లైంగిక వేధింపుతో నేనెలా వ్యవహరించేది?
యువత ఇలా అడుగుతోంది . . .
లైంగిక వేధింపుతో నేనెలా వ్యవహరించేది?
“అబ్బాయిలు ఈలలు వేస్తూ, అల్లరి చేస్తున్నారు.—కార్లా, ఐర్లాండ్.
“అమ్మాయిలు పదే పదే ఫోన్లు చేస్తున్నారు. నాలోని స్థిరచిత్తాన్ని నీరుగార్చడానికి వారు చేసే ప్రయత్నం అది.”—జేసన్, అమెరికా.
“అతడు నా చేతిని తాకుతూనే ఉంటాడు, నా చేతిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడు. —యూకీకో, జపాన్.
“అమ్మాయిలు నాతో సరసంగా మాట్లాడతారు. —అలెగ్జాండర్, ఐర్లాండ్.
“ఒక అబ్బాయి స్కూల్ బస్‌లోనుండి నావైపు చూస్తూ అరుస్తూ ఉన్నాడు. నాతో కలిసి తిరగాలన్నది అతడి కోరిక కాదు. నన్ను వేధిస్తున్నాడంతే.—రోజ్‌లిన్, అమెరికా.
మోహపు చూపు, సెక్స్‌కి సంబంధించిన గూఢార్థాలున్న “ప్రశంస,” అసభ్యకరమైన ఒక జోక్, కోరికతో తాకడం—ఇలాంటివన్నీ అవాంఛనీయమైనప్పుడూ పదే పదే వ్యక్తమైనప్పుడూ లైంగిక వేధింపు క్రిందికి వస్తాయి. ప్రపంచవ్యాప్తమైన గణాంకాలు రాబట్టడం కష్టంగా ఉన్నా అమెరికాలో స్కూలుకు వెళ్ళే విద్యార్థుల్లో అత్యధికులు దాన్ని అనుభవించినట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
అసలు లైంగిక వేధింపు అంటే ఏమిటి? డాక్టర్ విక్టోరియా షా రచించిన కోపింగ్ విత్ సెక్సువల్ హెరాస్‌మెంట్ అండ్ జెండర్ బయాస్ అనే పుస్తకం దాన్ని “ఎవరినైనా లైంగికంగా పీడించడం . . . అది శారీరకం కావచ్చు (అంటే కోరికతో ఎవరినైనా తాకడం), మౌఖికంగా కావచ్చు (ఒక వ్యక్తి కన్పించే తీరును గురించి అవాంఛనీయ వ్యాఖ్యానాలు చేయడం), లేదా మాటలులేకుండా కూడా కావచ్చు” అని వర్ణించింది. కొన్నిసార్లు లైంగిక వేధింపులో మరీ అనాగరికమైన ప్రతిపాదనలు చేయడం కూడా ఇమిడివుంటుంది.
స్కూల్లో వేధింపులు సాధారణంగా తోటి విద్యార్థుల నుండి వస్తుండవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అభ్యంతరకరమైన ఇటువంటి ప్రవర్తన పెద్దవారి నుండే ఎదురుకావచ్చు, టీచర్లలాంటి వారి నుండే వస్తుండవచ్చు. లైంగికపరమైన అపరాధాలకు శిక్షపడిన టీచర్ల సంఖ్య సాపేక్షికంగా చూస్తే తక్కువగానే ఉన్నప్పటికీ ఈ సంఖ్య “పెద్ద మంచు బండ చివరి కొనకు మాత్రమే బహుశ ప్రాతినిధ్యం వహించవచ్చు” అని రెడ్‌బుక్ అనే పత్రికలోని ఒక ఆర్టికల్ ఊహించింది.
స్త్రీలు, కొన్నిసార్లు పురుషులు కూడా చివరికి బైబిలు కాలాల్లోనూ అలాంటి దుర్వ్యవహారానికి గురయ్యారు. (ఆదికాండము 39:7; రూతు 2:8, 9, 15) బైబిలు ఇలా భయంకరమైన భవిష్యవాణి చేసింది: “అంత్యదినాల్లో కష్టతరమైన కాలాలు వస్తాయి. ప్రజలు స్వార్థపరులు, లోభులు, డంబాలు పలికేవారు, స్వాతిశయం గలవారుగా ఉంటారు; వారు అవమానించేవారుగా ఉంటారు . . . వారు దయారహితంగా, కనికరంలేని వారిగా, అపనిందలు వేసేవారిగా, హింసకులుగా, క్రోధంగల వారిగా ఉంటారు.” (2 తిమోతి 3:1-3, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్) అందుకని మీరు కూడా లైంగిక వేధింపుకు గురయ్యే సాధ్యతా ఉంది, అవకాశమూ ఉంది.
