కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చిన్న ద్వీపం నుండి పెద్ద పాఠం

చిన్న ద్వీపం నుండి పెద్ద పాఠం

చిన్న ద్వీపం నుండి పెద్ద పాఠం

రాపా న్యూయీ, అగ్ని పర్వతం నుండి ప్రవహించిన లావాతో ఏర్పడింది. విస్తీర్ణం 170 చదరపు కిలోమీటర్లు. దీనిమీద చెట్లు దాదాపు శూన్యమే. మనుష్యులుండే భూభాగం నుండి అతి దూరంలో ఉన్న దీవి ఇదే. * ఈ ద్వీపమంతా ఇప్పుడు కేవలమొక చారిత్రక అవశేషాలతో కూడిన భూప్రాంతం మాత్రమే. పాక్షికంగా దీనిక్కారణం అక్కడున్న మోయై అనే రాతి విగ్రహాలు. ఇవి ఒకప్పుడు పూర్తి వైభవంతో విలసిల్లిన ఒక నాగరికతకు చెందిన ప్రజల హస్తకృతులు.

గట్టిపడిన లావా రాతి నుండి చెక్కిన కొన్ని మోయైలు చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి, వాటి భారీ తలలు మాత్రమే కన్పిస్తుంటాయి. మరి కొన్నింటికి, కేవలం మొండెం మాత్రమే కన్పిస్తుంటుంది. కొన్ని మోయైలకైతే పుకావో అని పిలువబడే తలలపైని జుట్టు ముళ్ళు కన్పిస్తుంటాయి. ఈ విగ్రహాల్లో అధికశాతం రాతిగనుల్లో అసంపూర్తిగా పడివున్నాయి. ఇంకా కొన్ని ఇక్కడి ప్రాచీన బాటల కిరుప్రక్కలా చిందర వందరగా పడేసినట్లుగా, పనివాళ్ళు తమ పనిని మధ్యలో వదిలేసి, పనిముట్లన్నీ పడేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా అన్పిస్తుంది. నిలబడివున్న కొన్ని విగ్రహాలు అక్కడొకటీ ఇక్కడొకటీ ఉన్నా, కొన్ని 15 వరకు వరుసగా ఉన్నాయి. ఇవన్నీ సముద్రానికి అభిముఖంగా చూస్తుంటాయి. దీన్నంతటినీ చూసిన తర్వాత మౌయైలు ఎంతోకాలంగా సందర్శకుల్ని ఎందుకు తికమకపెట్టాయో అర్థమౌతుంది.

ఇటీవలి సంవత్సరాల్లో సైన్సు, మౌయైలలో ఉన్న మర్మమేమిటో అర్థం చేసుకోవడమే గాక, ఒకప్పుడు ఎంతగానో వర్ధిల్లిన నాగరికత ఇప్పుడు ఎందుకు నిర్మూలమైందో కూడా అర్థం చేసుకోనారంభిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వాస్తవాలు కేవలం చారిత్రక ప్రాముఖ్యం గలవి మాత్రమే కావు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ఈ వాస్తవాలు “ఆధునిక లోకానికి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని” బోధిస్తున్నాయి.

ఈ పాఠం, మనమీ భూమినీ మరి ప్రాముఖ్యంగా దాన్లోని వనరుల్నీ ఎలా వాడుకుంటున్నామన్న దానికి సంబంధించినది. అయితే ఈ భూమి, ఆ చిన్ని దీవికన్నా ఎంతో సంక్లిష్టమైనదీ జీవజాలం సంబంధంగా వైవిధ్యభరితమైనదీ అని ఒప్పుకోవలసిందే. కానీ దానర్థం మనం రాపా న్యూయీ అందించే పాఠాన్ని అలక్ష్యం చేయాలని కాదు. అందుకే, ముందు మనం రాపా న్యూయీ చరిత్రలోని కొన్ని విశేషాల్ని పరిశీలిద్దాము. క్రింద ఉన్న చరిత్ర వృత్తాంతం దాదాపు సా.శ. 400వ సంవత్సరంలో ప్రారంభమౌతుంది. అప్పుడు సముద్ర పడవల్లో ఇక్కడికి వచ్చిన తొలి కుటుంబాలు ఈ ద్వీపంపై నివాసం ఏర్పర్చుకున్నారు. వారు తీరం చేరుకుని సముద్రపుటొడ్డున నడుస్తూ ద్వీపంలోనికి ప్రవేశించినప్పుడు వారిని వీక్షించిన నేత్రాలు వారికి పైగా గిరికీలు కొడుతున్న పక్షులవే.

