కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకునే విషయమేమిటి?

శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకునే విషయమేమిటి?

యువత ఇలా అడుగుతోంది . . .

శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకునే విషయమేమిటి?

‘పెదవులను శరీరంలోని ఇతర భాగాలను కుట్టించుకున్న ప్రజలను మొదటిసారి చూసినప్పుడు, “ఇదేదో క్రొత్తగా ఉందే !” అనుకున్నాను.’—లీస.

లీస మాత్రమే కాదు అలా అనుకున్నది. చాలా మంది యౌవనస్థులు కనుబొమ్మలను, నాలుకను, పెదవులను, బొడ్డును కుట్టించుకుని రింగులను దిద్దులను పెట్టుకుంటారు. శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయ్యింది. *

హెతర్‌ అనే పేరుగల 16 ఏండ్ల అమ్మాయి, ఇలా కుట్టించుకునేవాళ్ళ కోవలో చేరాలనే ఉత్సాహంతో ఉంది. బొడ్డుకు రింగు పెట్టుకుంటే “చాలా అద్భుతంగా” ఉంటుందని ఆమెకు నమ్మకం కుదిరింది. అయితే, పంతొమ్మిదేండ్ల జో, అప్పటికే నాలుకను కుట్టించుకుని బంగారు దిద్దును పెట్టుకున్నాడు. మరొక అమ్మాయి తన కనుబొమ్మలను కుట్టించుకుంది. దానికి కారణం, “కొట్టొచ్చినట్లు కనిపించాలి,” “ప్రజలు ఆశ్చర్యపోవాలి” అని ఆమె కోరుకోవడమే.

చెవులకూ ముక్కుకూ ఆభరణాలు పెట్టుకోవడం క్రొత్త విషయమేమీ కాదు. బైబిలు కాలాల్లో, దైవభక్తిగల రిబ్కా ముక్కు కమ్మిని పెట్టుకుంది. (ఆదికాండము 24:22, 47) ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, చెవులకు పోగులను పెట్టుకున్నారు. (నిర్గమకాండము 32:2) అయితే, వాళ్ళు చెవులకూ ముక్కుకూ ఆభరణాలు పెట్టుకున్నది కుట్టించుకునేనా అన్నది మాత్రం తెలియదు. నమ్మకస్థులైన సేవకులు తమ యజమానులకు నమ్మకంగా ఉంటామనే దానికి సూచనగా తమ చెవులను కుట్టించుకునేవారు. (నిర్గమకాండము 21:6) ముక్కూ చెవులూ కుట్టించుకోవడం అనేది ఇతర ప్రాచీన సంస్కృతుల్లోను చాలా ప్రబలంగా ఉంటూ వచ్చింది. అజ్టెక్‌లు, మాయా తెగవారు మత కారణాల చేత తమ నాలుకలను కుట్టించుకున్నారు. పెదవిని కుట్టించుకునే సాంప్రదాయం, ఆఫ్రికాలోనూ దక్షిణ అమెరికన్‌ ఇండియన్స్‌ మధ్యా ఇప్పటికీ సర్వవ్యాప్తంగా ఉంది. మలనేషియన్‌లూ, భారతీయులూ మరియు పాకిస్తాన్‌ నివాసులూ ముక్కుకు ఆభరణాలను తగిలించుకోవడం చాలా సాధారణం.

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ, పాశ్చాత్య దేశాల్లో కూడా చెవులు కుట్టించుకోవడం స్త్రీలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఆడా మగ తేడా లేకుండా కౌమారప్రాయంలో ఉన్నవాళ్ళు వయోజనులు శరీరంలో ఎక్కడెక్కడ ఆభరణాలను పెట్టుకోవచ్చో అక్కడంతా పెట్టేసుకుంటున్నారు.

వాళ్ళు ఎందుకలా కుట్టించుకుంటున్నారు

ఇప్పుడు అది ఫ్యాషన్‌, చాలా ఫ్యాషన్‌ గనుక కుట్టించుకుంటున్నారు. అది తమ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుందని మరి కొందరు అనుకుంటున్నారు. గొప్ప గొప్ప మోడల్‌లూ, క్రీడా కారులూ, ప్రజాదరణ పొందిన సంగీతకారులూ శరీరంలోని వివిధ భాగాల్లో ఆభరణాలను వాడుతున్నారు కనుకనే ఈ ఫ్యాషన్‌ ఇంత ఊపందుకుంది. ఇలా కుట్టించుకోవడం తాము స్వతంత్రులమని వ్యక్తీకరించేందుకు, విశిష్ట వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు, తాము ఇతరులకు భిన్నమైనవారమని చూపించేందుకు ఒక మార్గంగా ఉపకరిస్తుందని కొందరు యౌవనస్థులు దృష్టిస్తారు. “తమ తల్లిదండ్రులకు చికాకు కలిగించాలి, మధ్యతరగతివారు ఖంగు తినేలా చేయాలి అన్న వారి వాంఛే, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కుట్టించుకోవడానికి ముఖ్య ప్రేరకం” అని కాలమిస్ట్‌ అయిన జాన్‌ లియో అంటున్నారు. వాళ్ళకున్న అసంతృప్తీ, అసమ్మతీ, సవాలు చేసే వైఖరీ, తిరగుబాటు ధోరణీ తాము సొంత వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకోవాల్సిన అవసరముందన్న భావాన్ని వాళ్ళలో కలిగిస్తున్నట్లుంది.

