కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కనిపించని వాటిలోకి తొంగిచూస్తే ఏమి వెల్లడి అవుతుంది?

కనిపించని వాటిలోకి తొంగిచూస్తే ఏమి వెల్లడి అవుతుంది?

కనిపించని వాటిలోకి తొంగిచూస్తే ఏమి వెల్లడి అవుతుంది?

క్రొత్త ఆవిష్కరణల సహాయంతో అలంకారికంగా చెప్పాలంటే తామింతకు మునుపు చూడలేని వాటిపైనుండి ముసుగును తీసేసి చూసినప్పుడు ఏమి సాధించబడింది. అలా చూడడం, మునుపు ఎరుగని వాటిని ఒక మోస్తరు ఖచ్చితత్వంతో నిర్ధారించడానికి సహాయపడగలదు.​—క్రిందనున్న బాక్సు చూడండి.

భూమి విశ్వానికి కేంద్రంగా ఉందనేది ఒకప్పటి విశ్వాసం. కానీ టెలిస్కోపులు వచ్చిన తర్వాత, భూమితో సహా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ వాటి వాటి కక్ష్యల్లో పరిభ్రమిస్తున్నాయని తెలిసింది. ఇంకా ఇటీవలి ఉదాహరణ ఇవ్వాలంటే, శక్తివంతమైన సూక్ష్మదర్శినిలు కనుగొనబడ్డంతో, మానవులు పరమాణువునే పరిశీలించగల్గారు, కొన్ని రకాల పరమాణువులు ఎలా ఇతర రకాల పరమాణువులతో కలుస్తాయో, తత్ఫలితంగా అణువులు ఎలా ఏర్పడతాయో చూడగల్గారు.

జీవానికి ఎంతో ఆవశ్యకమైన నీటి అణువు సంయోజనాన్ని పరిశీలించండి. వాటి రూపం కారణంగా, రెండు హైడ్రోజన్‌ పరమాణువులు ఎంతో విలక్షణమైన రీతిలో ఒక్క ఆక్సిజన్‌ పరమాణువుతో చేరి ఒక్క నీటి అణువుగా ఏర్పడతాయి​—ఈ అణువుల సంఖ్య ఒక్క నీటి బిందువులోనే కొన్ని వందల కోట్లు ఉంటుంది! ఒక నీటి అణువును పరిశీలించడం ద్వారా, వేర్వేరు పరిస్థితుల్లో దాని స్వభావం ఎలావుంటుందో చూడడం ద్వారా మనం ఏమి నేర్చుకోగలం?

నీరు ఒక అద్భుతము

నీటి చుక్కని చూసినప్పుడు అదెంతో సరళంగా కన్పిస్తుంటుంది, కానీ నీరు ఎంతో సంక్లిష్టమైన పదార్థం. నిజానికి, ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉన్న ఇంపీరియల్‌ కాలేజీలో సైన్స్‌ రచయిత అయిన డాక్టర్‌ జాన్‌ ఎంస్లీ, “రసాయనాలన్నింట్లోకెల్లా ఎక్కువగా పరిశోధనలకు గురైంది నీరే, కానీ ఇంకా దాన్ని గురించి అతి తక్కువగా అర్థం చేసుకోవడం జరిగింది” అని అన్నాడు. న్యూ సైంటిస్ట్‌ అనే పత్రిక ఇలా చెబుతోంది: “భూమ్మీద నీరు అతి సుపరిచితమైన ద్రవం, కానీ అతి గొప్ప మర్మంగా మిగిలిపోయింది కూడా అదే.”