ద్వీప వనం

ఈ ద్వీపంలోని మొక్కల్లో వైవిధ్యం పెద్దగా ఏమీ లేదు. కానీ పామ్‌, హావు హావు, టోరోమిరో అనే వృక్షాల అడవులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అలాగే గుబురైన పొదలు, మూలికలు, వివిధ రకాల ఫెర్న్‌లు, రకరకాల గడ్డి వంటివి కూడా ఇక్కడ సమృద్ధి. పక్షుల విషయానికొస్తే గుడ్లగూబలు, కొంగలు, రైల్‌ పక్షులు, రామ చిలుకలు, ఇంకా కనీసం ఆరు రకాల ఇతర పక్షులు ఈ మారుమూల ద్వీపంలో వర్ధిల్లినాయి. రాపా న్యూయీ, “పాలినేషియా అంతట్లోనూ, అసలు చెప్పాలంటే పూర్తి పసిఫిక్‌ ప్రాంతమంతట్లోనే సముద్ర పక్షుల కోసం అతి అనుకూలమైన స్థలంగా ఉంది” అని డిస్కవర్‌ పత్రిక చెబుతుంది.

ఇక్కడికి వచ్చిన వలసదారులు కోళ్ళని, తినదగిన ఎలుకల్నీ ఈ ద్వీపానికి తెచ్చివుండవచ్చు. ఈ ఎలుకలు వారికి అతి ప్రియమైన భోజనం. వీటితోపాటు వారు పంటలు వేసుకోవటానికి టారో, దుంపలు, చిలగడ దుంపలు, అరటి, చెఱకు వంటి మొక్కల్ని కూడా తెచ్చారు. ఇక్కడి నేల సారవంతమైనది కావడంతో వారు వెంటనే భూమిని చదును చేసి మొక్కలు నాటడం ప్రారంభించారు. జనాభా పెరుగుదలతో పాటు ఈ వ్యవసాయమూ అభివృద్ధి అయింది. కానీ రాపా న్యూయీ భూమి పరిమితమైంది, అడవులు బాగానే ఉన్నా వృక్షాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.

రాపా న్యూయీ చరిత్ర

రాపా న్యూయీ చరిత్ర గురించి మనకు తెల్సినదంతా ఎక్కువగా మూడు పరిశోధనా రంగాలపై ఆధారపడివుంది: పుప్పొడి విశ్లేషణ, పూరాతత్త్వశాస్త్రం, శిలాజశాస్త్రం. పుప్పొడి విశ్లేషణా ప్రక్రియలో, ఒకప్పుడు చెరువుల నుండీ చిత్తడి నేలలుగావున్న ప్రాంతాల నుండి పుప్పొడి శాంపిళ్ళను సేకరించడం ఇమిడివుంది. ఎంతో వైవిధ్యభరితమైన మొక్కల గురించీ, అవి వందలాది సంవత్సరాల క్రితం ఎంత సమృద్ధిగా ఉన్నాయన్న దాని గురించీ ఈ శాంపిళ్ళు చెబుతాయి. నేలలోని పొరల్లో ఎంత లోతుగా ఫలాని పుప్పొడి శాంపిల్‌ కన్పిస్తుందో అది అంత పురాతనమైనదన్నమాట.

