కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను విదేశంలో నివసించాలా?

నేను విదేశంలో నివసించాలా?

యువత ఇలా అడుగుతోంది . . .

నేను విదేశంలో నివసించాలా?

“మరెక్కడికన్నా వెళ్ళి జీవించాలని నేను కోరుకున్నాను.”​—సామ్‌.

“నాకు చాలా జిజ్ఞాస ఉండేది. క్రొత్తవాటిని చూడాలని కోరుకునేదాన్ని.”​—మారన్‌.

“నేను కొంతకాలం ఇంటి నుండి దూరంగా ఉండడం నాకు మంచిది అని నా సన్నిహిత స్నేహితుడు నాకు చెప్పాడు.”​—ఆండ్రేయస్‌.

“సాహస కృత్యాలేమన్నా చేయాలన్న ఆతృత నాకుండేది.”​—హాగన్‌.

విదేశానికి వెళ్ళాలనీ, కనీసం కొంతకాలమన్నా విదేశంలో జీవించాలనీ మీరు కలలు కంటున్నారా? ప్రతి సంవత్సరం, వేలాది మంది యౌవనస్థులు విదేశాలకు వెళ్ళి రాగల్గుతున్నారు. ఆండ్రేయస్‌, తన విదేశీ అనుభవాన్ని గురించి చెబుతూ, “మళ్ళీ వెళ్ళడం నాకిష్టమే” అని అన్నాడు.

కొంతమంది యౌవనస్థులు డబ్బు సంపాదించేందుకు, లేదా విదేశీ భాషను నేర్చుకునేందుకు, విదేశంలో కొన్నాళ్ళు ఉండాలని వెళ్తారు. ఉదాహరణకు, అనేక దేశాల్లో, ఓ పెయర్‌ పద్ధతి ఆచరణలో ఉంది. ఓ పెయర్‌ పద్ధతి అంటే, ఏదైన ఒక కుటుంబం విదేశాల నుండి వచ్చే యౌవనస్థులకు వసతిని భోజనాన్ని ఇస్తుంది. దానికి ప్రతిఫలంగా ఆ యౌవనస్థులు ఆ కుటుంబం కోసం ఇంటి పనులు చేసి పెడతారు, ఖాళీ సమయాల్లో అక్కడి స్థానిక భాషను నేర్చుకోగల్గుతారు. అయితే, విద్యను ఆర్జించేందుకు విదేశానికి వెళ్ళే యౌవనస్థులు కూడా ఉన్నారు. తమ కుటుంబానికి ఆర్థిక మద్దతు ఇవ్వగల్గేందుకు ఏదైన ఒక పనిని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. మరి కొందరు, చదువు అయిపోయిన తర్వాత ఏమి చెయ్యాలో తెలియక, సెలవుల్లో సరదాగా గడపడం కోసం కూడా విదేశాలకు వెళ్తారు.

ఆసక్తికరమైన ఒక విషయం ఏమిటంటే, కొందరు క్రైస్తవ యౌవనస్థులు, తమ పరిచర్యను విస్తృతం చేసేందుకు సువార్తికులు తక్కువగా ఉన్న దేశాలకు తరలివెళ్ళారు. విదేశాలకు తరలి వెళ్ళడానికి కారణమేదైనప్పటికీ, విదేశంలో జీవించడం వల్ల, వయోజనులుగా మీ సొంత కాళ్ళపై నిలబడేందుకు కావలసిన విలువైన ఒక పాఠాన్ని మీరు నేర్చుకోవచ్చు. వివిధ సంస్కృతులను గురించిన మీ అవగాహన పెరుగుతుంది. మీరు విదేశీ భాషపై పట్టు సాధించవచ్చు, అది మీ ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.

