కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ పెరుగుతున్న డిమాండ్‌

రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ పెరుగుతున్న డిమాండ్‌

రక్తరహిత మందులకూ శస్త్రచికిత్సకూ పెరుగుతున్న డిమాండ్‌

“రక్తముతోను, శస్త్రచికిత్స అవసరమైన రోగుల సంరక్షణతోను వ్యవహరిస్తున్నవారందరూ రక్తరహిత సర్జరీని పరిగణనలోకి తీసుకోవాలి.”—డా. జోయాకిమ్‌ బోల్ట్‌, అనెస్తీసియాలజీ, లూడ్‌విగ్‌హఫన్‌, జర్మనీ.

శాస్త్రజ్ఞులూ, వైద్యులూ, ఆపరేషన్‌ గదిని మరింత సురక్షితమైన స్థలంగా మార్చేందుకు అదనపు చర్యలు తీసుకునేలా ఎయిడ్స్‌ అనే విషాద విషయం బలవంతపెట్టింది. దానర్థం మరింత నిర్దిష్టంగా రక్తం స్క్రీనింగ్‌ చేయవలసి ఉందని స్పష్టం. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నా రక్తమార్పిడుల వల్ల ఇక ప్రమాదమేమీ ఉండదని చెప్పలేం. “రక్త సరఫరాను మునుపెన్నటికన్నా సురక్షితమైనదిగా మార్చడానికి సమాజం ఎంతో వెచ్చిస్తున్నా, రక్త మార్పిడులు పూర్తిగా సురక్షితమైనవిగా మారలేవు కనుక, ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోకుండా ఉండడానికే రోగులు ప్రయత్నిస్తారని మేము అనుకుంటున్నాం” అని ట్రాన్స్‌ఫ్యూషన్‌ అనే పత్రిక అంటోంది.

రాను రాను చాలామంది డాక్టర్లు రక్తం ఎక్కించే విషయంలో అప్రమత్తంగా ఉండడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. “రక్తమార్పిడులు నిజానికి మంచివి కావు. అసలు ఎవరికీ రక్తమెక్కించకూడదన్నదే మా ఉద్దేశం” అని కాలిఫోర్నియాలోని శాన్‌ ఫ్రాన్‌సిస్కోలోని డా. అలెక్స్‌ జపోలాన్‌స్‌కీ అంటున్నారు.

రక్తమార్పిడుల వల్ల వచ్చే ప్రమాదాలను గురించి సాధారణ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. వాస్తవానికి, కెనడా దేశస్థుల్లో 89 శాతం మంది రక్తానికి ప్రత్యామ్నాయం కావాలని ఇష్టపడతారని 1996లో చేసిన సర్వే చూపిస్తుంది. “ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోవడానికి యెహోవాసాక్షుల్లాగా అందరూ నిరాకరించరు. అయినప్పటికీ, రుగ్మతలు అంటడం, రోగనిరోధక వ్యవస్థ మార్పులు సంభవించడం వంటి ప్రమాదాలు, మనం మన రోగులందరి కోసం ప్రత్యామ్నాయాలను కనుగొనడం తప్పనిసరి అన్న స్పష్టమైన రుజువులను ఇస్తున్నాయి” అని జర్నల్‌ ఆఫ్‌ వాస్కులర్‌ సర్జరీ పేర్కొంటోంది.

ఎక్కువగా ఇష్టపడే పద్ధతి

మేలైన ఒక విషయమేమిటంటే, ఇప్పుడు ప్రత్యామ్నాయం ఉంది. ఆ ప్రత్యామ్నాయమేమిటంటే: రక్తరహిత మందులూ శస్త్రచికిత్స. చాలామంది రోగులు దాన్ని చివరికి ప్రయత్నించవలసిన విషయంగా కాక, మొదట కోరవలసిన విషయంగా దృష్టిస్తారు. దానికి మంచి కారణమే ఉంది. రోగం సోకే రేటూ, మరణం సంభవించే రేటూ రక్తరహిత శస్త్రచికిత్స చేయించుకునే వారికీ “రక్తం ఎక్కించుకునే రోగులకు దాదాపు ఒకటే. అయితే రక్తరహితంగా శస్త్రచికిత్స చేయించుకునేవాళ్ళు భవిష్యత్తులో రక్తమార్పిడి వల్ల రాగల ఇన్‌ఫెక్షన్‌ నుండి సంక్లిష్టతల నుండి తప్పించుకుంటారు” అని బ్రిటీష్‌ కన్‌సల్టంట్‌ సర్జన్‌ అయిన స్టీవన్‌ జెఫ్రీ పాలర్డ్‌ పేర్కొంటున్నారు.