ప్రజల నివాసాలు, గృహోపకరణాలు, వారికి ఆహారంగా పనికి వచ్చిన జంతువుల అవశేషాలు, అలాగే మోయై విగ్రహాలు వంటి వాటిపైన పురాతత్త్వశాస్తమూ శిలాజశాస్త్రమూ దృష్టి కేంద్రీకరిస్తాయి. రాపా న్యూయీల నివేదికలన్నీ చిత్రలిపిలో ఉండడం మూలంగా, ఆ లిపిని అర్థంచేసుకోవడం కష్టతరంగా ఉండడం మూలంగా యూరప్‌వాసులు రాపా న్యూయాలను కలవడానికి పూర్వపు తేదీలన్నీ అంచనాలు మాత్రంగానే ఉన్నాయి. అంచనాల్ని రుజువు చేయడం చాలామట్టుకు సాధ్యపడదు కూడా. అంతేగాక, క్రింద ఇవ్వబడిన కొన్ని సంఘటనలు వాటి దగ్గరి సంఘటనల ముందుగాని వెనుకగాని జరిగివుండవచ్చును. ముద్దక్షరాల్లో చూపించబడిన తేదీలన్నీ సామాన్య శకానికి చెందినవే.

400 పాలినేషియాకు చెందిన దాదాపు 20 నుండి 50 మంది వలసదారులు, బహుశ 15 మీటర్లు లేదా అంతకు మించిన పొడవున్న పడవల్లో 8,000 కిలోల కంటే ఎక్కువ బరువు మోయదగ్గ పడవల్లో వచ్చివుంటారు.

800 ఈ కాలానికి చెందిన నేల పొరల్లో చెట్ల పుప్పొడి తక్కువగా ఉంది, దీన్నిబట్టి చెట్ల కొట్టివేత ప్రారంభమైందని తెలుస్తుంది. గడ్డి పుప్పొడి ఎక్కువగా ఉంది, చదును చేయబడిన భూభాగంలోకి గడ్డి విస్తరించడమే దానికి కారణం.

900-1300 ఈ కాలంలో ఆహారం కోసం వేటాడిన జంతువుల ఎముకల్లో దాదాపు మూడవవంతు డాల్ఫిన్‌లవే. సముద్ర అంతర్భాగం నుండి డాల్ఫిన్‌లను తీసుకురావడానికి ద్వీపవాసులు పెద్ద పెద్ద పామ్‌ వృక్షాల కాండాలతో చేసిన పడవల్ని ఉపయోగించారు. ఈ వృక్షాలనుండే మౌయైలను రవాణా చేయడానికీ వాటిని నిలబెట్టడానికీ కావల్సిన ఉపకరణాల్ని తయారుచేసుకున్నారు, ఇప్పటికే వీటిని చెక్కే పని పుంజుకుంది. విస్తరిస్తున్న వ్యవసాయమూ, వంటచెరకు కోసరమైన అవసరమూ అడవులు నెమ్మదిగా తరిగిపోవడానికి కారణమయ్యాయి.

1200-1500 ఈపాటికి విగ్రహాలను చెక్కే పని పూర్తిస్థాయిలో సాగుతోంది. రాపా న్యూయీలు తమ భుజబలాన్నీ బుద్ధిబలాన్నీ మోయైలనూ, వాటిని నిలబెట్టడానికి కావాల్సిన వేదికల్నీ చేయడానికి వినియోగించారు. పురాతత్త్వశాస్త్రవేత్తయైన జో ఆన్‌ వాన్‌ టిల్బర్గ్‌ ఇలా వ్రాస్తుంది: “రాపా న్యూయీల సామాజిక వ్యవస్థ మరిన్ని ఎక్కువగా మరింత పెద్దవిగా విగ్రహాల్ని తయారుచేయడాన్ని ప్రోత్సహించింది.” “800 నుండి 1,300 సంవత్సరాల కాలంలో దాదాపు 1,000 విగ్రహాలు వెలిశాయి . . . , అంటే ప్రతి ఏడుగురు లేదా తొమ్మిది మందికి ఒక్క విగ్రహమన్నమాట” అని కూడా ఆమె చెబుతోంది.

