“అత్యంత అందమైన అరణ్యవాసి”
“అత్యంత అందమైన అరణ్యవాసి”
స్వీడన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
జూన్ నెలలో ఒకరోజు నేను దాన్ని మొట్టమొదటిసారిగా చూశాను. దాన్ని “అత్యంత అందమైన అరణ్యవాసి” అని ఈ ప్రాంతంలో నివసించే కొంతమంది పిలుస్తారు. అదే గ్రేట్ గ్రే ఔల్, దాన్ని కొన్నిసార్లు లాప్లాండ్ గుడ్లగూబ అని కూడా పిలుస్తారు.
ముగ్ధమనోహరమైన ఈ పెద్ద గుడ్లగూబ ఫిన్లాండ్, ఉత్తర స్వీడన్, తూర్పున సైబీరియా, అలాస్కా, కెనడా వంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. సాధారణంగా రహస్యంగా జీవించడానికి ఇష్టపడుతుంది. దాని గూడు ఎక్కడుందో మీకు తెలిస్తేనే గాని మీకు దాన్ని కనుక్కోవడం కష్టం. మీరు గూడు కనుక్కుని దాన్ని గమనించిన తర్వాత దానికి అంత భయం లేనట్లు మీరు తెలుసుకుంటారు.
ఈ వేటపక్షిని అధ్యయనం చేయడం
ఆ మగ లాప్లాండ్ గడ్లగూబ ఆహారాన్ని సేకరిస్తుండగా, స్పష్టంగా కనబడుతున్న దాని శరీర ఆకృతిని నేను అధ్యయనం చేయగలిగాను. ఒక ఎలుకను పట్టుకోవడానికి అది కొమ్మమీద నుంచి ఒక్క ఉదుటున దూకింది. దొరికిందా? దొరక్కేమౌతుంది! అది దాని పెద్ద పెద్ద రెక్కలను బారజాపుకొని గాల్లో ఠీవిగా నెమ్మదిగా ఎగురుతూ ఉండగా దాని కాలిగోర్ల మధ్యన వ్రేలాడుతున్న చిన్న ఎలుకను నేను చూడగల్గాను. దాని రెక్కల్ని ఈ చివరి నుండి ఆ చివరి వరకు కొలిస్తే దాదాపు 140 సెంటీమీటర్లు ఉంటుంది.
ఇతర గుడ్లగూబల్లా ఈ లాప్లాండ్ గుడ్లగూబ ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి చేయదు. ఈ భారీ గుడ్లగూబ చిన్న చిన్న ఎలుకల్లాంటి జీవులపైనే ఆధారపడుతుంది, అందుకని వీటి కొరత ఏర్పడినప్పుడు కొన్ని సంవత్సరాలపాటు సంతానోత్పత్తి పూర్తిగా నిలిచిపోతుంది.
ఆహారం సమృద్ధిగా ఉన్న సంవత్సరాల్లో, ఒక్కొక్క గూడులో నాలుగు లేక అంతకు మించిన సంఖ్యలో పిల్లలు కన్పిస్తాయి.జతను ఎంపిక చేసుకోవడం
గుడ్లగూబలు వసంత రుతువులో జతకడతాయి, ఆడ గుడ్లగూబ తన జతను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. వరుడు అందగాడై ఉండాలన్నది దానికి పెద్ద పట్టించుకోవల్సిన విషయంగా ఉండదు—మానవజాతిలోని అనేకమంది ఆడువారికి అది ప్రాముఖ్యమేమో గాని దానికి అంత పట్టింపు లేదు. కొందరు విహంగ వీక్షకులు చేసిన అధ్యయనాల ప్రకారం మగ గుడ్లగూబ తాను నైపుణ్యంగల వేటగాడినని చూపించుకోవల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలోకి ప్రవేశించాలని ఎటువంటి ప్రణాళికలు వేయడానికైనా ముందు మగ గుడ్లగూబ ఆడుదానికి ఆహారాన్ని సమకూర్చాల్సివుంటుంది.
ఎలుకలు సమృద్ధిగా దొరికినప్పుడు, మగ గుడ్లగూబ నైపుణ్యంగల “కుటుంబ పోషకుడు” అయినప్పుడు ఆడదానికి సరిపడా ఆహారం లభిస్తుంది, తద్వారా దాని బరువూ పెరుగుతుంది. పెరిగిన బరువు అది ఎన్ని గుడ్లను పెట్టగలదనేందుకు ఒక సూచనగా పనిచేస్తుంది.
ఇప్పుడిక వేటపని పూర్తిగా మగ గుడ్లగూబపైనే పడుతుంది, ఇందుకు దానికి చాలా శక్తి అవసరం. దానికి కావల్సిన ప్రోత్సాహం ఆడ గుడ్లగూబ విజ్ఞప్తితో పెట్టే అరుపుల ద్వారా లభిస్తుంది, కానీ ఆడదాని శక్తంతా గుడ్లను పెట్టడంలోనూ విలువైన ఆ సంపదను కాపాడుకోవడంలోనూ కేంద్రీకృతమై ఉంటుంది.