నీటి నిర్మాణం ఎంత సరళంగా ఉన్నప్పటికీ, దాని “స్వభావం అంత సంక్లిష్టత ఎందులోనూ లేదు” అని డాక్టర్‌ ఎంస్లీ వివరించాడు. ఒక ఉదాహరణగా పేర్కొంటూ ఆయన ఇలా అన్నాడు: “H2O (నీరు) అసలు వాయురూపంలో ఉండాలి, . . . కానీ అది ద్రవరూపంలో ఉంది. అంతేగాక, అది ఘనీభవించినప్పుడు . . . దాని ఘనరూపమైన ఐస్‌,” మనం సాధారణంగా ఎదురుచూసినట్లు “నీటిలో మునిగిపోవడానికి బదులుగా తేలుతుంది.” ఈ అసాధారణ ప్రవర్తన గురించి మునుపు అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌కు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ పాల్‌ ఈ. క్లోప్‌స్టెగ్‌ ఇలా అంటున్నాడు:

“చేపల్లాంటి జలచరాలు సజీవంగా ఉండేందుకొక అద్భుతమైన రూపనిర్మాణంగా అది కనబడుతోంది. నీరు చల్లబడుతూ ఘనీభవన స్థాయికి చేరుకుంటుండగా పైన చెప్పినట్లుగా ప్రవర్తించకపోయినట్లైతే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఐస్‌గడ్డలు ఏర్పడతాయి, అలా నెమ్మదిగా ఒక కొలను అంతటినీ ఆక్రమించుకొని, దాంట్లోని జలచరాలన్నింటినీ లేదా జలచరాల్లోని దాదాపుగా ప్రతీ జీవినీ అంతరింపచేసేంత వరకూ ఏర్పడుతూనే ఉంటాయి.” ఐస్‌ ఏర్పడినప్పుడు అనూహ్యమైన రీతిలో నీటిపై తేలడం, “ఈ విశ్వంలో ఒక గొప్ప వ్యక్తి, సంకల్పంవున్న వ్యక్తి పనిచేస్తున్నాడనడానికి నిదర్శనం” అని డాక్టర్‌ క్లోప్‌స్టెగ్‌ అన్నాడు.

న్యూ సైంటిస్ట్‌ పత్రిక ప్రకారం, నీరు ఈ విధంగా అసాధారణమైన రీతిలో ప్రవర్తించడానికి కారణం ఏమిటో ఇప్పుడు పరిశోధకులు గ్రహించారు. నీరు వ్యాకోచించడం గూర్చి ఖచ్చితత్వంతో చెప్పే మొట్టమొదటి సిద్ధాంతాన్ని వారు రూపొందించారు. “ఈ మిస్టరీ వెనుకనున్న రహస్యం, వీటి [నీరు, ఐస్‌ అణువుల] నిర్మాణంలో ఆక్సిజన్‌ పరమాణువుల దూరమే” అని పరిశోధకులు గ్రహించారు.

ఇది గమనార్హమైన విషయం కాదా? ఎంతో సరళంగా కనిపించే ఒక అణువు మానవ అవగాహనా శక్తినే సవాలు చేస్తోంది. ఇక మన శరీరంలోని బరువుకు అధికశాతం నీరే కారణం అన్న వాస్తవం గురించి ఆలోచించండి! రెండే రెండు మూలకాలకు చెందిన మూడే మూడు పరమాణువులు ఉన్న ఈ అణువులోని అద్భుతాల్లో “ఒక గొప్ప వ్యక్తి, సంకల్పంగల వ్యక్తి పనిచేస్తున్నాడనడానికి నిదర్శనం” మీకు కనిపిస్తుందా? అయితే, నీటి అణువు చాలా చిన్నది, అనేకమైన ఇతర అణువులతో పోలిస్తే చెప్పుకోదగినంత సంక్లిష్టమైనదేమీ కాదు.

మరింత సంక్లిష్టభరితమైన అణువులు

కొన్ని అణువులు భూమ్మీద సహజంగా లభించే 88 మూలకాల్లోని అనేక మూలకాలకు చెందిన వేలాది పరమాణువులతో రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, ప్రతి జీవి యొక్క వంశానుగత సమాచారాన్ని సంకేత రూపంలో కలిగివుండే డిఎన్‌ఎ (డైఆక్సీరైబోన్యూక్లియాక్‌ యాసిడ్‌కు సంక్షిప్త నామం) యొక్క ఒక్క అణువులో అనేక మూలకాలకు చెందిన లక్షలాది పరమాణువులు ఉండగలవు!