దైవిక దృక్కోణం
లైంగిక దురాక్రమణకు గురికావడం మూలంగా ఆందోళనకు లోనయ్యే పరిస్థితి యౌవనస్థులందరి విషయంలోనూ
ఏర్పడదన్నది ఒప్పుకోవలసిందే. కొందరు దాన్ని వేడుకగా దృష్టిస్తారు, చివరికి పొగడ్తగా కూడా స్వీకరిస్తారు. అమెరికాలో కలతపర్చే ఒక సర్వేలో లైంగిక వేధింపుకు గురైన బాధితుల్లో 75 శాతంమంది తాము కూడా ఇతరుల్ని వేధించినట్లు ఒప్పుకున్నారు. కొంతమంది పెద్దవారు లైంగికంగా దురాక్రమణపూరితమైన ప్రవర్తన అంత గంభీరమైనది కాదంటూ, అవి కేవలం చిన్న పిల్లలు చేసే ప్రయోగాలు మాత్రమేనని కొట్టి పారేస్తూ ఆ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుండవచ్చు. కానీ దాన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు?దేవుని వాక్యమైన బైబిలు అన్ని రకాల లైంగిక వేధింపుల్ని స్పష్టంగా ఖండిస్తుంది. లైంగిక పరమైన హద్దుల్ని మీరుతూ ఇతరుల “హక్కులను భంగము చేయదగదు” అని మనకు తెలియజేయడం జరిగింది. (1 థెస్సలొనీకయులు 4:3-8, పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము) నిజానికి, “అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను” దృష్టించాలని ప్రత్యేకంగా యువకులకు ఆజ్ఞాపించబడింది. (1 తిమోతి 5:1, 2) అంతేగాక, ‘సరసోక్తులను’ బైబిలు ఖండిస్తుంది. (ఎఫెసీయులు 5:3, 4) అందుకని మీరు వేధింపుకు గురైనప్పుడు కోప్పడే హక్కు మీకుంది, అలాగే కల్లోలానికి గురికావడం, కలవరం చెందడం, చివరికి అవమానానికి పాలైనట్లు భావించడం మీవైపు నుండి తప్పు కాదు!
నేనేమి చెప్పను?
మరైతే మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించాలి? కొన్నిసార్లు బలహీనంగా లేదా అస్పష్టంగా ప్రతిస్పందించడం వేధించే వ్యక్తి ఇంకా ఎక్కువగా ప్రయత్నించడానికే నడిపిస్తుంది. యోసేపు, తన యజమాని భార్య వెంటపడినప్పుడు ఆయన ఆమెపట్ల కేవలం నిర్లక్ష్యభావంతోనే ఉండలేదు. బదులుగా ఆయన ఆమె అనైతికమైన ప్రతిపాదనను దృఢంగా తిరస్కరించాడు. (ఆదికాండము 39:8, 9, 12) నేడు దృఢంగా, సూటిగా ఉండడం అనేవి వేధింపుల్ని త్రిప్పికొట్టడానికి అతి శ్రేష్ఠమైన మార్గాలు.
నిజమే, మీ వెంటపడే వ్యక్తిలో మీకు హాని తలపెట్టాలన్న తలంపు ఉండకపోవచ్చు. వేధింపుగా కన్పించేది నిజానికి మీ అవధానాన్ని ఆకర్షించడానికి చేసే మొరటైన ప్రయత్నమే కావచ్చు. కాబట్టి అవతలి వ్యక్తి నుండి వచ్చే అవాంఛిత ప్రతిపాదనల్ని ఆపడానికి మీరే మర్యాదలు మర్చిపోయి ప్రవర్తించాల్సిన అవసరం ఉందని భావించకండి. కేవలం, ‘అలాంటి మాటలు నాకిష్టం లేదు’ అనో లేదా ‘దయచేసి మీ చేతుల్ని అదుపులో పెట్టుకోండి’ అనో అంటే చాలు, మీ ఉద్దేశం అవతలి వ్యక్తికి అర్థం అయిపోతుంది. మీరే మాటల్లో వ్యక్తీకరించినా, మీ అభిప్రాయం మీ మాటల్లో నీరుగారిపోయేలా చేయకండి. మీరు కాదంటే కాదు అన్నట్లుగానే ఉండండి! యౌవనస్థురాలైన ఆండ్రీయా ఇలా వ్యక్తం చేస్తుంది: “మీరు మర్యాదపూర్వకంగా చేసే సూచనలు వారికి అర్థం కాకపోతే, వారికిక ముఖమ్మీదే చెప్పాల్సి రావచ్చు. కొన్నిసార్లు అంతదూరమూ పోక తప్పదు.” “అలా చేయడం ఆపండి!” అని
దృఢంగా అంటే సరిపోవచ్చు.పరిస్థితి విషమిస్తే దాన్ని మీకై మీరే చక్కబర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. మీ తల్లిదండ్రులతోనో వేరే పరిణతి చెందిన పెద్దలతోనో మాట్లాడండి. పరిస్థితితో వ్యవహరించడానికి వారి దగ్గర కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు ఉండవచ్చు. చివరి ప్రత్యామ్నాయంగా స్కూలు అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరముందని కూడా వారు భావించవచ్చు. అలా చేయడం మీకు ఇబ్బందిగా ఉన్నా, మీరు మరింత పీడించబడకుండా అది మిమ్మల్ని కాపాడవచ్చు.