రక్తరహిత మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఎలా వృద్ధయ్యింది? ఒక రకంగా చెప్పాలంటే, ఈ ప్రశ్న చాలా వింత ప్రశ్నే. ఎందుకంటే, రక్తరహిత మందు అనేది రక్తాన్ని ఉపయోగించి చికిత్స చేసే పద్ధతి అమలులోకి రాకముందు ప్రాబల్యంలో ఉన్నదే. వాస్తవానికి, రక్తమార్పిడి చేసే సాంకేతికత నిత్యం ఉపయోగించేమేరకు వృద్ధయినది 20వ శతాబ్దపు తొలిభాగంలోనే. అయినప్పటికీ, ఇటీవలి దశాబ్దాల్లో కొందరు రక్తరహిత శస్త్రచికిత్స రంగంలో బాగా పేరొందారు. ఉదాహరణకు, 1960లలో ప్రముఖ సర్జన్‌ అయిన డెన్టన్‌ కూలీ కొన్ని ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్‌లను రక్తరహితంగానే చేశారు.

1970లలో, రక్తమార్పిడి చేయించుకున్న వ్యక్తులకు హెపటైటిస్‌ సోకడం ఎక్కువ కావడంతో, చాలా మంది వైద్యులు రక్త ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మొదలుపెట్టారు. 1980లు వచ్చేసరికి, అనేక పెద్ద మెడికల్‌ టీమ్‌లు రక్తరహిత శస్త్రచికిత్సలు చేయడం మొదలుపెట్టాయి. తర్వాత, ఎయిడ్స్‌ మహామారి మొదలైనప్పుడు, ఇదే పద్ధతులను అవలంబించాలన్న ఆతురతతో ఇతరులు ఈ జట్టులను మరలా మరలా సంప్రదించారు. 1990లలో, తమ రోగులకు రక్తరహిత ట్రీట్‌మెంట్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్నిచ్చే ప్రోగ్రామ్‌లను అనేక ఆసుపత్రులు వృద్ధి చేశాయి.

మునుపు రక్తమార్పిడులు చేయవలసి వచ్చిన ఆపరేషన్‌లకూ ఎమర్జెన్సీ చికిత్సలకూ వైద్యులు ఇప్పుడు రక్తరహిత సాంకేతిక నైపుణ్యాలను విజయవంతంగా ఉపయోగించగల్గుతున్నారు. “రక్తాన్ని గానీ, రక్త ఉత్పన్నాలను గానీ ఉపయోగించకుండానే, కార్డియక్‌, వాస్కులర్‌, గైనకాలజికల్‌, ఆర్థోపెడిక్‌, యూరోలజికల్‌, ప్రసూతి మేజర్‌ ఆపరేషన్లు విజయవంతంగా చేయగల్గుతున్నారు” అని కెనేడియన్‌ జర్నల్‌ ఆఫ్‌ అనెస్తీసియాలో డి. హెచ్‌. డబ్ల్యు వోంగ్‌ పేర్కొన్నారు.