డిఎన్‌ఎ అణువు ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ దాని వ్యాసం మాత్రం 0.0000025 మిల్లీమీటర్లే ఉంటుంది, అంటే ఒక శక్తివంతమైన మైక్రోస్కోపులో నుంచి తప్ప మరేవిధంగానూ చూడడం సాధ్యంకానంత చిన్నదన్నమాట. ఈ డిఎన్‌ఎ ఒక వ్యక్తికి వంశానుగతంగా సంక్రమించే లక్షణాల్ని నిర్ధారిస్తుందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నది 1944లోనే. ఈ ఆవిష్కరణతో సంక్లిష్టభరితమైన ఈ అణువును కూలంకషంగా పరిశోధించడానికి మార్గం ఏర్పడింది.

అయితే, మన చుట్టూ ఉన్న వస్తువుల్లో ఉండే అనేక రకాల అణువుల్లో డిఎన్‌ఎ అణువు నీటి అణువులనేవి కేవలం రెండు మాత్రమే. ఇటు జీవుల్లోను, అటు నిర్జీవ వస్తువుల్లోను రెండింటిలోను అనేక అణువులు ఉండడం మూలంగా, జీవిస్తూ చలిస్తూ ఉన్నవాటికీ అలా లేని వాటికీ మధ్య ఏదో చిన్న మార్పు అంటే చిన్న లంకె మాత్రమే ఉన్నదన్న ముగింపుకి మనం చేరుకోవాలా?

ఎంతోకాలంగా చాలామంది ఇలాగే నమ్ముతూ వచ్చారు. “జీవరసాయనశాస్త్ర పరిజ్ఞానం పెరుగుతూ ఉండగా ఆ [జీవ-నిర్జీవాల మధ్యనున్న] అగాధం పూడ్చివేయబడుతుందన్న ఆశాభావాన్ని 1920లు 30లలోని అనేకమంది అధికారులు స్పష్టమైన రీతిలో వ్యక్తం చేశారు” అని సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడైన మైఖేల్‌ డెంటన్‌ వివరిస్తున్నాడు. అయినా చివరికి ఏమి తేలింది?

జీవం అసాధారణం, అసమానం

జీవ నిర్జీవాల మధ్య ఏవైనా పరివర్తనాల్ని అంటే అంచెలవారీగా ఉండే లంకెల్ని కనుగొంటామని శాస్త్రజ్ఞులు ఎదురుచూసినప్పటికీ, “1950వ దశకం తొలిభాగంలో అణుజీవశాస్త్రంలో విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగులోనికి వచ్చిన తర్వాత” రెంటికీ మధ్య నిర్దిష్టమైన అగాధం ఉందని “చివరకు రుజువైంది” అని డెంటన్‌ గమనించాడు. శాస్త్రజ్ఞులకు ఇప్పటికి స్పష్టమైన ఒక గమనార్హమైన వాస్తవాన్ని గురించి తెలియజేస్తూ డెంటన్‌ ఇలా వివరిస్తున్నాడు:

“జీవ నిర్జీవ ప్రపంచాల మధ్య ఒక గొప్ప అగాధం ఉన్నదన్న విషయం మాత్రమేకాదుగానీ అది, ప్రకృతిలో ఉన్న అగాధాలన్నింట్లో కెల్లా అత్యంత గమనార్హమైన, ప్రాధమికమైన అగాధానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్న విషయం మనకు ఇప్పుడు తెలుసు. ఒక జీవ కణానికీ, స్ఫటికం లేక మంచురేణువు వంటి అత్యంత సంక్లిష్టమైన నిర్జీవ కణానికీ మధ్య ఊహలకు కూడా అందనంత గొప్ప అగాధం ఉంది.”

