కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

పిల్లలకు పనులు

“పిల్లలు ఇంటి పనుల్లో తోడ్పాటునిస్తుండడంవల్ల, అనేక పనులతో సతమతమైపోయే నేటి తల్లిదండ్రులు కాస్త విశ్రాంతిని పొందుతున్నారు” అని ద టొరొంటో స్టార్‌ నివేదిస్తోంది. “పిల్లల దృష్టిలో” పనులు “అంత ప్రాముఖ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి వాళ్ళు తమ సొంత కాళ్ళపై నిలబడగలమన్న నమ్మకాన్నిస్తాయి, వారి ఆత్మగౌరవాన్ని పెంచుతాయి” అని పొజిటివ్‌ డిసిప్లీన్‌ అనే పుస్తక రచయితయైన జేన్‌ నెల్సన్‌ అన్నారు. చైల్డ్‌ అనే పత్రికలోని ఒక అధ్యయనం ప్రకారం, రెండు నుండి మూడేళ్ళ పిల్లలు తమ ఆటవస్తువులను సర్దిపెట్టుకోవడం, మురికి బట్టల్ని మైలబుట్టలో వేయడం మొదలైన పనులను చేయగలరు. మూడు నుండి ఐదేండ్ల వయస్సులోని పిల్లలు భోజనానికి ముందు భోజనపు బల్ల మీద ప్లేట్లు గ్లాసులు మొదలైనవాటిని అమర్చడం, తోమవలసిన గిన్నెలను అంట్లు తోమే చోటికి తీసుకువెళ్లడం, తాము ఆడుకునే స్థలాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయవచ్చు. 5 నుండి 9 ఏండ్లలోపు పిల్లలు నిద్రలేచాక తమ పక్క సర్దుకోవడం, ఆకులను ఊడ్చివేయడం, పిచ్చి చెట్లను పెరికి వేయడం వంటివి చేయవచ్చు, 9 నుండి 12 ఏండ్ల లోపు పిల్లలు అంట్లు కడిగి వాటిని ఆరబెట్టడం, చెత్తను బయటికి తీసుకువెళ్ళి పారవేయడం, యంత్రంతో గడ్డి కోయడం, వ్యాక్యూమ్‌ చేయడం మొదలైనవి చేయవచ్చు. “ఆ పనులను ఏ టైం లోపు చేసెయ్యాలో కూడా చెప్పడం ప్రయోజనకరంగా ఉంటుంది” అని నెల్సన్‌ అంటున్నారు.

క్లాసుకి అంతరాయం కలిగించే పిల్లలు

సాధారణంగా, జపాన్‌లోని కౌమారప్రాయంలోని పిల్లల్లో తిరుగుబాటు ధోరణి అంతగా ఉండేది కాదు. అయితే, కోపోద్రేకంతో క్లాసుకు అంతరాయం కలిగించే పిల్లల మూలంగా క్లాసుని ప్రశాంతంగా ఉంచడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంటోందని జపాన్‌లోని అన్ని ప్రాంతాల్లోని పాఠశాల ఉపాధ్యాయులూ ఇటీవల నివేదిస్తున్నారు. 9, 11, 14 ఏండ్ల పిల్లలు ఇతరులను గురించి ఏమని భావిస్తున్నారో తెలుసుకునేందుకు, టోక్యో మెట్రోపోలిటన్‌ ప్రభుత్వం వాళ్ళను కొన్ని ప్రశ్నలడిగింది. ద డెయిలీ యోముయిరి ప్రకారం, 65 శాతం మంది పిల్లలు తమ స్నేహితుల మూలంగాను, 60 శాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రుల మూలంగాను, 50 శాతం మంది పిల్లలు తమ ఉపాధ్యాయుల మూలంగాను తమకు చిరాకూ విసుగూ కలుగుతున్నాయని చెప్పారు. అసలెన్నడూ తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోయామని, తాము కోపాన్ని అదుపు చేసుకోగలగడం చాలా అరుదని నలభై శాతం మంది అన్నారు. ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో కనీసం ఒక విద్యార్థి గానీ విద్యార్థిని గానీ వస్తువులను పగలగొట్టడం ద్వారా తమ కోపాన్ని వెళ్ళగక్కుతున్నట్లు చెప్పారు.

