కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శరీర అలంకరణ—సహేతుకత అవసరం

శరీర అలంకరణ—సహేతుకత అవసరం

బైబిలు ఉద్దేశము

శరీర అలంకరణ​—సహేతుకత అవసరం

“ఆకర్షణీయంగా ఉన్నాననే అహంభావం ఊబిలాంటిది” అని ఒక ఫ్రెంచ్‌ నవలా రచయిత్రి వ్రాసింది. నిజమే, శతాబ్దాలకు పైగా మానవులు ఆకర్షణీయంగా ఉండడం కోసం వెంపర్లాడుతూ ఏర్పర్చుకున్న అనేక పద్ధతుల్లో సహేతుకత కొరవడింది. ఉదాహరణకు, 19వ శతాబ్దంలోని కొందరు స్త్రీలు తమ నడుమును సాధ్యమైనంత సన్నగా చేసుకోవాలనే ప్రయత్నంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమయ్యేంత బిగుతుగా లోదుస్తులు ధరించేవారు. కొందరు స్త్రీలు తమ నడుములు 13 అంగుళాలే ఉన్నట్లు చెప్పుకున్నారు. కొందరు స్త్రీలైతే, తమ ప్రక్కటెముకలు లోపలికి నొక్కుకు పోవడం ద్వారా కాలేయంపై ఒత్తిడి కలిగి తమ ప్రాణాల్నే కోల్పోయేంత బిగుతుగా లోదుస్తులను ధరించేవారు.

సంతోషకరంగా అలాంటి ఫ్యాషన్‌ గతించిపోయినప్పటికీ, ఆ రోజుల్లో ఆకర్షణ కోసం స్వయంసాధన చేసినట్టు ఈ రోజుల్లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పురుషులు, స్త్రీలు తమ సహజ సిద్ధమైన రూపాన్ని మార్చుకోవడానికి చాలా కష్టతరమైన, అపాయకరమైన విధానాలను పాటిస్తున్నారు. ఉదాహరణకు, ఒకప్పుడు అంతగా ప్రాధాన్యత లేని పచ్చబొట్లు పొడిచే పార్లర్లు, పియర్సింగ్‌ పార్లర్లు, ఈ రోజుల్లో పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్‌లలోనూ, నగరాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. వాస్తవానికి అమెరికాలో, ఇటీవలి ఒక సంవత్సరంలో వేగంగా పెరుగుతున్న చిన్న వ్యాపారాల్లో పచ్చబొట్లు పొడిచే వ్యాపారం ఆరవ స్థానంలో ఉంది.

శరీరాలంకరణలో శృతిమించిన పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి, ప్రత్యేకంగా యౌవనుల్లో ఇది కనిపిస్తుంది. చనుమొనలు, ముక్కులు, నాలుకలు, చివరికి మర్మాంగాలతో సహా శరీర భాగాలను మితిమీరి కుట్టించుకోవడం అత్యధికంగా జనాదరణ పొందుతోంది. ఒక చిన్న గుంపుకు మాత్రం, ఇలాంటివన్నీ ఏమంత ఉత్తేజపరిచేవిగా లేవనిపించాయి. వాళ్ళు మరింత విపరీతమైన పద్ధతులను​—శరీరంపై వాతలు పెట్టుకోవడం, కోసుకోవడం, * శరీరాన్ని చెక్కుకోవడం లాంటివి అవలంబించి చర్మంలో ఏవైనా వస్తువులను పెట్టుకోవడం వల్ల శరీరంపై గంట్లు, పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడేలా చేసుకుంటున్నారు.

ఒక ప్రాచీన ఆచారం

అలంకరించుకోవడం లేక ఆకారంలో మార్పులు చేసుకోవడమన్నవి క్రొత్తేమీ కాదు. ఆఫ్రికాలోని కొన్ని ప్రదేశాల్లో, తమ కుటుంబ సమూహాన్ని లేక తెగను గుర్తించడానికి వీలుగా గాట్లు పెట్టుకోవడం, పచ్చబొట్లు వేయించుకోవడం శతాబ్దాల పాటుగా ఆచారంగా ఉండేది. ఆసక్తికరంగా, వీటిలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పుడు అటువంటి ఆచారాలపై అయిష్టత చూపిస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో అవి పూర్తిగా అంతరించిపోతున్నాయి.

