కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

భారతదేశపు జనాభా నూరు కోట్లను దాటింది

యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ డివిజన్‌ అభిప్రాయం ప్రకారం, ఇండియాలోని జనాభా 1999 ఆగస్టులో నూరు కోట్లను దాటింది. యాభై సంవత్సరాల క్రితం, భారత దేశపు జనాభా ఇప్పుడు ఉన్న దానిలో మూడింట ఒక వంతే ఉంది. ప్రస్తుత జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1.6 శాతం. ఇది ఇలాగే కొనసాగితే, నాలుగు దశాబ్దాల్లో భారత దేశం అత్యంత జనాభాగల చైనాను మించిపోతుంది. “ఇప్పటికీ, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనాభాకు కారణం భారతదేశమూ, చైనా” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. దాదాపు అర శతాబ్దం క్రితం భారతదేశంలోని సంభవనీయ జీవత కాలం 39 సంవత్సరాలుగా ఉండేది, అది ఇప్పుడు 63 సంవత్సరాలకు పెరిగింది.

నాలుక సంరక్షణ

మీ నాలుకపైన దాగి ఉండే బ్యాక్టీరియా, సల్ఫర్‌ వాయువులను ఉత్పత్తి చేయడం ద్వారా నోటి దుర్వాసన కలుగుతుంది అని ప్రిన్స్‌ జార్జ్‌ సిటిజెన్‌ అనే వార్తాపత్రికలోని ఒక నివేదిక చెబుతుంది. “తేమలేని, ఆక్సిజన్‌ లేని వాతావరణంలో బ్యాక్టీరియా బాగా వర్ధిల్లుతుంది, కనుక మనం శ్వాసనాళాల ద్వారా మన ఊపిరితిత్తులకు పంపే గాలికి దూరంగా ఉన్న పగుళ్ళలోనూ, సందులలోనూ అది నివసిస్తుంది” అని ఆ నివేదిక చెబుతుంది. బ్రష్‌తో తోముకోవడం, పళ్ళ సంధులను దారంతో శుభ్రం చేసుకోవడం సహాయకరమైనవే అయినప్పటికీ వాటి ద్వారా, కేవలం 25 శాతం బ్యాక్టీరియా మాత్రమే తొలగించబడుతుంది. యూరప్‌లోని ప్రాచీన సాంప్రదాయం—నాలుక గీసే అలవాటు—“నోటి దుర్వాసనను నివారించుకునే ఏకైక ప్రముఖ మార్గం” అని డెంటిస్ట్‌ అయిన అలన్‌ గ్రూవ్‌ నమ్ముతున్నారు. “నాలుకను శుభ్రంగాను, గులాబి రంగులోను ఉంచుకునేందుకు దాన్ని బ్రష్‌తో శుభ్రం చేసుకోవడం కన్నా” ప్లాస్టిక్‌ నాలుక బద్దను ఉపయోగించడమే “మేలైన మార్గం” అని సిటిజెన్‌ పత్రిక అంటోంది.

“జీవానికి అత్యవసరమైనది”