వేధింపుని నివారించడం
అసలు వేధింపు బారిన పడకుండా నివారించుకోవడం అత్యుత్తమం. ఇలా చేయడానికి ఏమి సహాయం చేస్తుంది? ఆండ్రీయా ఇలా సలహా ఇస్తోంది: “మీకు బహుశ ఎవరిమీదో కాస్త ఆసక్తి ఉందన్న తలంపుని ఇతరులకు ఏమాత్రం ఇవ్వవద్దు. దాని గురించి ఇతరులకు తప్పకుండా వినబడుతుంది, ఇక ఒత్తిడి కొనసాగుతుంది.” మీ వస్త్రధారణ కూడా పెద్ద పాత్రను వహిస్తుంది. యౌవనస్థురాలైన మారా ఇలా చెబుతుంది: “నేనేమీ అమ్మమ్మలా బట్టలు వేసుకోను, కానీ నా శరీరంవైపు అవధానాన్ని ఆకర్షించే దుస్తుల్ని మాత్రం వేసుకోకుండా నేను జాగ్రత్తవహిస్తాను.” లైంగికపరమైన ప్రతిపాదనల్ని తిరస్కరిస్తూనే భావోద్రేకాల్ని రేకెత్తించే దుస్తుల్ని వేసుకోవడం గలిబిలితో కూడిన సందేశాన్ని ఇతరులకు ఇస్తుంది. “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై” వస్త్రధారణ చేసుకోవాలని బైబిలు సిఫారసు చేస్తోంది.—1 తిమోతి 2:9.
మీ స్నేహితుల ఎంపిక కూడా మీపట్ల ఇతరులు ఎలా ప్రవర్తిస్తారనేదాన్ని ప్రభావితం చేస్తుంది. (సామెతలు 13:20) రోజ్‌లిన్ ఇలా చెబుతోంది: “ఒక గుంపులోని కొందరు అమ్మాయిలు అబ్బాయిల అవధానాన్ని ఆకర్షించాలని ప్రయత్నించినప్పుడు, ఆ బృందంలోని అమ్మాయిలంతా అదే విధంగా భావిస్తున్నారని వారు ఊహించుకోవచ్చు.” కార్లా అదే విషయాన్ని చెబుతోంది: “సరసోక్తులకు ప్రతిస్పందిస్తూనో లేదా తమపై చూపించబడే అవధానాన్ని ఆనందిస్తూనో ఉండేవారితో మీరు కలిసి తిరుగుతున్నట్లైతే మీరు కూడా వేధింపుకు గురౌతారు.”
విచ్ఛలవిడితనానికి పేరుగాంచిన కనాను ప్రాంతపు అమ్మాయిల్తో సహవసించిన దీనా అనే యువతి గురించి బైబిలు చెబుతుంది. దాని మూలంగా ఆమె లైంగిక దాడికి గురైంది. (ఆదికాండము 34:1, 2) అందుకని మంచి కారణంతోనే బైబిలు ఇలా చెబుతుంది: “అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫెసీయులు 5:15) అవును, మీరెలాంటి దుస్తుల్ని ధరిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎవరితో సహవాసం చేస్తారు అన్న విషయాల్లో మీరు “జాగ్రత్తగా” ఉండడం మిమ్మల్ని లైంగిక వేధింపు నుండి కాపాడడానికి ఎంతో సహాయం చేయగలదు.