మోయైలను ఆరాధించడం జరగలేదని తెలుస్తుంది, అయితే శవఖనన, వ్యవసాయ ఆచారాల్లో వీటికి ఒక పాత్ర ఉంది. ఈ విగ్రహాల్ని వారు ఆత్మల నివాసాలుగా దృష్టించివుంటారు. అంతేగాక, అవి వాటి నిర్మాణకుల శక్తి, హోదా, వంశము వంటివాటికి కూడా ప్రతీకలుగా ఉండివుండవచ్చనిపిస్తుంది.

1400-1600 జనాభా దాదాపు 7,000 నుండి 9,000గా శిఖరాగ్ర సంఖ్య చేరుకుంది. అడవుల అచ్ఛాదనం పూర్తిగా తొలగిపోయింది, పాక్షికంగా దీనిక్కారణం ఇక్కడి పక్షుల జాతులు అంతరించిపోవడమే. పక్షులు ఉన్నప్పుడైతే, అవి చెట్లలో పూపరాగ సంపర్కం జరగడానికి ఉపకరించాయి, అలాగే అవి విత్తనాల్ని కూడా వెదజల్లాయి. “ఏమాత్రం మినహాయింపు లేకుండా ఇక్కడి ప్రతి పక్షి జాతి అంతరించిపోయింది” అని డిస్కవర్‌ పత్రిక చెబుతుంది. ఎలుకలు కూడా చెట్లు అంతరించిపోవడానికి దోహదపడ్డాయి; అవి పామ్‌ చెట్ల విత్తనాల్లోని పప్పుని తినేవని ఆధారాలు తెల్పుతున్నాయి.

కొంతకాలానికే పైనేల కొట్టుకుపోవడం ప్రారంభమైంది, నెమ్మదిగా సెలయేళ్ళు ఎండిపోయాయి, నీటి కొరత ఏర్పడింది. డాల్ఫిన్‌ ఎముకలు 1500 దగ్గరి కాలానికి చెందిన నేల పొరల్లో ఇక కన్పించలేదు, కారణం బహుశ సముద్రంలోకి వెళ్ళగల పడవల్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత పెద్ద వృక్షాలు లేకపోవడమేమో. ఈ ద్వీపం నుండి తప్పించుకు పోవడానికి ఇప్పుడు అవకాశాలు మృగ్యం. ప్రజలు ఆహారం కోసం కనబడిన చోటల్లా వెదకడంతో సముద్రపు పక్షులు తుడిచిపెట్టుకుపోయాయి. కోళ్ళ వినియోగం హెచ్చింది.

1600-1722 చెట్లు మాయమవ్వడం, భూమిని విపరీతంగా వినియోగంలోకి తేవడం, నేల కొట్టుకుపోవడం మూలంగా పంటలు పండటం మానేశాయి. విపరీతమైన కరవు ఏర్పడింది. రాపా న్యూయీలు రెండు విరుద్ధ కూటములుగా ఏర్పడ్డారు. సామాజిక అరాచకత్వపు తొలి చిహ్నాలు కన్పించాయి, చివరికి బహుశ నరమాంస భక్షకులు కూడా తయారయ్యారు. బలంగలవాడిదే రాజ్యమయ్యింది. ప్రజలు రక్షణ కోసం గుహల్లో జీవించనారంభించారు. దాదాపు 1700వ సంవత్సరానికల్లా జనాభా దాదాపు 2,000కు పడిపోయింది.