“జీవానికి నీళ్ళు చాలా ముఖ్యం, శరీరం ఎక్కువగా ద్రవమయంగా ఉంటుంది. శరీరంలో ఉన్న నీటిలో కేవలం 20 శాతం తగ్గినా ప్రాణాంతకం కాగలదు” అని టొరొంటో స్టార్‌ వార్తాపత్రిక నివేదిస్తుంది. నీళ్ళు మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడమే కాక, “అవయవాల్లో నుండి పోషకాలను, వ్యర్థ పదార్థాలనూ రక్త ప్రవాహంలోకి శరీర వ్యవస్థల్లోకి చేరవలసిన చోటికి చేరవేస్తాయి కూడా. కీళ్ళనూ పెద్దప్రేగునూ నున్నగా చేసి, వ్యర్థపదార్థ విసర్జనకు ఆలస్యం కలగకుండా చేస్తాయి.” సగటు వయోజనులకు రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీళ్ళు అవసరం. కాఫీ, పోప్‌ బెవరేజస్‌, లేదా మద్యపానం అనేవి మంచి నీటి అవసరాన్ని పెంచుతాయి. ఎందుకంటే, వాటిని సేవించడం వల్ల నిర్జలీకరణం జరుగుతుంది. ఒక డైటీషియన్‌ అభిప్రాయం ప్రకారం, దాహం కలగడమే మీరు నీళ్ళు త్రాగడానికి జ్ఞాపికగా తలంచకూడదు, ఎందుకంటే, మీకు దాహమయ్యే సరికల్లా బహుశా మీలో నీళ్ళు బొత్తిగా లేకుండా అయిపోవచ్చు. “చాలామందికి, పగలు ఒక్కో గంటకు ఒక్కో గ్లాసు నీళ్ళు త్రాగడం వాళ్ళ శరీర నీటి అవసరాన్ని తీర్చుతుంది” అని ఆ వార్తాపత్రిక పేర్కొంటుంది.

కావలసినవి భుజించాలి

సగటున చూస్తే, అమ్మాయిలు 10 నుండి 14 ఏండ్ల వయస్సులో 10 అంగుళాల ఎత్తూ, 18-22 కిలోల బరువూ పెరుగుతారు. అబ్బాయిలు 12 నుండి 16 ఏండ్ల వయస్సులో 12 అంగుళాల ఎత్తూ, 22-27 కిలోల బరువూ పెరుగుతారు. అలా శీఘ్రంగా పెరుగుతున్న ఈ వయస్సులో, అధికమౌతున్న తమ బరువును బట్టి కౌమార ప్రాయంలోని పిల్లలు చాలా అసౌకర్యంగా భావించడం అసాధారణమేమీ కాదు. అనేకమంది పిల్లలు తాము బరువెక్కకుండా ఎలా నియంత్రించుకోవాలా అని చింతిస్తుంటారు. “అతి తక్కువగా తినడం, తీసుకోవలసిన ఆహార పదార్థాలపై నియంత్రణలు పెట్టుకోవడం అనేవి ఆరోగ్యకరమైన పరిష్కారాలు కావు, అలా చేయాలని సిఫారసు కూడా చేయడంలేదు” అని డైటింగ్‌ స్పెషలిస్ట్‌ అయిన లిన్‌ రోబ్‌లిన్‌ ద టొరొంటో స్టార్‌ వ్రాశారు. ఆ విధంగా చేయడం వల్ల, శరీరానికి అవసరమైన పోషకాలు దొరక్కుండా పోతాయి అని రోబ్‌లిన్‌ అన్నారు. డైటింగ్‌ చేసే విషయంలో ప్రయోగాలు చేయడంవల్ల, “ఈ దశలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవడి మరింత గంభీరమైన రుగ్మతలకు దారితీయగలవు.” కౌమారప్రాయంలోని పిల్లలు తమ శరీరాన్ని గురించి మరింత వాస్తవికమైన దృక్కోణాన్ని అలవరచుకోవలసిన అవసరముంది, ఈ వయస్సులోని పిల్లలు, “తమ శరీరాన్ని గురించి అతిగా చింతించక, అవసరమైనంత పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, ఉత్సాహంగా ఉంటూ” కావలసినంత బరువును పెంచుకోవలసిన అవసరం ఉంది అని ఆమె పేర్కొంది.

