కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టైలు అప్పుడూ ఇప్పుడూ

టైలు అప్పుడూ ఇప్పుడూ

టైలు అప్పుడూ ఇప్పుడూ

మెడను అలంకరించుకోవడానికి ప్రజలు వేలాది సంవత్సరాలుగా ఆసక్తిని కనబరుస్తునే ఉన్నారు. ఉదాహరణకు, దాదాపు సా.శ.పూ. 1737వ సంవత్సరంలో ఐగుప్తులోని ఫరో యోసేపుకు బంగారు గొలుసు ఇచ్చాడు.​—ఆదికాండము 41:42.

నేడు ప్రపంచంలోని అనేక భాగాల్లో ప్రజలు టైలను ధరిస్తున్నారు. వేర్వేరు చరిత్ర మూలాల ప్రకారం చూస్తే, ఈ ఆధునిక టైకి ముందటి రూపం ఇంగ్లాండులోను, ఫ్రాన్సులోను 16వ శతాబ్దం మలిభాగంలో కన్పించింది. అప్పట్లో మగవారు డబ్లెట్‌ అనే కోటు వేసుకునేవారు. అలంకారం కోసం వారు మెడ దగ్గర రఫ్‌ అనేదాన్ని ధరించేవారు. ఈ రఫ్‌ సాధారణంగా కొన్ని సెంటీమీటర్ల మందం ఉండి మెడ చుట్టూ పట్టీలా ఉంటుంది. ఇది తెల్లటి బట్టతో చేయబడుతుంది. తర్వాత అది ఆకారాన్ని కోల్పోకుండేలా గట్టిపడేలా చేస్తారు.

కొంతకాలానికి ఈ రఫ్‌ పోయి దాని స్థానే వ్రేలాడే కాలర్‌ ఉనికిలోకి వచ్చింది. ఇది భుజాలను కప్పుతూ చేతుల మీదుగా వ్రేలాడుతూండే తెల్లని కాలర్‌. ఈ కాలర్లు అటు తర్వాత వాన్‌డైక్‌లని కూడా పిలువబడ్డాయి. వీటిని ప్యూరిటన్‌ మతస్థులూ మరితరులూ ధరించేవారు.

17వ శతాబ్దంలో వెయిస్ట్‌ కోట్‌ అనే పొడవాటి కోటు ఉనికిలోకి వచ్చింది. దీన్ని సాధారణంగా పొడవాటి పై అంగీ లోపల వేసుకునేవారు. దీన్ని ధరించినప్పుడు మెడ చుట్టూ క్రావట్‌ అనే రుమాలు ఉండేది. ఈ రుమాలుని మెడ చుట్టూ రెండు మూడుసార్లు చుట్టుకునేవారు. ఈ గుడ్డ చివర్లు ముందు భాగంలో వ్రేలాడేవి. 17వ శతాబ్దం చివరి భాగంలోని వర్ణచిత్రాలు, ఈ క్రావట్‌లు అప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చూపిస్తున్నాయి.

క్రావట్‌లను మస్లిన్‌తోను, పల్చటి బట్టతోను, ఇంకా లేసుతో అల్లిన గుడ్డతోను చేసేవారు. ఈ లేసుతో చేసినవాటికి ఖరీదెక్కువ. ఇంగ్లాండ్‌ రాజైన రెండవ జేమ్స్‌ తనకు పట్టాభిషేకం జరిగేటప్పుడు 36 పౌండ్లు, 10 షిల్లింగ్‌లు ఇచ్చి ఒక క్రావట్‌ను కొనుకున్నాడట. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే. లేసుతో చేసిన కొన్ని క్రావట్‌లు పెద్దగా ఉండేవి. వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బీలోని రెండవ ఛార్లెస్‌ విగ్రహంలో అది 15 సెంటీమీటర్ల వెడల్పు, 86 సెంటీమీటర్ల పొడవు ఉంది.

క్రావట్‌లను అనేక విధాలుగా కట్టుకునేవారు. కొన్నిసార్లు క్రావట్‌ని కట్టుకున్న తర్వాత అది జారిపోకుండా ఉండేందుకు దాని మీదుగా సిల్కు పట్టీని పెట్టి చుబుకం క్రింద బిగించి కట్టేవారు. ఈ విధమైన నెక్‌క్లాత్‌ని సోలిటైర్‌ అనేవారు. దీన్లోని బౌ ఇప్పటి బౌ టైని పోలివుండేది. ఒక్క క్రావట్‌ని కట్టడానికి కనీసం వంద విధాలున్నాయని చెబుతారు. పురుషుల దుస్తుల స్టైళ్ళను ఎంతగానో ప్రభావితం చేసిన బో బ్రూమెల్‌ అనే ఆంగ్లేయుడు ఒక విధమైన క్రావట్‌ని సరిగ్గా కట్టుకోవడానికి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమయం వెచ్చించాడట.

