చీకటి ఖైదీలకు వెలుగును ప్రసాదించిన వ్యక్తి లూయీ బ్రెయిల్
చీకటి ఖైదీలకు వెలుగును ప్రసాదించిన వ్యక్తి లూయీ బ్రెయిల్
చదవడం వ్రాయడం మీకు వస్తే, ఆ సామర్థ్యాన్ని మీరెంత అమూల్యంగా ఎంచుతారు? కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటుండవచ్చు, కానీ నేర్చుకునే మన సామర్థ్యానికి పునాది చదవడమూ వ్రాయడమూ రావడమే. చదవడం రాకపోతే విస్తారమైన జ్ఞానపు భాండాగారానికి తాళంచెవిని కోల్పోయినట్లే.
వందల సంవత్సరాలపాటు అంధులకు లిఖిత మాటలు అందుబాటులో లేకపోయాయి. అయితే 19వ శతాబ్దంలో, వారి దుస్థితి చూసి జాలిపడి, ఔత్సాహికుడైన ఒక యౌవనుడు ఒక విధమైన సంభాషణా ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఆ సంభాషణా ప్రక్రియ ఇటు ఆయనకూ అటు లక్షలాదిమంది ఇతరులకూ ఒక క్రొత్త బాటను వేసింది.
విషాదంలో నుండి ఆశాభావం చిగురించింది
ఫ్రాన్స్‌లోని పారిస్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూవ్రే గ్రామంలో 1809లో లూయీ బ్రెయిల్ జన్మించాడు. ఆయన తండ్రి సీమోన్-రనే బ్రెయిల్ గుర్రపు జీనులు తయారుచేస్తూ బతికేవాడు. బహుశ పిల్లవాడైన లూయీ తన తండ్రి దుకాణంలో తరచూ ఆటలు ఆడుకుంటుండేవాడు. అయితే ఒకసారి మాత్రం అలాంటి సందర్భంలోనే ఘోరం జరిగిపోయింది. సూదిగా ఉన్న ఉలిలాంటి ఒక ఉపకరణాన్ని పట్టుకుని దాన్ని పరధ్యాసలో కంట్లోకి దోపుకున్నాడు. జరిగిన నష్టం భర్తీచేయలేనిది. అంతకన్నా ఘోరం ఏమిటంటే, త్వరలోనే ఇన్ఫెక్షన్ రెండవ కంటికి కూడా సోకింది. మూడు సంవత్సరాల పసి వయస్సులో లూయీ పూర్తిగా అంధుడయ్యాడు.
పరిస్థితిని మెరుగుపర్చే ఉద్దేశంతో లూయీ తల్లిదండ్రులూ పారిష్ ప్రీస్ట్ అయిన ఝాక్ పాల్వీలు కలిసి, స్థానిక పాఠశాలలో క్లాసులకు లూయీ హాజరయ్యేలా ఏర్పాటు చేశారు. తాను వింటున్నదాన్లో చాలామట్టుకు లూయీ అర్థం చేసుకునేవాడు. నిజానికి కొన్ని సంవత్సరాలు తన క్లాసుకి లీడర్‌గా కూడా ఉన్నాడు! కానీ చూపు ఉన్నవారికోసం రూపొందించిన బోధనా పద్ధతుల ద్వారా చూపులేనివారు నేర్చుకోగల్గే దానికి పరిమితులున్నాయి. అందుకని లూయీని 1819లో రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్‌లో చేర్పించారు.
ఈ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించిన వలెంటిన్ ఆవ్యీ, అంధులు చదవడానికి సహాయం చేసే ఒక కార్యక్రమాన్ని స్థాపించిన తొలి వ్యక్తుల్లో ఒకరు. అంధులు పాఠశాలలోని విద్యాబోధన నుండి ప్రయోజనం పొందలేరని ప్రజల్లో ప్రబలివున్న అభిప్రాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది ఆయన కోరిక. అట్టలాంటి గట్టి కాగితంపైన పైకి వచ్చేలా పెద్ద పెద్ద అక్షరాలను ఉబ్బెత్తుగా చెక్కడం వంటివి ఆవ్యీ చేసిన తొలి ప్రయోగాలలో చేరివున్నాయి. ఆ ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అటుతర్వాత మొక్కలుగా వృద్ధి అయ్యేందుకు అవి విత్తనాల్ని నాటినట్లయ్యాయి.
