కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చెరకుగడ గడ్డి కుటుంబంలో పొడవైనవాటిలో ఒకటి

చెరకుగడ గడ్డి కుటుంబంలో పొడవైనవాటిలో ఒకటి

చెరకుగడ గడ్డి కుటుంబంలో పొడవైనవాటిలో ఒకటి

ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

చక్కెర లేకపోయినట్లైతే మనకు ఎంత కష్టమో కదా? చక్కెర లేకపోతే లోకమే లేదు అనడం అతిశయోక్తే కావచ్చు​—⁠కానీ నిజంగా అది అకస్మాత్తుగా అదృశ్యమైపోతే అనేక వంటల్ని పూర్తిగా మార్చాల్సివుంటుంది. అవును, నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో చక్కెర వినియోగం సర్వసాధారణం, అదే చక్కెర ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త పరిశ్రమగా చేసింది.

అటు క్యూబా నుండి ఇటు ఇండియా వరకు, బ్రెజిల్‌ నుండి ఆఫ్రికా వరకు లక్షలాదిమంది ప్రజలు చెరకును పండిస్తుంటారు. నిజానికి ఒకప్పుడు చక్కెర ఉత్పత్తి ప్రపంచంలోనే అతి పెద్ద లాభసాటియైన పరిశ్రమగా వర్ధిల్లింది. ఏవో కొన్ని ఇతర మొక్కలు తప్ప చెరకు మార్చినంతగా ప్రపంచాన్ని ఏదీ మార్చలేదని కూడా చెప్పవచ్చు.

ఈ విశిష్టమైన మొక్కను గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో చెరకును పండించే ఒక ప్రాంతాన్ని మాతోపాటు సందర్శించండి. ఇక్కడ చెరకు ఉత్పత్తి మరీ ఎక్కువగా లేకపోయినా ఫలదాయకమైన వ్యవసాయ పద్ధతుల మూలంగానూ, సమర్థవంతమైన చక్కెర తయారీ పద్ధతుల మూలంగానూ ఇది ప్రపంచంలోనే ప్రధాన ముడి చక్కెర ఎగుమతిదార్లలో ఒకటైంది.

చెరకుగడ ఉత్పత్తి ప్రాంతానికి సందర్శనం

వేడి గాలులు వీస్తున్నాయి, గాల్లో తేమ కూడా ఉంది. ఉష్ణమండలం కావడంతో సూరీడు కోతకొచ్చిన ఒక చెరకు తోటమీద విరగకాస్తున్నాడు. గోధుమపంట కోతకు ఉపయోగించేలాంటి ఒక పెద్ద యంత్రం పొడవుగా పెరిగిన చెరకు తోటలో నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అది ముందుకు వెళ్తుండగా గడల్ని నరుకుతూ ప్రక్కనే తనతోపాటు కదులుతూ ఉన్న ఒక బండిలోకి వేస్తుంది. నరికిన చెరకు గడల నుంచి నెమ్మదిగా చెరకు రసం బయటికి వస్తోంది, అది గాలినంతటినీ విపరీతమైన తియ్యటి వాసనతో నింపేస్తోంది. విశిష్టమైన ఈ గడ్డి నుండి ఉత్పత్తి అయ్యే చిక్కని రసం తన పయనాన్ని ఈ తోట నుండి ప్రారంభించి మీ ఇంట్లోని టేబుల్‌ మీదికి వచ్చిచేరుతుంది.

ఇటీవలి కాలం వరకూ ఆస్ట్రేలియాలో చెరకును చేతులతో నరికేవారు​—⁠చెరకును పండించే అనేక దేశాల్లో ఇప్పటికీ అలానే చేస్తున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. పొలంలో కూలీలు చేతులతో చెరకును నరుకుతూ ఉన్నారు. వాళ్ళు చెమటోడ్చుతూ చెరకు పొలంలో ఒక వరుసలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. ఒక సేనలా ఖచ్చితమైన పద్ధతిలో ఆ కూలీలు నిటారుగా ఉన్న చెరకు గడల ఒక్కొక్క గుత్తిని ముందు ఒక చేత్తో ఒక ప్రక్కకు వంచి వాటి మూలాల్ని కనబడేలా చేస్తున్నారు. తరువాత సర్ర్‌! సర్ర్‌! మని ఒక్కొక్క వేటుతో వాటిని నరుకుతున్నారు. పెద్ద పెద్ద కత్తులతో గడల్ని నేలకంటా నరికి ఒక పద్ధతి ప్రకారం వరుసగా ప్రక్కకి పెడుతున్నారు. ఒక గుత్తి తర్వాత మరో గుత్తి దగ్గరికి సాగిపోతున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా మారుతూ ఉంది, ఇప్పుడు చాలా దేశాల్లో ఈ ప్రక్రియను యంత్రాల సహాయంతో చేపడుతున్నారు.

