ఆస్ట్రేలియాకు చెందిన ముల్లులేని తేనెటీగను కలవండి
ఆస్ట్రేలియాకు చెందిన ముల్లులేని తేనెటీగను కలవండి
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! ప్రతినిధి ద్వారా
వసంత కాలపు ప్రారంభంలో ప్రకాశమాన అరుణోదయ కాంతిలో పువ్వు నుండి పువ్వుకు వేగిరంగా వెళ్తూ తీరిక లేకుండా ఉండే తేనెటీగల ఆహ్లాదకరమైన ఝూంకారాన్ని విని మీరు ఎప్పుడైనా ఉపశమనాన్ని పొందారా? నిజంగా అవి అందమైన కీటకాలే. కానీ అవి కుట్టకపోతే ఎంత బావుంటుంది!
కుట్టని తేనెటీగలు కూడా ఉన్నాయని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. అవి ఆస్ట్రేలియాకు చెందిన ముల్లులేని తేనెటీగలు, అవి ఎక్కువగా ఆస్ట్రేలియాలోని తూర్పు భాగాల్లో కనిపిస్తాయి. ముల్లులేని ఈ తేనెటీగలు నాలుగు మిల్లీమీటర్లకు ఇంకాస్త పొడవుంటాయి. అవి నలుపు రంగులో ఉండి, వాటి ముఖాల మీదా, ప్రక్కలలోనూ దట్టమైన తెల్లని వెంట్రుకలు ఉంటాయి. చాలా తేనెటీగలకు, శరీరపు వెనుక భాగంలోని చివరి అంచులపై చిన్న చిన్న పసుపు పచ్చని చుక్కలు ఉంటాయి. క్వీన్స్‌లాండ్ సుదూర ఉత్తర ప్రాంతం నుండి దక్షిణాన ఉన్న న్యూ సౌత్ వేల్స్ వరకూ తీరం వెంబడి కనీసం పది రకాలైన ముల్లులేని తేనెటీగలు కనిపిస్తాయి. ఆ ఖండపు ఉష్ణమండల ఉత్తర ప్రాంతంలో కూడా వాటిలో కొన్ని రకాలు కనిపిస్తాయి.
తేనెపట్టుల నుండి తేనెను తీసేవారు పొందే ప్రయోజనాల గురించి ఆలోచించండి. ఈ తేనెటీగలను పెంచే ఒక వ్యక్తి ఇలా చెప్తున్నాడు: “[ఇతర రకాలైన తేనెటీగల] దగ్గర పనిచేసేటప్పుడు, శరీరాన్ని పూర్తిగా కప్పివేసే ఒక తొడుగును ధరిస్తాను అయితే [ముల్లులేని తేనెటీగల] దగ్గరికి వెళ్లేటప్పుడు నేను ఏ ముసుగునూ ధరించను. తేనెపట్టును తెరిచిన ఐదు నిమిషాల తర్వాత కూడా తేనెటీగలు, అసలు నేనక్కడ లేనన్నట్లే తమ పని చేసుకుంటూ పోతాయి.”
ముల్లులేని తేనెటీగల తేనెపట్టులు ఇతర తేనెటీగల తేనెపట్టులకు ఎంతో భిన్నంగా ఉంటాయి. వాస్తవానికి అవి తరచూ గూళ్లని పిలువబడతాయి. తమ తేనెను, పుప్పొడిని షడ్భుజాకార తేనెపట్టులలో దాచుకునే బదులు, ముల్లులేని తేనెటీగలు అండాకారపు కుండలను గుత్తులు గుత్తులుగా నిర్మించుకుంటాయి. ఆ కుండలను నింపిన తర్వాత వాటికి ముద్రవేసి మూసేశాక వాటిపైన లేక వాటిచుట్టూ ఇతర కుండలు నిర్మిస్తాయి.
గూటి లోపల
మనం గూటిలోకి వెళ్లి వద్దాం, ఈ గూళ్లు దాదాపు 15,000 ముల్లులేని తేనెటీగలకు నివాస స్థలాలు. అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ తేనెటీగలు కుట్టకపోయినప్పటికీ, తమ దౌడపళ్లతో మిమ్మల్ని కరవగలవు.
