నేను ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకోవాలా, వద్దా?
నేను ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకోవాలా, వద్దా?
ఈ క్రింది కథ ఒక డాక్టరు చెప్పిన వాస్తవిక గాథ. తరచూ తలెత్తే ఒక బాధాకరమైన సమస్యను ఈ గాథ ప్రతిబింబిస్తుంది.
ఆ కుటుంబమంతా విచారంగా ఉంది. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా విచారంగానే ఉన్నారు. “ఈయనకు రక్తస్రావం వెంటనే ఆగకపోతే, రక్తం ఎక్కించడాన్ని గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది” అని ఆ డాక్టర్ అన్నారు.
అనేక వారాలుగా ఆ రోగికి ప్రేగులో నుండి రక్తం నెమ్మదిగా పోతూనే ఉంది. పరీక్షలు జరిపినప్పుడు, జీర్ణకోశపు వాపుందని తెలిసింది. “మీరు వేరే ఏ మందులూ వాడడం లేదు కదా?” అని నిరాశచెందిన ఆ డాక్టర్ ఆ రోగిని అడిగారు.
“కీళ్ళవాతం కోసం బజారులో దొరికే ఈ ప్రకృతిసిద్ధమైన మందును తప్పించి మరే మందునూ తీసుకోవడం లేదు” అని ఆ రోగి అన్నాడు.
ఆ మాటలు వినడంతో డాక్టర్ చెవులు నిక్కబొడుచుకున్నాయి. “నన్ను చూడనివ్వండి” అని అంటూ ఆయన ఆ మందు తీసుకుని, ఆ మందులో ఉండే మిశ్రమాలను గురించిన లేబల్‌ను చూశాడు. తను దేని కోసం చూస్తున్నాడో అదే ఆయనకు కనిపించింది. అందులో అసీటల్‌సలసిలిక్ ఆసిడ్ ఉంది ! (ఆస్పిరిన్ రసాయనిక నామం అసీటల్‌సలసిలిక్ ఆసిడ్) ఇక సమస్య పరిష్కరించబడినట్లే. ఆ రోగి డాక్టర్ నిర్దేశాన్ననుసరించి, ఆస్పిరిన్‌ను తీసుకోవడం మానేసి, ఉదరమును బాగు చేసే మందునూ, ఐరన్‌నూ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు, రక్తస్రావం తగ్గింది, రక్త పరిమాణం నెమ్మదిగా మామూలు స్థాయికి చేరుకుంది.
రక్తస్రావానికి కారణమౌతున్న మందులు
కొన్ని మందుల వల్ల జీర్ణకోశములోను ప్రేగుల్లోను రక్తస్రావం అవుతుంది. అలా మందుల మూలంగా రక్తస్రావం కావడం, నేడు వైద్యసంబంధమైన తీవ్ర సమస్యగా ఉంది. ఇలాంటి సమస్యలకు అనేక మందులు కారణమౌతున్నప్పటికీ, కీళ్ళవాతానికీ నొప్పికీ వాడే మందులే ఎక్కువగా కారణమౌతున్నాయి. వీటి కోవలో, నాన్‌స్టెరోయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందులు (NSAIDS) కూడా ఉన్నాయి. ఒక్కో దేశాన్ని బట్టి వాటి పేర్లు వేరు వేరుగా ఉండవచ్చు.
ఆస్పిరిన్ మెడికల్ షాప్‌లలో దొరుకుతుంది. ప్రతిరోజూ ఆస్పిరిన్ ఉపయోగించేవారి సంఖ్య ఈ మధ్య అనేక దేశాల్లో బాగా పెరిగిపోతోంది. ఎందుకని?
ఆస్పిరిన్ అంటే ఉత్సాహం
“ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు” అని 1995లో హార్వర్డ్ హెల్త్ లెటర్ నివేదించింది. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు జరిగిన అనేక అధ్యయనాలను ఉటంకిస్తూ, “గుండెపోటు గానీ స్ట్రోక్‌గానీ వచ్చినవారు, ఆంజైనా (పదే పదే వచ్చే ఊపిరి ఆడని నొప్పి)తో బాధపడుతున్నవారు, హృదయ ధమనులకు బైపాస్ సర్జరీ చేయించుకున్నవారు, దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఆస్పిరిన్ టాబ్లెట్ ఒకటి గానీ సగం గానీ తీసుకోవాలి. ఆస్పిరిన్ వల్ల అలెర్జీ ఏమీ కలగకపోతే మాత్రమే అలా తీసుకోవాలి” * అనే నిర్ధారణకు పరిశోధకులు వచ్చారు.
