ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
ఈకలతో కూడిన శిలాజం ఒక మోసం
చైనాలోని లియావోనింగ్ ప్రాంతంలో కనుగొనబడిన ఒక శిలాజం “డైనోసార్లకు పక్షులకు మధ్య ఉన్న సంక్లిష్టమైన గొలుసులో ఒక నిజమైన మిస్సింగ్ లింకు” అని నేషనల్ జియోగ్రఫిక్‌లో నివేదించబడింది. ఆర్కియోరాప్టర్ లియావోనింగెన్సిస్ అనే పేరు పెట్టబడిన ఈ శిలాజానికి, డైనోసార్ తోక, పక్షి రొమ్ము భుజాలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు శాస్త్రజ్ఞులు “తాము ఒక శిలాజపు ముక్క విషయంలో మోసపోయామని” ఒప్పుకుంటున్నారని సైన్ న్యూస్ నివేదిస్తుంది. తోకకీ శరీరానికీ మధ్య ఉండాల్సిన ఎముకలు కన్పించకపోవడంతో, అలాగే ఈ శిలాజం ఉన్న రాతిపై ఎవరో పనిచేసిన చిహ్నాలు కనిపించడంతో ఈ శిలాజాన్ని పరీక్షించిన శిలాజశాస్త్రజ్ఞులకు అనుమానం వచ్చింది. “డైనోసార్ తోకలో ఒక భాగాన్ని మరొక పక్షి శిలాజానికి అంటించడం ద్వారా ఆర్కియోరాప్టర్ విలువను పెంచడానికి ప్రయత్నించారని” కెనడాలోని అల్బెర్డాలో ఉన్న రాయల్ టిరెల్ మ్యూజియం ఆఫ్ పెలియాంటాలజీకి చెందిన ఫిలిప్ కరీ అనుమానిస్తున్నాడని ఆ నివేదిక తెలియజేస్తుంది.
పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త
ఫ్రెంచి దిన పత్రికయైన ల మోండ్ ప్రకారం ఫ్రాన్స్‌లో 52 శాతం గృహాల్లో పెంపుడు జంతువులున్నాయి. అయితే, ఇటీవల ఫ్రాన్స్‌లోని మేజో-ఆల్ఫోర్ వద్దనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపేరిటివ్ యానిమల్ ఇమ్యూనాలజీలో, పశు వైద్యుల బృందం ఒకటి నిర్వహించిన అధ్యయనంలో, ఫ్రాన్స్‌లోని 84 లక్షల పిల్లుల, 79 లక్షల కుక్కల యజమానులకు వచ్చిన అనేక వ్యాధులకు వాటి శరీరాల్లో ఉన్న ఫంగస్ మరియు పరాన్నజీవులే కారణమని వెల్లడియైంది. వీటిలో తామర, ఏటికపాములు, గజ్జి, లీష్‌మానియాసిస్, టాక్సోప్లాస్మోసిస్ వంటివి ఉన్నాయి. ఈ చివరిది గర్భిణీ స్త్రీల్లో మృత శిశువుల్ని కనేలా లేదా పిండం వికృతంగా మారేలా చేయవచ్చు. పెంపుడు జంతువుల మూలంగా కలిగిన అనేకమైన అలెర్జీలను గురించీ, కుక్క కాట్ల మూలంగా కలిగే ఇన్ఫెక్షన్‌ల గురించీ కూడా ఆ నివేదిక పేర్కొంటుంది. ఫ్రాన్స్‌లో సంవత్సరానికి 1,00,000 కుక్క కాట్ల కేసులు నమోదౌతున్నాయి.
విషపు మందా?