అయితే, విదేశాల్లో జీవించడమనేది ఎల్లవేళలా మంచి అనుభవాన్నే ఇవ్వదు. ఉదాహరణకు, ఎక్స్‌చేంజ్‌ స్టుడెంట్‌గా సూజాన ఒక సంవత్సరం గడిపింది. (విదేశంలోని ఒక విద్యార్థిని ఈ దేశంలోని ఒక విద్యా సంస్థలోకి తీసుకున్నట్లయితే, దానికి బదులుగా, ఈ దేశం నుండి ఆ దేశంలోని విద్యా సంస్థకు పంపబడే విద్యార్థిని ఎక్స్‌చేంజ్‌ స్టుడెంట్‌ అంటారు.) “అక్కడి జీవితం ఆద్యంతం అద్భుతంగా ఉంటుందని నేను నమ్మాను. కాని నిజానికి అలా లేదు” అని సుజానా అంటోంది. అలా వెళ్ళిన కొందరు యౌవనస్థులు మోసపోయారు. మరి కొందరు గంభీరమైన సమస్యల్లో చిక్కుకున్నారు కూడా. కనుక, మీరు విదేశానికి వెళ్ళడానికి సన్నద్ధులయ్యే ముందు, అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చే లాభనష్టాలను గురించి ఆలోచించడం వివేకం.

మీ ఉద్దేశాలను విశ్లేషించుకోండి

విదేశానికి వెళ్ళడం వల్ల వచ్చే లాభనష్టాలను గురించి ఆలోచించుకోవడంలో, నిశ్చయంగా మీరు అక్కడికి వెళ్ళాలని కోరుకునేలా మిమ్మల్ని పురికొల్పుతున్నదేమిటో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడం కూడా ఇమిడి ఉంది. మీరు ఆధ్యాత్మిక ఆసక్తులతో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు గానీ, కుటుంబ బాధ్యతలను నెరవేర్చేందుకు గానీ విదేశాలకు వెళ్ళడం వేరు. కానీ మొదట్లో పేర్కొన్నటువంటి యౌవనస్థుల్లా, అనేకులు కేవలం సాహస కృత్యాలను చేయడం కోసం, లేదా మరింత స్వేచ్ఛగా ఉండడం కోసం, సరదా కోసం విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం పూర్తిగా తప్పని కాదు. యౌవనులు ‘తమ యౌవనంలో సంతోషించాలి’ అనే ప్రసంగి 11:9 యౌవనస్థులను ప్రోత్సహిస్తున్నది. అయితే, “నీ హృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము” అని 10వ వచనం హెచ్చరిస్తోంది.

మీరు మీ తల్లిదండ్రులు పెట్టే నియమాలను పాటించనవసరం లేకుండా స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతోనే విదేశానికి వెళ్ళాలనుకుంటున్నట్లయితే, మీ జీవితాన్ని ‘చెరిపే’ క్లిష్టమైన పరిస్థితులను కొనితెచ్చుకుంటున్నారేమో. తప్పిపోయిన కుమారుడ్ని గురించి యేసు చెప్పిన ఉపమానం మీకు గుర్తుందా? ఆ ఉపమానంలో, ఒక యువకుడు తన స్వార్థముతో విదేశానికి బయల్దేరాడు. తనకు మరింత స్వేచ్ఛ కావాలన్న ఉద్దేశంతోనే అతడలా బయల్దేరాడన్నది స్పష్టం. అయితే ఎంతో కాలం గడవక ముందే, అతడికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అతడు బీదవాడయ్యాడు, ఆకలితో నకనకలాడాడు, ఆధ్యాత్మికంగా రోగి అయ్యాడు.​—లూకా 15:11-16.

ఇంట్లో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు విదేశానికి తరలి వెళ్ళాలని అనుకునేవారు కూడా ఉన్నారు. వాట్స్‌ అప్‌ అనే తన పుస్తకంలో, హైక బెర్గ్‌, “మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకోవడానికి కారణం, మీకు సంతోషం లేకపోవడమూ, . . . వేరే ఎక్కడికన్నా వెళ్తే అన్నీ చక్కబడుతాయని మీరనుకోవడమూనే అయితే, ఈ తలంపును ఇంతటితో వదులుకోండి!” అని వ్రాశారు. నిజానికి, సమస్యలను ముఖాముఖిగా ఎదుర్కోవడమే మేలు. మనకు ఇష్టంలేని పరిస్థితుల నుండి పారిపోవడం ద్వారా ఏమీ సాధించలేము.