భారతదేశంలో “తక్షణం చర్య తీసుకోవలసిన అత్యవసర పరిస్థితి”

“గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో ఆరోగ్య సంక్షేమ విషయాల్లో మెరుగుదలలు ఉన్నప్పటికీ, పోషకాహారలేమి ఇప్పటికీ, ‘తక్షణం చర్య తీసుకోవలసిన సమస్యగానే’ ఉంది” అని ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిస్తుంది. కుపోషణ మూలంగా, ఆరోగ్య సంరక్షణ కోసం, 2300 లక్షలకన్నా ఎక్కువ డాలర్లను దేశం వెచ్చిస్తోంది, కుపోషణ మూలంగా పని కూడా దెబ్బతింటుంది, అలా ఉత్పాదన తక్కువవుతోంది. ఆ నివేదిక ప్రకారం, దేశంలోని నాలుగేండ్ల లోపు పిల్లల్లో 50 శాతం మంది కుపోషణకు గురవుతున్నారు. నవజాత శిశువుల్లో 30 శాతం మంది “చాలా తక్కువ బరువు ఉన్నారు,” స్త్రీలలో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. “కుపోషణ, వ్యక్తుల జీవితాలను కుటుంబాలను బాధించడమే కాక చదువు కోసం వెచ్చించిన డబ్బుకు తగిన ఫలితం లేకుండా చేస్తుంది; సాంఘిక, ఆర్థిక ప్రగతికి పెద్ద అడ్డంకిగా ఉంటుంది” అని వరల్డ్‌ బ్యాంకులో సీనియర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ అయిన మీరా చటర్జీ అన్నారు.

ఎవరెస్ట్‌ పర్వతం ఇంకా ఎత్తుగా పెరుగుతోంది

“ప్రపంచంలోని అత్యున్నత పర్వతమైన ఎవరెస్ట్‌, శాస్త్రజ్ఞులు మునుపు అనుకున్నదాని కన్నా ఎత్తుగా ఉంది, అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. పర్వతారోహకులు, ఎంతో ఆధునికమైన ఉపగ్రహ వ్యవస్థలను ఉపయోగించి, ఈ పర్వతాన్ని కొలిచి చూసినప్పుడు 8,850 మీటర్ల ఎత్తు, అంటే దాదాపు 8.9 కిలోమీటర్ల ఎత్తు ఉంది. . . . 1954లో కొలిచినప్పుడు, దాని ఎత్తు 8,848 మీటర్లు ఉండేది, అంటే ఇప్పుడు మునుపటి కంటే రెండు మీటర్లు ఎక్కువ ఎత్తు ఉందన్నమాట” అని ఇటీవలి రోయిటర్స్‌ నివేదిక తెలియజేస్తుంది. ఆ క్రొత్త కొలతలో పర్వతంపై కప్పబడిన మంచు కూడా చేరి ఉంది. అయితే, మంచు కాకుండా ఆ పర్వతం అసలు ఎత్తు ఎంతో ఇప్పటికీ తెలియదు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ, తమ మ్యాప్‌లో ఈ క్రొత్త కొలతను ఉపయోగిస్తుంది. ఈ పర్వతం ఎత్తు పెరగడమే కాదు, నిజానికి, హిమాలయ పర్వత శ్రేణి అంతా కూడా ఈశాన్య దిక్కుగా ప్రతి సంవత్సరం 1.5 మీల్లీ మీటర్ల నుండి 6 మిల్లీ మీటర్ల వరకు పెరుగుతూ చైనా వైపుగా విస్తరిస్తోంది.