1860ల కల్లా పొడవైన కొసలు గల క్రావట్‌లు నేటి టైలను పోలివుండటం ఆరంభమైంది. వాటినే ఫోర్‌-ఇన్‌-హ్యాండ్‌ అని కూడా పిలిచారు. నాలుగు-గుఱ్ఱాల బండ్లను నడిపేవారు వీటిని ధరించడం మూలంగా వాటికా పేరు వచ్చింది. కాలర్లతో కూడిన అంగీలు ధరించడం కూడా ఫ్యాషనైంది. టైలను చుబుకం క్రింద కట్టేవారు. దాని పొడవాటి కొసలు అంగీపై వ్రేలాడేవి. సరిగ్గా అప్పుడే నేటి టై అవతరించింది. మరో రకమైన టై అయిన బౌ టై 1890లలో ప్రజాదరణ పొందింది.

నేడు, బాగా కన్పించాలంటే టై కట్టుకోవల్సిందేనన్న అభిప్రాయం చాలామందిలో స్థిరపడిపోయింది. కొందరైతే ఒక వ్యక్తి టై కట్టుకునే రీతిని బట్టి ఆయన్ను గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు కూడాను. అందుకని శుభ్రంగా ఉన్న టైలు కట్టుకోవడం ప్రాముఖ్యం. అలాగే, షర్టు, ప్యాంటు, కోటు రంగులతో మ్యాచ్‌ కాగల రంగుల టైలు కట్టుకోవాలి.

టైని కట్టుకునే పద్ధతి నీటుగా ఉండాలి. ఫోర్‌-ఇన్‌-హ్యాండ్‌ విధానం బహుళ వ్యాప్తిలో ఉన్నది. (18వ పేజీలోని చిత్రం చూడండి.) అది నీటుగా ఉండి, మరీ ఆడంబరంగా కనబడకుండా అన్ని సందర్భాల్లోను ఆమోదయోగ్యంగా ఉంటుంది. విండ్సర్‌ నాట్‌ అనే మరో పద్ధతి కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈ పద్ధతిలో సరిగ్గా టై ముడి క్రింద సాధారణంగా చిన్న ముడత కన్పిస్తుంది.

చాలామంది పురుషులు టై కట్టుకోవటం అసౌకర్యంగా ఉన్నట్లు భావిస్తారు. కంఠాన్ని ఏదో పట్టినట్లుగా ఉండడం వారికిష్టముండదు. అయితే ఈ అసౌకర్యానికి అసలు కారణం షర్టు సైజేనని ఈ బాధననుభవించిన కొందరు కనుగొన్నారు. మీక్కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లైతే మీ షర్టు కాలరు మరీ చిన్నదిగా ఉందేమో చూసుకోండి. అలాగే కాలరు సైజు కూడా సరిగ్గా ఉంటే మీకసలు టై కట్టుకున్నట్లే అన్పించదు.

చాలా దేశాల్లో టై కట్టుకోవడం వ్యాపార రంగంలో అత్యావశ్యకమని ఎంచబడుతుంది. ఆ కారణంగానే క్రైస్తవ పురుషులు తమ పరిచర్యలోని వివిధ అంశాల్లో పాల్గొనేటప్పుడు టైలు కట్టుకుంటారు. అవును, వ్యక్తి మెడ చుట్టూ కట్టుకునే ఒక చిన్న గుడ్డ ముక్క ఆయనకు హుందాతనాన్ని ఆపాదించి అతడ్ని గౌరవనీయునిగా చేయగలదు.

[18వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఫోర్‌-ఇన్‌-హ్యాండ్‌ టై కట్టుకునే విధానం *

1 టై వెడల్పైన కొసను సన్నని కొసకు 30 సెంటీమీటర్ల దూరంలో దానిపై నుండి చుట్టు తిప్పి, ముందుకు తీసుకురండి.

2వెడల్పైన కొసను పట్టుకుని ఉచ్చులా ఏర్పడిన దాన్లోనుండి ముందుకు తీసుకురండి.

3 చూపుడు వ్రేలితో ముడిని వదులుగా పట్టుకుని వెడల్పైన కొసను లోపలికి జొనిపి బయటికి లాగండి.

4 సన్నని కొసను పట్టుకుని ముడిని కాలర్‌కి దగ్గరగా జరుపుతూ నెమ్మదిగా ముడిని బిగించండి.

[అధస్సూచి]

^ షర్ట్‌ అండ్‌ టై పుస్తకంలోనుండి.

[19వ పేజీలోని చిత్రాలు]

17వ శతాబ్దం నుండి నేటి వరకు టైలలో స్టైళ్ళు