విదేశాలకు వెళ్ళాలని యౌవనస్థులను పురికొల్పే ఇతర ప్రమాదకరమైన కారకాలు అత్యాశ, ధనాపేక్ష. అనేక మంది యౌవనస్థులు, సంపన్నులమవ్వాలని కోరుకోనారంభించి, పారిశ్రామికీకరణ చెందిన దేశాల్లోని జీవితం గురించిన ఉత్తేజకరమైన, అవాస్తవికమైన తలంపులను పెంచి పోషించుకుంటుంటారు. పాశ్చాత్య దేశస్థులందరూ సంపన్నులేనని కొందరు అనుకుంటారు. అదెంత మాత్రమూ వాస్తవం కాదు. చాలా మంది యౌవనస్థులు తమకు పరిచయంలేని పాశ్చాత్య దేశానికి వెళ్ళిన తర్వాత, పేదరికంలో చిక్కుకుని దానినుండి బయటపడడానికి పెనుగులాడుతుంటారు. * “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయ నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని బైబిలు హెచ్చరిస్తుంది.​—1 తిమోతి 6:10.

మీరు సిద్ధంగా ఉన్నారా?

విదేశంలో వచ్చే కష్టాలనూ, సమస్యలనూ, సంఘర్షణలనూ ఎదుర్కొనేందుకు కావలసినంత పరిపక్వతను మీరు నిజంగా పొందారా లేదా అన్నది పరిగణించవలసిన మరొక విషయం. మీరు రూమ్‌మేట్‌తో లేదా ఒక కుటుంబంతో కలిసి జీవించవలసి వస్తుంది, వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు మీరు సర్దుకుపోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఇంట్లో అందరితో సర్దుకుపోగల్గుతున్నారా? మీరు ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యుల మేలును పట్టించుకోరనీ, మీరు స్వార్థపరులనీ మీ తల్లిదండ్రులు అంటున్నారా? తినే ఆహారానికి వంకలు పెట్టే అలవాటు మీకుందా? ఇంటి పనుల్లో సహాయపడడానికి మీరెంత సుముఖత చూపుతున్నారు? ఇవి మీకు ఇప్పుడు కష్టమైతే, విదేశంలో ఇంకెంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి !

మీరు ఒక క్రైస్తవుడైతే, మీ ఆధ్యాత్మికతను మీ అంతట మీరు కాపాడుకోగల్గుతారా? బైబిలు అధ్యయనాన్నీ, క్రైస్తవ కూటాలనూ, ప్రకటనా పనినీ నిర్లక్ష్యం చేయవద్దని మీ తల్లిదండ్రులు మీకు తరచూ గుర్తు చేయవలసి వస్తోందా? మీ స్వదేశంలో మీకు ఎదురవ్వని ఒత్తిళ్ళూ ప్రలోభాలూ విదేశంలో ఎదురైతే వాటిని ఎదిరించేంతటి ఆధ్యాత్మిక బలం మీకుందా? ఉదాహరణకు, ఒక ఎక్స్‌చేంజ్‌ స్టుడెంట్‌కి విదేశంలోని పాఠశాలకు వెళ్ళిన మొదటిరోజే, చట్టవిరుద్ధమైన మత్తుమందులు ఎక్కడ దొరుకుతాయన్నది తోటి పిల్లలు తెలియజేశారు. తర్వాత, ఆయన తోటి విద్యార్థిని తనతో బయటికి రమ్మని ఆయనను కోరింది. తన దేశంలోని అమ్మాయిలు అబ్బాయిలపై తమ ఆసక్తిని అంత నేరుగా ఎన్నడూ వ్యక్తం చేయరు. యూరప్‌కి తరలి వెళ్ళిన ఒక ఆఫ్రికా యౌవనస్థుడు, “మా దేశంలో అశ్లీలమైన చిత్రాలు బహిరంగంగా ఎక్కడా కనిపించవు. కాని ఇక్కడ అన్ని చోట్లా అవే కనిపిస్తున్నాయి” అని అంటున్నాడు. ఒకరు “విశ్వాసమందు స్థిరులై” ఉండకపోతే, విదేశానికి వెళ్ళడం వల్ల వారి ఆధ్యాత్మిక ఓడ బద్ధలైపోగలదు.​—1 పేతురు 5:9

వాస్తవాలను తెలుసుకోండి !

