చిరునవ్వు మంచిది!
చిరునవ్వు మంచిది!
జపాన్‌లోని తేజరిల్లు! విలేఖరి
అది హృదయపూర్వకమైనదైతే అనుమానాలనే మంచుకొండను కరిగించేస్తుంది. అనేక సంవత్సరాలుగా నాటుకుపోయిన అకారణమైన దురభిప్రాయాలను తీసివేస్తుంది. అపనమ్మకాల మూలంగా అనుమానాల మూలంగా మూసుకుపోయిన హృదయపు తలుపులను తెరుస్తుంది. అనేకులకు ఉపశమనాన్నీ ఆనందాన్నీ ఇస్తుంది. “నాకర్థమయ్యింది, బాధపడవద్దు” అని చెబుతుంది. “మనం స్నేహితులముగా ఉండవచ్చని ఆశిస్తున్నాను” అన్న అభ్యర్థనను తెలుపుతుంది. అంత శక్తివంతమైన ఆ ఉపకరణం ఏమిటి? అదే, చిరునవ్వు. అది మీ చిరునవ్వే కాగలదు.
అసలు, చిరునవ్వు అంటే ఏమిటి? చిరునవ్వు అంటే, “పెదవుల చివర్లు కొద్దిగా పైకి వంపు తిరిగి ఆహ్లాదాన్నీ ఆమోదాన్నీ ఆనందాన్నీ వ్యక్తం చేసే ముఖకవళిక” అని కొన్ని నిఘంటువులు నిర్వచిస్తున్నాయి. ఆప్యాయతగా చిరునవ్వు చిందించడానికి కీలకం ఉంది. మాట్లాడకుండానే, అనుభూతులను గానీ భావోద్వేగాలను గానీ ఇతరులకు తెలియజేసే మార్గం చిరునవ్వు. చిరునవ్వు ఎగతాళిని లేదా చిన్నచూపును కూడా వ్యక్తం చేయగలదు, అయితే అది వేరే విషయం.
చిరునవ్వు నిజంగా ప్రభావం చూపగలదా? ఎవరన్నా మిమ్మల్ని చూసి నవ్వినప్పుడు మీకు ఉపశమనం గానీ నెమ్మది గానీ కల్గిన సందర్భం ఏదైనా మీకు గుర్తుందా? ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వనప్పుడు మీకు భయం కలిగినట్లుగానీ లేదా మిమ్మల్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లు మీకు అనిపించినట్లు గానీ మీకు గుర్తుందా? అవును, చిరునవ్వు చిందించేవాళ్ళ మీదా, ఎవరిని చూసి చిరునవ్వు చిందించడం జరిగిందో వాళ్ళ మీదా చిరునవ్వు ప్రభావం చూపగలదు. “వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి” అని యోబు తన వైరులను గురించి అన్నాడు. (యోబు 29:24) యోబు ముఖ ప్రకాశము ఆయన సంతోషాన్నీ ఆనందాన్నీ సూచించి ఉండవచ్చు.