ఒక అణువును సృష్టించడం చాలా సులభమని దానర్థం కాదు. అణువుల నుండి జీవ కణాల వరకు (ఆంగ్లం) అనే పుస్తకం, “అణువులలోని చిన్న చిన్న కణాల సంయోజన ప్రక్రియయే ఎంతో సంక్లిష్టభరితంగా ఉంటుంది” అని వివరిస్తుంది. అయితే, “మొదటి జీవ కణాన్ని ఉత్పత్తి చేయడంలో అనుసరించిన ప్రక్రియతో పోలిస్తే” అటువంటి అణువుల్ని తయారుచేయడం “ఎంతో సులభమని” కూడా ఆ పుస్తకం పేర్కొంటుంది.

కణాలు స్వతంత్ర జీవులుగా ఉండగలవు, ఇందుకు ఉదాహరణ సూక్ష్మక్రిములు. లేదా, అవి బహుళకణ జీవుల్లో​—ఉదాహరణకు, మనిషిలో​—భాగంగా కూడా పనిచేయగలవు. ఈ వాక్యానికి చివరనున్న ఫుల్‌స్టాప్‌ పరిమాణం, 500 సగటు కణాల పరిమాణంతో సమానం. కాబట్టి కణంలో జరిగే కార్యకలాపాలు కంటికి కనబడవనడంలో అంత ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు. మరైతే, మైక్రోస్కోపును ఉపయోగించి మానవ శరీరంలోని ఒక కణంలోకి తొంగిచూస్తే ఏమి వెల్లడి అవుతుంది?

కణం​—యాదృచ్ఛికమా లేక సృష్టా?

అన్నింటికన్నా ముందు చెప్పాలంటే, జీవ కణాల్లో ఉన్న సంక్లిష్టతను చూసి అచ్చెరువొందని వారుండరు. ఒక విజ్ఞానశాస్త్ర రచయిత ఇలా చెబుతున్నాడు: “అతి సరళమైన జీవ కణం ఎదగడానికి కూడా సమన్వయంతో కూడిన రీతిలో వేలాది రసాయనిక ప్రతిచర్యలు సంభవించడం ఆవశ్యకం.” తర్వాత ఆయనిలా అడిగాడు: “ఒక సూక్ష్మమైన కణం లోపల ఏక కాలంలో జరిగే 20,000 ప్రతిచర్యలు ఎలా నియంత్రించబడగలవు?”

అతి సూక్ష్మమైన జీవ కణాన్ని కూడా, “అణువుల పరిమాణంలోని వేలాది యంత్రాలున్న సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణంలోని అసలు సిసలైన కర్మాగారంతో” మైఖేల్‌ డెంటన్‌ పోల్చాడు. “ఒక జీవ కణం మొత్తం 10 వేల కోట్ల పరమాణువులతో ఏర్పడుతుంది. మానవుడు నిర్మించిన ఏ యంత్రంకన్నా అదెంతో సంక్లిష్టమైనది. నిర్జీవ వస్తు ప్రపంచంలో దీనికి సాటిరాగలదేదీ లేదు” అన్నాడాయన.

కణంలో ఉన్న సంక్లిష్టతను చూసి శాస్త్రజ్ఞులు విస్మయం చెందుతున్నారు. ద న్యూయార్క్‌ టైమ్స్‌ 2000, ఫిబ్రవరి 15వ తారీఖున ఇలా పేర్కొంది: “జీవ కణాల్ని జీవశాస్త్రజ్ఞులు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్నారో, అవి నిర్వర్తిస్తున్న విధులన్నింటిని గురించి నిర్ధారించేపని అంత సంక్లిష్టంగా మారుతోంది. మనిషిలోని ఒక సగటు కణం మనం చూడలేనంత చిన్నది, అయినా, అందులోని 1,00,000 జన్యువుల్లోని 30,000 జన్యువులు ప్రతి క్షణం ఆన్‌ ఆఫ్‌ అవుతూ, కణంలోని అవసరాలను తీరుస్తూ లేదా ఇతర కణాల నుండి వచ్చిన సందేశాలకు ప్రతిస్పందిస్తూ ఉంటాయి.”

