ప్రేమ గ్రుడ్డిదైనప్పుడు
ప్రేమ గ్రుడ్డిదైనప్పుడు
స్పెయిన్‌లోని తేజరిల్లు! విలేఖరి
మీరు వధువు కోసం వెదుకుతున్నారు, తగిన కన్యలు చీకటిపడిన తర్వాత మాత్రమే కనబడతారు. కానీ మీకు హ్రస్వ దృష్టి అని అనుకోండి. మీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంపరర్ మోత్ (ఒక రకం చిమ్మెట) పరిస్థితి అదే. అయితే, ఈ అద్భుతమైన కీటకానికున్న కొన్ని సవిశేషతలు, ఈ అసాధారణ సవాలును కాస్త సులభతరం చేస్తాయి.
వేసవి నెలల్లో, గొంగళి పురుగుగా ఈ భావి వరుడు కంటికి కనిపించే ప్రతిదీ స్వాహా చేస్తూ బాగా లావెక్కుతాడు. అలా, రానున్న వసంత కాలంలో, ప్యూపా (కోశస్థ దశ) నుండి అందమైన ఎంపరర్ మోత్‌గా బయటికి వచ్చేసరికి తన ఆయుష్కాలమంతటికీ సరిపోయేంత ఆహారం సమకూరి ఉంటుంది. మోత్ ఆయుష్కాలం కేవలం రెండు నెలలే.
ఆహార సమస్య పరిష్కరించబడిన తర్వాత, ఎంపరర్ మోత్ తన జతను కనుగొనే ప్రయత్నంలో శ్రద్ధ కేంద్రీకరించగలడు. అయితే, ఉపయోగకరమైన ఉపకరణాలు లేకుండా, వెన్నెలలో ఆడ మోత్‌ను కనుగొనడమంటే గడ్డిమోపులో సూదిని వెదకడమే.
మోత్ యొక్క చిన్న తల నుండి సున్నితమైన రెండు ఆంటెన్నాలు చిన్న మొలకల్లా మొలుస్తాయి. ఈ చిన్న మొలకలు భూమి మీద ఉన్న వాసనను కనిపెట్టే యంత్రాలన్నింటిలోకెల్లా చాలా సంక్లిష్టమైనవి. అంతేకాక, ఆడ మోత్ స్నేహభావంతో వెదజల్లే రసాయనం లేదా “సుగంధం” ఎంత తక్కువగా ఉన్నా చక్కగా కనిపెట్టగల్గేలా ఆ ఆంటెన్నాలు రూపొందించబడి ఉంటాయి.
ఆడ మోత్‌లు చాలా తక్కువే అయినప్పటికీ, అవి వెదజల్లే శక్తిమంతమైన ఫెరోమోన్ అనే రసాయన పదార్థం ఘ్రాణ సంకేతంగా పనిచేస్తుంది. మగ మోత్‌ల ఆంటెన్నాల ఇంద్రియజ్ఞానం ఎంత గొప్పదంటే, దాదాపు ఏడు మైళ్ళ దూరంలో ఉన్న ఆడ మోత్‌ను కూడా కనిపెట్టగలవు. మగ మోత్ ఆ విధంగా ఆటంకాలన్నింటినీ అధిగమించి, తన పూరకమైన ఆడ మోత్‌ను కలుస్తుంది. కీటక ప్రపంచంలో, కనీసం ఈ కీటకం విషయంలో, ప్రేమ గ్రుడ్డిదై ఉండగలదు.
దేవుని సృష్టిలో, ఎంత ఆసక్తికరమైన అసాధారణమైన విషయాలు విస్తారంగా ఉన్నాయి ! అందుకే, “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి ! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది” అని కీర్తన రచయిత వ్రాశాడు.—కీర్తన 104:24.
[12వ పేజీలోని చిత్రసౌజన్యం]
© A. R. Pittaway