విదేశానికి వెళ్ళే ముందు, మీరు వెళ్ళే దేశాన్ని గురించిన వాస్తవాలనన్నింటినీ తెలుసుకోవలసిన అవసరముంది. ప్రత్యక్షంగా తెలియనివాళ్ళు చెప్పే సమాచారంపై ఆధారపడకండి. ఉదాహరణకు, మీరు స్టుడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్‌ గురించి ఆలోచిస్తున్నట్లయితే, దానికెంత మూల్యం చెల్లించవలసి వస్తుందన్నది ముందుగానే తెలుసుకోవాలి. దానికి వేవేల డాలర్లు చెల్లించవలసి ఉంటుందని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు విదేశంలో పొందబోయే చదువుకు స్వదేశంలో గుర్తింపు ఉంటుందా, ఉండదా అన్నది కూడా మీరు తెలుసుకోవలసిన అవసరముంది. అలాగే, ఆ దేశాన్ని గురించి, అంటే, దాని చట్టాల గురించి, సంస్కృతి గురించి, అక్కడి ఆచారాల గురించి వీలైనన్ని వివరాలను కూడా ప్రత్యక్షంగా తెలిసినవారిని అడిగి తెలుసుకోండి. అక్కడ జీవించడం వల్ల ఏయే మూల్యాలు చెల్లించవలసి ఉంటుంది? మీరు ఏయే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? అక్కడ ఆరోగ్య సమస్యలేమైనా ఎదురు కాగలవా? ఈ వివరాల కోసం, అక్కడ నిజంగా నివసించిన ప్రజలతో మాట్లాడడం సహాయకరంగా ఉంటుంది.

అక్కడ ఉండే వసతుల గురించి కూడా ఆలోచించాలి. ఎక్స్‌చేంజ్‌ స్టుడెంట్స్‌కి వసతినీ భోజనాన్నీ ఇచ్చే కుటుంబాలు మామూలుగా తాము చేసే ఉపకారానికి ప్రతిఫలంగా డబ్బును ఆశించరు. అలాగైనప్పటికీ, బైబిలు సూత్రాలకు గౌరవమివ్వని వ్యక్తులతో నివసించడమంటే చాలా ఒత్తిళ్ళూ బాధలూ కలగవచ్చు. స్నేహితులతో లేదా బంధువులతో ఉండడం ప్రత్యామ్నాయం కావచ్చు. అయితే, తమతో ఉండమని వాళ్ళు మిమ్మల్ని బలవంతపెట్టినప్పటికీ, వాళ్ళకు మీరు ఒక భారంగా కాకుండా ఉండేందుకు జాగ్రత్తపడండి. మీరు వాళ్ళకు భారమైతే, మీకు వాళ్ళతో ఉన్న సంబంధం చెడిపోవచ్చు, లేదా పూర్తిగా పాడైపోవచ్చు.​—సామెతలు 25:17.

మీరు విదేశంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాలని పథకం వేసుకుంటున్నట్లయితే, క్రైస్తవులుగా మీరు అధికారులకు విధేయత చూప బద్ధులై ఉన్నారన్న విషయాన్ని మరిచిపోకండి. (రోమీయులు 13:​1-7) మీరు ఆ దేశంలో పని చేయడానికి అక్కడి చట్టం అనుమతిస్తుందా? ఒకవేళ అనుమతిస్తున్నట్లయితే, ఎలాంటి షరతుల క్రింద పనిచేయడానికి అనుమతిస్తుంది? మీరు చట్టవిరుద్ధంగా పని చేస్తే, నిజాయితీపరుడైన క్రైస్తవుడన్న మీ మంచి పేరును మీరు కోల్పోతారు. అప్పుడిక ఆక్సిడెంట్‌ ఇన్సురెన్స్‌ మొదలైన ప్రాథమిక సంరక్షణలు మీకు దొరక్కుండా పోతాయి. ఒకవేళ మీరు చట్టబద్ధంగానే పనిచేస్తున్నప్పటికీ, జాగ్రత్తగా ఉండాలి, సూక్ష్మబుద్ధిని ఉపయోగించాలి. (సామెతలు 14:​15) నీతినియమాలు లేని యజమానులు విదేశీయులను తరచూ మోసం చేస్తుంటారు.