1722 డచ్‌ పరిశోధకుడు యాకోప్‌ రోఖవేన్‌ ఈ ద్వీపాన్ని కనుగొన్న మొట్టమొదటి యూరప్‌వాసి. ఇది ఈస్టర్‌ రోజున సంభవించడంతో, దానికి ఆయన ఈస్టర్‌ ఐలాండ్‌ అని పేరు పెట్టాడు. తన తొలి భావనల్ని ఆయనిలా నమోదు చేశాడు: “బంజరులా పడివున్న [ఈస్టర్‌ ఐలాండ్‌] దృశ్యం బీదరికపు వైపరీత్యానికీ బీడుకూ చిహ్నంగా ఉంది.”

1770 ఇప్పటికల్లా రూపా న్యూయీలలో మిగిలిన ప్రతిద్వంద్వులు ఒకరి విగ్రహాల్ని మరొకరు కూలద్రోయడం ప్రారంభించారు. ఆంగ్లేయుడైన కెప్టెన్‌ జేమ్స్‌ కుక్‌ అనే పరిశోధకుడు 1774లో సందర్శించినప్పుడు, ఆయన అనేక విగ్రహాలు పడిపోయివుండడం చూశాడు.

1804-63 వేరే నాగరికతలతో సంపర్కం ఎక్కువైంది. ఇప్పటికల్లా సర్వసాధారణ విషయంగా పరిగణింపబడుతున్న బానిసవ్యాపారము, వ్యాధులు, విపరీతమైన జననష్టాన్ని కల్గించాయి. సాంప్రదాయిక రాపా న్యూయీ సంస్కృతి అంతమైనట్లే.

1864 ఇప్పటికల్లా మోయైలన్నీ పడిపోయివున్నాయి, కొన్నింటి తలల్ని కావాలనే విరగ్గొట్టడం జరిగింది.

1872 ఈ ద్వీపంలో కేవలం 111 మంది మాత్రం ఆదివాసులున్నారు.

రాపా న్యూయీ 1888లో చీలీ దేశానికి చెందిన భూప్రాంతంగా మారింది. ఇటీవలి సంవత్సరాల్లో చూస్తే రాపా న్యూయీలో వేర్వేరు ప్రదేశాలవారితో కూడిన దాదాపు 2,100 మంది జనాభా ఉంది. చీలీ దీన్ని చారిత్రక స్థలంగా పేర్కొంది. రాపా న్యూయీలోని విశిష్ట లక్షణాల్ని దాని చరిత్రనూ కాపాడ్డానికి అనేక విగ్రహాల్ని తిరిగి నిలబెట్టారు.

నేడు మనకోసం ఒక పాఠం

రాపా న్యూయీలు తాము ఎటు పయనిస్తున్నారో ఎందుకు గ్రహించలేకపోయారు? విపత్తును ఎందుకు తప్పించలేకపోయారు? దీన్ని గురించి అనేకమంది పరిశోధకులు చేసిన వ్యాఖ్యానాల్ని గమనించండి.

“అరణ్యం ఒక్క రోజులో ఏమీ మాయమైపోలేదు​—అది నెమ్మదిగా దశాబ్దాల కాలంలో అంతర్థానమైంది. . . . ద్వీపవాసుల్లో ఎవరైనా అడవుల కొట్టివేతలోని ప్రమాదాల గురించి హెచ్చరించడానికి ప్రయత్నించినా ప్రయోజనం శూన్యం. విగ్రహాలు చెక్కేవారి, పరిపాలనా వ్యవస్థలోనివారి, అధికార వర్గాలవారి స్వార్థపర ప్రయోజనాల నిమిత్తం ఆ హెచ్చరికల్ని కొట్టివేయటం జరిగివుంటుంది.”​—డిస్కవర్‌.