చిరునవ్వు మంచి ప్రభావం చూపగలదన్నది నేటికీ వాస్తవమే. ఆప్యాయతతో కూడిన చిరునవ్వు తీవ్రమైన మానసిక సంఘర్షణల నుండి మనలను విముక్తులను చేయగలదు. ప్రెషర్ కుక్కర్‌లోని ఆవిరి ఒత్తిడి అధికమైనప్పుడు ఆ అధిక ఒత్తిడిని తగ్గించేందుకు కుక్కర్ మీద ఉండే సేఫ్టీ వాల్వ్ ఎలా సహోయపడుతుందో, అలాగ, చిరునవ్వు కూడా, మనకు మానసిక ఒత్తిళ్ళు లేదా నిరాశానిస్పృహలు కలిగినప్పుడు, మనం వాటి మూలంగా కృంగిపోకుండా, వాటిని తగ్గించుకునేందుకు, కాస్త ఉపశమనాన్ని పొందేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఇతరులు తనను చూస్తూండడాన్ని టోమోకో అనే అమ్మాయి చాలాసార్లు గమనించింది. వాళ్ళు తనను చూస్తున్నారన్న విషయాన్ని ఆమె గమనించినప్పుడు వాళ్ళు తమ చూపులు త్రిప్పుకునేవారు. అందరూ అలా చూపులు త్రిప్పుకుంటున్నందువల్ల, వాళ్ళు తనను విమర్శనాత్మకంగా చూస్తున్నారని ఆమె అనుకుంది. దాని ఫలితంగా, తాను ఒంటరిదన్న భావనా, విచారమూ ఆమెకు కలిగాయి. ఎవరైనా నిన్ను చూసినట్లు నువ్వు ఈసారి గమనిస్తే, వాళ్ళను చూసి చిరునవ్వు చిందించు అని ఆమె స్నేహితురాలు ఒకరోజు ఆమెకు సలహా ఇచ్చింది. ఆమె అలా రెండు వారాలు చేసింది. ఆమె ఎవరెవర్ని చూసి చిరునవ్వు నవ్విందో
వాళ్ళంతా తిరిగి నవ్వినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది! ఆమెకు కలిగిన మానసిక సంఘర్షణలన్నీ మటుమాయమయ్యాయి. “జీవితం నిజంగా ఎంతో ఆస్వాదించదగినదిగా మారింది” అని ఆమె ఇప్పుడు అంటోంది. అవును, చిరునవ్వు ఇతరుల సమక్షంలో మనకు ఇబ్బందిగా బెరుకుగా అనిపించకుండా చేస్తుంది, మనం మరింత స్నేహశీలురమయ్యేందుకు సహాయపడుతుంది.మీ మీదా ఇతరుల మీదా చిరునవ్వు చూపే మంచి ప్రభావం
చిరునవ్వు ఒక వ్యక్తిపై భావోద్వేగ పరంగా కూడా ప్రభావం చూపగలదు. ఒకరు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండేందుకు సహాయం చేస్తుంది. అది శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది. “నవ్వు ఒక మంచి టానిక్” అనే లోకోక్తి కూడా ఉంది. వాస్తవానికి, ఒకరి మానసిక స్థితికీ శారీరక ఆరోగ్యానికీ దగ్గరి సంబంధం ఉందని వైద్య అధికారులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడీ, ప్రతికూలమైన భావోద్వేగాలూ మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనం చేయగలవని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరొక వైపు చిరునవ్వు మనకు సంతోషాన్ని కల్గిస్తుంది, నవ్వు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది కూడా.
చిరునవ్వు ఇతరులపై గొప్ప ప్రభావాన్ని చూపించగలదు. మీకు ఎవరైనా ఒక ఉపదేశాన్ని ఇస్తున్నారు లేదా ఏదైనా బోధిస్తున్నారు అని అనుకుందాం. మీకు ఉపదేశం ఇస్తున్న ఆ వ్యక్తి ముఖంలో ఎలాంటి భావాన్ని చూడడానికి మీరు ఇష్టపడతారు? ఆ వ్యక్తి ముఖంలో మీకు స్నేహభావం గానీ వాత్సల్యం గానీ కన్పించకపోతే, లేదా కఠినత్వమే గనుక కనిపిస్తే ఆయనకు మీపై కోపంగానీ చిరాకుగానీ తృణీకారభావంగానీ శత్రుభావంగానీ ఉన్నాయన్న మాట. అలా కాకుండా, ఆయన ముఖంలో వాత్సల్యమూ స్నేహభావమూ మిళితమైన చిరునవ్వు కన్పిస్తున్నట్లయితే మీరు ఇబ్బందిగా ఫీలవ్వరు. ఆయన ఇచ్చే ఉపదేశాన్ని మీరు వెంటనే స్వీకరించగల్గుతారు కూడా. అవును, మానసిక సంఘర్షణలుగల పరిస్థితుల్లో అపార్థాలు కలిగే అవకాశాన్ని చిరునవ్వు తగ్గించగలదు.
