లామూ—కాలం మార్చలేకపోయిన ఒక దీవి
లామూ—కాలం మార్చలేకపోయిన ఒక దీవి
కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి
అది సా.శ. 15వ శతాబ్దం, సముద్రగాలి వీస్తుండగా తెరచాప సహాయంతో ఆ చిన్న పడవ ముందుకు సాగుతోంది. పడవ మీదుగా స్తంభానికి గట్టిగా అంటిపెట్టుకుని ఒక వ్యక్తి హిందూ మహాసముద్రం ఎండలో జిగేలుమంటున్నా కళ్ళు చికిలించుకుని దీవి కనబడుతుందేమోనని చుట్టూ చూశాడు. ఆ పడవలోని నావికులు లామూ అనే ద్వీపం కోసం అన్వేషిస్తున్నారు.
ఆఫ్రికాలో బంగారం, ఏనుగుదంతాలు, మసాలా దినుసులు, బానిసలు సమృద్ధం. ఆఫ్రికాలోని ఖజానాలను కొల్లగొట్టాలనీ, ఆ ఖండంలో అన్వేషణలు కొనసాగించాలనీ సాహసికులు ఎంతో దూర దేశాల నుండి తూర్పు ఆఫ్రికా తీరానికి ఓడల్లో వచ్చారు. ఖజానాల కోసం ఈ నావికులు సముద్రాల్లో తుపానులూ బలమైన గాలులూ లెక్కచేయకుండా వచ్చారు. అదీ ఇరుకైన చెక్క ఓడల్లో కిక్కిరిసిపోయి వాళ్ళు ఎంతో దూరాల నుండి ఈ తీరాలకు వచ్చారు.
ఈ తూర్పు ఆఫ్రికా కోస్తా మధ్య దూరంలో చిన్న దీవుల సమూహాలున్నాయి, అవే లామూ దీవులు. ఇక్కడి సురక్షితమైన, లోతైన ఓడరేవుల్లో సముద్ర యాత్రికులు తమ పెళుసైన ఓడల్ని నిలిపేవారు. ఇక్కడే నావికులు తమ నావల్లో తాగేందుకు నీటిని, తినడానికి ఆహారాన్ని తీసుకుని మళ్ళీ పయనమయ్యేవారు.
లామూ ద్వీపం, 15వ శతాబ్దానికల్లా సరుకుల్ని సరఫరా చేసే వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతూవుంది. 16వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చిన పోర్చుగీసు నావికులు పట్టు తలపాగాల్ని, పొడవుగా వదులుగా ఉండే వస్త్రాల్ని ధరించిన సంపన్నులైన వర్తకులను చూశారు. చేతులకు బంగారు గాజులు కాళ్ళకి బంగారు కడియాలు పెట్టుకుని ఇరుకైన వీధుల గుండా నడుస్తూ, రాసుకున్న అత్తరు పరిమళాల్ని వెదజల్లుతూపోయే స్త్రీలను చూశారు. రేవు ప్రాంతమంతా ఓడలు తెరచాపల్ని రెపరెపలాడిస్తూ నీటిమీద తేలుతూ ఉన్నాయి. వీటినిండా విదేశాలకు పంపించడానికి సరుకులు నింపివున్నాయి. బానిసల్ని గుంపులుగా కలిపి కట్టేసి ధవ్ అనే అరబ్బుల ఓడల్లో నింపడానికి వారిని రేవుల్లో ఉంచేవారు.
యూరప్ నుంచి వచ్చిన తొలి అన్వేషకులు లామూలో పరిశుభ్రతా ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి ఇళ్ళ నిర్మాణం కూడా వారిని అబ్బురపర్చింది. సముద్ర తీరాల్లోని ఇళ్ళు స్థానిక పగడపు దిబ్బల క్వారీల నుండి పట్టుకొచ్చిన పగడపు రాళ్ళతో కట్టబడ్డాయి, చక్కగా చెక్కబడిన పెద్ద పెద్ద చెక్క తలుపులు ఆ ఇళ్ళను భద్రంగా కాపాడతాయి. ఆ ఇళ్ళు, వేసవి వేడి నుండి ఉపశమనాన్నిచ్చే చల్లని సముద్రపు గాలి వీస్తున్నట్లుగా, తీరం పొడవునా తీర్చిదిద్దినట్లుండి వాటి మధ్య సన్నని వీధులు కూడా ఉన్నాయి.