“తమ ఆధ్యాత్మిక రాజకీయ భావనల్ని వ్యక్తీకరించడానికి వారు ఎంపిక చేసుకున్న విధానం మూలంగా వారు, ఒక ద్వీపాన్నే మూల్యంగా చెల్లించాల్సివచ్చింది. ఇప్పుడా ద్వీపం పూర్వపు ప్రాకృతిక వైభవానికి కేవలం దర్పణంగా మిగిలివుంది.”​—ఈస్టర్‌ ఐలాండ్‌​—ఆర్కియాలజీ, ఇకాలజీ, అండ్‌ కల్చర్‌.

“నియంత్రణ లేని పెరుగుదలా, పర్యావరణాన్నే మార్చేయాలన్న ఉద్దేశమూ శృతి మించడం కేవలం పారిశ్రామిక ప్రపంచానికి మాత్రమే చెందిన ఒక అంశం కాదని అది మానవ ప్రవృత్తిలోని ఒక ప్రాధమికాంశమనీ రాపా న్యూయీకి సంభవించిన దుర్దశ సూచిస్తోంది.”​—నేషనల్‌ జియాగ్రఫిక్‌.

ఒకవేళ నేడు, ఆ మానవ ప్రవృత్తి అని పై పత్రిక పిలిచిన దాన్లో మార్పు లేకపోయినట్లైతే ఏమి సంభవిస్తుంది? పర్యావరణానికి విపత్తును తీసుకువచ్చే జీవనవిధానాన్ని కొనసాగిస్తే, ఈ విశ్వంలో ఒక ద్వీపం అయిన మన ఈ భూమికి ఏమి సంభవిస్తుంది? ఒక రచయిత చెప్పేదాని ప్రకారం మనకు రాపా న్యూయీకి లేని ఒక పెద్ద అనుకూల పరిస్థితి ఉంది. “వినాశనానికి గురైన సమాజాల చరిత్రలు” మనకు హెచ్చరికా మాదిరులుగా ఉన్నాయి.

అయినా అడుగదగిన ప్రశ్నేమిటంటే, ఈ చరిత్రల్ని మానవుడు పరిగణలోనికి తీసుకుంటున్నాడా? పెద్ద మొత్తంలో అడవుల్ని కొట్టివేయడమూ, ప్రమాదకరమైన వేగంతో భూజీవుల్ని అంతరించిపోయేలా చేయడమూ చూస్తుంటే అతనికి ఏమాత్రం పట్టింపు లేదని అవగతమౌతోంది. జూ బుక్‌ అనే తన పుస్తకంలో లిండ కోబ్‌నర్‌ ఇలా వ్రాస్తున్నాడు: “ఒకటి లేక రెండు లేక యాభై జాతులను నిర్మూలించడం మూలంగా ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో మనం చెప్పలేము. మనం ఆ పర్యవసానాల గురించి అర్థం చేసుకునే లోపలే జాతుల నిర్మూలన మార్పుల్ని తీసుకువస్తుంది.”

విధ్వంసకుడొకడు తానున్న విమానంలో నుండి ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క రేకుని విరగ్గొడుతూ పోతుంటే, ఏ రేకుని తీసినప్పుడు విమానం కూలుతుందో వానికి తెలియదు. కానీ కీలకమైన రేకు పోయినప్పుడు విమానం భవితవ్యం రాసిపెట్టినట్లే. విమానం వెంటనే కూలకపోవచ్చు కానీ తప్పక కూలుతుంది. అలాగే మానవులు భూమ్మీది సజీవ “రేకుల్ని” ఒక్కటొక్కటిగా తీసేస్తున్నారు. దీని వేగం, సంవత్సరానికి 20,000 జాతులు, ఈ వేగం తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు! ఇక అంతమెప్పుడో ఎవరికి తెలుసు? అయితే తెలిసినంత మాత్రాన ఒరిగేదేముంది గనుక?