పొగాకు వల్ల పిల్లలకు ప్రమాదం

పొగాకు పొగ పీల్చడం వల్ల ప్రపంచంలోని 50 శాతం మంది పిల్లల ఆరోగ్యం అపాయంలో ఉందని లండన్‌లోని గార్డియన్‌ అనే వార్తాపత్రిక అంచనా వేస్తుంది. ఇతరులు త్రాగి విడిచిన పొగను పీల్చడం వల్ల ఆస్త్మా, శ్వాసప్రక్రియలో ఇబ్బందులు, అకస్మాత్తుగా శిశువులు మరణించడం, మధ్య చెవి రుగ్మత, క్యాన్సర్‌ మొదలైన ప్రమాదాలు రాగలవు. పొగత్రాగేవారి పిల్లలకు చదువు విషయంలోను, ప్రవర్తన విధానాల్లోను సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులిరువురూ పొగత్రాగేటట్లయితే, వాళ్ళ పిల్లలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కునే సాధ్యత 70 శాతం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కరు పొగత్రాగినా 30 శాతం ఎక్కువగా ఉంటుంది. పొగత్రాగే అలవాటు మూలంగా కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందో గ్రహించేందుకు తల్లిదండ్రులకు విద్యాబోధ చేయాలనీ, పాఠశాలల్లోను పిల్లలు తరచూ వెళ్ళే మరితర స్థలాల్లోను పొగత్రాగడాన్ని నిషేధించాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇస్తోంది.

పర్యటన విజయం

వరల్డ్‌ టూరిజమ్‌ ఆర్గనైజేషన్‌ (WTO) చేసిన సూచనల ప్రకారం, “అంతర్జాతీయ పర్యాటకుల ప్రస్తుత సాంవత్సరిక సంఖ్య 6,250 లక్షలు. అది 2020వ సంవత్సరంలో 160 కోట్లకు చేరుకుంటుంది” అని ద యునెస్కో కొరియర్‌ నివేదిస్తుంది. ఈ పర్యాటకులు రెండు లక్షల కోట్ల కన్నా ఎక్కువ అమెరికన్‌ డాలర్లను ఖర్చు చేస్తారని, ఆ విధంగా, “టూరిజమ్‌ ప్రపంచ ప్రముఖ పరిశ్రమగా మారుతుంది” అని నిరీక్షించబడుతుంది. ఇప్పటి వరకూ, యూరప్‌ అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటన కేంద్రంగా ఉంది. ఫ్రాన్స్‌, అత్యధికంగా పర్యటన చేయబడుతున్న దేశం. 1998లో ఇక్కడికి ఏడు కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. అయితే, 2020 నాటికి చైనా మొదటి స్థానానికి వస్తుందని నిరీక్షించబడుతుంది. అయితే, అంతర్జాతీయ పర్యటన ఆధిక్యత గల కొందరికి మాత్రమే సాధ్యమౌతోంది. 1996లో, ప్రపంచ జనాభాలోని కేవలం 3.5 శాతం మంది మాత్రమే విదేశాలను పర్యటించారు. ఇది 2020 నాటికి 7 శాతం కావచ్చని వరల్డ్‌ టూరిజమ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ అంచనావేస్తోంది.

రాటిల్‌ సర్పం ప్రతీకారం

“రాటిల్‌ సర్పాలు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కాటువేయవచ్చు—ఈ మరణానంతర అసాధారణ ప్రతీకారం అనేది చాలా సాధారణమన్నది ఆశ్చర్యకరం” అని న్యూ సైంటిస్ట్‌ నివేదిస్తోంది. అమెరికాలోని అరిజోనాలో 11 నెలల కాలవ్యవధిలో రాటిల్‌ సర్పం కాటుకు గురై చికిత్స చేయబడిన 34 మందిలో 5 గురు, దాన్ని చంపిన తర్వాత అది తమను కాటు వేసిందని చెప్పినట్లు ఈ ప్రతిఘటనను అధ్యయనం చేస్తున్న ఇద్దరు వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఒక రాటిల్‌ సర్పాన్ని చంపాడు. దాని తలను తెగనరికి, అది కదలకుండా ఉండేవరకు వేచి చూశాడు. ఆ తర్వాత తలను తన చేతిలోకి తీసుకున్నాడు. అకస్మాత్తుగా ఆ తల ముందుకు కదిలి ఆయన రెండు చేతులపై కాటు వేసింది. తెగనరకబడిన రాటిల్‌ సర్పాల తలలు “చనిపోయిన ఒక గంట వరకు తమ ఎదుట రెపరెపలాడించిన వస్తువులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి” అని మునుపు జరిగిన అధ్యయనాలు చూపించాయి అని ఆ పత్రిక పేర్కొంటోంది. “ఇది, ముక్కుకూ కంటికీ మధ్య ఉండేటువంటి, శరీర ఉష్ణోగ్రతను కనుగొనేటువంటి నిర్మాణమైన ‘పిట్‌ ఆర్గాన్‌’లో ఉండే ఇంద్రియాలచేత పురికొల్పబడిన అచేతన ప్రక్రియ” అని సరీసృప శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. తల ఛేదించబడిన రాటిల్‌ సర్పాన్ని “ఒక చిన్న పాము”గా దృష్టించాలని డా. జెఫరీ సూషార్డ్‌ హెచ్చరిస్తున్నారు. “మీరు దాన్ని ముట్టుకోవలసి ఉంటే, చాలా పెద్ద కర్రను ఉపయోగించమనే నా సలహా” అని ఆయన అంటున్నారు.