ఆదర్శవంతమైన రవాణాసౌకర్యం

భారత దేశంలో దశాబ్దాలుగా వాడుకలో ఉన్న సైకిల్‌ రిక్షాలను పెడికబ్స్‌ అని, లేదా ట్రిషాస్‌ అని కూడా అంటారు. ఈ సైకిల్‌ రిక్షాలకు ఏ మార్పూ లేదు, “బరువైన కొయ్య నిర్మాణం, పెద్ద ఇనుప చట్రం, ఒరిగేటటువంటి సీట్లు, గేర్లు లేకపోవడం” అంతా మునుపటిలాగే ఉంది అని అవుట్‌ లుక్‌ అనే పత్రిక చెబుతుంది. ఈ సైకిళ్ళ నిర్మాణం ఇలా ఉన్నందువల్ల, సైకిల్‌ రిక్షా డ్రైవర్లు పడుతున్న శ్రమలను బట్టి ఈ సైకిళ్ళకు ఇటీవలి సంవత్సరాల్లో వ్యతిరేకత వచ్చింది (సైకిల్‌ రిక్షా డ్రైవర్లలో ఎక్కువ మంది పెద్దవాళ్ళూ, పోషకాహారం లేనివాళ్ళూనే). ఇప్పుడు, భారతదేశంలో వాహనాల మూలంగా వాతావరణం బాగా కలుషితమవుతుంది కనుక, సైకిల్‌ రిక్షాలకు క్రొత్తగా మళ్ళీ డిమాండ్‌ పెరిగింది. ఢిల్లీలోని ఒక సంస్థ రూపకల్పన చేసిన సైకిల్‌ రిక్షాలకు​—⁠గాలి ఒత్తిడిని తగ్గించే ఎక్కువ బరువు లేని అందమైన చట్రమూ; ఎంతో శ్రమపడి తొక్కనవసరం లేనటువంటి గేర్‌ సిస్టమూ; సరైన విధమైన డ్రైవర్‌ సీట్లూ; మణికట్టుపై ఒత్తిడిని తగ్గించే హ్యాండిల్‌బార్‌లూ; ఇంకొంచెం విశాలమైన సౌకర్యప్రదమైన సీట్లూ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ నాయకుడైన టీ. వినీత్‌ అభిప్రాయం ప్రకారం, ఈ సైకిల్‌ రిక్షా, “మానవ హక్కుల కోసమైన, కలుషిత వాయువులేని వాతావరణం కోసమైన నినాదాలు ఎడతెరపిలేకుండా వినిపిస్తున్న ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులకు తగినది.” అవుట్‌ లుక్‌ పత్రిక, “ఈ నిరాడంబరమైన సైకిల్‌ రిక్షా 21వ శతాబ్దపు ఆదర్శవంతమైన రవాణాసౌకర్యంగా మారగలదు” అని అంటోంది.

పిల్లలూ నిద్రా

“తల్లిదండ్రులు, తమ పిల్లలు ఎప్పుడు పడుకోవాలనే దానిపై మాత్రమే కాక, పడుకునే ముందు ఏ పనులను చేయవచ్చు, ఏ పనులను చేయకూడదు అనే వాటిపైన కూడా పరిధులను నియంత్రించాలి” అని పేరెంట్స్‌ అనే పత్రిక అంటోంది. “టీవీ చూడడమూ, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుకోవడమూ, వీడియో గేమ్స్‌ ఆడుకోవడమూ, ఇంటర్‌నెట్‌ సర్ఫింగూ, పిల్లలు సమయం దాటాక కూడా మేల్కొని ఉండేలా చేస్తాయి. స్కూల్‌ నుండి వచ్చిన తర్వాత పిల్లలు అనేక కార్యక్రమాలతో సతమతమౌతుంటే, సహేతుకమైనంత సమయంలో హోమ్‌వర్క్‌ చేయలేరు” అని కూడా ఆ పత్రిక అంటోంది. నిద్రలేమి ప్రభావం పిల్లలపై, పెద్దవారిపై వేర్వేరుగా ఉంటుంది. నిద్ర తక్కువైనప్పుడు, పెద్దవాళ్ళయితే కునికిపాట్లు పడుతుంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, కానీ పిల్లలు అతి చలాకీగా ఉంటూ బాగా అల్లరి చేస్తారు, అదుపు తప్పి ప్రవర్తిస్తారు, స్కూల్లో పాఠాలపై మనస్సును కేంద్రీకరించలేరు, అవధానాన్నుంచలేరు, వాళ్ళు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోలేరు, లెక్కలను సరిగా చేయలేరు. కనుక, పిల్లలు ఏ సమయానికి నిద్రకుపక్రమించాలన్న విషయాన్ని తల్లిదండ్రులు నిర్ణయించవలసిన అవసరముంది, అంటే నిద్రకు మొదటి స్థానమివ్వాలి, అలసిపోయినప్పుడు లేదా ఇంకా చేయవలసిన పనులు ఏమి లేనప్పుడు చేయవలసిన పనిగా నిద్రను దృష్టించకూడదు.