ఆస్ట్రేలియాలోని చెరకుగడ పండించే ప్రాంతం ప్రాథమికంగా దాదాపు 2,100 కిలోమీటర్ల పొడవున ఉన్న కోస్తా ప్రాంతంతో కూడినదే. దీన్లో చాలా ప్రాంతం ప్రఖ్యాత గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌కు సమాంతరంగా సాగుతుంది. [జూన్‌ 8, 1991 తేజరిల్లు! సంచికలోని “ద గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ సందర్శన” అనే (ఆంగ్లం) ఆర్టికల్‌ను చూడండి] సంవత్సరమంతా వేడిగా తేమగా ఉండే ఇక్కడి వాతావరణం మూలంగా చెరకు పంట పుష్కలంగా పండుతుంది, దాదాపు 6,500 మంది వ్యవసాయదారులు సాధారణంగా చిన్న చిన్న పొలాల్లో తమ కుటుంబాలతో జీవిస్తుంటారు, ఈ పొలాలు ద్రాక్షా తోటలోని ద్రాక్షా గుత్తుల్లా అక్కడక్కడా చెదిరివుంటాయి.

మన ప్రయాణంలో చాలా దూరం వెళ్ళిన తరువాత, దూరంగా క్వీన్స్‌లాండ్‌ కోస్తాలో మధ్యన ఉన్న బండాబెర్గ్‌ అనే చెరకు నగరం మనకు కనిపిస్తుంది. ఒక చిన్న గుట్ట మీద నుంచి దిగుతుండగా ఊపిరిబిగబట్టే దృశ్యం మన కళ్ళముందుకు వస్తుంది​—⁠కనుచూపు మేరంతా చెరకు గాలికి వీస్తూ ఒక సంద్రంలా కనిపిస్తుంది! ఎన్నెన్ని వర్ణాలో! అక్కడున్న వేర్వేరు చెరకు పొలాలు వేర్వేరు పంట దశల్లో ఉండి, చూడ్డానికి నేలపై తాపడం చేసిన వర్ణఫలకాల్లా రకరకాల ఛాయల్లో ఉన్న ఆకుపచ్చ బంగారు వర్ణాల్లో కాంతులీనుతూ, అక్కడక్కడా ఈ సంత్సరం సాగుచేయకుండా వదిలేసిన లేదా ఈపాటికే ఊడ్చేసిన ముదురు గోధుమ రంగులో ఉన్న పొలాలతో చిన్న చిన్న అతుకులు వేసినట్టు అగుపిస్తున్నాయి.

జూలై నెల అన్నింటికన్నా చల్లగా ఉంటుంది, అందుకని అప్పుడే చెరకు పంట కోతకాలము, వాటి రసం తీసే కాలము ప్రారంభమైంది. వివిధ దశల్లో ఉన్న పంటలు పక్వానికి వచ్చే కొలది ఈ పనులు డిసెంబరు వరకు కొనసాగుతాయి. చెరకు కోత తర్వాత దాన్ని ఏమి చేస్తారో చూడ్డానికి మనం ఇప్పుడు చెరకు ఫ్యాక్టరీకి వెళ్ళాల్సిందే. కానీ వెళ్ళే ముందు మనం చెరకును గురించి కాస్త తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో నెలకొల్పిన చక్కెర ప్రయోగశాల దగ్గర మనం ముందు ఆగుదాం. ఇక్కడ శాస్త్రజ్ఞులు చెరకు సాగునూ దాని ఉత్పత్తినీ మెరుగుపర్చడానికి వివిధ రకాల చెరకును అభివృద్ధి చేస్తున్నారు.