గుండెపోటు రాగల ప్రమాదం ఉన్న 50 ఏండ్లు పైబడిన మగవాళ్ళూ, ఆడవాళ్ళూ ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఇతర పరిశోధకులు కూడా చెబుతున్నారు. ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకుంటే పెద్ద ప్రేగుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయనీ, మధుమేహవ్యాధితో బాధపడుతున్న రోగులు ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుందనీ తర్వాత జరిగిన అధ్యయనాలు సూచించాయి.
ఆస్పిరిన్ ఈ ప్రయోజనాలను ఎలా చేకూర్చుతుంది? ఎలా అన్నది పూర్తిగా తెలియకపోయినప్పటికీ, రక్తంలోని ఫలకాలు ఒకదానికొకటి అతిగా అంటుకోకుండా చేసి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుందని రుజువులు చూపిస్తున్నాయి. గుండెలోను, మెదడులోను ఉండే చిన్న ధమనులు మూసుకుపోవడాన్ని నివారిస్తూ, ప్రాముఖ్యమైన అవయవాలు పాడవ్వకుండా ఉంచుతుందని అనుకుంటున్నారు.
ఆస్పిరిన్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ,
ప్రతి ఒక్కరూ దీనిని ఎందుకు తీసుకోవడం లేదు? దాని గురించి ఇంకా చాలా విషయాలు తెలియకపోవడమే ఒక కారణం. దీనిని ఎంత పరిమాణంలో తీసుకోవాలో కూడా తెలియదు. రోజుకొక ఆస్పిరిన్ టాబ్లెట్‌ని తీసుకోవాలని కొందరు నిపుణులు అంటే, రెండు రోజులకొక చిన్న ఆస్పిరిన్ టాబ్లెట్‌ను తీసుకోవాలని మరి కొందరు నిపుణులు అంటారు. ఆడవాళ్ళు తీసుకోవాల్సిన టాబ్లెట్ పరిమాణానికీ, మగవాళ్ళు తీసుకోవాల్సిన టాబ్లెట్ పరిమాణానికీ తేడా ఉందా? దీని గురించి డాక్టర్లకు ఖచ్చితంగా తెలియదు. ఒకవైపు, ఎంటరిక్ పూత ఉన్న ఆస్పిరిన్ కాస్త సహాయకరమైనదని తలంచబడుతున్నప్పటికీ, దాని వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది ఇప్పటికీ వివాదాంశంగానే ఉంది.జాగ్రత్తపడేందుకు కారణాలు
అమెరికన్ ఇండియన్‌లు ఆస్పిరిన్‌ని విలో చెట్టు బెరడు నుండి తీసేవారు. నిజానికి, ఆస్పిరిన్ ప్రకృతిసిద్ధమైన పదార్థమే అయినప్పటికీ, దానివల్ల అనేక సైడ్ ఎఫక్ట్‌లు కలుగుతాయి. కొంతమంది ప్రజల్లో, ఆస్పిరిన్ మూలంగా రక్తస్రావం జరగడమే కాక, మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఆస్పిరిన్ వల్ల త్వరగా రియాక్షనయ్యే వారికి అలెర్జీ కూడా వస్తుంది. కనుక ఆస్పిరిన్‌ను ప్రతిరోజూ తీసుకోవడం అందరికీ మంచిది కాదన్నది ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే, గుండెపోటు గానీ, స్ట్రోక్ గానీ, మరితర గంభీరమైన ఆరోగ్య సమస్యలు గానీ రాగల ప్రమాదమున్న వ్యక్తులు ఆస్పిరిన్‌ని ప్రతిరోజూ తీసుకోవాలనుకుంటే, దాని వల్ల రాగల ప్రమాదాల గురించీ, ప్రయోజనాల గురించీ తమ డాక్టర్‌ను అడగాలి. తనకు ఆస్పిరిన్‌ను భరించలేని స్థితిగానీ, రక్తస్రావ సమస్యలుగానీ లేవని, కడుపులోను జీర్ణకోశంలోను ప్రేగుల్లోను సమస్యలేమీ లేవని నిర్ధారించబడితే మాత్రమే ఆస్పిరిన్‌ని వాడాలి. ఆస్పిరిన్ మూలంగా మరితర సమస్యలేమైనా రాగలవా, లేక తాను ఇప్పటికే వేరే మందులేమైనా తీసుకుంటున్నట్లయితే ఆ మందులతోపాటు ఆస్పిరిన్‌ని తీసుకోవచ్చా లేదా అన్నది ఆస్పిరిన్ తీసుకోవడం మొదలుపెట్టక ముందే డాక్టర్‌తో చర్చించాలి.
