత్ సెంచురీ చెబుతుంది. ఆధ్యాత్మికత పతనం అవుతూవుండగా, సుఖసంతోషాలను అనుభవించాలని తాపత్రయపడటం చాలా విపరీతంగా, అవసరానికన్నా ఎక్కువగా పెరిగిపోతోంది.
“మెరిసేదంతా . . . ”
20వ శతాబ్దంలో మంచి మార్పులు అనేకం జరిగాయి, కానీ ఒక సామెత చెప్పినట్లుగా “మెరిసేదంతా బంగారం కాదు.” సగటు జీవితకాలం పెరగడం మూలంగా ప్రజలు ప్రయోజనం పొందినప్పటికీ ప్రపంచ జనాభా పెరగటం మూలంగా అనేక పెద్ద సమస్యలు ఏర్పడ్డాయి. నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక ఇటీవల
ఇలా పేర్కొంది: “మనం క్రొత్త సహస్రాబ్దిలోకి ప్రవేశిస్తుండగా జనాభా పెరుగుదల అత్యంత గంభీరమైన సమస్యగా ఉంటుండవచ్చు.”మోటారు వాహనాలు చాలా ఉపయోగకరంగా, ఆనందాన్నిచ్చేవిగా ఉండవచ్చు. కానీ అవి ప్రాణాంతకం కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల మంది వాహనాల ప్రమాదాల్లో చనిపోతున్నట్లు వేయబడిన అంచనా ఆ విషయాన్ని నిరూపిస్తోంది. మరో విషయం, కాలుష్యానికి అతి పెద్ద కారకాలు కార్లే. కాలుష్యం “ఇప్పుడు భూగోళవ్యాప్తంగా ఉంది, ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు అన్ని ప్రాంతాల్లోనూ పర్యావరణాన్ని నాశనం చేస్తుంది, పర్యావరణ వ్యవస్థల్లోని జీవజాలానికి ముప్పు తలపెడుతోంది” అని గ్రహాన్ని రక్షించడానికి 5000 రోజులు (ఆంగ్లం) అనే పుస్తక రచయితలు చెబుతున్నారు. వారిలా వివరిస్తున్నారు: “పర్యావరణ వ్యవస్థల్ని పాడుచేసే స్థాయిని మనమెప్పుడో దాటిపోయాము, ఇప్పుడు మనం, ఉన్నత ప్రాణులకు భూమిని అనువైన స్థలంగా చేసే పర్యావరణ ప్రక్రియలకే విఘాతం కల్గిస్తున్నాము.”
20వ శతాబ్దంలో సమస్యగా మారిన కాలుష్యం మునుపటి శతాబ్దాల్లో కనీవినీ ఎరుగనిది. “మానవ చర్యలు, భూగోళ పరిధిలో ప్రభావాన్ని చూపగలవని ఇటీవలి వరకు ఎవరూ తలంచలేదు” అని నేషనల్ జియోగ్రఫిక్ చెబుతుంది. “ఇప్పుడు అటువంటి మార్పులు చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయని కొందరు విజ్ఞానశాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.” తర్వాత అదిలా హెచ్చరిస్తుంది: “మానవజాతి సమష్టిగా చూపగల్గే ప్రభావం ఎంతంటే, మొక్కల జంతువుల అనేక జాతులు ఒకే ఒక్క తరంలో అంతం కాగలవు.”
నిజంగానే 20వ శతాబ్దం విశేషమైనదిగా ఉంది. మంచి జీవితాన్ని అనుభవించటానికి మునుపెరుగనన్ని అవకాశాలు అందుబాటులోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం, ప్రజల జీవితాలు ప్రమాదంలో చిక్కుకున్నట్లు కనబడుతోంది !
[8, 9వ పేజీలోని చార్టు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
1901
అట్లాంటిక్ మీదుగా మార్కోనీ మొదటి రేడియో సంకేతాన్ని పంపాడు
1905
ఐన్‌స్టీన్ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించాడు
1913
మోడల్-టి కారు అసెంబ్లీ లైన్‌ను ఫోర్డ్ ప్రారంభించాడు
1941
టీవీ వాణిజ్య రూపాన్ని సంతరించుకుంది
1969
చంద్రునిపై మానవుని నడక
పర్యాటక వ్యవస్థ భారీ వాణిజ్యంగా మారింది
ఇంటర్‌నెట్ ప్రజాదరణకెదిగింది
1999
ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది