కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మృత్యు “ముద్దు”ను ఎదుర్కోవడం

మృత్యు “ముద్దు”ను ఎదుర్కోవడం

మృత్యు “ముద్దు”ను ఎదుర్కోవడం

బ్రెజిల్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

నిశిరాత్రిలో మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు అది నెమ్మదిగా మిమ్మల్ని సమీపిస్తుంది. మిమ్మల్నది నిద్రలేపదు. నిజానికి ప్రమాదకరమైన దాని “ముద్దు”ను పొందుతుండగా మీరు కనీసం పక్కమీద అటు ఇటు కూడా తిరగరు.

ఈనిశాచరి పేరు బార్బర్‌ బీటిల్‌​—దీన్నే కిస్సింగ్‌ బగ్‌ అని కూడా అంటారు​—దక్షిణ అమెరికాలో ఇవి కుప్పలుతెప్పలుగా ఉంటాయి. మనిషి రక్తాన్ని తాపీగా పీలుస్తూ ఈ కీటకం ఇచ్చే “ముద్దు” దాదాపు 15 నిమిషాలు ఉంటుంది. అదిచ్చే “ముద్దు” హానికరం ఏమీ కాదు. కానీ చర్మంపైన అది జారవిడిచే మలంలో ట్రైపానోసోమా క్రూజీ లేదా సంక్షిప్తంగా చెప్పాలంటే టి. క్రూజీ అనే సూక్ష్మక్రిమి ఉండే అవకాశం ఉంది. ఈ పరాన్నజీవి కళ్ళు, నోరు, శరీరంపైని గాయం వంటివాటి ద్వారా ఒకవేళ మీ శరీరంలోనికి ప్రవేశిస్తే ఫలితంగా మీకు అమెరికన్‌ ట్రైపానోసోమియాసిస్‌ అనే వ్యాధి కలుగుతుంది, దీనికిగల ఛాగాస్‌ డిసీజ్‌ అనే పేరు సాధారణంగా అందరికీ తెలుసు.

ఛాగాస్‌ వ్యాధి బాగా ముదిరిపోయినప్పుడు స్పష్టంగా తెలిసే ఒక రోగలక్షణం ఏమిటంటే ఒక కన్ను వాస్తుంది. అటుతరువాత నిస్సత్తువ, జ్వరం, ఆకలి లేకపోవడం, లేదా డయేరియా వంటివి కలుగవచ్చు. ఒకటి రెండు నెలల తరువాత ఈ చిహ్నాలు ఎటువంటి చికిత్సా లేకుండానే నెమ్మదిగా కనిపించకుండా పోతాయి. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. ఇలా ఇన్ఫెక్షన్‌ సోకిన 10 లేక 20 సంవత్సరాల తర్వాత ఆ బాధితునికి గుండె సమస్యలు రావచ్చు, అంటే గుండె కొట్టుకునే లయ తప్పుతుండవచ్చు లేదా కొట్టుకోవడం ఆగిపోవచ్చు కూడాను. *

దాదాపు కోటీ 80 లక్షలమంది ప్రజలకు ఛాగాస్‌ వ్యాధి సోకిందనీ, ప్రతి సంవత్సరం దాదాపు 50,000 మంది చనిపోతున్నారనీ అంచనా. బాధితులందరూ ఆ కీటకం కుట్టడం మూలంగానే ఆ వ్యాధికి గురికాలేదు. ఉదాహరణకు రోగానికి గురైన తల్లి పాలను త్రాగడం ద్వారా తల్లి నుండి కొందరికి సంక్రమించింది. చివరికి ఒక గర్భిణీ స్త్రీ కూడా ఈ వ్యాధిని ఇంకా జన్మించని తన బిడ్డకు సంక్రమింపజేయగలదు లేదా పుడుతున్న సమయంలో ఆ బిడ్డకు సంక్రమింపజేయగలదు. ఈ వ్యాధి సంక్రమించే మరితర విధానాలు ఏమిటంటే టి. క్రూజీ క్రిములు చేరిన రక్తాన్ని ఎక్కించుకోవడం, వాటిచే కలుషితమైన ఉడకబెట్టని ఆహారం తినడమూను. *