టైమ్స్‌ ఇలా ప్రశ్నించింది: “అంత సూక్ష్మమైన, చిక్కైన ఒక యంత్రాన్ని విశ్లేషించడం అసలెలా సాధ్యం? ఒకవేళ అసాధారణమైన నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక్క మానవ కణాన్ని పూర్తిగా అర్థంచేసుకున్నా, మానవ శరీరంలో ఇంకా కనీసం 200 రకాల కణాలు ఉన్నాయే.”

శరీరంలోని ప్రతి కణం లోపల చిన్ని చిన్ని మోటార్లు ఉన్నట్లు కనుగొనడం జరిగిందని ప్రకృతి (ఆంగ్లం) అనే పత్రిక “సృష్టిలోని అసలు సిసలైన ఇంజిన్‌లు” అనే శీర్షికతో ప్రచురించిన ఆర్టికల్‌లో నివేదించింది. కణాల్లో శక్తికి మూలాలైన అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌లను సృష్టించడానికి ఇవి గిరగిరా తిరుగుతూ ఉంటాయి. ఒక శాస్త్రజ్ఞుడు తన సంభ్రమాన్ని ఇలా వ్యక్తంచేశాడు: “కణాల్లో మనకు కనబడే అణువ్యవస్థలను పోలిన అణు యంత్రవ్యవస్థలను రూపొందించి నిర్మించడం నేర్చుకున్నప్పుడు మనం ఏమి సాధించవచ్చో గదా?”

అణువుల్లో ఉన్న సృజనాత్మక సామర్థ్యాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి! మన శరీరంలోని ఒక్క కణంలో ఉన్న డిఎన్‌ఎలో నిబిడీకృతమైవున్న సమాచార మొత్తం ఈ పేజీ సైజులోని పది లక్షల పేజీలు నిండుతుంది! అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే, ఒక క్రొత్త కణాన్ని సృష్టించడానికి ఒక కణం విభజించబడే ప్రతిసారి అదే సమాచారం ఆ క్రొత్త కణంలోకి ప్రవేశపెట్టబడుతుంది. మన శరీరంలో ఉన్న 1,00,00,000 కోట్ల కణాల్లో ప్రతీది ఇలాంటి సమాచారంతో ఎలా ప్రోగ్రామ్‌ చేయబడిందన్న విషయాన్ని మీరెలా తలస్తారు? అది యాదృచ్ఛికంగా జరిగిపోయిందా, లేక గొప్ప నైపుణ్యంగల ఒక రూపనిర్మాణకుడు దానికి బాధ్యుడా?

జీవశాస్త్రజ్ఞుడైన రస్సెల్‌ చార్లెస్‌ ఆర్టిస్ట్‌ చేరుకున్న ముగింపుకే మీరు కూడా బహుశ చేరుకుని ఉంటారు. ఆయనిలా అన్నాడు: “ఒక మేధాశక్తి సంపన్నుడు, మనశ్శక్తి సంపన్నుడు కణాన్ని ఉనికిలోనికి తెచ్చాడన్న సహేతుకతకూ తర్కానికీ సమ్మతిస్తే తప్పించి, [దాని] ఉద్భవం గురించి, ఆ మాటకొస్తే అది పనిచేస్తూ కొనసాగుతుండడం గురించీ విశ్లేషించడానికి ప్రయత్నించడంలో అసాధ్యమైన, అధిగమించనశక్యమైన సమస్యలను మనం ఎదుర్కుంటాం.”

