కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

దుస్తులు “మన వస్త్రధారణా విధానం—అది ప్రాముఖ్యమైన విషయమేనా?” అనే శీర్షికను ఉద్దేశించి నేనిది మీకు వ్రాస్తున్నాను. (మార్చి 8, 1999) మాకు “తగినవేళ అన్నము” అందించటానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని మెచ్చుకుంటున్నాను. (మత్తయి 24:45) కానీ శీర్షికలోని కొన్ని వ్యాఖ్యానాలు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నట్లుగా అనిపించాయి. ఉదాహరణకు ‘మీ అభిమాన కథానాయకుడ్ని లేక క్రీడాకారుడ్ని గురించి ప్రకటించే టీ-షర్ట్‌లు మిమ్మల్ని మనుష్యుల ఆరాధనవైపుకు అంటే విగ్రహారాధన వైపుకు మళ్ళించవచ్చు’ అనే వ్యాఖ్యానం ఆధారం లేనిది. ఏ బైబిలు ఆజ్ఞను మీరకుండానే ఒక క్రీడాకారుడ్ని ఇష్టపడటం, చివరికి అభిమానించటం సాధ్యమే.

ఎమ్‌. డి., ఫ్రాన్స్‌

నిర్మొహమాటంగా చెప్పిన మీ వ్యాఖ్యానాన్ని మేము మెచ్చుకుంటున్నాము, కానీ దుస్తుల విషయంలో ఒక నియమాన్ని పెట్టాలన్నది, లేక వస్త్రధారణ విధానాన్ని ఏర్పరచాలన్నది మా అభిమతం కాదు. తమ వస్త్రధారణ ఎంపికలో ‘స్వస్థ బుద్ధిని’ ఉపయోగించమని మా పాఠకులను ఆ శీర్షిక ప్రోత్సహించింది. (1 తిమోతి 2:9, 10) టీ-షర్టులకు సంబంధించిన ఆ వ్యాఖ్యానం పిడివాదంతో చేసినది కాదు గానీ కొన్నిరకాల స్టైళ్లు అవి వేసుకున్న వారికే హాని కలిగించగల సాధ్యతను అంగీకరించడమే. ఒక వ్యక్తికున్న నైపుణ్యాలను, ప్రజ్ఞను ప్రశంసించడంలో తప్పేమీ లేకపోయినప్పటికీ, బైబిలు ప్రమాణాలకు అనుగుణ్యంగా జీవించని ఒక వ్యక్తి జీవన విధానాన్ని లేక నైతికతను ఒక క్రైస్తవుడు అనుసరిస్తున్నాడనే తలంపును ఇతరులలో కలిగించే వస్త్రాలను ధరించడం యుక్తమైనదిగా ఉంటుందా?—ఎడిటర్‌.

తల్లిదండ్రులకు లేఖ “తమ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక లేఖ” అనే శీర్షిక ద్వారా నేను చాలా ప్రోత్సాహాన్ని పొందాను. (ఏప్రిల్‌ 8, 1999) అదే నేను కూడా నా తల్లిదండ్రులకు వ్రాయవలసినది. క్రైస్తవ కూటాలకు హాజరుకావడంలోనూ, పరిచర్యలో క్రమంగా పాల్గొనడంలోనూ, ఆతిథ్యాన్నివ్వడంలోనూ వారు మంచి మాదిరిని చూపించారు. మా నాన్నగారు పరిచర్య సేవకుడు, ఆయన సంఘ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అయినా, తరచూ మా వినోదం కోసం ప్లాన్‌ చేసేవారు, మేము ఎప్పుడూ స్కూల్‌లోని మా తోటి విద్యార్థులను బట్టి ఈర్ష్య పడేవాళ్ళం కాదు. ఆయన ఒక క్రైస్తవ సమావేశం నుండి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు, మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆయన తన జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చిన విధానాన్నీ మా అమ్మ విశ్వాసాన్నీ గుర్తుంచుకోవడం, యెహోవా సేవలో నేను కొనసాగేలా నన్ను పురికొల్పింది.

యస్‌. కె., జపాన్‌

సంక్షోభంలో పిల్లలు మే 8, 1999 సంచికయైన “సంక్షోభంలో పిల్లలు—వారినెవరు కాపాడతారు?” అనే శీర్షిక పరంపరల పట్ల నా మెప్పుదలను మీకు వ్యక్తపర్చాలనుకుంటున్నాను. ప్రజల ఆలోచనను రేకెత్తించడానికి, బాలలపై అత్యాచారం అనే ఘోరమైన అంశాన్ని గూర్చి తరచూ చర్చించడం మంచిదని నేను అనుకుంటున్నాను. మన పిల్లల ప్రపంచాన్ని రక్షించడం మన బాధ్యత. మీరు మీ మంచి పనిలో కొనసాగాలని నా ఆకాంక్ష.

పి. పి., కౌన్సిలర్స్‌ ఆఫీస్‌ ఫర్‌ చిల్డ్రన్‌, సిటీ ఆఫ్‌ రోమ్‌, ఇటలీ

21వ శతాబ్దం ప్రారంభంలో చాలామంది పిల్లలు ఇంకా బానిసలుగా పని చేస్తున్నారన్నది, ఇతరులను చంపేందుకు ఉపయోగించబడుతున్నారన్నది ఆలోచించడం చాలా విభ్రాంతిని కలిగించేదిగా ఉంటుంది. వాళ్ళల్లో చాలామందికి మంచి జీవితాన్ని పొందే అవకాశం అంతగా లేదన్నది అంగీకరించడం మరీ కష్టమైన వాస్తవం. మరొకసారి, తేజరిల్లు! ప్రపంచ పిల్లల దురవస్థను ఖచ్చితంగా వివరించింది.

యస్‌. ఆర్‌. బి., బ్రెజిల్‌

మా పెళ్లైన 36 ఏళ్లకు నేను విడాకులు తీసుకున్నాను. నా భర్త నా ప్రియమైన కూతుళ్లను సంవత్సరాలుగా పీడించాడని తెలుసుకున్నాను. (ఆయన క్రైస్తవుడు కాడు.) ఆ విషయం తెలుసుకున్నప్పుడు నేను పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయాను. లైంగిక అత్యాచార తీవ్రతనూ, అమాయకులైనవారు పడే చెప్పలేని వ్యథనూ ఎవరూ అర్థం చేసుకుంటున్నట్లు అనిపించడంలేదు. మీరు ఈ మహమ్మారి గురించి వ్రాసినందుకు నేను యెహోవాకు నా కృతజ్ఞతలు చెబుతున్నాను.

ఎన్‌. ఎమ్‌., అమెరికా