రక్తరహిత శస్త్రచికిత్స వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, దానివల్ల మెరుగైన ఆరోగ్య సంరక్షణ కలుగుతుంది. “రక్తం అధికంగా పోవడాన్ని నివారించడంలో సర్జన్‌కి నైపుణ్యం ఉండడం చాలా ప్రాముఖ్యం” అని డా. బెంజమిన్‌ జె. రీచ్‌స్టెన్‌ అంటున్నారు. ఆయన ఓహాయోలోని క్లీవ్‌లండ్‌లో శస్త్రచికిత్స డైరెక్టర్‌. కొన్నిసార్లు రక్తరహిత శస్త్రచికిత్స “తక్కువ ఖర్చుతో త్వరగా శుభ్రంగా” పూర్తికాగలదు అని దక్షిణ ఆఫ్రికాలోని ఒక లీగల్‌ జర్నల్‌ అంటోంది. “చాలా కేసుల్లో దాని తర్వాతి ట్రీట్‌మెంట్లకు ఖర్చుగానీ సమయం గానీ చాలా తక్కువ పడుతుందని రుజువవుతుంది” అని కూడా ఆ పత్రిక అంటోంది. ప్రత్యేకంగా రక్తరహిత మందులనిచ్చే, రక్తరహిత శస్త్రచికిత్సలను చేసే ప్రోగ్రాములు ఉన్న ఆసుపత్రుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 180 కన్నా ఎక్కువగా ఉండడానికి పైన పేర్కొన్నవి కొన్ని కారణాలు మాత్రమే.

రక్తమూ యెహోవాసాక్షులూ

బైబిలు ఆధార కారణాలను బట్టి యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరిస్తారు. * అయితే వాళ్ళు రక్త ప్రత్యామ్నాయాలను అంగీకరిస్తారు, వాటి కోసం పట్టుదలతో ప్రయత్నిస్తారు. “యెహోవాసాక్షులు మెడికల్‌ ట్రీట్‌మెంట్‌లో ఏది శ్రేష్ఠమైనదో దాని కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ విషయంలో మంచి విద్యాబోధను పొందిన ఒక గుంపుగా సర్జన్‌లకు తారసపడే వినియోగదారులు వీరే” అని డా. రిచర్డ్‌ కె. స్పెన్స్‌, న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో డైరెక్టరుగా ఉన్నప్పుడు అన్నారు.

డాక్టర్లు యెహోవాసాక్షులకు అనేక రక్తరహిత శస్త్రచికిత్సలను చేయడంలో సఫలులయ్యారు. కార్డియోవాస్కులర్‌ సర్జన్‌ అయిన డెంటన్‌ కూలీ అనుభవాన్నే తీసుకుందాం. 27 సంవత్సరాల కాలంలో, ఆయన జట్టు యెహోవాసాక్షులకు 663 రక్తరహిత ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలు చేసింది. రక్తాన్ని ఉపయోగించకుండానే కార్డియాక్‌ ఆపరేషన్‌లను విజయవంతంగా చేయవచ్చని ఆ శస్త్రచికిత్సల ఫలితాలు చూపిస్తున్నాయి.

నిజమే, యెహోవాసాక్షులు రక్తమార్పిడికి నిరాకరించడాన్ని చాలామంది విమర్శించారు. అయితే, సాక్షుల దృఢ నిశ్చయం, “జీవం మీద గౌరవానికి సూచన”గా ఉంది అని అసోసియేషన్‌ ఆఫ్‌ అనెస్తీటిస్ట్స్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌ అండ్‌ ఐర్లాండ్‌ ప్రచురించిన ఒక గైడ్‌ చెబుతుంది. నిజానికి, సాక్షుల గట్టి నిర్ణయం, నేడు అందరికీ సురక్షితమైన ట్రీట్‌మెంట్‌ లభ్యం కావడానికి ముఖ్య ప్రేరకమైంది. “నార్వేజీయన్‌ హెల్త్‌ సర్వీస్‌లోని ఒక సెక్టర్‌లో మెరుగులకు మార్గాన్ని చూపించిందీ, ఒత్తిడి చేసిందీ శస్త్రచికిత్స అవసరమైన యెహోవాసాక్షులే” అని నార్వే నేషనల్‌ హాస్పిటల్లో ప్రొఫెసర్‌ అయిన స్టేన్‌ ఏ. ఇవన్‌సన్‌ వ్రాశారు.

