దేవుడు మారుతాడా?
బైబిలు ఉద్దేశము
దేవుడు మారుతాడా?
“పాత నిబంధన”లోని దేవుడు “క్రూరమైన దేవుడు” అని మానవశాస్త్రవేత్తయైన జార్జ్ డోర్సీ అంటున్నాడు. “యాహ్‌వే . . . బొత్తిగా ప్రేమలేనివాడు. విజయానికీ దోపిడిగాళ్ళకూ వేధించేవాళ్ళకూ యోధులకూ దేవుడు ఆయన” అని కూడా ఆయన అంటున్నాడు. “పాత నిబంధన”లోని దేవుడైన యెహోవా లేదా యాహ్‌వే గురించి మరితరులు కూడా ఇలాంటి నిర్ధారణలకే వచ్చారు. యెహోవా నిజానికి ఒకప్పుడు క్రూరమైన దేవుడై ఉండి, “క్రొత్త నిబంధన”లోని ప్రేమామయుడైన కరుణామయుడైన దేవుడుగా మారాడా అని కొందరు నేడు ఆశ్చర్యచకితులవుతుంటారు.
బైబిలులోని దేవుణ్ణి గురించిన అలాంటి తలంపు క్రొత్తేమీ కాదు. ఈ తలంపును, మొట్టమొదటిసారిగా, సా.శ. రెండవ శతాబ్దానికి చెందిన, పాక్షికంగా జ్ఞానవాదియైన మార్సీయన్ వ్యక్తీకరించాడు. “పాత నిబంధన”లోని దేవుణ్ణి అంగీకరించడానికి ఆయన నిరాకరించాడు. ఆ దేవుడు హింసాత్మక స్వభావం గలవాడనీ, ప్రతీకార వైఖరి గలవాడనీ, తనను ఆరాధిస్తే వస్తుసంబంధమైన ప్రతిఫలాలను ఇస్తానని వాగ్దానం చేసే నిరంకుశ పరిపాలకుడనీ ఆయన ఎంచాడు. మరొకవైపు, యేసు క్రీస్తు ద్వారా బయల్పరచబడిన “క్రొత్త నిబంధన”లోని దేవుడు పరిపూర్ణుడైన దేవుడనీ, నిర్మలమైన ప్రేమా కరుణా దయా క్షమా గల దేవుడనీ ఆయన వర్ణించాడు.
మారుతున్న పరిస్థితుల్లో కలిగే ఆయా అవసరాలను యెహోవా తీరుస్తాడు
“యెహోవా” అనే దేవుని పేరుకు “సంభవింపజేయువాడు” అని అర్థం. అంటే తాను చేసిన వాగ్దానాలన్నీ నెరవేరేలా తానే చూసుకుంటాడు అని అర్థం. మోషే దేవుని పేరు అడిగినప్పుడు, “నేను ఉన్నవాడను అను వాడనై యున్నానని” అంటూ ఆయన తన పేరు అర్థాన్ని వివరంగా చెప్పాడు. (నిర్గమకాండము 3:14) ఇదే లేఖనాన్ని రోథర్‌హామ్ అనువాదంలో చూస్తే, “నాకిష్టమైన రీతిలో నేను అవుతాను” అని అది చెబుతుంది.
అంటే, యెహోవా, తన నీతియుక్తమైన ఉద్దేశాలనూ వాగ్దానాలనూ నెరవేర్చేందుకు తను ఎలా ఉండాల్సిన అవసరం ఉంటే అలా ఉండేందుకు ఎంపిక చేసుకుంటాడు, తను అలా ఉంటాడని నిరూపించుకుంటాడు. ఇందుకు రుజువుగా ఆయనకు వైవిధ్యభరితమైన బిరుదులూ, ఆయనను వర్ణించేందుకు అనేక పదాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని: రోషముగల దేవుడు, న్యాయాధిపతి, కాపరి, ప్రార్థన ఆలకించువాడు, ప్రభువు [“సర్వాధిపతియైన ప్రభువు,” NW], తండ్రి, సైన్యములకధిపతి, బోధకుడు, సృష్టికర్త, విమోచకుడు, శ్రీమంతుడు [“సంతోషంగల దేవుడు, NW]. ఆయన తన ప్రేమపూర్వక ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఇవన్నీ అవుతాడు, ఇంకా అంత కన్నా ఎక్కువే అవుతాడు.—నిర్గమకాండము 34:14; న్యాయాధిపతులు 11:27; కీర్తన 23:1; 65:2; 73:28; 89:26; యెషయా 8:13; 30:20; 40:28; 41:14; 1 తిమోతి 1:8.
దేవుని వ్యక్తిత్వం గానీ ప్రమాణాలు గానీ మారుతూ ఉంటాయని దీనర్థమా? కానే కాదు. ఆయనను గురించి యాకోబు 1:17, “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు” అని చెబుతుంది. దేవుడు మారకుండానే, మారుతున్న పరిస్థితులతో ఎలా వ్యవహరించగలడు?