అయితే క్రైస్తవ యౌవనస్థులకు వేధింపును నివారించే అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే మీ మతపరమైన స్థానం గురించి ఇతరులకు తెలియజేయడమే. యౌవనస్థుడైన టీమోన్ ఒక యెహోవాసాక్షి, ఆయనిలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను సాక్షినని పిల్లలందరికీ తెలుసు, దాదాపు ఎటువంటి వేధింపూ లేకుండా చేసినది అదే.” ఆండ్రీయా ఇలా చెబుతుంది: “మీరు సాక్షి అని ఇతరులకు చెప్పడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరనేక మార్గాల్లో తమ నుండి భిన్నంగా ఉన్నారనీ, మీకు ఖచ్చితమైన నైతిక ప్రమాణాలున్నాయనీ వారు గ్రహిస్తారు.”—మత్తయి 5:15, 16.
మీరు వేధింపుకు గురైతే
మీరెంతగా ప్రయత్నించినా నీతిబాహ్యమైన, దూషణకరమైన ప్రజల నుండి పూర్తిగా తప్పించుకోలేరు. కానీ మీరు లైంగిక వేధింపు బారిన పడినప్పుడు—మీరు క్రైస్తవునిగా ప్రవర్తించినంత మట్టుకు—మీరే ఏదో తప్పు చేసేసినట్లు అపరాధ భావాలతో కలతచెందాల్సిన అవసరం లేదు. (1 పేతురు 3:15-17) ఒకవేళ అటువంటి పరిస్థితి మిమ్మల్ని భావోద్రేకపరంగా ఆందోళనకు గురిచేస్తున్నట్లైతే, మీ తల్లిదండ్రులతో గానీ క్రైస్తవ సంఘంలో పరిణతి చెందిన వారితో గానీ మాట్లాడడం ద్వారా మద్దతు పొందుతారు. మిమ్మల్నెవరైనా వేధించినప్పుడు మీ పట్ల మీరు మంచి అభిప్రాయం కలిగివుండడం కష్టమేనని రోజ్‌లిన్ ఒప్పుకుంటుంది. “మీరు మాట్లాడగలిగే ఎవరి సహచర్యాన్నైనా ఆనందించడం చాలా మంచిదిగా ఉంటుంది” అంటుందామె. “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు” అన్న విషయాన్ని కూడా జ్ఞాపకముంచుకోండి.—కీర్తన 145:18, 19.
దుర్వ్యవహారానికి గురైనప్పుడు స్థిరమైన స్థానం వహించడం సులభం కాదు, కానీ అది అత్యుత్తమమైన మార్గం. ఉదాహరణకు షూనేముకు చెందిన ఒక యువతి ఉదాహరణను పరిశీలించండి. ఆమె నిజంగా వేధింపు అనే పదానికి నేడు ఉన్న భావంలో వేధించబడకపోయినా, ధనవంతుడూ శక్తిసంపన్నుడూ అయిన యూదా రాజైన సొలొమోను నుండి అవాంఛిత ప్రతిపాదనల్ని వినాల్సివచ్చింది. కానీ ఆమె వేరొక పురుషుడ్ని ప్రేమిస్తున్నందున ఆ ప్రతిపాదనల్ని నిరోధించింది. అందుకే ఆమె తనను గురించి తాను గర్వంగా “నేను ప్రాకారమువంటిదాన[ను]” అని చెప్పుకోగల్గింది.—పరమగీతము 8:4, 10.
మీరు కూడా అదే నైతికపరమైన నిబ్బరాన్ని కృత నిశ్చయాన్ని చూపించండి. అవాంఛితమైన ప్రతిపాదనల విషయానికొస్తే “ప్రాకారము”లా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారందరికీ మీ క్రైస్తవ స్థానాన్ని స్పష్టం చేయండి. అలా చేయడం ద్వారా మీరు “నిష్కళంకులును అనింద్యులునై” ఉండగలరు, మీరు దేవుణ్ణి ప్రీతిపర్చారన్న నమ్మకాన్ని పొందుతారు.—ఫిలిప్పీయులు 2:14-15. *
[అధస్సూచి]
^ తేజరిల్లు! జూన్ 8, 1996; సెప్టెంబరు 8, 1995; మే 22, 1991 (ఆంగ్లం) సంచికల్లో లైంగిక వేధింపుపై మరిన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.
[26వ పేజీలోని చిత్రం]
మీ క్రైస్తవ నమ్మకాల్ని అందరికీ తెలిసేలా చేయడం మీకు కాపుదలగా ఉండగలదు
[26వ పేజీలోని చిత్రం]
తప్పుడు సహవాసాలు చేయకుండా ఉండడం ద్వారా మీరు లైంగిక వేధింపును నివారించగలరు