రక్తం సహాయం లేకుండానే ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంలో డాక్టర్లకు సహాయపడేందుకు, యెహోవాసాక్షులు సహాయకరమైన ఒక ఆసుపత్రి అనుసంధాన సర్వీస్‌ని మొదలుపెట్టారు. కంప్యూటర్‌లో ఉన్న రక్తరహిత మందులను గురించిన శస్త్రచికిత్సని గురించిన 3,000 కన్నా ఎక్కువ శీర్షికల నుండి తయారు చేసిన వైద్య సాహిత్యాన్ని డాక్టర్లకూ పరిశోధకులకూ ఇచ్చేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,400 కన్నా ఎక్కువ హాస్పిటల్‌ ఆసుపత్రి అనుసంధాన కమిటీలు సంసిద్ధంగా ఉన్నాయి. “నేడు యెహోవాసాక్షుల హాస్పిటల్‌ లెయిసన్‌ కమిటీల పని మూలంగా, యెహోవాసాక్షులకు మాత్రమే కాక, మొత్తమ్మీద రోగులెవరికీ కూడా అత్యవసరం కానప్పడు రక్తాన్ని ఎక్కించడం లేదు” అని బోస్టన్‌ కాలెజ్‌ లా స్కూల్‌లో ప్రొఫెసర్‌ అయిన డా. చాల్స్‌ బరన్‌ అంటున్నారు. *

యెహోవాసాక్షులు సంపుటీకరించిన రక్తరహిత మందులను గురించిన శస్త్రచికిత్సని గురించిన సమాచారం వైద్యరంగంలోని అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. ఉదాహరణకు, ఆటోట్రాన్స్‌ఫ్యూషన్‌: తెరాప్యూటిక్‌ ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ అనే పుస్తకం వ్రాయడం కోసం ఆ పుస్తకపు రచయితలు, రక్తమార్పిడుల ప్రత్యామ్నాయాన్ని గురించిన సమాచారాన్ని ఇవ్వమని యెహోవాసాక్షులను అడిగారు. యెహోవాసాక్షులు వాళ్ళు కోరినది సంతోషంగా ఇచ్చారు. కృతజ్ఞతాపూర్వకంగా ఆ రచయితలు, “మేము ఈ సమాచారమంతటినీ చదువుతుండగా, మునుపెన్నడూ చూడనంతగా, రక్త మార్పిడులు నివారించే పద్ధతుల సంక్షిప్తమైన పూర్ణమైన లిస్ట్‌ను చూశాము” అని తర్వాత పేర్కొన్నారు.

వైద్య రంగంలోని పురోగతి, అనేకులు రక్తరహిత మందులను ఉపయోగించడాన్ని పరిగణనలోకి తీసుకునేలా చేసింది. ఇది మనల్ని ఎంత వరకు తీసుకువెళ్తుంది? “ఈ రంగంలో మన అవగాహనలో కలిగిన ప్రగతి, రక్తమార్పిడులు ఒక నాటికి లేకుండా పోవలసిందేనని చూపిస్తుంది” అని ఎయిడ్స్‌ వైరస్‌ను కనుగొన్న ప్రొఫెసర్‌ లూక్‌ మాన్‌టాన్యే అన్నారు. ఈలోగా, ఇప్పటికే రక్త ప్రత్యామ్నాయాలు అనేక జీవితాలను కాపాడుతున్నాయి.

[అధస్సూచీలు]

^ ఆసుపత్రి అనుసంధాన కమిటీలు వైద్య సిబ్బందిని ఆహ్వానించి కూడా తమ దగ్గర ఉన్న సమాచారాన్ని సమర్పిస్తాయి. అంతేకాక, ఆపరేషన్‌లకు లేదా శస్త్రచికిత్సలకు ముందు, ఇన్‌చార్జ్‌లో ఉన్న వైద్యుడూ రోగులూ అరమరికలు లేకుండా నిర్మొహమాటంగా మనస్సులో మాటను చర్చించుకోవడానికి నిర్దిష్ట తోడ్పాటును కోరినా ఆ కమిటీలవారు వచ్చి సహాయం చేస్తారు.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

కొందరు డాక్టర్లు ఏమంటున్నారు

‘యెహోవాసాక్షులకు మాత్రమే కాక అందరికీ రక్తరహిత సర్జరీ చేయాలి. ప్రతి డాక్టరూ రక్తరహిత సర్జరీ చేయాలని నేననుకుంటున్నాను.’—డా. జోయాకిమ్‌ బోల్ట్‌, అనెస్తీసియాలజీ ప్రొఫెసర్‌, లుడ్‌విగ్‌షఫన్‌, జర్మనీ.