గూళ్ళను పసిగట్టడం
అవిశ్రాంతంగా ఆహారాన్ని నా తలమీదుగా తీసుకువెళ్తూవున్న అందమైన మగ గుడ్లగూబను నేను నా బైనాక్యులర్స్ సహాయంతో చూస్తూవున్నాను. చివరికి గూడును పసిగట్టగల్గాను. లాప్లాండ్ గుడ్లగూబలు సొంత గూళ్ళను కట్టుకోవు. తరచుగా అవి, అడవిలో నివసించే ఇతర వేటపక్షులు పుల్లలతో కట్టుకున్న గూళ్ళను ఆక్రమించుకుంటాయి. గూడు దొరక్కపోతే గుడ్లగూబ విరిగిన చెట్టు మోడును ఉపయోగించుకుంటుంది.
సున్నితమైన ఈకలుగల రెండు పిల్లలు గూడులో నాక్కనిపించాయి, అవి కళ్ళు విప్పార్చుకుని తమ చుట్టూ ఉన్న ప్రతీదాన్ని ఆశ్చర్యంతో గమనిస్తున్నాయి. విజ్ఞప్తితో కూడిన అరుపులతో అవి దగ్గర్లోనే కూర్చుని చూస్తున్న తమ తల్లివైపు చూశాయి, వాటి కళ్ళల్లో ఆకలి కనిపించింది. ఈ సమయంలో మరీ దగ్గరకు వెళ్ళడం మన వంటికి అంత మంచిది కాదు. తన పిల్లలకు ప్రమాదం వాటిల్లబోతోందని తల్లికి అనిపిస్తే, నిశ్శబ్దంగా ఎగురుకుంటూ వచ్చి మరీ దగ్గరకు వెళ్ళిన దుండగుడిపై వాడియైన తన పంజాలతో దాడిచేస్తుంది. అందుకని గుడ్లగూబలను అధ్యయనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ తగిన దూరంలో ఉండడం ప్రాముఖ్యం.
ఆహారాన్నందించడం, శిక్షణనివ్వడం
మగది గూడును చేరుకుని తన పంజాల్లోని వేటను ముక్కులోకి మార్చుకుంది. తర్వాత ఆ ఎలుకను తన పిల్లలకు అందించింది. ఒక పిల్లకు ఆహారాన్ని అందిస్తుంటే వరుసలో తర్వాత ఉన్న పిల్ల తనక్కూడా ఓ ముద్ద పెట్టమని కర్ణకఠోరంగా అరుస్తోంది.
ఆబగా తన ఆహారాన్ని ఆరగించిన తర్వాత, చోద్యమైన రీతిలో దాని ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకూ ఎగిరెగిరి పడుతూ ఎంతో చురుకుగా ఉన్న అది అకస్మాత్తుగా తాగిన మత్తులో ఉన్నట్లు ప్రవర్తిస్తుంది! దాని శక్తులన్నీ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మళ్ళించబడతాయి, కొంతసేపటికి అది కుప్పకూలిపోతుంది. మెత్తని బొచ్చుతో చిన్న ఈకల కుప్పలా మనకది కనిపిస్తుంది. కానీ దానికి దగ్గర్లో ఉన్న మరో పిల్ల నెమ్మదిగా తేరుకుంటూ తను క్రితంసారి తిన్న ఆహారం మూలంగా ఏర్పడిన మత్తులోనుండి బయటపడుతూ ఉంది.
ఇలా జూన్ మధ్య భాగం వరకు కొనసాగుతుంది. అప్పటికల్లా పిల్లలకు నాలుగు వారాల వయస్సు వస్తుంది, ఇప్పుడిక తమ తల్లి పిలుపు ప్రోత్సాహంతో తమ గూడులోంచి బయటికి ఎగురుతుంటాయి. మొదట అవి గొప్ప నైపుణ్యంతో చెట్ల మీదికి ఎక్కుతుంటాయి. చెట్లమీదైతే వాటిపై దాడిచేసే జంతువులు నేలమీదున్నంత ఎక్కువగా ఉండవు.
కొంతకాలానికి పిల్లలు తమ రెక్కల సహాయంతో ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగురుతూ ప్రాక్టీసు చేస్తుంటాయి. మరి కొంతకాలానికి అవి తమ స్వంతగా ఎగిరే, వేటాడే సామర్థ్యాల్ని పెంపొందించుకుంటాయి. వాటి రూపు కూడా మారిపోతుంది, దాంతో అవి కూడా ‘అత్యంత అందమైన అరణ్యవాసులు’గా తయారౌతాయి.
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Joe McDonald
© Michael S. Quinton
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Michael S. Quinton
© Michael S. Quinton