కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన విశ్వాసం—అంటే ఏమిటి?

నిజమైన విశ్వాసం—అంటే ఏమిటి?

బైబిలు ఉద్దేశము

నిజమైన విశ్వాసం—అంటే ఏమిటి?

“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”—హెబ్రీయులు 11:6.

విశ్వాసం అంటే ఏమిటి? సరైన రుజువు లేకున్నా దేవుడు ఉనికిలో ఉన్నాడన్న మతపరమైన నమ్మకమే విశ్వాసమని కొందరు వివరిస్తారు. “అసంభవమైనది సంభవిస్తుందన్న నిర్హేతుకమైన నమ్మకమే” విశ్వాసం అని అమెరికన్‌ జర్నలిస్ట్‌ అయిన హెచ్‌. ఎల్‌. మెన్‌కెన్‌ నిర్వచిస్తున్నాడు. బైబిలులో వివరించబడిన నిజమైన విశ్వాసం అదేనా? పైన ఎత్తివ్రాయబడినట్లు “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” గనుక, విశ్వాసం అంటే ఏమిటన్నది స్పష్టంగా గ్రహించడం చాలా ప్రాముఖ్యం.

“విశ్వసించుటయన, మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగ ఉండుట” అని బైబిలు చెబుతుంది. (హెబ్రీయులు 11:1, క్యాతలిక్‌ అనువాదము) కనుక, ఖచ్చితమైన పరిజ్ఞానంతో, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారమైన వాస్తవాలతో విశ్వాసం రూపు దిద్దుకుంటుంది. విశ్వాసానికి నమ్మకమే కాక, నమ్మడానికి ఆధారం కూడా ఉండాలి.

సోదాహరణగా చెప్పాలంటే: “నేను ఆ వ్యక్తిని నమ్ముతాను. ఆయన తన మాటమీద నిలబడతాడన్న నమ్మకం నాకుంది. నాకు సమస్యలేమైనా వస్తే, నాకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తాడని నాకు తెలుసు” అని మీరు చెప్పగల ఒక స్నేహితుడు మీకున్నాడని అనుకుందాం. కేవలం ఒకటి రెండు రోజులుగా మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి గురించి మీరు అలా చెప్పకపోవచ్చు, చెబుతారా? ఒక వ్యక్తి గురించి అలా చెప్పాలంటే, తనపై ఆధారపడవచ్చని ఆయన మరల మరల నిరూపించుకుని ఉండాలి. మతసంబంధమైన విశ్వాసం విషయంలో కూడా అది నిజం. అది, నమ్మదగిన గట్టి రుజువుల ఆధారంగా నిరీక్షణనూ నమ్మకాన్ని కలిగించగల్గాలి.

విశ్వాసమా, ఏదైనా సరే నమ్మడానికి సిద్ధంగా ఉండడమా?

నేడు విశ్వాసమంటే, నిజానికి అలా నమ్మేయడం—సరైన ఆధారం గానీ, కారణం గానీ లేకుండానే నమ్మడానికి సిద్ధపడడం అని ఎక్కువగా తలంచబడుతోంది. భావోద్వేగం, అంధవిశ్వాసం అనే అస్థిర పునాది ఆధారంగా దేన్నైనా ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి నమ్మకం సుస్థిరమైన పునాదిగల విశ్వాసం కాదు, దానికి నమ్మదగిన ఆధారం లేదు.

ఏదైనా సరే నమ్మేందుకు సిద్ధపడే మనస్సు, బైబిలు సత్యానికి అనుగుణ్యంగా లేని నిర్ధారణకు వచ్చేందుకు దారితీయగలదు. కనుకనే, “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని అంటూ సరైన ఆధారం లేని విశ్వాసానికి వ్యతిరేకంగా బైబిలు హెచ్చరికనిస్తుంది. (సామెతలు 14:15) “సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 థెస్సలొనీకయులు 5:21) ఏదైనా నమ్మడానికి సుముఖత చూపడాన్ని బైబిలు ప్రోత్సహించడం లేదు. రుజువుల ఆధారమున్న విశ్వాసాన్నే అది ప్రోత్సహిస్తుంది.

ఏదైన నమ్మేయడానికీ నిజమైన విశ్వాసానికీ గల తేడాను గ్రహించగల్గడం చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి మత నిష్ఠగలవాడై ఉన్నప్పటికీ నిజమైన విశ్వాసం లేకపోవచ్చు. “విశ్వాసము అందరికి లేదు” అని పౌలు వ్రాశాడు. (2 థెస్సలొనీకయులు 3:2) కానీ బైబిలు ఆధారమైన విశ్వాసం కొందరికి ఉంది, అది వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది.

