కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తప్పుడు ప్రచారం ప్రాణాంతకం కాగలదు

తప్పుడు ప్రచారం ప్రాణాంతకం కాగలదు

తప్పుడు ప్రచారం ప్రాణాంతకం కాగలదు

“నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచంలో సగభాగం ప్రయాణించగలదు.”​—మార్క్‌ ట్వెయిన్‌.

ఒక స్కూల్‌ టీచర్‌, ఏడేండ్ల విద్యార్థిని “నికృష్టపు యూదుడా!” అని అంటూ, వాడి చెంప మీద కొట్టింది. ఆ తర్వాత, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి వరుసగా నిలబడి ఒకరి తర్వాత ఒకరు అతడి ముఖమ్మీద ఉమ్మండి అని ఆ తరగతిలోని పిల్లలకు చెప్పింది.

ఆ అబ్బాయీ, ఆ అబ్బాయి తల్లిదండ్రులూ యూదా వంశస్థులూ కారు యూదా మత విశ్వాసులూ కారు, వాళ్ళు యెహోవాసాక్షులు. ఆ విషయం ఆ ఉపాధ్యాయురాలికీ, ఆ అబ్బాయికీ (ఆమె మేనల్లుడే) ఇద్దరికీ తెలుసు. అయినా, ఆ ఉపాధ్యాయురాలు, సర్వవ్యాప్తంగా యూదుల గురించి ఉన్న నిర్హేతుకమైన దురభిప్రాయాన్ని ఉపయోగించుకుని తోటి పిల్లల మనస్సుల్లో ఆ అబ్బాయి మీద ద్వేషాన్ని రేకెత్తించింది. యెహోవాసాక్షులు నీచులని ఆ ఉపాధ్యాయురాలికీ, ఆమె క్లాసులోని పిల్లలకూ సంవత్సరాలుగా వాళ్ళ ప్రీస్ట్‌ చెప్పేవారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కమ్యూనిస్ట్‌లనీ, సిఐఎ (సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ) ఏజెంట్లనీ అందరూ చెప్పుకునేవారు. కనుకనే, ఆ తరగతిలోని పిల్లలు “నికృష్టపు యూదుడు” అని తలంచబడే ఆ అబ్బాయి ముఖం మీద ఉమ్మివేయడానికి ఎంతో ఆతురతతో వరుసగా నిలబడ్డారు.

ఆ అబ్బాయి తన కథను చెప్పడానికి బ్రతికే ఉన్నాడు. కానీ, దాదాపు 60 సంవత్సరాల క్రితం, జర్మనీలోను, దాని పొరుగు దేశాల్లోను నివసించిన అరవై లక్షల మంది యూదులు తమ కథను చెప్పుకోవడానికి నేడు జీవించి లేరు. నాజీ గ్యాస్‌ చేంబర్లలోను, కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లోను యూదుల ప్రాణాలు పోవడానికి కారణం ద్రోహబుద్ధితో కూడిన తప్పుడు ప్రచారమే. యూదులను గురించి యూదావ్యతిరేకులకు ఉన్న తప్పుడు అభిప్రాయం ఎంత మేరకు వాస్తవమన్నది పరిశీలించకుండానే ప్రజలు దాన్ని అంగీకరించారు. అలా ఆ తప్పుడు అభిప్రాయం విస్తృతంగా ప్రచారం చేయబడి ప్రబలమైంది. అలా వ్యాపించిన యూదా వ్యతిరేక భావం, అనేకులు యూదులను శత్రువులుగా ఎంచి, యూదులను భూమిమీద లేకుండా చేయాలని తలంచేలా చేసింది, వాళ్ళనలా లేకుండా చేయడం న్యాయసమ్మతమైనదేనని తలంచేలా కూడా చేసింది. అలా, ఆ తప్పుడు ప్రచారం అనేకుల ప్రాణాలను తీసే మారణాయుధంగా ఉపయోగించబడిందని మనం చూడగల్గుతున్నాం.

అవును, స్వస్తిక్‌ వంటి చిహ్నాల ద్వారా లేదా పరిహాసాల ద్వారా కూడా తప్పుడు సమాచారాలను ప్రచారం చేసి విద్వేషాన్ని రేకెత్తించవచ్చు. ప్రజల ఆలోచనలపై ప్రవర్తనపై తమ ప్రభావం ఉండాలన్న ఉద్దేశం గల నియంతలూ, రాజకీయవేత్తలూ, మతనాయకులూ, ప్రకటనాదారులూ, వాణిజ్యవేత్తలూ విలేఖరులూ రేడియో టీవీ తారలూ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్లూ మరితరులూ ప్రజలను నమ్మించేందుకు అనేక తంత్రాలను ఉపయోగిస్తూనే ఉంటారు.

నిజమే, ప్రయోజనకరమైన సామాజిక లక్ష్యాలను సాధించేందుకు కూడా ప్రచార సందేశాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, త్రాగి వాహనాలను నడిపే ధోరణిని తగ్గించడం కోసం ప్రచారాన్ని ఉపయోగించవచ్చు. అయితే, అల్ప సంఖ్యాక మత వర్గాల వారిపై ద్వేషాన్ని రగిలించేందుకు లేదా ప్రజల చేత సిగరెట్లను కొనిపించడానికి కూడా ప్రచారాన్ని ఉపయోగించవచ్చు. “మనం నమ్మేలా చేసే సందేశాలు ప్రతిరోజూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. ప్రచారం చేసేవాళ్ళు, భావవినిమయం ద్వారానో, చర్చల ద్వారానో కాక, సాంస్కృతిక చిహ్నాలను కౌశలంగా ఉపయోగించడం ద్వారా, మానవ మౌలిక భావోద్వేగాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సందేశాలకు మనలో ప్రతిస్పందనను రేకెత్తిస్తున్నారు. ప్రచారం వల్ల లాభం ఉన్నా నష్టమే ఎక్కువగా ఉన్నా, మొత్తమ్మీద మనం ఉన్నది ప్రచారపు యుగంలోనే” అని పరిశోధకులైన ఆంథనీ ప్రాట్‌కానస్‌, ఎలీయట్‌ అరాన్‌సన్‌ పేర్కొంటున్నారు.

మానవుని ఆలోచనా విధానంపై ప్రవర్తనపై ప్రభావం చూపేందుకు ప్రచారం అనే ఆయుధం శతాబ్దాలుగా ఎలా ఉపయోగించబడింది? ప్రమాదకరమైన ప్రచారం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మీరేమి చేయగలరు? నమ్మదగిన సమాచారాన్నిచ్చే మూలమేమైనా ఉందా? తరువాతి శీర్షికల్లో ఇవీ మరితర ప్రశ్నలూ చర్చించబడతాయి.

[3వ పేజీలోని చిత్రం]

తప్పుడు ప్రచారాన్ని ఆయుధంగా చేసుకుని నాజీ మారణహోమంలో యూదులను అంతమొందించడం జరిగింది