తమ పిల్లల కోసం వివిధ పాత్రలను నిర్వహిస్తూ వాళ్ళను శ్రద్ధగా చూసుకునే తల్లిదండ్రుల ఉదాహరణ, ఇదెలా సాధ్యమో చూపిస్తుంది. ఒక్కరోజులోనే ఒక తండ్రి/తల్లి వంట మనిషి, పని మనిషి, ఎలక్ట్రిషియన్, నర్సు, నేస్తం, సలహాలిచ్చే వ్యక్తి, బోధించే వ్యక్తి, శిక్షణనిచ్చే వ్యక్తి మొదలైన ఎన్నో పాత్రలను నిర్వహిస్తారు. తండ్రి/తల్లి ఆ పనులను చేస్తున్నప్పుడు తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం లేదు; ఆయా అవసరాలను బట్టి ఆయా పాత్రలను నిర్వహిస్తుంటారు. యెహోవా విషయం కూడా అంతే, ఆయన తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం లేదు. కాకపోతే ఆయన మరింత ఉన్నత స్థాయిలోని పాత్రలను నిర్వహిస్తున్నాడు. ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చడానికీ, తన సృష్టి యొక్క ప్రయోజనం కోసం తాను చేయగలవాటికి ఆయనకు పరిమితులేమీ లేవు.—రోమీయులు 11:33.
యెహోవా ప్రేమా కరుణా కలవాడనే హెబ్రీ, గ్రీకు లేఖనాలు వెల్లడి చేస్తున్నాయి. ఉదాహరణకు, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన మీకా అనే ప్రవక్త, “తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా?” అని యెహోవాను అడిగాడు. “ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు” అని కూడా తర్వాత తానే అన్నాడు. (మీకా 7:18) అలాగే, అపొస్తలుడైన యోహాను, “దేవుడు ప్రేమాస్వరూపి” అన్న ప్రసిద్ధిగాంచిన మాటలను వ్రాశాడు.—1 యోహాను 4:8.
మరొకవైపు, పశ్చాత్తాపం లేకుండా ఆయన నిబంధనలను మళ్ళీ మళ్ళీ మరెక్కువగా ఉల్లంఘించేవారికి, ఇతరులకు హాని చేసేవారికి సరైన తీర్పు విధించే నీతిమంతుడైన న్యాయాధిపతి యెహోవా అని హెబ్రీ లేఖనాలూ గ్రీకు లేఖనాలూ వెల్లడిచేస్తున్నాయి. “భక్తిహీనులనందరిని ఆయన [యెహోవా] నాశనము చేయును” అని కీర్తన రచయిత అన్నాడు. (కీర్తన 145:20) దీనికి సాదృశ్యంగా, “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును” అని యోహాను 3:36 అంటోంది.
లక్షణాల్లో ఏ మాత్రం మార్పులేనివాడు
యెహోవా దేవుని వ్యక్తిత్వం గానీ, ప్రేమ, వివేకం, న్యాయం, శక్తి అనే ఆయన మౌలిక లక్షణాలు గానీ మారలేదు. “యెహోవానైన నేను మార్పులేనివాడను” అని ఇశ్రాయేలీయులకు ఆయన చెప్పాడు. (మలాకీ 3:6) ఇవి, దేవుడు మానవులను సృష్టించి 3,500 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పిన మాటలు. దేవుడు చెప్పిన ఈ మాటలు నిజం. మొత్తం బైబిలును సునిశితంగా పరిశీలించినప్పుడు, దేవుడు తన ప్రమాణాల్లో గానీ లక్షణాల్లోగానీ మారడని వెల్లడవుతుంది. శతాబ్దాలు గడుస్తున్నా యెహోవా దేవుని వ్యక్తిత్వం అప్పుడూ ఇప్పుడూ మృదువైనదే, అది మారలేదు, మారవలసిన అవసరమూ లేదు.
బైబిలులో మొదటి నుండి చివరి వరకు వెల్లడవుతున్నట్లు, యెహోవా ఏదెను తోటలో మానవులతో వ్యవహరించినది మొదలుకొని, ఇప్పటివరకూ నీతి విషయంలో ఆయనకున్న పట్టు తగ్గనూ లేదు, మానవులపై ఆయనకున్న ప్రేమ ఎక్కువ కానూ లేదు. ఆయన వ్యక్తిత్వంలో తేడాలు ఉన్నట్లుగా బైబిలులోని వివిధ భాగాల్లో కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి, అవి ఆయన యొక్క మారని వ్యక్తిత్వంలోని వివిధ పార్శ్వాలు మాత్రమే. వివిధ పరిస్థితుల్లో, వివిధ వ్యక్తులకూ ఆయనకూ మధ్య జరిగిన వ్యవహారాల్లో అవి కనిపిస్తున్నాయి.
శతాబ్దాలుగా దేవుని వ్యక్తిత్వం మారలేదనీ భవిష్యత్తులోను మారబోదనీ లేఖనాలు స్పష్టంగా చూపుతున్నాయి. యెహోవా దేవుడు నిలకడా ఏకరీతీ గల సర్వోన్నతుడు. ఆయన అన్నివేళలా ఆధారపడదగినవాడు, నమ్మదగినవాడు. కనుక, ఆయనను మనం ఎల్లవేళలా ఆశ్రయించగలం.
[12, 13వ పేజీలోని చిత్రాలు]
సొదొమ గొమొర్రాలను నాశనం చేసిన దేవుడే . . .
. . . నీతివంతమైన క్రొత్త లోకాన్నీ తెస్తాడు