నిజమైన విశ్వాసం మానవుడికీ దేవుడికీ మధ్య అనుబంధాన్ని ఏర్పరుస్తుంది

మానవుడికీ దేవుడికీ మధ్య అనుబంధాన్ని ఏర్పరిచే, నమ్మకమూ ఆధారపడడమూ అనే కొక్కెములు గల గొలుసుతో విశ్వాసాన్ని పోల్చవచ్చు. ఈ రకమైన విశ్వాసం అలవరచుకోవలసినది; అది జన్మసిద్ధంగా ఉండేది కాదు. మీరు నిజమైన విశ్వాసాన్ని ఎలా అలవరచుకోవచ్చు? “వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును” అని బైబిలు వివరిస్తుంది.—రోమీయులు 10:17.

కనుక, దేవుడ్ని గురించీ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు బోధలను గురించీ తెలుసుకునేందుకు మీరు సమయాన్ని తీసుకోవలసి ఉంది. ఈ జ్ఞానం, ప్రయత్నం లేకుండా వచ్చేది కాదు. (సామెతలు 2:1-9) బైబిలు నమ్మదగినదన్న నమ్మకం కలగాలంటే, అదేమి చెబుతుందో కనుగొనేందుకు మీరు ప్రయత్నించడం తప్పనిసరి.

అయినప్పటికీ, నిజమైన విశ్వాసంలో, కేవలం పరిజ్ఞానాన్ని సంపాదించడం కన్నా, లేదా ఫలానిది నిజమై ఉంటుంది అని నమ్మడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. ప్రేరణకు జన్మస్థానమైన హృదయం కూడా ఇమిడి ఉంది. “మనుష్యుడు హృదయములో విశ్వసించును” అని రోమీయులు 10:10 చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) దానర్థం ఏమిటి? మీరు దైవిక విషయాలను ధ్యానించుకుని, వాటిపై మీకున్న మెప్పుదలను పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు బైబిలు సందేశం మీ హృదయపు అట్టడుగు భాగానికి చేరుకునేందుకు మీరు అనుమతిస్తారు. దేవుని వాగ్దానాలకు అనుగుణ్యంగా మీరు చర్య గైకొనడానికి ప్రేరేపించబడినప్పుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడన్న రుజువును మీరు చూస్తున్నప్పుడు మీ విశ్వాసం పెరుగుతుంది, మరింత బలీయమౌతుంది.—2 థెస్సలొనీకయులు 1:3.

నిజమైన విశ్వాసం నిజంగా ఎంత ప్రశస్తమైన ఆస్తి ! దేవుని మీద నమ్మకంతో, మన అడుగుజాడలకు మార్గదర్శనమివ్వగల ఆయన సామర్థ్యంపైనా, మన అవసరాలను తీర్చేందుకు ఆయన చూపే సుముఖతపైనా ఆధారపడుతూ, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగల్గినప్పుడు మనం ప్రయోజనం పొందుతాం. అంతేకాక, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, విశ్వాసం వలన కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని గురించి ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (ఇటాలిక్కులు మావి.) (యోహాను 3:16) నిత్యజీవం—విశ్వాసంగలవారికి ఎంత అద్భుతమైన వరమది !

తన సేవకులకు ప్రతిఫలమిస్తానని దేవుడు చేసిన వాగ్దానంపై ఉండే విశ్వాసం ఒకరికి జీవితాన్ని గురించిన క్రొత్త దృక్కోణాన్ని చూపిస్తుంది. “దేవుని . . . వెదకువారికి” ప్రతిఫలమిచ్చే సామర్థ్యం దేవునికుందన్న నమ్మకం నిజమైన విశ్వాసంలో ఇమిడి ఉందని హెబ్రీయులు 11:6 చెబుతుంది. అయితే, నిజమైన విశ్వాసం అంటే ఏదైనా నమ్మడానికి సిద్ధపడడమని కాదు. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం కన్నా ఎక్కువే. తనను హృదయపూర్వకంగా వెదికేవారికి ప్రతిఫలమిచ్చేవాడిగా చర్య తీసుకునే శక్తి దేవునికి ఉందని అంగీకరించడం ఇమిడి ఉంది. దేవుడ్ని తెలుసుకోవాలని మీరు నిజంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నారా? అలాగైతే, ఆయన వాక్యమైన బైబిలులో నుండి ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోండి, మీ విశ్వాసానికి ప్రతిఫలం లభిస్తుంది.—కొలొస్సయులు 1:9, 10.

[20వ పేజీలోని చిత్రసౌజన్యం]

Drawings of Albrecht Dürer/Dover Publications, Inc.