ఛాగాస్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకోబడుతున్నాయి? బార్బర్‌ బీటిల్‌ కీటకాలు వృద్ధిచెందకుండా క్రిమిసంహారకాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. కానీ క్రిమిసంహారక మందులను ఇంట్లో కొడితే అంత ఆహ్లాదకరంగా ఉండదు, అంతేకాదు వీటిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొట్టాల్సిందే. ఫెడరల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ రియో డి జనైరో మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది, దాన్ని 4,800 గృహాల్లో పరీక్షించి చూశారు. అదేమిటంటే, క్రిమిసంహారకాన్ని కలిపిన పెయింటు ఇంటికి వేసుకోవడం. ఫలితమేమిటి? 80 శాతం గృహాల్లో రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ కీటకాలు కనిపించలేదు! బ్రెజిల్‌లోని సినామోమో చెట్టు ఆకులు అంటే వేపచెట్టు ఆకులు విషతుల్యంకాని నేలలో కలిసిపోయే పదార్థాన్ని (అజాడిరాక్టిన్‌) కల్గివున్నాయనీ, అది ఇన్ఫెక్షన్‌ సోకిన కీటకాలకు చికిత్సగా పనికిరావడమే గాక, ఆరోగ్యకరంగా ఉన్న కీటకాల్ని ఇన్ఫెక్షన్‌ సోకకుండా కాపాడడానికి కూడా పనికి వస్తుందనీ పరిశోధకులు కనుగొన్నారు.

ఇన్ఫెక్షన్‌ సోకినవారికి సహాయం

ఇప్పటికే ఛాగాస్‌ వ్యాధి సోకిన లక్షలాది మందికి ఏమైనా నిరీక్షణకు హేతువుందా? తప్పకుండా ఉంది. అనేక దేశాలకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం ఒకటి టి. క్రూజీ యొక్క 10,000 జన్యువుల రహస్యాల్ని ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. ఇది రోగనిర్ధారణా పరీక్షలు, వాక్సిన్లు, మరింత శక్తివంతమైన మందులు వంటివాటిని తయారుచేయడాన్ని సాధ్యంచేస్తుంది.

1997 జూలైలో శాస్త్రజ్ఞులు, సూక్ష్మగురుత్వాకర్షణశక్తిలో టి. క్రూజీ యొక్క కీలకమైన ప్రోటీన్లలో ఒకదాన్ని దాని నిర్మాణాన్ని అధ్యయనం చేయగల్గేలా కొలంబియా స్పేస్‌ షటిల్‌లో అంతరిక్షానికి పంపారు. టి. క్రూజీ నిర్మాణానికి సరిపడే మందుల్ని తయారుచేయడంలో ఇదొక ప్రాధమిక చర్య. క్రొత్త మందుల్ని అన్వేషించడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే వ్యాధి చివరి దశల్లోకి చేరుకుందంటే ప్రస్తుతం దానికి ఎటువంటి మందులూ లేవు. *

తొలి దశల్లోనే చికిత్స చేయడంలోని ప్రయోజనాల్ని గ్రహించి బ్రెజిల్‌లోని జీవశాస్త్రజ్ఞురాలైన కాన్‌స్టాన్సా బ్రిట్టూ పాలిమరీస్‌-చైన్‌-రియాక్షన్‌ అనే పరీక్షను అభివృద్ధి చేసింది. దీని ద్వారా రెండు రోజుల్లోనే రోగనిర్ధారణ సాధ్యమౌతుంది. అయితే, విచారకరమైన విషయం ఏమిటంటే, తమకు అసలు వ్యాధి ఉన్నదని చాలామందికి దాని తొలి దశలో తెలియదు.

నివారణే మార్గం

చివరగా, బార్బర్‌ బీటిల్‌ ఉండే ప్రాంతంలో మీరున్నట్లైతే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోగలరు?

మీరు మట్టితో గానీ గడ్డితో గానీ చేసిన ఇంట్లో ఉంటే, దోమతెర ఉపయోగించడానికి ప్రయత్నించండి.

క్రిమిసంహారకాలు ఉపయోగించండి. వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని అవి తగ్గిస్తాయి.

గోడ పగుళ్ళు బీటలు మరమ్మతు చేయండి, ఎందుకంటే అవి బార్బర్‌ బీటిల్‌ సంతానోత్పత్తి స్థలాలుగా పనిచేయవచ్చు.

