కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిణామ సిద్ధాంతం తర్కబద్ధమైనదేనా?

పరిణామ సిద్ధాంతం తర్కబద్ధమైనదేనా?

పరిణామ సిద్ధాంతం తర్కబద్ధమైనదేనా?

నేడు, పరిణామ సిద్ధాంతాన్ని ప్రబలం చేసే వాళ్ళు అది వాస్తవమని చెబుతారు. అయితే, తరచూ పరిణామం గురించి వాళ్ళు చెప్పే మాటలు ఎంత తర్కబద్ధమైనవి? ఈ క్రింది ఉదాహరణలను చూడండి.

సాలె పురుగులు తయారుచేసే పట్టు, అత్యంత బలమైన పదార్థాల్లో ఒకటి. న్యూ సైంటిస్ట్‌ చెబుతున్నదాని ప్రకారం, “ఒక్కో దారాన్ని అది ఉన్నదాని కన్నా 40 శాతం ఎక్కువ పొడవు వరకు సాగదీయవచ్చు. అది ఉక్కు భరించగల దానికన్నా నూరురెట్లు ఎక్కువ శక్తిని భరించి తెగిపోకుండా ఉండగలదు.” ఇంత అసాధారణమైన దారం ఎలా తయారవుతుంది? సాలె పురుగు శరీరంలో ఉండే చిన్ని నాళాల్లో, చిక్కగాను జిగటగాను ద్రవరూపంలో ఉండే ప్రోటీన్లు ప్రవహిస్తుంటాయి. ఆ ప్రోటీన్లలోని అణువుల క్రమంలో మార్పులు జరిగి, అవి గట్టి దారంగా మారుతాయి అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తుంది.

న్యూ సైంటిస్ట్‌ పత్రిక, “అత్యంత నిపుణుడైన రసాయనశాస్త్రవేత్త కూడా రూపొందించలేని సాంకేతిక పద్ధతులను సాలెపురుగు రూపొందించింది” అనే నిర్ధారణకు వచ్చింది. మానవుడు ఇంతవరకూ అర్థం చేసుకోలేని సంకీర్ణమైన ఉత్పాదనకు సంబంధించిన సాంకేతిక పద్ధతులను సాలెపురుగు రూపొందించింది అన్నది తలంచశక్యమైనదేనా?

కాలిఫోర్నియాలోని యూనివర్సిటీకి చెందిన లా ప్రొఫెసర్‌ అయిన ఫిలిప్‌ ఇ. జాన్సన్‌, ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ అనే పత్రికలో, తాను వ్రాసిన ఒక శీర్షికలో, పరిణామ సిద్ధాంతానికి రుజువులు లేకపోయినా, దాన్ని సమర్ధించేవారు దాన్ని ప్రశ్నించేవారిని ఎగతాళి చేస్తారు అని అంటున్నారు. “పరిణామ సిద్ధాంతానికి రుజువులను చూపించడం చాలా కష్టం కనుక దాన్ని సమర్థించేవారు, దాని గురించి నిజాయితీగా చర్చించేందుకు ఇష్టపడరు. అలా చర్చలు జరిగితే, తమ గురించి లోకానికి ఉన్న మంచి అభిప్రాయం ఎక్కడ దెబ్బ తింటుందో అని వాళ్ళ భయం” అని ఆ శీర్షిక వ్యాఖ్యానిస్తోంది.

పరిణామ సిద్ధాంతం తర్కబద్ధమైనది కాదనేందుకు మొక్కలు మరొక ఉదాహరణ. మరాకో దేశంలో, శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుపుతూ త్రవ్వకాలు జరిపినప్పుడు, ఆర్కియోప్టరిస్‌ మొక్కల 150 శిలాజాలు వెలికి వచ్చాయి. ఆ మొక్కలు, “విత్తనాలుగల మొదటి మొక్కలకు దగ్గరి బంధువులు, నేటి చెట్ల పూర్వికులు” అని లండన్‌లోని ద డెయిలీ టెలెగ్రాఫ్‌ చెబుతుంది. ఈ మొక్క, “ఆకులను, కొమ్మలను కనిపెట్టి, ఆధునిక ప్రపంచానికి ఒక ఆకృతి వచ్చేందుకు సహాయపడింది” అని ఆ వార్తాపత్రిక యొక్క సైన్స్‌ ఎడిటర్‌ ఉద్ఘాటించారు. “కనిపెట్టడం” అంటే, “ఆలోచించి కనిపెట్టడం” అన్నమాట. దేన్నైనా కనిపెట్టాలంటే ఆలోచించే సామర్థ్యం ఉండాలి, మరి ఒక మొక్కకు అది ఉందనుకోవడం తర్కబద్ధమేనా?

మనం ‘మన ఆలోచనా సామర్థ్యాలను కాపాడుకోవాలి,’ అని మనం సొంతగా ఆలోచించుకోవాలి అని అత్యంత వివేకం గలవారిలో ఒకరైన సొలొమోను మనకు సలహా ఇస్తున్నాడు. మనం అలా చేయవలసిన అవసరం మునుపెన్నటి కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది.​—సామెతలు 5:2, NW.