ధనికుల ఇళ్ళు పెద్దగా విశాలంగా ఉండేవి. ఆ కాలం నాటి కొళాయి వ్యవస్థల ద్వారా స్నానపు గదులకు మంచినీటి సరఫరా జరిగేది. మురుగునీటి పారుదల కూడా అప్పటి కాలంలో యూరప్ దేశాలలోకన్నా ఎంతో చక్కగా ఉండేది. రాతి గుండా తొలిచిన పెద్ద కాల్వలు, మురుగునీటిని సముద్రం వైపుకు తీసుకువెళ్ళేవి. తాగేనీటికి దూరంగా ఇసుకలోకి బాగా లోతుగా తవ్విన గోతుల్లోకి ఆ మురుగు నీరు ప్రవహించేది. ఇండ్లకు తాగేనీటిని సరఫరా చేసే రాతిలో తొలిచిన జలాశయాల్లో చిన్న చిన్న చేపలుండేవి. అవి దోమల లార్వాలను తినేస్తుండటం మూలంగా దోమల బెడద అంతగా ఉండేది కాదు.
19వ శతాబ్దంలో లామూ ధవ్ ఓడల్ని ఉపయోగిస్తూ ఏనుగు దంతాలు, నూనె, విత్తనాలు, జంతుచర్మాలు, తాబేలు డిప్పలు, నీటిగుర్రం దంతాలు వంటివాటిని పెద్ద ఎత్తున సరఫరా చేసింది. బానిసల ఎగుమతి కూడా విపరీతంగా జరిగింది. అయితే కొంతకాలం తర్వాత లామూ వైభవం క్షీణించనారంభించింది. మహమ్మారులు, శత్రు తెగల దాడులు, బానిస వ్యాపారంపై విధించబడిన నిర్బంధాలు లామూ ఆర్థిక ప్రాముఖ్యతను దిగజార్చాయి.
గతంలోకి పయనం
నేడు ఓడలో లామూ రేవులోకి ప్రవేశించడం గత చరిత్రలోకి ప్రయాణించడంలానే ఉంది. విశాలమైన హిందూ మహాసముద్ర జలాలపై నుండి గాలి అవిశ్రాంతంగా వీస్తుంటుంది. సముద్ర అలలు నెమ్మదిగా తెల్లని ఇసుక తీరాన్ని తాకుతుంటాయి. పాతకాలం డిజైనుల్లోని చెక్క ఓడలు తీరాన్ని చేరుతూ ఉంటే, త్రికోణాకారంలోని వాటి తెరచాపలు ఎగురుతున్న సీతాకోక చిలుకల రెక్కల్లా అగుపిస్తుంటాయి. చేపలు, పండ్లు, కొబ్బరికాయలు, ఆవులు, కోళ్ళు అన్నింటినీ నింపుకుని ప్రయాణికులతో సహా అవి లామూ రేవువైపు వెళ్తుండటం కన్పిస్తుంది.
మండుటెండలో ఓడల్లోంచి సరుకుల్ని దింపే మనుషులకు రేవు దగ్గరున్న ఈతచెట్లు కాస్త నీడగావున్నాయి. ఆ తర్వాత కొంతసేపటికి మార్కెట్లో హడావుడి మొదలైంది, ఇక్కడి వ్యాపారం వస్తుమార్పిడి పద్ధతిలోనే జరుగుతుంది. ఈ వ్యాపారస్థులకు కావల్సింది పూర్వంలా బంగారమూ ఏనుగుదంతాలూ లేదా బానిసలూ కాదు గానీ అరటిపండ్లు, కొబ్బరికాయలు, చేపలు, బుట్టలు వంటివే.