అద్భుతమైన వస్తుక్రమం

కర్‌ట్లీ ఎఫ్‌. మథర్‌ చాలా సంవత్సరాల క్రితం హార్వార్డ్‌ యూనివర్శిటీలో భూభౌతికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నప్పుడు, ఆయనీ ముగింపుకి చేరుకున్నాడు: “మనం యాదృచ్ఛికంగానో లేదా అకారణంగానో ఉనికిలోకి వచ్చిన విశ్వంలో కాక, నియమాలూ క్రమమూ ఉన్న విశ్వంలో జీవిస్తున్నాము. దాని కార్యనిర్వహణ పూర్తిగా సహేతుకంగా ఉంది, పూర్ణ గౌరవానికి తగినదై ఉంది. పదార్థంలోని ప్రతి మూలకానికీ వరసక్రమంలో పరమాణు సంఖ్యను నియమించేందుకు అనుమతించే ప్రకృతిలోని అద్భుతమైన గణిత వ్యవస్థను గురించి ఒక్కసారి ఆలోచించండి.”

మనం “ప్రకృతిలోని అద్భుతమైన గణిత వ్యవస్థను” గురించి కాస్త పరిశీలన చేద్దాము. ప్రాచీనులకు తెలిసిన మూలకాల్లో * బంగారం, వెండి, రాగి, తగరం, ఇత్తడి వంటివి ఉన్నాయి. ఆర్సెనిక్‌, బిస్మత్‌, యాంటిమనీ అనే మూలకాలను మధ్య యుగాల్లోని రసవాదులు కనిపెట్టారు, అటుతర్వాత 1700లలో మరి కొన్ని మూలకాలను కనుగొనడం జరిగింది. ప్రతి మూలకం ప్రసరింపజేసే విలక్షణమైన వర్ణపటాన్ని వేరుచేసి చూపించే స్పెక్ట్రోస్కోపును 1863లో కనుగొనడంతో, దీన్ని ఉపయోగించి ఇండియమ్‌ అనే మూలకాన్ని కనిపెట్టారు, ఇది కనుగొనబడిన మూలకాల్లో 63వది.

ఆ సమయంలో రష్యా దేశపు రసాయనశాస్త్రజ్ఞుడైన డిమిట్రీ ఇవానోవిచ్‌ మెండిలీయెవ్‌ మూలకాలు క్రమరహితంగా ఏర్పడుతున్నవి కావన్న నిర్ధారణకు వచ్చాడు. చివరికి 1869, మార్చి 18న ఆయన వ్రాసిన “మూలకాల వ్యవస్థ సంక్షిప్త రూపం” అనే గొప్ప వ్యాఖ్యానం రష్యన్‌ కెమికల్‌ సొసైటీలో చదవబడింది. అందులో ఆయనిలా పేర్కొన్నాడు: ‘ఏదో యాదృచ్ఛికంగా నడిపించబడేది కాక నిర్దుష్టమైన ఖచ్చితమైన సూత్రాలచే నడిపించబడే ఒక వ్యవస్థను స్థాపించాలని నేను కోరుకుంటున్నాను.’

తన ఈ ప్రఖ్యాత పరిశోధక వ్యాసంలో మెండిలీయెవ్‌ ఇలా భవిష్యవాణి పలికాడు: “మనకు తెలియని సరళమైన మూలకాలను కనుగొంటామని ఇంకా ఎదురుచూడాలి; ఉదాహరణకు అల్యూమినియం, సిలికాన్‌ మూలకాలలాంటి 65 నుండి 75 వరకు పరమాణు భారాలుగల మూలకాలను ఇంకా కనుగొనాల్సివుంది.” మెండిలీయెవ్‌ క్రొత్త మూలకాల కోసం 16 ఖాళీ స్థలాల్ని విడిచిపెట్టాడు. తన ఊహలకు రుజువులేమిటని ప్రశ్నించినప్పుడు ఆయనిలా జవాబిచ్చాడు: “రుజువులివ్వాల్సిన అవసరం నాకు లేదు. వ్యాకరణ నియమాల్లా కాక ప్రకృతి నియమాలు ఎటువంటి మినహాయింపులనూ అనుమతించడం లేదు.” ఆయనింకా ఇలా చెబుతున్నాడు: “ఉనికిలో ఉండాలని నేను చెప్పిన అజ్ఞాత మూలకాలు కనుగొనబడినప్పుడు ఇంకా ఎక్కువమంది ప్రజలు మనకు మరింత అవధానాన్నిస్తారు.”