గూటిలోని వసారా గుండా వెళ్తూ, మనం ఎన్నో కార్యకలాపాలతో
నిండివున్న లోకాన్ని చూడవచ్చు. ఈ తేనెటీగలు నిజంగా సమిష్టిగా పనిచేస్తాయి. ఏమి పని చేయవలసి ఉందో, ఎక్కడ చేయవలసి ఉందో ప్రతి తేనెటీగకూ తెలుసు. ఒక చిన్న తేనెటీగ కచ్చితమైన బ్లూప్రింట్‌ను ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా అనుసరిస్తున్నట్లుగా క్రొత్త తేనె కుండకు ఆకారం ఇస్తూ దానికి మెరుగులు దిద్దుతూ మనకు కనిపిస్తుంది. మరో నాలుగు తేనెటీగలు, అప్పుడే తేనె నింపబడిన ఒక కుండకు ముద్రవేసి దాన్ని మూసే పనిలో నిమగ్నమై ఉంటాయి. ఒక పెద్ద త్రికోణీయ అల్లికలో ఈ తేనె కుండలు పొందుపర్చబడతాయి. ఈ అద్భుతమైన పనితనం, తేనె బరువును మోసేందుకు తగిన సహాయాన్ని అందజేస్తుంది.ఇప్పుడు మనం మరో విభాగంలోకి వెళ్లి, ఇతర తేనెటీగలకన్నా ఎంతో పెద్దగా ఉన్న ఒక తేనెటీగను గమనిద్దాం. అది అత్యంత మహిమాన్వితమైన రాణి తేనెటీగ! అది ప్రకాశవంతమైన నలుపురంగులో బంగారు రంగు వలయాలతో అలంకరించబడి ఉంటుంది. ఇతర తేనెటీగలు దాన్ని చుట్టుముట్టి ఉంటాయి! ఇప్పుడు రాణి తనకోసం సిద్ధం చేయబడిన 60 గదుల్లో గ్రుడ్లు పెట్టడం మొదలుపెడుతుంది. ఈ రాణి తేనెటీగ ఎంత జాగ్రత్తగానూ, ప్రక్కలకు జారిపోకుండానూ గ్రుడ్లను పెడుతుందో చూస్తే, బిడ్డను ఊయలలో పడుకోబెడుతున్న తల్లి మనకు జ్ఞాపకం వస్తుంది! అది గ్రుడ్లు పెట్టగానే పనిచేస్తున్న తేనెటీగలు ఆ గదులను ఎంత త్వరత్వరగా మూసేస్తాయో గమనించండి. కేవలం కొన్ని నిమిషాల్లో, పని ముగిసిపోతుంది.
గ్రుడ్లు పొదగబడినప్పుడు
గ్రుడ్లు పొదగబడినప్పుడు, బయటికి వచ్చే చిన్న చిన్న లార్వాలు వాటి కోసం ఆ యా గదుల్లో ఉంచబడిన ఆహారాన్ని తింటాయి. ఆ మైనపు గదులు పట్టజాలనంత పెద్దగా పెరిగిన తర్వాత, ఆ లార్వాలు తమ కోసం తాము పట్టుకాయలను నిర్మించుకుంటాయి. ఈ కాయలలోనే ఆ లార్వాలు (ప్యూపా దశను దాటి) తేనెటీగలుగా మారతాయి. తర్వాత, అవి ఆ కాయలలో నుండి బయటికి వచ్చి పనిచేయడం మొదలుపెడతాయి, అంటే వాటి గురించి శ్రద్ధ తీసుకునే తేనెటీగలు తమకు కొంత సపర్య చేసిన తర్వాతే అవి తమ పనిని మొదలు పెడతాయి. ఆ మైనపు గదులకు ఏమౌతుంది? వెంటనే ఆ మైనపు పదార్థాన్ని సేకరించి, తిరిగి ఉపయోగించడం జరుగుతుంది. తేనెటీగలు తమ కాయలలో నుండి ఒకసారి బయటికి వచ్చిన తర్వాత, ఇక ఆ కాయలతో పని ఉండదు. వాటిని అక్కడే ఉంచేస్తే గూడు ఇరుకైపోతుంది. కాబట్టి శుభ్రపరిచే అనేకానేక తేనెటీగలు వచ్చి మిగిలిపోయిన ఆ కాయలను తీసేస్తాయి.
ముల్లులేని అనేక రకాల తేనెటీగలు సెరుమెన్ అనే నిర్మాణ
పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థం తేనెటీగల స్వంత శరీరాలలోని మైనం నుండి, అలాగే అవి చెట్లు మొక్కల నుండి సేకరించిన జిగురు నుండీ, మైనం నుండీ ఉత్పత్తి చేయబడుతుంది. సెరుమెన్ అనే పదార్థం స్తంభాలు, దూలాలతో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించేందుకూ, వాటి జాయింట్లన్నిటినీ పటిష్టం చేసేందుకూ ఉపయోగించబడుతుంది. అవి ఈ ఫ్రేమ్‌వర్క్‌లో తేనె, పుప్పొడి కుండలను రూపొందింపజేసినప్పుడు, తేనెటీగలు సెరుమెన్‌కు ఆకారమిస్తూ దాన్ని కుదిస్తూ, ఆ కుండల చుట్టూ కుండల్లోకి పరుగులు తీస్తాయి. తర్వాత కుండలు నింపబడి, భద్రపర్చడానికి ముద్రవేయబడతాయి. ఈ తేనెటీగలకు మొక్కలకుండే ఋతు సంబంధమైన విలువల గురించి ఋతుసంబంధమైన వాతావరణం మూలంగా ఏర్పడే ప్రమాదాల గురించి సహజసిద్ధంగానే తెలిసి ఉండవచ్చు. ఆహారాన్ని సేకరించి, దాన్ని భద్రపర్చుకోవడమనేది తాము మనుగడ సాగించడానికొక ప్రాథమిక అవసరమన్న విషయం వాటికి బాగా తెలుసనిపిస్తుంది.తేనెటీగలు గూటిని విడిచి పెట్టి, నిర్మాణ సామాగ్రి కోసం అలాగే తేనె పుప్పొడుల కోసం, మకరందం కోసం వేట ప్రారంభిస్తాయి. ఒకసారి గూటి నుండి బయటికి వచ్చిన తర్వాత ఇక ఆ తేనెటీగ నైపుణ్యంగల పైలట్‌లా, నావికునిలా మారిపోతుంది. దేనిని సేకరించాలో, అది ఎక్కడ లభిస్తుందో కూడా ఆ తేనెటీగకు బాగా తెలుసు.