మరో ప్రక్కన కొంతమంది పెద్ద మామిడి చెట్టు నీడలో సీసల్ నారతో తాళ్ళు పేనుతూనో, తమ ఓడల తెరచాపలను సరిచేసుకుంటూనో కన్పిస్తారు. ఇక్కడి ఇరుకైన వీధులు అటూ ఇటూ నడుస్తున్న జనంతో కిటకిటలాడుతున్నాయి. పొడవైన తెల్లని అంగీలు ధరించిన వ్యాపారస్థులు తమ వస్తువుల్ని చూడమనీ కొనమనీ తమ దుకాణాల్లోంచే కొనుగోలుదారుల్ని ఆహ్వానిస్తూ పిలుస్తుంటారు. అటువైపు ఒక గాడిద, ధాన్యపు గింజల బస్తాలతో నింపిన చెక్క బండిని లాగలేక లాగుతూ జనాల గుండా దారిచేసుకుంటూ ముందుకు వెళ్తూవుంది. లామూ నివాసులు ద్వీపానికి ఇటువైపు నుండి అటువైపుకి కాలినడకనే ప్రయాణిస్తుంటారు, కారణం అక్కడ మోటారు వాహనాలే లేవు. ఈ ద్వీపానికి రావాలన్నా ఓడలే శరణ్యం.
మిట్టమధ్యాహ్నం పూట సూరీడు నడినెత్తి మీదికి
వచ్చినప్పుడు కాలం స్తంభించిపోయినట్లుంటుంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు జనసంచారం అంతగా ఉండదు, చివరికి గాడిదలు కూడా తీవ్రత తగ్గేంత వరకు కళ్ళు మూసుకుని నిశ్చలంగా నిల్చుండిపోతాయి.సూర్యుడు అస్తమిస్తూ వేడి తగ్గుతుండగా ద్వీపంలో మళ్ళీ సందడి మొదలైంది. వ్యాపారస్తులు తమ దుకాణాలకున్న పెద్ద పెద్ద తలుపులు తెరిచి బాగా చీకటి పడేంత వరకు దీపాల వెలుగులో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. స్త్రీలు తమ పిల్లలకు స్నానం చేయించి, ఒంటికి నిగారింపు వచ్చేంత వరకు ఒంటికి కొబ్బరినూనె పట్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళు కొబ్బరి ఆకులతో చేసిన చాపల మీద కూర్చుని వంట ప్రారంభిస్తారు. తాలింపు గుబాళింపుల మధ్య పసందైన చేపల కూరా, కొబ్బరి పాలతో అన్నమూ కట్టెల పొయ్యిల మీదే సిద్ధమౌతాయి. ఆ ప్రజలు స్నేహపూర్వకమైన ప్రజలు అతిథిప్రియులు కూడా, జీవితాన్ని వీరు ఆనందంగా గడిపేస్తుంటారు.
లామూ తన మునుపటి శోభను కోల్పోయినా, 20వ శతాబ్దానికి పూర్వపు ఆఫ్రికా సంస్కృతి ఇంకా విలసిల్లుతూనే ఉంది. ఇక్కడి ప్రజల జీవితం శతాబ్దాలుగా ఎటువంటి మార్పూ లేకుండా కొనసాగుతోంది. ఇక్కడ భూత వర్తమాన కాలాలను ఒకేసారి చూడవచ్చు. నిజంగా, లామూ ఒక విశేషమైన గతకాలపు స్మృతి, కాలం మార్చలేకపోయిన దీవి.