అసాధారణ శక్తి వనరులు

◼ న్యూ కలడోనియాలోని ఊవేయ దీవిలో పెట్రోలియమ్‌ లేదు. అయితే ఆ దీవి విద్యుచ్ఛక్తిని ఉత్పన్నం చేసేందుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తోంది అని సైన్స్‌ ఏ అవనీర్‌ అనే ఫ్రెంచ్‌ పత్రిక చెబుతోంది. ఫ్రెంచ్‌వాడైన ఇంజనీర్‌ అయిన అలయన్‌ లియనార్డ్‌, కొబ్బరినూనెతో పనిచేసే ఇంజన్‌ను రూపొందించేందుకు 18 సంవత్సరాలు వెచ్చించాడు. ఆ ఇంజన్‌ ఒక జనరేటర్‌ని నడిపిస్తుంది. ఆ జనరేటర్‌, ఆ దీవిలోని 235 కుటుంబాలకు నీటిలోని ఉప్పును తీసివేసి మంచినీటిని సరఫరా చేసే ప్లాంట్‌కి విద్యుచ్ఛక్తిని ఇస్తుంది. తాను రూపొందించిన 165 కిలోవాట్‌ సిస్టమ్‌, శక్తిని ఉత్పాదనలోను, ఇంధన ఉపయోగంలోను డీజల్‌ ఇంజన్‌లకు సరితూగుతుందని లెనర్డ్‌ చెప్పాడు.

◼ అయితే, భారతదేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలోని కలాలీ గ్రామంలో చేసిన ఒక ప్రయోగంలో, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసేందుకు ఎద్దుల బలం ఉపయోగించబడింది. ఈ విధంగా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే తలంపు ఒక శాస్త్రజ్ఞుడికీ, ఆయన సోదరుని/సోదరి కూతురికీ వచ్చింది అని క్రొత్త ఢిల్లీలో ప్రచురించబడే డౌన్‌ టు ఎర్త్‌ అనే పత్రిక నివేదిస్తుంది. చిన్న జనరేటర్‌ని నడిపే గియర్‌బాక్స్‌తో అనుసంధానం చెయ్యబడిన కొయ్యను నాలుగు ఎద్దులు తిప్పుతాయి. ఆ జనరేటర్‌ను బ్యాటరీలకు అనుసంధానం చేశారు. ఆ బ్యాటరీలు నీళ్ళ పంపుకూ, ధాన్యపు గ్రైండర్‌కీ విద్యుచ్ఛక్తిని అందజేస్తాయి. గాలిని ఉపయోగించే మిల్లులను ఉపయోగించినప్పుడు ఒక యూనిట్‌కి అయ్యే 40 రూపాయల ఖర్చుతోగాని లేదా, సోలార్‌ బ్యాటరీలను ఉపయోగించినప్పుడు ఒక యూనిట్‌కి అయ్యే 1,000 రూపాయల ఖర్చుతో గానీ పోల్చి చూస్తే, ఎద్దులను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఒక యూనిట్‌ విద్యుచ్ఛక్తికి నాలుగు రూపాయలే అవుతుంది అని డౌన్‌ టు ఎర్త్‌ అనే పత్రిక చెబుతుంది. అయితే, గ్రామస్తులకు సంవత్సరంలోని మూడు నెలలు పొలం పనిలో ఎద్దులు కావాలి కనుక, ఎద్దులతో విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసేవారు ఎద్దులు అందుబాటులో లేనప్పుడు ఉపయోగించేందుకని విద్యుచ్ఛక్తిని నిల్వచేసే ఫలకరమైన మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నారు.