పచ్చబొట్లు వేయించుకోవడం, కుట్టించుకోవడం, కోసుకోవడం బైబిలు కాలాల్లో కూడా ఉండేవి. అతి తరచుగా అన్యప్రజలే తమ మతానికి సంబంధించి వాటిని ఆచరించేవారు. ఈ అన్య ప్రజలను అనుసరించకుండా ఉండేలా యెహోవా తన ప్రజలైన యూదులను నిషేధించాడన్నది అర్థం చేసుకోదగ్గ విషయమే. (లేవీయకాండము 19:28) దిగజారిన అబద్ధ మతాచారాలను అవలంబించకుండా, దేవుని స్వంత “ప్రతిష్టితజనము”గా, యూదులు రక్షించబడ్డారు.​—ద్వితీయోపదేశకాండము 14:2.

క్రైస్తవ స్వాతంత్ర్యం

క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు. అయినప్పటికీ, అందులోని కొన్ని సూత్రాలు క్రైస్తవ సంఘంలోనికి తీసుకోబడ్డాయి. (కొలొస్సయులు 2:13-15) ఆ విధంగా, ఏ రకమైన అలంకరణలను ఎంపికచేసుకోవాలి వేటిని ఎంపికచేసుకోకూడదనే విషయంలో ప్రవర్తనకు సంబంధించిన పరిమిత నియమాలను ఆ సూత్రాలు వాటంతటవే వ్యక్తంచేయగలవు. (గలతీయులు 5:1; 1 తిమోతి 2:9, 10) అయినప్పటికీ, ఆ స్వేచ్ఛకు హద్దుల్లేకుండా పోలేదు.​—1 పేతురు 2:16.

అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 6:12 లో ఇలా వ్రాశాడు: “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు.” ఇతరుల గురించి పట్టించుకోకుండా తనకిష్టం వచ్చినట్టు చేయడానికి, క్రైస్తవునిగా తనకున్న స్వాతంత్ర్యం అనుమతించదని పౌలు అర్థం చేసుకున్నాడు. ఇతరుల పట్ల ఆయనకున్న ప్రేమ ఆయన ప్రవర్తనను ప్రభావితం చేసింది. (గలతీయులు 5:13) “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని ఆయన ఉద్బోధించాడు. (ఫిలిప్పీయులు 2:4) ఏదొక రకమైన అలంకరణతో తన శరీరాన్ని అలంకరించుకోవాలనుకునే ఒక క్రైస్తవునికి పౌలు చూపించిన నిస్వార్థపూరిత దృక్పథం శ్రేష్ఠమైన మాదిరిగా ఉంటుంది.

యోచించాల్సిన బైబిలు సూత్రాలు

క్రైస్తవులు పాటించాల్సిన ఆజ్ఞల్లో ఒకటి సువార్తను ప్రకటించడం, బోధించడం. (మత్తయి 28:19, 20; ఫిలిప్పీయులు 2:14,15) ఒక క్రైస్తవుడు తానందించే సందేశాన్ని వినకుండా ఇతరుల అవధానాన్ని మళ్లించడానికి దేన్నీ అనుమతించడు. అది తాను కనబడే తీరైనా సరే.​—2 కొరింథీయులు 4:2.

కుట్టించుకోవడం లేక పచ్చబొట్లులాంటి అలంకరణలు కొందరి ఆదరణను పొందినా, ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు తనను తాను ఇలా ప్రశ్నించుకోవల్సిన అవసరముంది: ‘అలాంటి అలంకరణ నేను నివసించే ప్రాంతంలో ఎలాంటి ప్రతిస్పందనను కలుగజేస్తుంది? సమాజంలో వెర్రిగా అలంకరించుకుని తిరిగే గుంపుల్లో ఏదో ఒకదానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడతానా? దానికి నా మనస్సాక్షి అంగీకరించినప్పటికీ, నేను నా శరీరాన్ని కుట్టించుకోవడం లేక పచ్చబొట్లు పొడిపించుకోవడం సంఘంలోని ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? వారు దాన్ని “లౌకికాత్మ”కు ఒక నిదర్శనంగా దృష్టిస్తారా? నా “స్వస్థబుద్ధి”పై వారికి సందేహం కలుగుతుందా?’​—1 కొరింథీయులు 2:12; 10:29-32; తీతు 2:13.