అమెరికాలో సంవత్సరానికి 44,000 నుండి 98,000 మంది ఆసుపత్రుల్లో చేరిన తరువాత వైద్యపరమైన పొరబాట్ల మూలంగా చనిపోతుంటారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ నివేదిస్తుంది. ఆసుపత్రులు, క్లినిక్‌లు, మందుషాపులు పనిచేసే విధానాల్లో లోపాలే కారణమని చెప్పబడుతుంది. ఉదాహరణకు, తరచు డాక్టర్ల చేతివ్రాత ఘోరంగా ఉండడం మూలంగా మందు షాపుల యజమానులు ప్రిస్క్రిప్షన్‌ల ప్రకారం మందులు అందజేయడంలో సమస్యలు ఎదురౌతున్నాయి. డాక్టరు పది మిల్లీగ్రాములు చెప్పాడో పది మైక్రోగ్రాములు చెప్పాడో తెలియడం లేదు. ఈ సమస్యని ఇంకా జటిలం చేస్తున్నదేమిటంటే చాలా మందులు ఒకే రకం పేర్లతో ఉండడమే. అవి, డాక్టర్లనూ, నర్సులనూ, మందు షాపుల యజమానులనూ, రోగులనూ అందరినీ ఒకే విధమైన గందరగోళంలో పడేస్తున్నాయి. రానున్న ఐదు సంవత్సరాల్లో వైద్యపరమైన పొరబాట్లు 50 శాతం తగ్గాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ పిలుపునిచ్చింది.
మరిన్ని భాషల్లోకి బైబిలు అనువాదం
ఎక్సెల్సియోర్ అనే మెక్సికో దేశపు వార్తాపత్రిక, “ప్రపంచంలో అత్యధికంగా అనువదించబడిన పుస్తకంగా బైబిలే ఇంకా కొనసాగుతోంది” అని చెబుతోంది. జర్మన్ బైబిల్ సొసైటీ ప్రకారం 1999వ సంవత్సరంలో బైబిలు అదనంగా 21 భాషల్లోకి అనువదించబడింది, ప్రస్తుతం కనీసం బైబిల్లోని కొన్ని భాగాలైనా 2,233 భాషల్లో
అందుబాటులో ఉన్నాయి. వీటిలో “పాత నిబంధన, క్రొత్త నిబంధనలు పూర్తిగా కలిపి 371 భాషల్లోకి అనువదించబడ్డాయి, అంటే 1998వ సంవత్సరంతో పోలిస్తే అదనంగా 5 భాషలన్నమాట.” ఇన్ని భాషలు ఎక్కడెక్కడివి? “అన్నింటికన్నా ఎక్కువగా ఆఫ్రికాలో 627 ఉన్నాయి, ఆసియాలో 553, ఆస్ట్రేలియా/పసిఫిక్‌లో 396, లాటిన్ అమెరికాలో/కరీబియన్‌లో 384, యూరప్‌లో 197, అమెరికాలో 73 ఉన్నాయి” అని ఆ పత్రిక చెబుతుంది. అయినప్పటికీ, “బైబిలు ప్రపంచభాషల్లో కనీసం సగం భాషల్లోకి కూడా అనువదించబడలేదు.” ఎందుకని? ఎందుకంటే ఆయా భాషలు మాట్లాడే ప్రజల సంఖ్య చాలా తక్కువ, వాటిలోకి బైబిలును అనువదించడం సవాలుతో కూడినది. అంతేగాక, చాలామంది ప్రజలు రెండు భాషలు మాట్లాడతారు, అందుకని వారు తమ భాషలో బైబిలు లేకపోయినా వేరే భాషలో దాన్ని చదవగలరు.లండన్‌లోని భాషలు
ఇంగ్లాండ్‌లోని లండన్‌లో స్కూలు పిల్లలందరూ కలిసి కనీసం 370 భాషలు మాట్లాడతారని ఆ నగరంలోని ద టైమ్స్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. ప్రస్తుతం లండన్‌లో మాట్లాడబడే భాషల మొట్టమొదటి సర్వేను నిర్వహించిన డాక్టర్ ఫిలిప్ బేకర్ నిజంగా ఎన్ని భాషలు మాట్లాడబడుతున్నాయో చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనిలా అన్నాడు: “ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలోని భాషలు లండన్‌లో మాట్లాడబడుతున్నాయని మాకిప్పుడు రూఢీ అయ్యింది, ఈ సంఖ్య చివరికి న్యూయార్క్‌నే మించిపోయింది.” ఈ 307లో వందలాది మాండలికాలు చేర్చబడలేదు, వాటిని తక్కువ అంచనా వేసివుండవచ్చు. ఈ నగరంలోని 8,50,000 స్కూలు పిల్లల్లో మూడింట రెండు వంతులమంది ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడతారు. అన్నింటికన్నా ఎక్కువమంది మాట్లాడే విదేశీభాషలు భారత ఉపఖండంలోనివి. ఆఫ్రికాకు చెందినవి కనీసం 100 భాషలుంటాయి. ఒకే ఒక్క స్కూల్లో 58 భాషలు మాట్లాడే విద్యార్థులున్నారు.