ఆరోగ్యం కోసం నడవడం

నడక, మీరు బరువు తగ్గించుకునేందుకూ ఒత్తిడిని తగ్గించుకునేందుకూ సహాయపడడమే కాక, “రక్త పోటూ గుండెపోటూ వచ్చే ప్రమాదాన్ని” తగ్గించుకునేందుకు కూడా మీకు సహాయపడుతుంది అని టొరొంటోలోని ద గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ చెబుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే నడవడానికి సమయం తీసుకోవాలి. ఎంత సమయం? “కెనడాస్‌ ఫిజికల్‌ ఆక్టివిటీ గైడ్‌ టు హెల్తీ ఆక్టివ్‌ లివింగ్‌ పత్రిక ప్రకారం, మీరు మామూలు వేగంలో నడుస్తున్నట్లయితే, మీరు ఒక్కోసారి కనీసం పది నిమిషాలు చొప్పున ప్రతిరోజు మొత్తం 60 నిమిషాలు నడవాల్సి ఉంటుంది.” రోజుకు 30 నుండి 60 నిమిషాలు వేగంగా నడిచినా సైకిల్‌ తొక్కినా లేదా ప్రతిరోజు 20 నుండి 30 నిమిషాలు పరుగెట్టినా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. పరుగెట్టడానికి వేసుకునే జోళ్లు తేలిగ్గానూ కాళ్ళకు గాలి తగిలే విధంగానూ ఉండాలి, జోళ్ల క్రింది భాగం వంగేలా ఉండి పాదం ఆకారానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి, జోళ్ల లోపలి భాగం మెత్తగా ఉండాలి, వేళ్ళకు తగినంత స్థలమూ ఉండాలి అని గ్లోబ్‌ సిఫారసు చేస్తుంది.

పిల్లలు తల్లిపాలు త్రాగడం వారి బరువును నియంత్రిస్తుందా?

పిల్లలకు పాలివ్వడం వల్ల మరొక ప్రయోజనముందని పరిశోధకులు చెబుతున్నారు: బిడ్డ తర్వాతి కాలంలో అమిత బరువు పెరగడాన్ని నివారించవచ్చు. జర్మనీ వార్తాపత్రికయైన ఫోకస్‌లో నివేదించబడినట్లు, మునిచ్‌ యూనివర్సిటీ పరిశోధన జట్టు, ఐదారేండ్లుగల 9,357 మంది పిల్లల బరువును తూచి చూసింది, వాళ్ళు శైశవంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నారన్నది ఎంక్వయరీ చేసింది. తల్లిపాలు అసలు త్రాగని పిల్లల కన్నా మూడు నుండి ఐదు నెలలు తల్లిపాలు త్రాగిన పిల్లలు బడికెళ్ళే వయసు వచ్చే సరికి, అమితంగా బరువు పెరిగే సాధ్యత, 35 శాతం తక్కువ అని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. వాస్తవానికి, బిడ్డ తల్లిపాలు ఎంత ఎక్కువ కాలం త్రాగితే, అమితంగా బరువెక్కే సాధ్యత అంత తక్కువవుతుంది. ఈ ప్రయోజనకరమైన ఫలితాలు తల్లిపాలలోని మిశ్రితాల వల్లేనని, అవి పిల్లల శరీరంలో కావలసిన ప్రక్రియ జరిగేందుకు తోడ్పడతాయని ఒక పరిశోధకుడు అంటున్నాడు.