సవ్య తలంపులు చిరునవ్వు చిందించడాన్ని సులభతరం చేస్తాయి
ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణమే చిరునవ్వులు చిందించగల నిపుణులైన నటుల్లా మనలో చాలా మందిమి చిరునవ్వు చిందించలేమన్నది నిజమే; అలా చిందించగల్గాలని మనం కోరుకోము కూడా. మన చిరునవ్వు సహజమైనదిగాను హృదయపూర్వకమైనదిగాను ఉండాలనే మనం కోరుకుంటాం. ‘మీరు ప్రశాంతంగా ఉంటూ, హృదయపూర్వకంగా చిరునవ్వు నవ్వడం చాలా ప్రాముఖ్యం. లేదంటే, మీ చిరునవ్వు చాలా కృత్రిమంగా ఉంటుంది’ అని ఒక కమ్యూనికేషన్ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్ వ్యాఖ్యానించారు. అయితే, మనం హృదయపూర్వకంగా ఎలా నవ్వగలం? ఈ విషయంలో బైబిలు మనకు సహాయాన్నందించగలదు. “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును” అని మనం మాట్లాడే మాటలను గురించి మత్తయి 12:34, 35 చెబుతుంది.
చిరునవ్వు అనేది మాట్లాడకుండానే మన అనుభూతులను ఇతరులకు తెలియజేసే మార్గమని గుర్తుంచుకోండి. మన ‘హృదయంలో నిండి ఉన్న’ మాటలనే మన నోరు మాట్లాడుతుందనీ, “మంచి ధననిధి” నుండి “సద్విషయము”లు వస్తాయనీ గుర్తుంచుకుంటే, హృదయపూర్వక చిరునవ్వుకు కీలకం మన తలంపులూ, భావోద్వేగాలూనేనన్న విషయం స్పష్టమవుతుంది. అవును, మన హృదయంలో ఏముందన్నది, మన మాటలు, ప్రవర్తనల ద్వారానే కాక, మన ముఖ కవళికలను బట్టి కూడా ఎప్పుడో
ఒకప్పుడు తప్పక వ్యక్తం చేయబడుతుందనడంలో సందేహం లేదు. కనుక మనం సవ్య తలంపులను మాత్రమే మనస్సులో ఉంచుకోవడంలో కొనసాగవలసిన అవసరం ఉంది. ఇతరుల గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామన్నది, మన ముఖంలోని భావాలపై గట్టి ప్రభావాన్ని చూపుతుంది. కనుక, కుటుంబ సభ్యులకూ, పొరుగువాళ్ళకూ, మన సన్నిహిత స్నేహితులకూ ఉన్న సుగుణాలను గురించే ఎల్లప్పుడూ ఆలోచించుదాం. అలా చేస్తే వాళ్ళను చూసినప్పుడు చిరునవ్వు చిందించడం మనకు చాలా సులభమవుతుంది; పైగా, మనం అలా చేసినప్పుడు, మంచితనం, కరుణ, దయలతో మన హృదయం నిండి ఉంటుంది కనుక, చిరునవ్వు హృదయపూర్వకమైనదై ఉంటుంది. అప్పుడు కళ్ళు మెరుస్తాయి, మనం హృదయపూర్వకంగానే చిరునవ్వు నవ్వుతున్నామని ఇతరులు గ్రహిస్తారు.అయితే తాము పెరిగిన వాతావరణాన్ని బట్టీ నేపథ్యాన్ని బట్టీ కొంతమందికి ఇతరులను చూసినప్పుడు నవ్వడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. వాళ్ళకు పొరుగువాళ్ళ మీద సదభిప్రాయమే ఉన్నప్పటికీ వాళ్ళను చూసి నవ్వే అలవాటు ఉండదు. ఉదాహరణకు, జపాన్ దేశస్థులు, మగవాళ్ళు ఎల్లప్పుడూ గంభీరంగాను ఠీవిగాను మౌనంగాను ఉండాలని అనుకుంటారు. కనుక వాళ్ళలో చాలామందికి పరిచయం లేనివాళ్ళను చూసి నవ్వే అలవాటు ఉండదు. మిగతా సంస్కృతుల్లో కూడా ఈ తలంపు ఉంది. లేదా కొంతమంది స్వతహాగానే బిడియస్థులు కావచ్చు, వారికి ఇతరులను చూసి చిరునవ్వు చిందించడం చాలా కష్టంగా ఉండవచ్చు. కనుక ఇతరులు ఎంత పెద్దగా ఎంత తరచుగా చిరునవ్వు చిందిస్తారనే దాన్ని బట్టి వాళ్ళ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకూడదు. ప్రజలు వేర్వేరుగా ఉంటారు కనుక, వాళ్ళ వ్యక్తిత్వాలూ, వాళ్ళు ఇతరులకు తమ భావాలను తెలియజేసే విధానమూ భిన్నంగా ఉంటాయి.