ఖచ్చితంగా అలానే జరిగింది! “తరువాతి 15 సంవత్సరాల్లో, మెండిలీయెవ్‌ ఊహలకు దగ్గరగా సరిపోయే గుణాలుగల గాల్లియం, స్కాండియమ్‌, జెర్మేనియమ్‌లనే మూలకాలు కనుగొనబడడంతో, ఆవర్తన పట్టిక విలువనూ దాని రూపకర్త ఖ్యాతినీ మరే సందేహానికీ తావులేకుండా స్థాపించేశాయి” అని ఎన్‌సైక్లోపీడియా అమెరికానా వివరిస్తుంది. ఇక 20వ శతాబ్దం తొలిభాగానికల్లా ఉనికిలో ఉన్న మూలకాలనన్నింటినీ కనుగొనడం పూర్తైంది.

స్పష్టంగా, పరిశోధక రసాయన శాస్త్రజ్ఞుడైన ఎల్మెర్‌ డబ్ల్యు. మౌరర్‌ చెప్పినట్లుగా, “ఇంత అద్భుతమైన ఏర్పాటు ఎంతమాత్రం యాదృచ్ఛికంగా వచ్చినది కాదు.” మూలకాల అద్భుతమైన క్రమం ఒక యాదృచ్ఛికమైన విషయమనే సాధ్యత ఎంత మేరకు సమంజసమో చెబుతూ రసాయనశాస్త్ర ప్రొఫెసర్‌ అయిన జాన్‌ క్లీవ్‌లాండ్‌ కోత్రాన్‌ ఇలా అన్నాడు: “[మెండిలీయెవ్‌] ఏ మూలకాల ఉనికిని గురించి భవిష్యవాణి చెప్పాడో ఆ మూలకాలన్నీ కనుగొనబడడమూ, వాటి గుణాల గురించి ఆయన పేర్కొన్న విషయాలు ఖచ్చితంగా సరిపోవడమూ అలాంటి సాధ్యతను పూర్తిగా తీసివేశాయి. ఆయన ఏర్పర్చిన గొప్ప ప్రమాణాలు ఎన్నడూ ‘యాదృచ్ఛిక ఆవర్తన పట్టిక’ అని పిలువబడలేదు. బదులుగా అవి, ‘ఆవర్తన పట్టిక నియమాలు’ అని పిలువబడ్డాయి.”

మూలకాల్ని కూలంకషంగా అధ్యయనం చేయడమూ, అవి విశ్వంలోని ప్రతి పదార్థం ఏర్పడడానికి ఒకదానికొకటి అవెలా కలుస్తాయో పరిశీలించడమూ చూసి, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో లెక్కల ప్రొఫెసర్‌గా ఉన్న ప్రఖ్యాత భౌతికశాస్త్రజ్ఞుడైన పి. ఎ. ఎమ్‌. డిరాక్‌ ఇలా అన్నాడు: “దేవుడు అత్యున్నతమైన స్థాయిలోని గణితజ్ఞుడు అని చెబుతూ పరిస్థితిని వర్ణించవచ్చు, అంతేకాదు ఆయన ఈ విశ్వాన్ని నిర్మించడానికి చాలా అడ్వాన్స్‌డ్‌ గణితశాస్త్రాన్ని ఉపయోగించాడని చెప్పవచ్చు.”