ఆవ్యీ దగ్గరున్న చిన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల్లోని ఉబ్బెత్తుగా ఉన్న పెద్ద పెద్ద అక్షరాల్ని చదవడం బ్రెయిల్ నేర్చుకున్నాడు. అయితే ఈ పద్ధతి ద్వారా నేర్చుకోవడం చాలా మెల్లిగా జరుగుతుందనీ అంత ఆచరణీయంగా లేదనీ ఆయన గ్రహించాడు. ఎంతైనా ఆ అక్షరాలు కళ్ళకోసం రూపొందించబడ్డాయే గాని వేళ్ళకోసం కాదు గదా. సంతోషకరంగా ఈ పరిమితుల్ని గుర్తించిన మరొక వ్యక్తి రంగంపైకి రానైయున్నాడు.
అనూహ్యమైన వ్యక్తినుండి ఒక తలంపు
లూయీ బ్రెయిల్‌కి 12 ఏండ్లు ఉన్నప్పుడు అంటే 1821లో షార్ల్ బార్బ్యే అనే ఒక రిటైర్డ్ ఆర్టిల్లరీ క్యాప్టెన్, రాయల్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించాడు. ఆయన అక్కడ చీకటి వ్రాత అనే లిఖిత మాధ్యమాన్ని ప్రదర్శించి చూపించాడు, ఇది అటుతర్వాత సోనోగ్రఫీ అని పిలువబడింది. ఈ చీకటి వ్రాతని యుద్ధరంగంలో ఉపయోగించడం కోసం అభివృద్ధిపర్చడం జరిగింది. అది, స్పర్శ ద్వారా అక్షరాల్ని చదివే ఒక లిఖిత మాధ్యమం. ఈ పద్ధతిలో, నిలువ వరుసలో ఆరేసి, అడ్డ వరుసలో రెండేసి చుక్కల చొప్పున ఉబ్బెత్తుగా ఉన్న చుక్కలు దీర్ఘచతురస్రాకార రూపంలో ఉంటాయి. ఒక్కొక్క పద శబ్దానికి ఒక్కొక్క సంకేతాన్ని నిర్ధారించాలన్న ఈ భావనకు స్కూల్లో గొప్ప ప్రతిస్పందన లభించింది. బ్రెయిల్, ఈ క్రొత్త విధానంలో గొప్ప
ఉత్సాహంతో మమేకమైపోయి దానికి మెరుగులు కూడా దిద్దాడు. కానీ ఈ విధానం నిజంగా ఆచరణాత్మకమైనదిగా పనిచేయాలంటే బ్రెయిల్ చేయాల్సిందింకా ఎంతో ఉంది. తన డైరీలో ఆయన ఈ విధంగా వ్రాశాడు: “మనుషుల గురించీ సంఘటనల గురించీ, తలంపుల గురించీ సిద్ధాంతాల గురించీ నాకు నా కళ్ళు చెప్పలేకపోతే, నేను మరో మార్గాన్ని వెదుక్కోవల్సిందే.”అలా తర్వాతి రెండు సంవత్సరాలు బ్రెయిల్ ఆ సంకేత భాషను సరళీకృతం చేయడానికి పట్టుదలతో కృషి చేశాడు. చివరికి ఆయన నిలువు వరుసలో మూడేసి అడ్డ వరుసలో రెండేసి చుక్కలు మాత్రమే అవసరమయ్యే ఒక గడిపై ఆధారపడిన ఒక పద్ధతిని అంటే మరింత మెరుగులు దిద్దబడిన అద్భుతమైన ఒక పద్ధతిని అభివృద్ధి చేశాడు. 1824లో లూయీ బ్రెయిల్‌కి 15 ఏండ్లున్నప్పుడు ఆరు చుక్కల గడి విధానాన్ని రూపొందించడం పూర్తి చేశాడు. అటుతర్వాత త్వరలోనే రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో బోధించడం ప్రారంభించాడు, 1829లో ఆయన తన విలక్షణమైన కమ్యూనికేషన్ విధానాన్ని ప్రచురించాడు; ఇప్పుడది ఆయన పేరు మీదుగా పిలువబడుతుంది. కొన్ని చిన్న చిన్న మార్పులు తప్పించి నేటి వరకూ ఆయన రూపొందించిన విధానమే అమల్లో ఉంది.