[18, 19వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
మా లామూ సందర్శనం
కొనుగోలు, అమ్మకాలు చేయటానికి కాదు గానీ కొంతకాలం క్రితం కొంతమందిమి కలిసి లామూని సందర్శించాము. మేమక్కడికి యెహోవాసాక్షులైన మా తోటి క్రైస్తవ సహోదర సహోదరీలను, సందర్శించటానికి వెళ్ళాము. మా చిన్న విమానం కెన్యా కోస్తా ప్రాంతం మీదుగా ఉత్తరదిశలో ఎగురుతుంది. కింద పచ్చని అరణ్యం కనబడుతోంది, దానికి అంచున ఎండలో ఇసుక తెల్లగా మెరుస్తూవుంది. కొంత సేపటికి, ఎక్కణ్ణుంచో అకస్మాత్తుగా ఊడిపడ్డట్టుగా లామూ ద్వీపసముదాయం పచ్చని సముద్రంలో రత్నాల్లా మెరుస్తూ కనిపించాయి. మేము మా విమానంలో ఆఫ్రికా డేగలా దీవుల మీదుగా గిరికీలు కొట్టి ఆకాశంలోనుండి నేలమీదికి ఊడిపడ్డాము. విమానం దిగింది కెన్యాలో, లామూకి వెళ్ళాలంటే పడవెక్కాల్సిందే. నీటి ఒడ్డుకు నడిచి, అక్కడున్న ధవ్ పడవెక్కి లామూ సందర్శనానికి బయలుదేరాం.
ఎండ తీవ్రంగా కాస్తుంది, సముద్ర గాలి వెచ్చగా వీస్తుంటే హాయిగా ఉంది. మేము కొంచెం సేపటికి ద్వీపాన్ని చేరుకున్నాం. తీరంలో కొంతమంది బలశాలురు ఓడల్లోంచి చెక్క బల్లమీదుగా బస్తాలను చేరవేస్తూ కనిపించారు. స్త్రీలు తాము తయారుచేసిన చిన్న చిన్న వస్తువుల్ని తలల మీద పెట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్నారు. మేం మా బ్యాగుల్ని తీసుకుని జనం మధ్యలోంచి ఇవతలికి వచ్చి కొబ్బరిచెట్టు నీడలో నిల్చున్నాము. కొన్ని నిమిషాలకు మా క్రైస్తవ సహోదరులు మమ్మల్ని గుర్తుపట్టి, మాకు హృదయపూర్వకంగా స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్ళారు.
మరుసటి దినాన, సముద్రతీరంలో ఉన్న మరితర సహోదర సహోదరీలను కలవటానికి సూర్యోదయం కాక ముందే మేం నిద్ర లేచాం. సంఘ కూటాలకు హాజరు కావటానికి ఎంతో దూరం ఎన్నో గంటలు ప్రయాణించాల్సివుంటుంది. తాగేనీరు తీసుకుని, పెద్ద హ్యాట్‌లు పెట్టుకుని గట్టి బూట్లు వేసుకుని బయల్దేరాం. పడవలో మేం పడమటికి పయనిస్తుండగా తూర్పున సూర్యోదయం అవుతూ ఉంది. సంఘ కూటాలు కెన్యాలో జరుగుతాయి.
పడవలో ఉన్నవారికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని సహోదరులు ఉపయోగించుకున్నారు. కొందరితో బైబిలు చర్చలను చేసి, తీరం చేరుకునే
లోపు కొన్ని పత్రికలను అందించాము. పడవ దిగి మట్టి రోడ్డు మీదికి వచ్చేసరికి ఎండ ఎక్కువైంది, అంతా నిర్మానుష్యంగా ఉంది. మనుషులెవరూ ఉండని ఆ అరణ్య ప్రాంతం గుండా నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలు మేము వినివున్నాము. అక్కడ జంతువులు సంచరిస్తుంటాయి, అప్పుడప్పుడు ఏనుగులు ఆ మట్టి రోడ్డును దాటుతూ కనబడతాయి. సహోదరులందరం ఉత్సాహంతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా మా గమ్యం వైపు నడిచాము.కొంచెం సేపటికి మేమొక చిన్న గ్రామాన్ని చేరుకున్నాము. అక్కడి సంఘంలో ఎంతో దూరం నుండి వచ్చిన ఇతరుల్ని కలిశాము. దాదాపు అందరూ ఎంతో దూర ప్రాంతాల నుండి వస్తున్నందున అదే రోజు నాలుగు సంఘ కూటాలు జరుగుతాయి.