తండ్రులూ కూతుళ్ళూ

కెనడాలో కౌమారప్రాయంలో ఉన్న 2,500 మంది పిల్లలపై హెల్త్‌ కెనడా అనే ప్రచురణ చేసిన ఇటీవలి అధ్యయనం, తండ్రులకూ పిల్లలకూ మధ్య, ముఖ్యంగా తండ్రులకూ కూతుళ్ళకూ మధ్య భావ వినిమయం జరగడం లేదని చూపిస్తుందని కెనడాలోని గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. 15 నుండి 16 ఏండ్ల వయస్సులోని అబ్బాయిల్లో 51 శాతం మందీ, అమ్మాయిల్లో 33 శాతం మందీ మాత్రమే “తమను నిజంగా బాధించే విషయాలను గురించి తమ తండ్రులతో చనువుగా మాట్లాడగల్గుతున్నారు.” అయినప్పటికీ, అమ్మాయిలు, “తమ తండ్రులకు ఎంతో విలువ ఇస్తారు, వాళ్ళకు తండ్రుల ఆలంబన అవసరము” అని ఆ నివేదిక చెబుతుంది. చాలా మంది తండ్రులు లైంగిక వివాదాలను, ప్రమాదకరమైన ప్రవర్తనను నిర్లక్ష్యం చేస్తుండగా, “తమ పిల్లలతో మాట్లాడడం, ముఖ్యంగా వాళ్ళు యౌవన దశలోకి అడుగుపెడుతున్న సంవత్సరాల్లో, కలత కలిగించే ఆ సంవత్సరాల్లో మాట్లాడడం అంటే తండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది” అని క్వీన్స్‌ యూనివర్సిటీలోని ప్రొఫెసర్‌ అలన్‌ కింగ్‌ అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా, తమ పిల్లలతో మునుపటంత సమయాన్ని గడపడం చాలా మంది తల్లులకు కష్టమవుతున్నందువల్ల, తప్పనిసరిగా ఈ సవాలును ఎదుర్కోమని తండ్రులకు ఆయన ఉద్బోధిస్తున్నారు.

సూపర్‌ సుమో మల్లయోధులు

తమ స్థూలకాయాన్ని బట్టి ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన సుమో మల్లయోధుల శరీర బరువు రోజురోజుకీ వాళ్ళ కాళ్ళకే బరువైపోతోంది అని జపాన్‌లోని స్పోర్ట్స్‌ ఫిసియోలజిస్ట్‌లు అంటున్నారు. రెండు టాప్‌ సుమో కేటగరీల్లో ప్రమాదాలు గత ఐదు సంవత్సరాల్లో రెండింతలు కావడంతో, ఫిసియోలజిస్ట్‌ల ఒక బృందం, 50 మంది మల్లయోధుల లావును, వాళ్ళ కాళ్ళ బలంతో పోల్చి చూశారు అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తోంది. “వాళ్ళలో నాలుగింట ఒక వంతు మంది కాళ్ళ కండరాలకు వాళ్ళ శరీర బరువును మోసేంత బలం లేదు” అని ఆ నివేదిక చెబుతుంది. టాప్‌ సుమో మల్లయోధుల సగటు బరువు 1974లో 126 కిలోలు ఉండేది, అది 1999లో 156 కిలోలకు పెరిగింది. “జపానీయుల సగటు పరిమాణం పెరిగింది, అలాగే వాళ్ళదీ పెరిగింది” అని సుమో వ్యాఖ్యాతయైన డోరీన్‌ సిమ్మండ్స్‌ అంటున్నారు. కానీ బరువు పెరిగినంత మాత్రాన కుస్తీలో తమ సామర్థ్యం పెరగాలనేమీ లేదు. “ఆదర్శ సుమో మల్లయోధుని రూపం పెయర్‌ పండులా ఉంటుంది. తుంటి భాగం ఎత్తుగా ఉండక, తొడలు పెద్దగాను, పిక్కలు దృఢంగాను ఉంటాయి” అని సైమండ్స్‌ పేర్కొంటున్నారు.

ఇతరులు త్రాగి విడిచిన పొగ బారిన పిల్లలు

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బెర్కెలీ వెల్‌నెస్‌ లెటర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికపై వ్యాఖ్యానిస్తూ, “ప్రపంచంలోని పిల్లల్లో దాదాపు సగం మంది జీవిస్తున్నది పొగత్రాగేవాళ్ళతోనే. అలాంటి పిల్లల సంఖ్య 70 కోట్ల కన్నా ఎక్కువగా ఉంది” అని చెబుతోంది. పొగత్రాగే పెద్దవాళ్ళ సంఖ్య, మరో 20 సంవత్సరాల్లో, 160 కోట్లకు పెరుగుతుందని నిరీక్షిస్తున్నారు కనుక, త్రాగి విడిచిన పొగ బారిన ఇంకా చాలా మంది పిల్లలు పడతారు. ఈ పిల్లలకు చెవి ఇన్‌ఫెక్షన్‌లు, శ్వాసకోశానికి సంబంధించిన రోగాలు వంటి ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఎక్కువవుతుంది.