మనశ్శాస్త్రపరమైన, లేదా భావోద్వేగపరమైన గొప్ప అవసరాలను తీర్చుకునేందుకు కూడా కొందరు తమ శరీర అవయవాలను కుట్టుకుంటారు. ఉదాహరణకు, అది తమ ఆత్మగౌరవాన్ని పెంచుతుందని కొందరు యౌవనస్థులు భావిస్తారు. బాల అత్యాచారానికి గురైన కొందరు, తమ శరీరంపై తమకు అధికారం ఉందని చూపించేందుకు తమ శరీరంలోని వివిధ భాగాలను కుట్టుకోవడం మార్గమని భావిస్తారు.

ఆరోగ్య ప్రమాదాలు

అయితే శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ కుట్టించుకోవడం సురక్షితమైన పనేనా? కొన్ని చోట్ల కుట్టించుకోవడం మంచిది కాదని అనేకమంది వైద్యులు చెబుతారు. మీ అంతట మీరు కుట్టుకోవడం నిశ్చయంగా ప్రమాదకరం. వృత్తిపరంగా కుట్టేవారమని చెప్పుకునేవారి దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు ఉండవచ్చు. వారిలో చాలా మందికి విస్తృత తర్ఫీదు లేదు. వాళ్ళు స్నేహితులు చేయడం చూసి, పత్రికలను చదివి, వీడియోలను చూసి నేర్చుకున్నారు. కనుక వాళ్ళు పారిశుద్ధ్యంగల పద్ధతులను ఉపయోగించకపోవచ్చు. శరీరంలోని వివిధ భాగాలను కుట్టడం వల్ల రాగల ప్రమాదాలను గురించిన సరైన అవగాహన కూడా వారికి లేకపోవచ్చు. అలాగే, కుట్టే అనేకులకు శరీర నిర్మాణాన్ని గురించి సరైన అవగాహన లేదు. ఇది చిన్న విషయం కాదు. కాని చోట రంధ్రం చేస్తే అతిగా రక్తం పోవచ్చు. ఒక నరాన్ని గుచ్చడం జరిగితే శాశ్వతమైన హాని కలగవచ్చు.

గంభీరమైన మరొక సమస్య ఇన్‌ఫెక్షన్‌. స్టెరైల్‌ చేయని ఉపకరణం కాలేయ వాపు (హెపటైటిస్‌), ఎయిడ్స్‌, క్షయ, ధనుర్వాతం వంటి ప్రాణాంతకమైన రోగాలను తీసుకురావచ్చు. స్టెరైల్‌ చేసిన ఉపకరణాన్ని ఉపయోగించినప్పటికీ, ఆ తర్వాత జాగ్రత్త తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు, బొడ్డు కుట్టించుకుంటే అక్కడ డ్రెస్సు ఎడతెరపిలేకుండా తగులుతుంటుంది కనుక చికాకు కలగవచ్చు. అక్కడి గాయం మానడానికి తొమ్మిది నెలలు పట్టవచ్చు.

ముక్కు ఉపాస్థి నరాన్ని, చెవుల ఉపాస్థి నరాలను కుట్టడం చెవితమ్మెను కుట్టడం కన్నా చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. “చెవులకు అనేక కన్నాలు పెట్టడం చాలా చింతించవలసిన విషయమే—తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌లు వచ్చి చెవి వెలుపలి భాగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కు కమ్మీలు కూడా ప్రమాదకారులే. ఈ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్‌ వస్తే, దాని దగ్గర్లో ఉన్న రక్తనాళాలకు కూడా ఇన్‌ఫెక్షన్‌ అయి మెదడుకు వ్యాపిస్తుంది” అని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఫేష్యల్‌ ప్లాస్టిక్‌ అండ్‌ రికన్స్‌ట్రక్టివ్‌ సర్జరీ విడుదల చేసిన ఒక వార్తాపత్రిక వివరిస్తుంది. “చెవి తమ్మెను మాత్రమే కుట్టించుకోవడం ఆదర్శవంతం” అని ఆ వార్తాలేఖ నిర్ధారిస్తుంది.