కూటాలు జరిగేది ఒక చిన్న పాఠశాలలో. దాని కిటికీలు, తలుపుల మీద పని సగంలో ఆగిపోయినట్లుంది. ఒక తరగతి గదిలో, 15 మందిమి సన్నని బెంచీలపై కూర్చుని చక్కని బైబిలు చర్చలను ఆనందించాము. ఆ కార్యక్రమం ద్వారా ప్రోత్సాహమూ ఉపదేశమూ పొందాము. కప్పు రేకుది కావడం మూలంగా వేడి విపరీతంగా ఉంది, కానీ దాన్ని ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. తామంతా ఒక్కచోట కలవగల్గినందుకు వారిలో ఆనందం తప్పించి వేరే భావాలేమీ లేవు. నాలుగు గంటలపాటు జరిగిన కూటాల తర్వాత ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకుని వేర్వేరు దిశల్లో తిరుగు ప్రయాణాలు ప్రారంభించాము. మేము లామూ చేరుకునే సమయానికి, పశ్చిమాన ఎర్రని సూర్యుడు అస్తమిస్తుంటే సందె చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి.
ఆ సాయంకాలం లామూలోని సాక్షుల కుటుంబాలన్నీ ఒక్కచోట కూడాయి. చల్లని గాలిని ఆస్వాదిస్తూ మేమంతా కలిసి భోజనాలు చేశాము. తర్వాత కొద్ది రోజులపాటు వారితో కలిసి లామూలోని ఇరుకైన వీధులన్నీ తిరుగుతూ, బైబిలు సత్యం కోసం ఆకలిదప్పికలతో ఉన్న ప్రజలను అన్వేషిస్తూ ప్రకటనా పని చేశాము. ఈ కొద్దిమంది సహోదర సహోదరీలకున్న ఆసక్తీ ధైర్యమూ మమ్మల్నెంతో ప్రోత్సహించాయి.
చివరికి మేము బయల్దేరే రోజు రానే వచ్చింది. సహోదరులు ఓడరేవు దాకా వచ్చారు, మేము విషాద వదనాలతో విడ్కోలు చెప్పాం. మా సందర్శనంతో వారికి ఎంతో ప్రోత్సాహం లభించిందని వారన్నారు. నిజానికి వారు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించారో వారికేం తెలుసు ! కెన్యా భూభాగం మీద అడుగుపెట్టిన తర్వాత మేము వెంటనే మా చిన్న విమానంలోకి ప్రవేశించాము. విమానం గాల్లోకి పైపైకి వెళ్తుండగా మేము క్రింద అందమైన లామూ ద్వీపాన్ని చూస్తూ, అక్కడ నివసిస్తున్న సహోదరుల అచంచల విశ్వాసాన్ని గురించీ, సత్యం పట్ల వారికున్న ఆసక్తీ ప్రేమల గురించీ తలపోశాము. వారు కూటాలకు హాజరవ్వటానికి ఎంతెంత దూరాలు ప్రయాణించాల్సి వస్తుందో గుర్తుతెచ్చుకున్నాము. సహస్రాబ్దాల క్రితం కీర్తన 97:1 లో ఒక ప్రవచనం నమోదు చేయబడింది: “యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక.” (ఇటాలిక్కులు మావి.) నిజంగానే మారుమూలన ఉన్న ద్వీపమైన లామూలోని ప్రజలకు కూడా, దేవుని రాజ్యం క్రింద ఇదే భూమిపై భావి పరదైసులో జీవించే అద్భుతమైన నిరీక్షణయందు సంతోషించే అవకాశం అందించబడుతుంది.—ఉచిత వ్యాసం.
[17వ పేజీలోని మ్యాపులు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఆఫ్రికా
కెన్యా
లామూ
[17వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Alice Garrard
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Alice Garrard