ఇటు చిన్ని చిన్ని పరమాణువులు, అణువులు, జీవ కణాలు వంటి అదృశ్య సూక్ష్మ లోకంలోకీ, అటు దృక్‌ సాధనాలులేని కంటికి కనబడనంత దూరాల్లో ఉన్న భారీ నక్షత్రాలతో కూడిన గ్యాలక్సీల్లోకీ తొంగిచూడడం అత్యద్భుతమైన అనుభవంగా ఉంది! ఈ అనుభవం మనల్ని నమ్రతతో నింపాలి. మీరు వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చెందారు? ఈ వస్తువుల్లో ఏమి ప్రతిబింబిస్తున్నట్లు మీరు గమనించారు? మీ భౌతిక కన్నులు చూడగలిగే వాటిని మించి మీరు చూస్తున్నారా?

[అధస్సూచి]

^ ప్రాధమిక పదార్థాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. భూమ్మీద కేవలం 88 మూలకాలు మాత్రమే సహజంగా లభిస్తాయి.

[5వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

కంటికి కనబడనంత వేగం

దౌడు తీస్తున్న గుర్రం కదలిక ఎంతో వేగంగా ఉండడంతో, 19వ శతాబ్దంలో అదసలు ఎప్పుడైనా నాలుగు డెక్కలూ ఒకేసారి నేలమీద ఆన్చకుండా ఉంటాయా ఉండవా అన్న విషయంలో వాదోపవాదాలు జరిగేవి. 1872లో ఎడ్వర్డ్‌ మైబ్రిడ్జ్‌ కొన్ని ఫోటోగ్రఫిక్‌ ప్రయోగాలను ప్రారంభించాడు, చివరికి ఈ ప్రయోగాల ఆధారంగా జవాబు లభించింది. అతి వేగంతో ఫోటోల్ని తీసే టెక్నిక్‌ని ఆయన మొట్టమొదటిగా రూపొందించాడు.

మైబ్రిడ్జ్‌ 24 కెమేరాలను ఒకదానికొకటి కాస్త ఎడంగా ఒక వరుసలో నిలబెట్టాడు. ఒక్కొక్క కెమేరా షట్టర్‌కి ఒక్కొక్క దారం కట్టి దాని చివర్లను ట్రాక్‌కి ఆవలివైపున కట్టాడు. అలా, గుర్రం కెమేరాల ముందు నుండి దౌడు తీసినప్పుడు ఆ దారాల్ని తన్ని షట్టర్‌లను రిలీజ్‌ చేసింది. ఆ ఫోటోలను విశ్లేషించినప్పుడు గుర్రం కొన్నిసార్లు భూమ్మీద ఆనకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయని తెలిసింది.

[చిత్రసౌజన్యం]

Courtesy George Eastman House

[7వ పేజీలోని చిత్రం]

ఘనీభవించిన నీరు మునిగిపోకుండా ఎందుకు తేలుతుంది?

[7వ పేజీలోని చిత్రం]

డిఎన్‌ఎ అణువు వ్యాసం 0.0000025 మిల్లీమీటర్లే, అయినా అందులో నిబిడీకృతమైవున్న సమాచార మొత్తం పది లక్షల పేజీలు నిండుతుంది

[చిత్రసౌజన్యం]

Computerized model of DNA: Donald Struthers/Tony Stone Images

[8వ పేజీలోని చిత్రం]

మన శరీరంలో ఉన్న 1,00,00,000 కోట్ల [100 ట్రిలియన్ల] కణాల్లో ప్రతీదాన్లో సమన్వయంతో కూడిన రీతిలో వేలాది రసాయనిక ప్రతిచర్యలు సంభవిస్తాయి

[చిత్రసౌజన్యం]

Copyright Dennis Kunkel, University of Hawaii

[9వ పేజీలోని చిత్రాలు]

రష్యా దేశపు రసాయనశాస్త్రజ్ఞుడైన మెండిలీయెవ్‌, మూలకాలు క్రమరహితంగా ఏర్పడుతున్నవి కావన్న నిర్ధారణకు వచ్చాడు

[చిత్రసౌజన్యం]

Courtesy National Library of Medicine