భారీ బ్యాగులు
అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పిల్లల్లో వీపు నొప్పి భుజాల నొప్పులకూ వారు మోసుకెళ్ళే భారీ బ్యాగులకూ చాలా సంబంధం ఉందని చూపించింది. కొంతమంది పిల్లలు తమ వీపుల మీద మోసుకెళ్ళే బ్యాగుల్లో స్కూలు పుస్తకాలు, ఆహారపానీయాలు, సంగీత వాయిద్యాలు, మార్చుకోవడానికి బట్టలు అన్నీ కలిపితే 18 కిలోగ్రాముల బరువులుంటాయి. ఎలిమెంటరీ స్కూలు పిల్లలు అలాంటి బరువుల్ని ప్రతిరోజు స్కూలుకు మోసుకెళ్తే, వీపుల్లో విపరీతమైన సమస్యలు ఏర్పడవచ్చనీ, వెన్నెముక వంపు తిరుగవచ్చనీ పెడీట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు మోసుకెళ్ళే బరువులు వారి శరీర బరువులో 20 శాతానికి మించకూడదనీ, అలా కానట్లైతే వాటికి “చక్రాలు అమర్చడమో, నడుంకి బెల్టులు కట్టడమో, లేదా కనీసం వీపుమీద వత్తు కోసం పట్టీలు కట్టడమో” చేయాలని ప్రిన్సిపాళ్ళకు టీచర్లకు స్పెషలిస్టులు సూచిస్తున్నారని మెక్సికో సిటీలోని ఎక్సెల్సియోర్ వార్తాపత్రిక నివేదిస్తుంది.
కాలుష్యకారకాలౌతున్న విగ్రహాలు
సాంప్రదాయబద్ధమైన ఒక పండుగ చివర్లో విగ్రహాల్ని దగ్గర్లోని నీటి సముదాయంలో నిమజ్జనం చేయడం హైందవుల్లో ఆచారం. విగ్రహాలకు పూలు లేదా కూరగాయలు వంటి ముడి పదార్థాల నుంచి తయారుచేసిన రంగులతో అద్దే కాలంలో ఇదంత వాతావరణ కాలుష్యాన్ని కలిగించకపోయేది. అయితే, విగ్రహాల తయారీదార్లు భార లోహాలతో క్యాన్సరు కారక పదార్థాలతో తయారుచేసిన పెయింట్లను వేయడం ప్రారంభించినప్పుడు, వేలాది విగ్రహాల్ని వాగుల్లోను చెరువుల్లోను వేయడంతో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ కాలుష్యం ఏర్పడింది. నీటి కాలుష్యాన్ని తగ్గించడానికిగాను ఒక పట్టణంలోని నివాసులు వందలాది విగ్రహాల్ని ఒక చోటికి తీసుకువెళ్ళి వాటిని ముక్కలు ముక్కలుగా పగులకొట్టేశారు. ఇండియాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇలానే చేయాలనీ, తయారీదార్లు సింథటిక్ పెయింట్లకు బదులుగా సాంప్రదాయిక రంగులను ఉపయోగించాలనీ డౌన్ టు ఎర్త్ అనే పత్రిక సూచిస్తుంది. “లేకపోతే హైందవులు పూజించే నదులు తాము పూజించే విగ్రహాలచేతనే విషతుల్యం కాగలవు” అని ఆ పత్రిక చెబుతుంది.