ఈస్టర్‌ ఐలాండ్‌​—ఎర్త్‌ ఐలాండ్‌ అనే పుస్తకం ఈ గమనార్హమైన వ్యాఖ్యానాన్ని చేసింది: [రాపా న్యూయీ పైనున్న] చివరి వృక్షాన్ని తెగనరికిన వ్యక్తికి, తాను నరుకుతుంది చివరి వృక్షమని తెలుసు. అయినా ఆయన ఒక్క క్షణం ఆగి ఆలోచించకుండా నరికేశాడు.”

“మనం మన మతాన్ని మార్చుకోవాలి”

“ఏమైనా ఆశ అంటూ మిగిలి ఉంటే, అది మనం మన మతాన్ని మార్చుకోవాలి అన్న తలంపులోనే” అని ఈస్టర్‌ ఐలాండ్‌​—ఎర్త్‌ ఐలాండ్‌ చెబుతుంది. ఆర్థిక అభివృద్ధీ, సైన్సూ టెక్నాలజీ, పైపైకి పెరుగుతూ పోతున్న జీవన ప్రమాణాలూ, పోటీలోని లాభాలూ​—ఇవీ మనం ప్రస్తుతం పూజించే దేవుళ్ళు. సర్వశక్తిగలవని మనం తలంచే ఈ దేవుళ్ళు ఈస్టర్‌ ఐలాండ్‌లోని భారీ విగ్రహాల్లాంటివి. ప్రతి గ్రామమూ తన పొరుగున ఉన్న గ్రామంతో పోటీపడి ఇంకా పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలని తాపత్రయపడింది. . . . ఇంకా ఇంకా ఎక్కువ కృషి సల్పి, ఉన్న వనరులే హరించుకుపోయేలా విగ్రహాలను చెక్కడం, రవాణా చేయడం, నిలబెట్టడం అనే నిష్ప్రయోజనకరమైన పనులు కొనసాగాయి.”

ఒక జ్ఞాని ఒకప్పుడిలా అన్నాడు: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లే[దు], మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లే[దు].” (యిర్మీయా 10:23) ‘మన ప్రవర్తనలో సన్మార్గాన ప్రవర్తించటానికి’ మన సృష్టికర్త మాత్రమే సహాయం చేయగలడు. మన దుస్థితి నుండి ఆయన మాత్రమే మనల్ని లేవనెత్తగలడు. తానా పనిచేస్తానని తన వాక్యమైన బైబిలులో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రాచీన నాగరికతల్లోని మంచి చెడు నాగరికతల్ని ఆ గ్రంథం నమోదు చేసింది. నిజంగా ఆ పుస్తకం, ఈ అంధకార బంధురంలో ‘మన త్రోవలకు వెలుగుగా’ ఉండగలదు.​—కీర్తన 119:105.

చివరికా త్రోవ విధేయత ప్రదర్శించిన మానవుల్ని శాంతి సమృద్ధిలతో కూడిన భూవ్యాప్త తోటలాంటి పరదైసుకి నడిపిస్తుంది​—ఆ పరదైసు నూతన లోకంలో, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని రాపా న్యూయీ అనే ఆ చిన్ని తునక కూడా ఒక భాగమై ఉంటుంది.​—2 పేతురు 3:13.

[అధస్సూచి]

^ ఈ దీవిలోని ప్రజలు తమనూ, తమ దీవినీ, రాపా న్యూయీ అనే పేరుతో పిలుచుకున్నా, దీన్ని సాధారణంగా ఈస్టర్‌ ఐలాండ్‌ అనీ దీన్లో నివసించేవారిని ఈస్టర్‌ ఐలాండ్‌వాసులనీ అంటారు.

[23వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఈస్టర్‌ ఐలాండ్‌

[చిత్రసౌజన్యం]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[23వ పేజీలోని చిత్రం]

“దాదాపు 1,000 విగ్రహాలు వెలిశాయి”

[25వ పేజీలోని చిత్రాలు]

పూర్తి భూమి అంతా, మారుమూల ద్వీపాలతో సహా పచ్చని తోటగా, పరదైసుగా మారుతుంది