ముందు పేర్కొన్నట్లు, ఆస్పిరినూ, ఇతర మందులూ తీవ్రంగా రక్తస్రావం కలగడానికి కారణం కాగలవు. ఆ మందుల వల్ల లోపల రక్తస్రావం నెమ్మనెమ్మదిగా మొదలై బయటికి కనిపించకపోవచ్చు, కాలం గడుస్తున్న కొద్దీ, అది అధికం కావచ్చు. ఇతర మందులను గురించి ముఖ్యంగా, వాపు తగ్గించే మందులను గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు వాటిలో దేనినైనా ఉపయోగిస్తున్నట్లయితే, మీ డాక్టర్‌కి తప్పకుండా తెలియజేయండి. సర్జరీ చేయించుకునే ముందు ఈ మందులను ఆపివేయడమే మంచిది. అలాగే, మీ రక్త పరిమాణం ఎంత ఉందన్నది రెగ్యులర్‌గా పరీక్ష చేయించుకోవడం కూడా సహాయకరం కావచ్చు.
భవిష్యత్తులో రాగల సమస్యల నుండి మనం తప్పించుకోవాలనుకుంటే, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అన్న బైబిలు సామెతను ఆచరణలో పెడతాము. (సామెతలు 22:3) వైద్య సంబంధమైన ఈ విషయంలో, మనం బుద్ధిగలవారమై ఉండి, ఆరోగ్య సమస్యలను తప్పించుకుందాం.
[అధస్సూచి]
^ తేజరిల్లు! ప్రత్యేకించి ఏ వైద్య చికిత్సనూ సిఫారసు చేయదు.
[20, 21వ పేజీలోని బాక్సు/చిత్రం]
ప్రతిరోజూ ఆస్పిరిన్ తీసుకునే విషయాన్ని పరిగణనలోకి ఎవరు తీసుకోవచ్చంటే
● కొరొనరీ హార్ట్ డిసీజ్ (హృదయ ధమనులకు సంబంధించిన వ్యాధి) ఉన్నవారు లేదా గళ ధమనులు (మెడలోని ముఖ్య రక్తనాళాలు) సంకుచితంగా ఉన్న వ్యక్తులు.
● త్రోంబోటిక్ స్ట్రోక్ (రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చే స్ట్రోక్) లేదా ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిన వ్యక్తులు. (అకస్మాత్తుగా కొన్ని క్షణాలపాటు స్ట్రోక్ లాంటిది రావడమే ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్).
●కార్డియోవాస్కులార్ డిసీజ్ (హృదయ, రక్తనాళాల వ్యాధి) రావడానికి కారణమయ్యే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్న 50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళు. [పొగత్రాగడం, అధిక రక్తపోటు, కొలొస్ట్రోల్ లెవెల్ మొత్తమ్మీద అధికం కావడం, తక్కువ హెచ్‌డిఎల్ కొలొస్ట్రోల్, అమిత స్థూలకాయము, కూర్చుని చేసే పని, అమిత మద్యపానం, స్ట్రోక్ గానీ కొరొనరీ డిసీజ్ గానీ మునుపు వచ్చి ఉండడం (55 ఏండ్ల వయస్సు కన్నా ముందే గుండెపోటు వచ్చి ఉండడం) మొదలైనవి కార్డియోవాస్కులార్ డిసీజ్‌కి కారణమవుతాయి.]
● పైన పేర్కొన్నవాటిలో రెండో లేదా అంతకన్నా ఎక్కువో ప్రమాద కారకాలు ఉన్న, 50 ఏళ్ళు పైబడిన స్త్రీలు.
ఈ విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
[చిత్రసౌజన్యం]
మూలం: Consumer Reports on Health