చెరకు మూలం, వ్యవసాయం

చెరకు పరిశోధనా కేంద్రం దగ్గర ఒక వ్యవసాయశాస్త్రజ్ఞుడు చెరకు గురించీ దాన్నెలా పండిస్తారనే దానిగురించీ మనకు నేర్పించడానికి పూర్తి సంసిద్ధతతో ముందుకు వచ్చాడు. చెరకుకు మూలం ఆగ్నేయాసియా, న్యూ గినియాల్లోని వర్షాపాత అడవుల్లో ఉంది. పెరట్లోని గడ్డి, తృణధాన్యాలు, వెదురు వంటి ఎంతో వైవిధ్యంగల గడ్డి కుటుంబంలో పొడవైన వాటిలో ఇది ఒకటి. ఈ మొక్కలన్నీ కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆకుల్లో చక్కెరను తయారుచేస్తాయి. అయినా చెరకులో ఉన్న విశేషం ఏమిటంటే అది చాలా పెద్ద మొత్తాల్లో చక్కెరను తయారుచేస్తుంది, ఆ చక్కెరను తంతువులతో నిండిన తన కాండంలో నిల్వ ఉంచుకుంటుంది.

ప్రాచీన ఇండియాలోని అనేక ప్రాంతాల్లో చెరకుగడ సేద్యం చేయడం తెలుసు. సా.శ.పూ. 327లో అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ సైన్యాలు దండెత్తినప్పుడు, ఇక్కడి నివాసులు “అద్భుతమైన రెల్లును నములుతూవున్నారు, దాన్లోనుండి ఎటువంటి తేనెటీగల సహకారమూ లేకుండానే ఒక రకమైన తేనె వస్తూవుంది” అని ఆయన లేఖికులు వ్రాశారు. 15వ శతాబ్దంలో ప్రపంచ పరిశోధనా అభివృద్ధులు వేగాన్ని పుంజుకోగా చెరకుగడల ఉత్పత్తి దావానలంలా వ్యాపించింది. నేడు ఈ గడల్లోని వైవిధ్యం వేలల్లో ఉంది, 80 దేశాలకు పైగా కలిపితే సాలీనా వంద కోట్ల టన్నుల పంట ఉత్పత్తి అవుతూంది.

ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నాట్లు వేయడం చాలా శ్రమతో కూడిన పనిగా ఉంటుంది. చెరకుగడల్ని కనీసం 40 సెంటీమీటర్ల పొడవులో ముక్కలుగా కోసి, ఒకదానికొకటి 1.5 మీటర్ల దూరంలో నాటుతారు. ఒక్కొక్క ముక్క 8 నుండి 12 గడలతో కూడిన గుత్తిగా పెరుగుతుంది. ఇవి 12 నుండి 16 నెలల కాలానికల్లా కోతకు వచ్చేస్తాయి. కోతకు సిద్ధంగా ఉన్న దట్టమైన చెరకు పొలం గుండా నడవడం చాలా భీతిగొల్పే అనుభవం. గుబురుగా ఉండే ఆకులతో చెరకుగడలు దాదాపు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇప్పుడు వినబడిన సవ్వడి ఆకుల కదలిక మూలంగానా లేక ఏదైనా పాము లేక సుందెలుక కదిలిన మూలంగానా? ఏమో, ఎందుకైనా మంచిది, పొలంలో నుంచి తిరిగి పోవడం ఉత్తమం!

చెరకుగడలకు పట్టే చీడల్నీ వ్యాధుల్నీ ఎదుర్కొనే మార్గాల కోసం పరిశోధన జరుగుతోంది. ఈ ప్రయత్నాల్లో చాలామట్టుకు విజయవంతమయ్యాయి, అయితే అన్నీ కాదు. ఉదాహరణకు, చెరకుగడలకు పట్టే కీటకాలు పెద్ద సమస్యగా ఉన్నప్పుడు, వాటిని నిర్మూలించడానికి 1935లో జరిగిన ప్రయత్నంలో అధికారులు హవాయీ కేన్‌ టోడ్‌ కీటకాలను ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోకి ప్రవేశపెట్టారు. విచారకరంగా, ఈ కేన్‌ టోడ్‌ కీటకాలు చెరకుగడలకు పట్టే కీటకాలను గాక సమృద్ధిగా అందుబాటులో ఉన్న వేరే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాయి, అంతేకాదు అవి విపరీతంగా సంతానోత్పత్తి చేసి ఈశాన్య ఆస్ట్రేలియా అంతట్లో అవే ఒక పెద్ద సమస్య అయికూర్చున్నాయి.