“రక్తమార్పిడులు గతం కన్నా నేడు సురక్షితమైనవే. కానీ, రోగనిరోధక వ్యవస్థ ప్రతిఘటించడం, హెపటైటిస్‌ రావడం లేదా లైంగికంగా సంక్రమించే మరితర రుగ్మతలు సోకడం మొదలైన ప్రమాదాలు ఇప్పటికీ ఉంటాయి.”—డా. టెర్రెన్స్‌ జే. సాకీ, క్లినికల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌.

“చాలామంది వైద్యులు రక్తమార్పిడులు చేయడానికి అసంకల్పితంగా ముందుకొస్తారు. యథేచ్ఛగా, వెనకా ముందు ఆలోచించకుండా రక్తం ఎక్కించేస్తారు. నేనలా చేయను.”—శాన్‌ ఫ్రాన్సిస్కో హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కార్డియక్‌ సర్జరీ డైరెక్టరైన డా. అలెక్స్‌ జోపోలాన్‌స్కీ.

“సాధారణ రోగి కడుపుకి మామూలు ఆపరేషన్‌ చేసేటప్పుడు రక్తం ఎక్కించవలసిన అవసరం ఉన్నట్లు నేననుకోవడం లేదు.”—జర్మనీలోని జెనాలోని, సర్జరీలో ప్రొఫెసర్‌ అయిన డా. జోహన్నస్‌ షేల.

[చిత్రాలు]

డా. టెర్రెన్స్‌ జే. సాకీ

డా. జోయాకీమ్‌ బోల్ట్‌

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

రక్తరహిత మందులూ శస్త్రచికిత్సా కొన్ని పద్ధతులు

ద్రవాలు: రక్త పరిమాణాన్ని కాపాడడానికీ, రక్తలేమి వల్ల రక్తప్రసరణ ఆగిపోవడాన్ని నివారించడానికీ రింగర్స్‌ లాక్టేట్‌ సొల్యూషన్‌నూ, డెక్స్‌ట్రాన్‌ను, హైడ్రోక్సీథైల్‌ స్టార్చ్‌ను మరితరములను ఉపయోగిస్తారు. ఇప్పుడు పరీక్షించబడుతున్న కొన్ని ద్రావకాలు శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేయగలవు.

మందులు: జెనటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా తయారు చేయబడిన ప్రోటీన్‌లు, ఎర్ర రక్తకణాల (ఎరిత్రోపోయిటీన్‌), రక్త ప్లేట్‌లెట్‌ల (ఇంటర్‌లూకిన్‌-11), వివిధ తెల్ల కణాల (జిఎమ్‌-సిఎస్‌ఎఫ్‌, జి-సిఎస్‌ఎఫ్‌) ఉత్పత్తికి ప్రేరకం కాగలవు. ఇతర మందులు శస్త్రచికిత్స (అప్రోటనన్‌, ఆంటీఫైబ్రినోలిటిక్స్‌) చేసేటప్పుడు రక్తం ఎక్కువగా నష్టం కాకుండా చేస్తాయి లేదా అమిత రక్త స్రావం (డెస్మోప్రెసిన్‌) కాకుండా తగ్గించడానికి సహాయపడతాయి.

బయోలజికల్‌ హెమోస్టాట్స్‌: రక్తస్రావాన్ని ఆపడానికి కోలజన్‌ మరియు సెల్యులోస్‌ ప్యాడ్‌లను నేరుగా ఉపయోగిస్తారు. లోతైన గాయాలను రక్తస్రావమౌతున్న కణజాలాల పెద్ద ప్రాంతాలను ఫైబ్రిన్‌ గ్లూలు (బంకలు), సీలంట్‌లు ఉపయోగించి మూస్తారు.

రక్తం నష్టంకాకుండా కాపాడడం: శస్త్రచికిత్స చేసేటప్పుడు లేదా కణజాలానికి గాయం కలిగినప్పుడు పోయిన రక్తాన్ని సాల్‌వేజింగ్‌ యంత్రాల సహాయంతో సేకరించి, శుద్ధీకరించి, రోగిలోకి తిరిగి పంపవచ్చు. కొన్నిసార్లు, ఈ పద్ధతి ద్వారా లీటర్ల లెక్కన రక్తాన్ని తిరిగి సేకరించి రోగిలోకి ప్రవేశపెట్టవచ్చు.