ఒక నిర్ణయం తీసుకోవడం

విదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడమంటే చిన్న విషయం కాదన్నది స్పష్టం. దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మీరూ మీ తల్లిదండ్రులూ కూర్చుని, కొంచెం సమయం తీసుకుని, విదేశానికి పోవడం వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోండి. రాగల ప్రమాదాలను గురించి చర్చించండి. విదేశానికి వెళ్ళాలన్న అమితోత్సాహంతో, ప్రస్తుత పరిస్థితులను గురించి, మీరు ఇప్పుడు విదేశానికి వెళ్తే కలుగగల మంచి చెడులను గురించి వివేచించకుండా ఉండకండి. మీరు మీ తల్లిదండ్రులతో మీ లక్ష్యాలను గురించి విశ్లేషిస్తున్నప్పుడు మీ లక్ష్యాలేమిటో నిజాయితీగా వ్యక్తీకరించండి. మీ తల్లిదండ్రులు చెప్పేది శ్రద్ధగా ఆలకించండి. మీరు విదేశానికి వెళ్ళి ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ, ఎంతకాదన్నా, తమకు మీ మీద బాధ్యత ఉందనే వాళ్ళు భావిస్తారు. మీరు అక్కడికి వెళ్ళాక కూడా మీకు మీ తల్లిదండ్రుల ఆర్ధిక సహాయం అవసరం కావచ్చు.

ఈ విషయాలనన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత, మీరు అసలు విదేశానికి వెళ్ళడమే వివేకవంతమైన పని కాదని గానీ, లేదా ఇప్పట్లో వెళ్ళడం వివేకవంతమైన పని కాదని గానీ తేలవచ్చు. అలా తెలిసినప్పుడు నిరాశ కలుగవచ్చు, కానీ మీరు చేయగల ఉత్తేజకరమైన పనులు మరెన్నో ఉన్నాయి. ఉదాహరణకు, మీ స్వదేశంలో ఉన్న సందర్శించదగిన ఆసక్తికరమైన అనేక స్థలాలకు వెళ్ళే అవకాశాలను గురించి మీరు ఆలోచించారా? లేదా, విదేశీ భాషను ఇప్పుడే నేర్చుకోనారంభించడాన్ని గురించి ఆలోచించారా? ఇప్పుడు కాకపోతే, కొన్నాళ్ళ తర్వాతైనా విదేశానికి వెళ్ళే అవకాశం రావచ్చు.

అయితే, విదేశానికి వెళ్ళాలన్నదే మీ నిర్ణయమైతే అప్పుడు ఏమిటి? మీరు విదేశానికి వెళ్ళాక అక్కడ విజయవంతంగా ఎలా కొనసాగవచ్చన్నది తర్వాతి సంచిక చర్చిస్తుంది.

[అధస్సూచి]

^ వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన కావలికోట జనవరి 1, 1992వ సంచికలోని “సుసంపన్నమైన దేశమునకు కదలివెళ్లుటలోని తగులుబడిని యెంచిచూచుకొనుట” అనే శీర్షికను చూడండి.

[15వ పేజీలోని చిత్రం]

కొందరు యౌవనస్థులు రాజ్య ప్రకటనా పనిని విస్తృతపర్చేందుకు విదేశాలకు వెళ్తారు

[16వ పేజీలోని చిత్రం]

విదేశానికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనాలను గురించీ ప్రమాదాలను గురించీ మీ తల్లిదండ్రులతో మాట్లాడండి