క్రొత్త ఇంటిని నిర్మించడం
గుంపు పెరుగుతుండగా, గూడు పూర్తిగా నిండిపోతుంది. ఇప్పుడేమి జరుగుతుంది? “మనం మరో ఇంటిని నిర్మించాలి” అనే సందేశం పూర్తి కుటుంబానికి అందజేయబడుతుందనుకుంటా. గూడు కట్టుకోవడానికి తగిన స్థలాన్ని వెదకడానికి ఒక గస్తీ దళం బయలుదేరుతుంది. ఆ తర్వాత దాన్ని “ఇంజినీర్లు” దర్శిస్తాయి. సాధారణంగా, నిపుణతగల దాదాపు 30 నుండి 50 వరకున్న తేనెటీగలు అనేక గంటలపాటు ఆ ప్రాంతపు లోపలి భాగాన్ని తనిఖీ చేస్తాయి, దాన్ని గీతలతో, గుంజలతో గుర్తులు పెడుతున్నట్లుగా ఉంటుంది. పునాది తగిన విధంగా ఉందని నిర్థారించుకున్న తర్వాత అవి ఇంటికి తిరిగి వస్తాయి, బహుశా నివేదించడానికి కావచ్చు. తర్వాత, సాధారణంగా 48 గంటల్లోపలే అసలైన “నిర్మాణకులు” వస్తారు. ఒక గుంపులో వెయ్యికన్నా ఎక్కువ తేనెటీగలు ఉంటాయి గానీ రాణి మాత్రం ఉండదు. అవి వెంటనే పనిని మొదలుపెట్టి, అసలు గూటి నుండి నిర్మాణ సామాగ్రినీ, ఆహారాన్ని తెచ్చుకోవడం మొదలుపెడతాయి.
ఈ క్రొత్త గూటిని రాణి కోసం సిద్ధపరచడంలో భాగంగా, సరైన ఉష్ణోగ్రత అంటే 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే విధంగా ఆ గూడు నిర్మించబడాలి. అందుకోసం, పనిచేసే తేనెటీగలు గూడును కంబలిలో చుట్టిపెట్టినట్లుగా, దాని చుట్టూ సెరుమెన్ గోడను నిర్మిస్తాయి. గ్రుడ్లను వెచ్చగా ఉంచాలని జ్ఞానవంతమైన ఈ తేనెటీగలకు తెలిసినట్లే ఉంది. ఇప్పుడిక అంతా సిద్ధంగా ఉంది, తొమ్మిదవ రోజున, తల్లి గూటిలో పెరిగిన క్రొత్త రాణి అక్కడికి తీసుకురాబడుతుంది. వెంటనే ఆమె తన రాజభవనంలో మరిన్ని తేనెటీగలను ఉత్పత్తి చేసేందుకుగాను గ్రుడ్లను పెట్టడం మొదలు పెడుతుంది.
క్రమంగా, తల్లి గూటి నుండి తరలి వచ్చిన తేనెటీగలు చనిపోతాయి, ఆ క్రొత్త గూటిలో నుండి చిన్న చిన్న క్రొత్త తేనెటీగలు తయారౌతాయి. కొంతకాలానికి, ఈ గూటికి చెందిన తేనెటీగలు, మరో ఇంటిని నిర్మించవలసిన అవసరం ఉందని గ్రహిస్తాయి. కాబట్టి అసామాన్యుడైన సృష్టికర్త రూపొందించిన మరో అద్భుతమైన వలయం ప్రారంభమౌతుంది!
(g00 11/8)
[13వ పేజీలోని చిత్రం]
షడ్భుజాకార తేనెపట్టులకు బదులు, ముల్లులేని తేనెటీగలు అండాకారపు కుండలను గుత్తులు గుత్తులుగా నిర్మించుకుంటాయి
[14వ పేజీలోని చిత్రం]
ఆస్ట్రేలియాలో కనీసం పది రకాల ముల్లులేని తేనెటీగలు కనిపిస్తాయి