శస్త్రచికిత్స ఉపకరణాలు: కొన్ని ఉపకరణాలు రక్తనాళాలను కత్తిరించడమూ మూయడం ఒకేసారి చేయగలవు. కణజాలంలో రక్తస్రావమౌతున్న పెద్దప్రాంతాలను మూయడానికి ఉపయోగించగల ఉపకరణాలు కూడా ఉన్నాయి. లాపరోస్కోప్‌ ఉపయోగించి, ఆపరేషన్‌ చేయవలసిన భాగాన్ని పరిశీలించి, చిన్నగా కోసే ఉపకరణాలతో శస్త్రచికిత్స చేయడం ద్వారా పెద్దగా కోతలను నివారిస్తూ రక్తం ఎక్కువగా పోకుండా చూడవచ్చు.

శస్త్రచికిత్స టెక్నిక్‌లు: ఆపరేషన్‌కి సరిగా ప్లాన్‌ చేయడంలో, అనుభవజ్ఞులైన సర్జన్‌లను సంప్రదించడం కూడా ఇమిడి ఉంది. అలా చేయడం శస్త్రచికిత్స చేసే బృందం సంక్లిష్టతలను నివారించుకోవడానికి సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపడానికి వెంటనే చర్యతీసుకోవడం చాలా ప్రాముఖ్యం. 24 గంటల కన్నా ఎక్కువ ఆలస్యమైతే రోగి చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పెద్ద శస్త్రచికిత్సలను అనేక చిన్న చిన్న శస్త్రచికిత్సలుగా విభజించి చేస్తే రక్తం తక్కువగా పోతుంది.

[10వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

రక్తరహిత మందులు క్రొత్త “ఆరోగ్య సంరక్షణ ప్రమాణమా”?

తేజరిల్లు !, రక్తరహిత మందుల వల్ల శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఈ రంగంలోని నలుగురు నిపుణులతో చర్చించింది.

మత సంబంధమైన కారణాల వల్ల రక్తమార్పిడులకు నిరాకరించే రోగులు కాకుండా, మరెవరు రక్తరహిత వైద్యంలో ఆసక్తిని చూపిస్తున్నారు?

డా. స్పాన్‌: రక్తరహిత వైద్యం కావాలని మా సెంటర్‌కి వచ్చి అడిగేవారు సాధారణంగా విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసిన రోగులే.

డా. షాన్డర్‌: 1998లో రక్తమార్పిడులను మత సంబంధమైన కారణాల వల్ల నిరాకరించినవారి కన్నా, వ్యక్తిగత కారణాల వల్ల నిరాకరించినవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

డా. బోయ్డ్‌: ఉదాహరణకు, క్యాన్సర్‌ రోగులనే తీసుకుందాం. వాళ్ళు రక్తం ఎక్కించుకోకపోతే, బాగా కోలుకుంటారని, వాళ్ళకు ఆ రుగ్మత మళ్ళీ అంతగా రావడం లేదని అనేకసార్లు రుజువయ్యింది.

డా. స్పాన్‌: తరచూ యూనివర్సిటీ ప్రోఫెసర్లకూ, వాళ్ళ కుటుంబ సభ్యులకూ రక్తం ఉపయోగించకుండానే ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాము. రక్తమార్పిడులు చేయవద్దని సర్జన్లు సహితం కోరుకుంటారు ! ఉదాహరణకు, ఒక సర్జన్‌ విషయమే తీసుకోండి. ఆయన భార్యకు ఆపరేషన్‌ అవసరమైంది. ఆయన మా దగ్గరికి వచ్చి, “ఒక్క విషయం. ఆమెకు రక్త మార్పిడి చేయకుండా చూసుకోండి !” అని అన్నాడు.