ఇతరులను చూస్తే మీకు చిరునవ్వు రావడం లేదా? అలాగైతే, చిరునవ్వు చిందించడాన్ని ఇప్పటికైనా మీరెందుకు నేర్చుకోకూడదు? “మనము మేలుచేయుట యందు విసుకక యుందము. . . . అందరియెడలను . . . మేలు చేయుదము” అని బైబిలు మనకు ఉపదేశిస్తుంది. (గలతీయులు 6:9, 10) మనం ఇతరులకు మేలు చేసే ఒక మార్గం వాళ్ళను చూసినప్పుడు చిరునవ్వు చిందించడమే. అది మనం చేయగలదే! కనుక, ఇతరులను పలకరించేందుకు, చిరునవ్వుతో ప్రోత్సాహకరమైన మాటలను పలికేందుకు చొరవ తీసుకోండి. మీరు అలా చేస్తే ఇతరులు ఎంతో మెచ్చుకుంటారు. మీరు ఇతరులను చూసి చిరునవ్వు నవ్వడాన్ని అలవాటు చేసుకుంటున్న కొద్దీ మరింత సులభం అవుతుంది.
[27వ పేజీలోని బాక్సు]
ఒక హెచ్చరిక మాట
ఒక విచారకరమైన వాస్తవమేమిటంటే మనం చూసే ప్రతి చిరునవ్వూ హృదయపూర్వకమైనదై ఉండదు. వంచకులూ, మోసగాళ్ళూ, స్వార్థప్రియులైన అమ్మకం దారులూ, మరితరులూ చాలా ఆకర్షణీయంగా చిరునవ్వును చిందించవచ్చు. చిరునవ్వు చిందిస్తే, ప్రజలు తమను అనుమానించరనీ, అలా ప్రజలను సులభంగా మోసం చేయవచ్చనీ వాళ్ళకు తెలుసు. నైతికత లేనివాళ్ళూ అశ్లీల ఉద్దేశాలు గలవాళ్ళూ కూడా ఆకర్షణీయంగా చిరునవ్వులు చిందిస్తారు. వాళ్ళ చిరునవ్వులు అర్థరహితమైనవి; మోసపూరితమైనవి. (ప్రసంగి 7:6) అయితే, ఒకవైపు ఇతరులను గురించి అతిగా అనుమానించకుండా ఉంటూనే, మరొక వైపు, మనం క్లిష్టమైన ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామన్న విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. యేసు తానే స్వయంగా సిఫారసు చేసినట్లు, మనం ‘పాములవలె వివేకులముగాను పావురములవలె నిష్కపటులముగాను ఉండవలసిన’ అవసరం కూడా ఉంది.—2 తిమోతి 3:1; మత్తయి 10:16.
[28వ పేజీలోని చిత్రం]
చిరునవ్వుతో ఇతరులను పలకరించేందుకు చొరవ తీసుకోండి