శరీరాకృతిలో చేసుకునే కొన్ని రకాల మార్పులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతాయి. పచ్చబొట్లకు అపరిశుభ్రమైన సూదులను వాడడం వల్ల హెపటైటిస్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. కొన్నిసార్లు జుట్టుకు వాడే రంగులు చర్మవ్యాధులకు కారణమయ్యాయి. శరీరభాగాలపై కుట్టించుకున్న కుట్లు మానడానికి నెలలు పడతాయి, దాంతో చాలాకాలం బాధననుభవించాలి. అవి రక్తం విషపూరితం అవ్వడానికి, రక్తం కారడానికి, రక్తం గడ్డ కట్టడానికి, నరాలు దెబ్బతినడానికి, ఇంకా ప్రమాదకరమైన అంటువ్యాధులకు కారణమౌతాయి. వాటితో పాటు, కొన్ని పచ్చబొట్లు అంత తేలికగా చెరగవు. ఉదాహరణకు, రంగును, సైజును బట్టి, ఒక పచ్చబొట్టు చెరిపేయడానికి ఖర్చుతో కూడిన బాధాకరమైన లేజర్‌ చికిత్సలు చేయాల్సివస్తుంది. పియర్సింగ్‌ జీవితాంతం ఉండే గుర్తుల్ని విడిచిపెడుతుంది.

ఈ సాహసాలను అంగీకరించాలా వద్దా అనేది ఒక వ్యక్తి తానే స్వయంగా నిర్ణయించుకోవాలి. కాని దేవుణ్ణి సంతోషపర్చాలని కోరుకునే వ్యక్తి, క్రైస్తవుడవడంలో తనను తాను దేవునికి సమర్పించుకోవడం కూడా ఇమిడివుందని గుర్తిస్తాడు. మనం మన శరీరాలను దేవుని చిత్తం చేయడం కోసం సజీవ యాగాలుగా సమర్పించుకున్నాం. (రోమీయులు 12:1) అందువల్ల, పరిణతి చెందిన క్రైస్తవులు తమకిష్టమొచ్చినట్లుగా గాయపరచుకోవడానికి గానీ వికృతపర్చుకోవడానికి గానీ తమ శరీరాలను తమ స్వంత సొత్తుగా భావించరు. ప్రత్యేకంగా సంఘంలో నడిపింపునిచ్చే అర్హత గలవారు చక్కని అలవాట్లకు, స్వస్థబుద్ధికి, సహేతుకానికి పేరు పొందినవారై ఉంటారు.​—1 తిమోతి 3:2, 3.

ఏ విధమైన నిరీక్షణా లేకుండా “దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన” ఈ లోకానికి సంబంధించిన తీవ్రమైన పైశాచిక పద్ధతులను విడిచిపెట్టడానికి, బైబిలు శిక్షిత వివేచనా శక్తిని అభివృద్ధి చేసుకుని ఆచరణలో పెట్టడం, క్రైస్తవులకు సహాయకరంగా ఉంటుంది. (ఎఫెసీయులు 4:18) ఆ విధంగా వారు తమ సహేతుకతను అందరి ముందు ప్రకాశింపజేయగల్గుతారు.​—ఫిలిప్పీయులు 4:5.

[అధస్సూచి]

^ వైద్యపరమైన కారణాలనుబట్టి కోయించుకోవడానికీ, లేదా సౌందర్యాలంకరణ సంబంధమైన ఉద్దేశాలనుబట్టి శరీరాన్ని కుట్టించుకోవడానికీ, అలాగే బలవంతంగా గాయపరిచిందానికీ లేక అనేకమంది యౌవనులు ముఖ్యంగా టీనేజ్‌ అమ్మాయిల మధ్య ఒంటినిండా గాట్లు పెట్టుకోవడమనే దానికీ మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలియజేయబడింది. ఈ రెండవది తరచుగా గంభీరమైన మానసిక ఒత్తిడికి లేక అమానుషత్వానికి గురైనదానికి సూచన. దానికి బహుశా వైద్య నిపుణుల సహాయం అవసరం కావచ్చు.