డా. షాన్డర్‌: ‘రక్తం ఎక్కించుకోని రోగులు కూడా కోలుకుంటున్నారు. మిగతా వాళ్ళ కన్నా బాగా కోలుకుంటున్నారు. అలాంటప్పుడు రెండు వైద్య ప్రమాణాలను ఎందుకు అనుసరించాలి? ఇలా చేయడమే మంచిదైతే, అందరికీ ఇలాగే చేద్దాం’ అని మా అనెస్తీసియా డిపార్ట్‌మెంట్‌లోని సభ్యులు, అన్నారు. కనుక, రక్తరహిత వైద్యమే ఆరోగ్య సంరక్షణ ప్రమాణంగా మారాలని మేము ఎదురు చూస్తున్నాం.

మిస్టర్‌ ఎర్న్‌షా: రక్తరహిత శస్త్రచికిత్స ముఖ్యంగా యెహోవాసాక్షుల కోసమేనన్నది నిజమే. అయినప్పటికీ అందరికీ అలాగే చేయాలని మేము కోరుకుంటున్నాం.

రక్తరహిత పద్ధతికి ఖరీదెక్కువా తక్కువా?

మిస్టర్‌ ఎర్న్‌షా: ఇది ఖర్చు తగ్గిస్తుంది.

డా. షాన్డర్‌: రక్తరహిత వైద్యానికి 25 శాతం ఖర్చు తక్కువ.

డా. బోయ్డ్‌: ఖర్చునే పరిగణనలోకి తీసుకున్నా, మనం ఈ పద్ధతినే అవలంబించాలి.

రక్తరహిత వైద్య రంగంలో మనమెంత ప్రగతిని సాధించాం?

డా. బోయ్డ్‌: ఇది ప్రగతి పథంలో ఉందనే నేననుకుంటున్నాను. ఇది ఎంత మాత్రమూ ఆగిపోదు. రక్తరహితంగా వైద్యం చేసిన ప్రతిసారీ, రక్తం ఉపయోగించకుండా ఉండడానికి ఏదో ఒక మంచి కారణాన్ని క్రొత్తగా కనుగొంటూనే ఉంటాం.

[చిత్రాలు]

డా. డోనట్‌ ఆర్‌. స్పాన్‌ అనెస్తీసియాలజీ ప్రొఫెసర్‌, ఝూరిక్‌, స్విట్జర్‌లాండ్‌

డా. ఆర్యే షాన్డర్‌ అనెస్తీసియాలజీలో అసిస్టెంట్‌ క్లినికల్‌ ప్రొఫెసర్‌, అమెరికా

డా. మార్క్‌ ఇ. బోయ్డ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ మరియు గైనకాలజీ ప్రొఫెసర్‌, కెనడా

మిస్టర్‌ పీటర్‌ ఎర్న్‌షా, ఎఫ్‌ఆర్‌సిఎస్‌, కన్సల్టెంట్‌ ఆర్థోపీడిక్‌ సర్జన్‌, లండన్‌, ఇంగ్లండ్‌

[11వ పేజీలోని బాక్సు]

రోగి పాత్ర

▪ ట్రీట్‌మెంట్‌ చేయవలసిన అవసరం రాక ముందే, రక్తరహిత ప్రత్యామ్నాయాలను గురించి డాక్టర్‌తో మాట్లాడండి. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులూ, వార్ధక్యంలో ఉన్న వారూ అలాగే గర్భిణులూ ముందే మాట్లాడడం చాలా ప్రాముఖ్యం.

▪ మీ కోరికను వ్రాతలో పెట్టండి. అలాంటివాటి కోసం లీగల్‌ డాక్యుమెంట్‌లు ఏమైనా దొరికేటట్లయితే వాటి మీద వ్రాసి పెట్టండి.

▪ మీకు రక్తం లేకుండా ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి మీ డాక్టర్‌ ఇష్టపడనట్లైతే, మీ కోరికకు తగ్గట్లు చేయగల డాక్టర్‌ దగ్గరికి వెళ్ళండి.

▪ కొన్ని ప్రత్యామ్నాయాలు ఫలకరంగా ఉండాలంటే, సమయం పడుతుంది. కనుక, మీకు ఆపరేషన్‌ అవసరమని మీకు తెలిసినట్లైతే, ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్‌ను వాయిదా వేయడానికి ప్రయత్నించకండి.