మీ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచండి, గోడకు వేలాడదీసిన చిత్రాల వెనుక, ఫర్నీచర్‌ వెనుక కూడా పరిశుభ్రంగా ఉంచండి.

అప్పుడప్పుడు మెత్తల్ని దుప్పట్లని బయట ఎండలో ఉంచండి.

అటు సాధు జంతువులు ఇటు క్రూర మృగాలు వ్యాధిని సంక్రమింపజేయగలవని గుర్తుంచుకోండి.

ఒక కీటకాన్ని చూసినప్పుడు అది బార్బర్‌ బీటిల్‌ అన్న అనుమానం వస్తే దాని విశ్లేషణ కోసం దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి పంపించండి.

[అధస్సూచీలు]

^ రోగచిహ్నాలు వేర్వేరుగా ఉంటాయి, వాటిలో కొన్ని కేవలం ఛాగాస్‌ వ్యాధికి సంబంధించినవి మాత్రమే కానక్కర్లేదు. అందుకని, ఇక్కడ ఇవ్వబడిన రోగచిహ్నాలు కేవలం సారాంశంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. రోగనిర్ధారణ చేయడానికి దీన్ని ఆధారంగా ఉపయోగించమన్న ఉద్దేశంతో మాత్రం ఇవి ఇవ్వబడలేదు. చాలామంది ప్రజల విషయంలో వ్యాధి పూర్తిగా ముదిరిపోయేంత వరకు ఎటువంటి చిహ్నాలు కనిపించవు.

^ కొన్ని దేశాల్లోని రక్త నిధుల్లో ఛాగాస్‌ వ్యాధి కారక క్రిములున్నాయో లేవోనని పరీక్షలు చేయరని యు.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ చెబుతోంది.

^ టి. క్రూజీకి చికిత్స చేయడానికి డాక్టర్లు నిఫూర్టిమాక్స్‌ని ఉపయోగిస్తున్నారు, కానీ దానికి చాలా తీవ్రమైన దుష్పరిణామాలు ఉన్నాయి.

[13వ పేజీలోని బాక్సు]

ఛాగాస్‌ వ్యాధిని కనుగొనడం

1909లో బ్రెజిల్‌లోని వైద్యుడైన కార్లోస్‌ ఛాగాస్‌, మినాస్‌ గెరైస్‌ స్టేట్‌లో పనిచేస్తున్నాడు. అక్కడ ఒక రైలు మార్గాన్ని నిర్మించే పనిని మలేరియా వ్యాధి అడ్డగిస్తోంది. చాలామంది రోగులు అర్థంకాని రోగలక్షణాలతో బాధపడ్తున్నట్లు ఆయన గమనించాడు. ఆ ప్రాంతంలోని ఇళ్ళల్లో రక్తం పీల్చే బార్బర్‌ బీటిల్స్‌ అనే కీటకాలు కుప్పలుతెప్పలుగా ఉన్నట్లు కూడా ఆయన గమనించాడు. ఆ కీటకాల ప్రేవుల్లోని పదార్థాల్ని పరీక్షించినప్పుడు ఛాగాస్‌ ఒక క్రొత్త ప్రోటోజోవన్‌ని కనుగొన్నాడు. దానికాయన ట్రైపానోసోమా క్రూజీ అని పేరు పెట్టాడు. ఆ పేరు తన స్నేహితుడూ శాస్త్రజ్ఞుడూ అయిన ఓస్వాల్డూ క్రూజ్‌ గౌరవార్థం పెట్టబడింది. ఆ క్రొత్త వ్యాధికి కార్లోస్‌ ఛాగాస్‌ పేరే పెట్టడం ఎంతో యుక్తం. ఎందుకంటే ఈ వ్యాధిని కనుగొనడానికి ఆయన తీవ్రమైన పరిశోధన చేశాడు.

[12, 13వ పేజీలోని చిత్రాలు]

గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ళల్లో తరచూ బార్బర్‌ బీటిల్‌లు కుప్పలు తెప్పలుగా ఉంటాయి

[చిత్రసౌజన్యం]

Photos: PAHO/WHO/P. ALMASY