ప్రపంచానికి అందుబాటులో బ్రెయిల్
ఉబ్బెత్తుగా ఉండే చుక్కల బ్రెయిల్ విధానాన్ని వివరించే మొట్టమొదటి పుస్తకం 1820ల చివర్లో వెలువడింది; కానీ ఈ పద్ధతికి ప్రజాదరణ చాలా నెమ్మదిగా లభిస్తోంది. చివరికి రాయల్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఈ క్రొత్త సంకేత భాషను బ్రెయిల్ చనిపోయిన రెండు సంవత్సరాలకు గానీ అంటే 1854 వరకూ గానీ అధికారికంగా ఆమోదించబడలేదు. ఏదేమైనా, ఎంతో ఉత్కృష్టమైన ఈ విధానానికి ఎట్టకేలకు ప్రజాదరణ లభించింది.
తరువాత అనేక సంస్థలు బ్రెయిల్ సాహిత్యాన్ని ఉత్పత్తి చేశాయి. ఇంగ్లీషు భాషా ప్రజల కోసం బ్రెయిల్ సంకేత భాషను ఇంకా ప్రామాణీకరిస్తూ ఉన్న రోజుల్లోనే అంటే 1912లో వాచ్ టవర్ సొసైటీ బ్రెయిల్ భాషలో సాహిత్యాన్ని తయారు చేయడం ప్రారంభించింది. నేడు ఆధునిక బ్రెయిల్ ముద్రణా పద్ధతుల్ని ఉపయోగిస్తూ సొసైటీ ప్రతి సంవత్సరం లక్షలాది పేజీల్ని ఎనిమిది భాషల్లో తయారుచేస్తోంది, వీటిని 70కి పైగా దేశాల్లో పంపిణీ చేస్తోంది. బ్రెయిల్ బైబిలు సాహిత్యానికిగల డిమాండు పెరుగుతుండడంతో ఇటీవల సొసైటీ తన ఉత్పత్తిని రెండింతలు చేసింది.
చక్కగా రూపొందించబడిన సరళమైన బ్రెయిల్ సంకేత భాష, నేడు దృష్టి లోపంగల లక్షలాదిమందికి లిఖిత మాటల్ని అందుబాటులో ఉంచుతుంది—దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక యౌవనస్థుడు చేసిన అకుంఠిత ప్రయత్నాల మూలంగానే.
[15వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
బ్రెయిల్ సంకేత భాషను భేదించడం
బ్రెయిల్‌ను ఎడమ నుండి కుడికి చదువుతారు, ఇందుకు ఒకటి లేదా రెండు చేతుల్నీ ఉపయోగించవచ్చు. ఒక్కొక్క బ్రెయిల్ గడిలో 63 రకాలుగా చుక్కలు పెట్టే సాధ్యత ఉంది. అందుకని, అనేక భాషలకు చెందిన అక్షరమాలలోని అక్షరాలన్నింటినీ, విరామ చిహ్నాలనూ సూచించడానికి ఆ 63 రకాల చుక్కలలో నుంచి తీసుకున్న కొన్ని నిర్దిష్టమైన చుక్కల సమ్మేళనాన్ని కేటాయించవచ్చు. చాలా భాషలు క్లుప్తీకరించిన బ్రెయిల్‌ను ఉపయోగిస్తాయి, ఇందులో కొన్ని గడులు మరీ తరచుగా వచ్చే అక్షరాల సమ్మిళిత పదాలకూ లేదా పూర్తి పదాలకూ సంకేతాలుగా ఉంటాయి. కొందరు బ్రెయిల్‌లో ఎంత నైపుణ్యాన్ని సంపాదించారంటే వారు నిమిషానికి 200 పదాల్ని చదవగలరు.
[చిత్రాలు]
ఒకటి నుండి పది అక్షరాల్ని సూచించడానికి గడిలో పై రెండు అడ్డ వరుసల్లో ఉన్న చుక్కల్నే ఉపయోగిస్తారు
తరువాతి పది అక్షరాల్ని సూచించడానికి మొదటి పది అక్షరాల సంకేతాలకు తోడు గడిలో ఉన్న మూడవ అడ్డ వరుసనందు ఎడమ మూలన మరొక చుక్కను చేరుస్తారు
చివరి ఐదు అక్షరాల్ని సూచించడానికి మొదటి ఐదు అక్షరాల సంకేతాలకు తోడు గడిలో ఉన్న మూడవ అడ్డ వరుసనందు రెండు చుక్కల్నీ చేరుస్తారు; దీని నుంచి “w” అనే అక్షరానికి మినహాయింపుంది, ఎందుకంటే దాన్ని అటు తర్వాత ఫ్రెంచి అక్షరాలకు చేర్చారు
[14వ పేజీలోని చిత్రసౌజన్యం]
Portrait: © Maison Natale de Louis Braille - Coupvray, France/Photo Jean-Claude Yon