ఇతర ప్రమాదాలు ఏమిటంటే కుట్టించుకున్న చోట అసహ్యకరమైన గుర్తులు ఏర్పడుతాయి. ఆభరణాలు పెట్టుకోవడం వల్ల అలర్జీ కలుగవచ్చు. ఉదాహరణకు, రొమ్ము వంటి సున్నితమైన ప్రాంతాల్లో, రింగులు పెట్టుకుంటే, ఆ ప్రాంతంలో బట్టలు బలంగా బిగపట్టి ఉండటం ద్వారా లేదా లాగడం ద్వారా కుట్టించిన ఆ భాగం సులభంగా చీలిపోవచ్చు. ఒక అమ్మాయి రొమ్ములో కణజాలం దెబ్బ తింటే అది స్తన్య గ్రంథులకు అడ్డుపడవచ్చు. ఆమె చికిత్స చేయించుకోకపోతే, భవిష్యత్తులో బిడ్డకు పాలివ్వడం కష్టం కావచ్చు, పాలివ్వడం అసాధ్యంగా కూడా మారవచ్చు.

నోటి భాగంలో కుట్టించుకోవడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ది అమెరికన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఇటీవల అంది. నోటి భాగంలో కుట్టించుకోవడం వల్ల కలిగే అదనపు ప్రమాదాల్లో, అక్కడ పెట్టుకున్న ఆభరణాన్ని మ్రింగివేయడం వల్ల గొంతుకకు అడ్డం పడడం, నాలుకకు తిమ్మిరి పుట్టడమూ, రుచిని గుర్తించలేకపోవడం, ఎక్కువ సేపు రక్తం పోవడమూ, పళ్ళ పెచ్చు విరిగిపోవడం, చీలిపోవడం, లాలాజలం అమితంగా ఊరడం, నోట్లో అనియంత్రితంగా లాలాజలం ఊరడం, చిగుళ్ళు దెబ్బతినడం, మాట్లాడాలంటే ఆటంకం కలగడం, ఊపిరి పీల్చుకోవడంలోను నమలడంలోను మ్రింగడంలోను ఇబ్బందులు కలగడం మొదలైన సమస్యలు ఉన్నాయి. కెండ్రా అనే యువతి తన నాలుకను కుట్టించుకున్నప్పుడు అది, “బెలూన్‌లా ఉబ్బింది.” ఇంకా ఘోరం ఏమిటంటే, కుట్టినవ్యక్తి, గడ్డం కోసమని తయారు చేసిన దిద్దును ఆమె నాలుకకు పెట్టగా, ఆమె నాలుక కోసుకుపోయి, నాలుక అడుగు భాగాన ఉన్న కణజాలం చీలిపోయింది. దాంతో మాట్లాడే సామర్థ్యాన్ని ఆమె దాదాపుగా కోల్పోయింది.

ఇశ్రాయేలీయులైన తన ప్రజలు తమ శరీరాలకు గౌరవమివ్వాలని, తమ శరీరాన్ని కోసుకోకూడదని దేవుడు బోధించాడు. (లేవీయకాండము 19:28; 21:5; ద్వితీయోపదేశకాండము 14:1) నేడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, తమ శరీరాలతో గౌరవప్రదంగా వ్యవహరించవలసిందిగా ప్రోత్సహించబడుతున్నారు. (రోమీయులు 12:1) అనవసరంగా ఆరోగ్య ప్రమాదాలను తెచ్చిపెట్టుకోకుండా నివారించుకోవడంలో అర్థం ఉంది కదా? అయితే, ఆరోగ్యమే కాకుండా మీరు లెక్కలోకి తీసుకోవలసిన వేరే కారకాలు కూడా ఉన్నాయి.

అలా కుట్టించుకోవడం ఇతరులకు ఏ సందేశాన్ని తెలియజేస్తుంది?

శరీరంలోని వివిధ భాగాలను కుట్టుకునే విషయంలో బైబిలు నిర్దిష్ట ఆజ్ఞలనేమీ ఇవ్వడం లేదు. ‘అణకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండమని’ బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది. (1 తిమోతి 2:9) ప్రపంచంలోని ఒక భాగంలో ఒకదానిని మర్యాదతో కూడినదిగా పరిగణించినా, మీరు నివసిస్తున్న ప్రాంతంలోనివారు దానినెలా దృష్టిస్తారన్నది నిజంగా పరిగణనలోకి తీసుకోవలసిన విషయమే. ఉదాహరణకు, ఒక దేశంలోని ప్రజలు, స్త్రీలు తమ చెవితమ్మెలను కుట్టించుకోవడాన్ని ఆమోదిస్తారు, కానీ మరొక దేశంలో లేదా సంస్కృతిలో దానికి అభ్యంతరపడవచ్చు.

శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకోవడమూ మగవాళ్ళు చెవి పోగులను పెట్టుకోవడమూ ప్రజాదరణ పొందినవాళ్ళ ఆదరణను పొందినప్పటికీ, మొత్తమ్మీద పాశ్చాత్య దేశాల్లోని ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయాయి. ఎంతోకాలంగా ఇవి, ఖైదులో ఉన్నవారి, మోటారు సైకిళ్ళ మీద తిరిగే గ్యాంగుల, రాక్‌ సంగీత బృందాల, ఒకరినొకరు నొప్పించుకుంటూ ఆనందించే సలింగ సంపర్కం చేసేవాళ్ళ చిహ్నంగా ఉండడమే ఒక కారణం కావచ్చు. శరీర అవయవాలను కుట్టించడం భిన్నమైనవారమన్న వైఖరినీ, తిరుగుబాటునూ సూచిస్తుందని అనేకులు అనుకుంటారు. అనేకులు దాన్ని విభ్రాంతికరమైన విషయంగా, ఏహ్యమైన విషయంగా దృష్టిస్తారు. అష్‌లీ అనే ఒక క్రైస్తవ యువతి ఇలా అంటుంది: “మా తరగతిలోని ఈ అబ్బాయి ఈ మధ్యే ముక్కు కుట్టించుకున్నాడు. చాలా బాగుంది అని ఆయన అనుకుంటున్నాడు. చాలా అసహ్యంగా ఉందని నేననుకుంటున్నాను !”

వినియోగదారులతో వ్యవహరించే తన ఉద్యోగస్తులు ఒక్కో చెవికి ఒక్కో పోగు కన్నా ఎక్కువగా పెట్టుకోవడాన్నీ, మరెక్కడా కనిపించే చోట కుట్టించుకోవడాన్నీ నిషేధించే ఒక నియమాన్ని బాగా ప్రసిద్ధిగాంచిన ఒక అమెరికన్‌ స్టోర్‌ పెట్టడంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. “ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారో మనం చెప్పలేం” అని ఒక కంపెనీ స్పోక్స్‌వుమన్‌ వివరిస్తున్నారు. ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుంటున్న కాలెజ్‌ విద్యార్థులు “చెవి పోగులు పెట్టుకోవద్దనీ, ఇతర శరీర అవయవాలను కుట్టుకోవడం గానీ ఆభరణాలు పెట్టుకోవడం కానీ చేయకూడదనీ; స్త్రీలు . . . ముక్కు కమ్మీలను పెట్టుకోకూడదని” కరియర్‌ కౌన్సిలర్‌లు సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా యువ క్రైస్తవులు తాము క్షేత్ర సేవలో పాల్గొనేటప్పుడు సహితం, తాము ఇతరులకు సరైన అభిప్రాయం కలిగించాలన్న చింత కలిగివుండాలి. వారు ‘తమ పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక’ ఉండాలని కోరుకుంటారు. (2 కొరింథీయులు 6:3, 4) శరీరావయవాలను కుట్టించుకోవడాన్ని గురించి వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏదైనప్పటికీ, మీ దృక్పథం ఏమిటో, మీ జీవన శైలి ఏమిటో మీ రూపం తప్పకుండా చెబుతుంది. మీ గురించి మీరేమని తెలియజేయాలనుకుంటారు?

నిజమే, ఈ విషయంలో మీరు ఏమి చేయాలన్నది చివరికి, మీరూ మీ తల్లిదండ్రులూ నిర్ణయించాలి. “మీరు ఈ లోక మర్యాదను అనుసరింప”వద్దని బైబిలు మంచి సలహా ఇస్తుంది. (రోమీయులు 12:2) ఎంతకాదన్నా, మీరు చేసిన దాని ఫలితాలను అనుభవించేది మీరే.

[అధస్సూచి]

^ సాధారణంగా, వివిధ దేశాల్లో సంస్కృతిపరంగా చెవులు ముక్కు కుట్టించుకోవడాన్ని గురించి కాదు కానీ, నేడు ప్రజాదరణ పొందుతున్న అతి ఫ్యాషన్‌ గురించే ఇక్కడ మాట్లాడుతున్నాం.—మే 15, 1974 కావలికోట (ఆంగ్లం) 318-19 పేజీలు చూడండి.

[14వ పేజీలోని చిత్రం]

శరీరంలోని వివిధ భాగాలను కుట్టించుకోవడం యువ జనాదరణను పొందుతోంది