కోతకు ముందే కాల్చడమా?

చీకటి పడ్డాక స్థానిక రైతు కోతకు సిద్ధంగా ఉన్న తన చెరకుగడ పొలానికి నిప్పంటించడం చూసి మేము ఆశ్చర్యపోయాం. కొన్ని సెకన్లలో ఆ చిన్న పొలం పెద్ద జ్వాలలతో నిండిపోయి ఆ చీకట్లో ఆకాశంలోకి అగ్నినాల్కల్ని విరజిమ్ముతూ ఉంది. అలా చెరకును తగలబెట్టడం ద్వారా అనవసరమైన ఆకులూ మరితర పదార్థాలూ తీసేయబడ్తాయి, తద్వారా కోత అలాగే ఫ్యాక్టరీలో పనులు కూడా సులభంగా ఉంటాయి. అయితే ఇటీవలి కాలాల్లో మాత్రం ఇలా అద్భుతరీతిన తగులబెట్టాల్సిన అవసరం లేకుండానే కోతపని చేయడంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారు. ఈ పద్ధతిని హరిత చెరకు కోత అని పిలుస్తున్నారు. దీని మూలంగా చక్కెర ఉత్పాదన పెరగడమే కాక, ఎరువులా పనిచేయడానికి ఆకులు భూమిలో మిగిలిపోతాయి. ఈ పద్ధతిలో భూమి కోతను నివారించడము కలుపు మొక్కలు పెరగకుండా కాపాడడమూ జరుగుతుంది.

నేడు చెరకును పండించే అనేక దేశాల్లో ఇప్పటికీ కోత చేతులతోటే జరుగుతున్నప్పటికీ, భారీ కేన్‌ కట్టింగ్‌ యంత్రాలతో కోతను చేపట్టే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఏనుగుల్లాంటి ఈ భారీ యంత్రాలు పొడుగ్గా పెరిగిన చెరకుగడల గుండా పోతూ వాటి చివర్లను నరుకుతూ, అదే సమయంలో ఆకుల్ని కూడా తీసేస్తూ, తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తూ ముందుకు సాగిపోతుంటాయి. ఇక ఈ ముక్కల్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడమే తరువాయి. పొలంలో పనిచేసే ఒక్కొక్క కూలి ఎంతో శ్రమపడి చేతులతో రోజుకి సగటున 5 టన్నుల చెరకుగడల్ని సేకరిస్తే, ఈ యంత్రం రోజుకి 300 టన్నుల్ని సునాయాసంగా సేకరించగలదు. పొలాల్లో కొన్ని సంవత్సరాలపాటు ప్రతి సంవత్సరం కోత జరుగుతుంది, చివరికి చెరకుగడల్లో చక్కెర దిగుబడి తగ్గిపోయినప్పుడు క్రొత్త మొక్కలు నాటాల్సివస్తుంది.

ఒక్కసారి చెరకుగడను నరకడం జరిగిందంటే దాన్ని వెంటనే రవాణా చేయాల్సివుంటుంది, ఎందుకంటే కోత జరిగిన తర్వాత దానిలో చక్కెర శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది. క్వీన్స్‌లాండ్‌లోని చెరకుగడ పొలాలున్న ప్రాంతంలో చెరకును ఫ్యాక్టరీలకు త్వరితంగా రవాణా చేయడానికి దాదాపు 4,100 కిలోమీటర్ల పొడవున నారో గేజ్‌లో ట్రామ్‌ సర్వీసు ఉంది. ఈ చిన్న రైళ్ళు డజన్ల కొద్దీ కప్పుల్లేని పెట్టెల్లో అంచుకంటా చెరకుగడల్ని నింపుకుని గ్రామాల గుండా వెళ్తుండే దృశ్యం చాలా వర్ణభరితంగా ఉంటుంది.

ఫ్యాక్టరీలో

చక్కెర ఫ్యాక్టరీని సందర్శించడం చాలా ఆసక్తికరమైన అనుభవం. ముందుగా మనకు చెరకును నింపుకుని వచ్చిన బండ్లు స్వాగతం పలుకుతాయి. భారీ సైజు ష్రెడ్డర్లు, రోలర్లు చెరకును పిప్పి పిప్పి చేస్తూ వాటి తంతుల నుండి చెరకు రసాన్ని బయటికి తీస్తాయి. మిగిలిపోయిన చెరకు పిప్పిని ఎండబెట్టి ఫ్యాక్టరీకంతటికీ విద్యుచ్ఛక్తిని సరఫరా చేయడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిపోయిన పిప్పిని కాగితం తయారీదార్లకు, నిర్మాణసామగ్రి తయారీదార్లకు తమ ఉత్పత్తుల్లో వినియోగించడానికిగాను అమ్మేస్తారు.

తరువాత చెరకు రసంలోని మలినాల్ని తీసేయడంతో శుద్ధమైన సారాయి మిగులుతుంది. మడ్డి అని పిలిచే ఈ మలినాల్ని ఎరువుల్లో వినియోగిస్తారు. మరో ఉపోత్పత్తి అయిన మోలాసెస్‌ను పశువులకు ఆహారంగా లేదా రమ్‌, పారిశ్రామిక ఆల్కహాల్‌ వంటివాటి డిస్టిల్లేషన్‌లో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. చెరకుగడల విభిన్నత, నైపుణ్యంతో కూడిన ఫ్యాక్టరీ ప్రక్రియలు మనల్ని నిజంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

ఈ సారాయిలో అదనంగా ఉన్న నీటిని తీసేయడానికి మరిగించి, చిక్కని ద్రావణంగా మారుస్తారు. తర్వాత దానిపై చిన్న చిన్న చక్కెర స్ఫటికాలను చల్లుతారు. ఈ స్ఫటికాలు నెమ్మదిగా కావల్సిన పరిమాణానికి చేరుకునేంత వరకు పెరగనిస్తారు. తర్వాత వాటిని ఆ మిశ్రణంలోనుండి తీసేసి ఆరబెడతారు. ఇక మిగిలిపోయినది ముడి బ్రౌన్‌ షుగర్‌. ఈ ముడి చక్కెరను ఇంకా శుద్ధీకరిస్తే మనకు బాగా పరిచయమున్న మన భోజనపు బల్లపైనున్న తెల్ల చక్కెరగా మారుతుంది.

చెరకుగడల ప్రాంతానికి మనం చేసిన ఈ అద్భుతమైన ప్రబోధాత్మకమైన సందర్శనం తరువాత బహుశ మీరీసారి త్రాగే టీ లేదా కాఫీ మరింత తియ్యగా ఉంటుండవచ్చు. ఒక్కమాట, మీకు డయాబెటిస్‌ ఉంటే మీరు చక్కెరను మానేసి మరో ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిరావచ్చు.

గడ్డి కుటుంబంలో నిజంగానే పొడవైన ఈ అత్యద్భుత చెరకుగడను సృష్టించి, ఇంత సమృద్ధిగా పెరిగేలా చేసిన సృష్టికర్త వైవిధ్యతా నైపుణ్యాలను బట్టి మనం గాఢంగా ప్రభావితం చెందాము!

[22వ పేజీలోని బాక్సు]

బీట్‌ రూట్‌ లేక చెరకు, ఏది?

ప్రపంచ పంటల్లోని రెండు అతి పెద్ద పంటల్లో నుండి చక్కెర ఉత్పత్తి అవుతుంది. చెరకుగడల్ని ఎక్కువగా ఉష్ణమండలాల్లో పండిస్తుంటారు, ఇది ప్రపంచ చక్కెర ఉత్పత్తిలో 65 శాతం వరకు ఉంటుంది. మిగిలిన 35 శాతం షుగర్‌ బీట్‌ల నుండి ఉత్పత్తి చేస్తారు, ఇవి సాధారణంగా తూర్పు పశ్చిమ యూరప్‌, ఉత్తర అమెరికాల్లాంటి చల్లని వాతావరణాలున్న ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ రెండు చక్కెరలూ రసాయనికంగా చూస్తే ఒకే విధంగా ఉంటాయి.

[23వ పేజీలోని చిత్రం]

చెరకు కోత యంత్రం. ట్రాక్టర్‌తో పాటుగా ఒక బండి వెళ్తుంది

[23వ పేజీలోని చిత్రం]

కోతకు ముందు చెరకుగడల్ని తగులబెట్టడం

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

All pictures on pages 21-4: Queensland Sugar Corporation