కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చైనీయుల మందుల దుకాణాన్ని సందర్శించడం

చైనీయుల మందుల దుకాణాన్ని సందర్శించడం

చైనీయుల మందుల దుకాణాన్ని సందర్శించడం

క్వాక్‌ కిట్‌ గత కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు, కాబట్టి వైద్యుని దగ్గరికి వెళ్లడం మంచిదని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన చైనీయుడైనందున, సాంప్రదాయకమైన చైనా వైద్యాన్ని చేసే వైద్యుని దగ్గరికి వెళ్లడానికే ఇష్టపడతాడు. కుటుంబ స్నేహితుడొకాయనకు, దగ్గరలోనేవున్న అలాంటి ఒక వైద్యుడు తెలుసు, అతనికి ఒక మూలికల దుకాణం ఉంది, అతడే దాన్ని చూసుకుంటాడు. క్వాక్‌ కిట్‌ను బాధిస్తున్నదాన్ని తొలగించివేసే మూలికల కషాయాన్ని ఆ వైద్యుడు తయారుచేసివ్వగలడని ఆ స్నేహితుడు ఆయనకు చెప్తాడు.

ఆగ్నేయాసియాలోని అనేక భాగాల్లోలాగే, చైనాలో వైద్యుని దగ్గరికి వెళ్లడానికీ పశ్చిమ దేశాల్లో వైద్యుని దగ్గరికి వెళ్లడానికీ చాలా తేడా ఉంది. పశ్చిమ దేశాల్లో వైద్యుని దగ్గరికి వెళ్లడమంటే ఒక అపాయింట్‌మెంట్‌ తీసుకుని, డాక్టరు దగ్గరికి వెళ్లి, పరీక్ష చేయించుకుని, ప్రిస్క్రిప్షన్‌ తీసుకోవడం వంటివి సాధారణంగా ఇమిడి ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్‌లో ఉన్నవి కొనుక్కోవడానికి ఆ రోగి మందుల దుకాణానికి వెళ్లాలి. అయితే చైనీయుల వైద్యుని విషయంలో పద్ధతి చాలా సులభమైనదిగా ఉంటుంది. మీరొక మూలికల దుకాణానికి వెళ్తారు, అక్కడ ఎప్పుడూ ఒక మూలికా వైద్యుడు ఉంటాడు, అతడు చైనీయుల వైద్యుడు కూడా అయ్యుంటాడు. అతడు మిమ్మల్ని పరీక్షించి, మీ సమస్య ఏమిటో నిర్థారించి, మూలికల మోతాదును కొలిచి ఇచ్చి, దాన్ని ఎలా తీసుకోవాలో మీకు చెప్తాడు​—అంతా ఒక్క సందర్శనంతోనే ముగిసి పోతుంది! *

ఔషధంగా మూలికలా?

చాలామంది పాశ్చాత్యులు మాత్రలు, క్యాప్సూల్స్‌, ఇంజక్షన్‌లకు అలవాటు పడినప్పటికీ, అవి ఇటీవలి కాలంలోనే వాడుకలోకి వచ్చాయని చెప్పవచ్చు. వేలాది సంవత్సరాలపాటు ప్రజలు చికిత్స కోసం ప్రకృతి మాధ్యమాలపైనే ఆధారపడ్డారు. ఉదాహరణకు, బైబిలు కాలాల్లోని యూదులైన వైద్యులు తైలము, గుగ్గిలము, ద్రాక్షారసము వంటి ఔషధాలను ఉపయోగించారు. (యెషయా 1:6; యిర్మీయా 46:11; లూకా 10:​34) కురుపులను బాగుచేయడానికి ఎండిన అంజూరపు పండ్ల నుంచి తయారు చేసిన ముద్దలను ఉపయోగించేవారని స్పష్టమౌతుంది.​—2 రాజులు 20:7.

వాస్తవానికి, దాదాపు ప్రతి దేశమూ లేక ప్రతి జనాంగమూ రోగాలకు, జబ్బులకు చికిత్స చేసేందుకు ఎప్పుడో ఒకసారి మూలికలను, వివిధ రకాలైన ఔషధాలను ఉపయోగించింది. చివరికి ఇప్పుడు వంటకాల్లో ఉపయోగించబడుతున్న అనేక మసాలా దినుసులు మొదట్లో వాటి వైద్యపరమైన విలువను బట్టే ఉపయోగించబడేవి. దాని ఉద్దేశం, అటువంటి పద్ధతులు ఎప్పుడూ విజయవంతమయ్యాయని చెప్పడం కాదు. అందుకు భిన్నంగా, తరచూ మూఢనమ్మకం, అజ్ఞానం వాటిలో ఇమిడి ఉండేవి. అయినప్పటికీ, రోగులకు చికిత్సచేసే అటువంటి పద్ధతులు సహస్రాబ్దాలుగా వాడుకలో ఉన్నాయి. నేడు ఎంతో సర్వసాధారణంగా ఉపయోగించబడుతున్న కొన్ని మందులు కూడా మొక్కల నుండి తీయబడినవే.

చైనీయుల వైద్య సిద్ధాంతమూ, ఆచరణా

జబ్బును మూలికా వైద్యంతో బాగుచేయడమన్నది చైనీయుల చరిత్రలో ఒక అంతర్గత భాగం. నే జింగ్‌ అనే అంతర్గత వైద్య ప్రమాణాన్ని పసుపువర్ణ చక్రవర్తియైన వాన్‌-ది కూర్చినట్లు జనపదం చెప్తుంది, చైనాలోని వైద్యులు ఇప్పటికీ దాన్ని సంప్రదిస్తారు. * ఈ ప్రమాణంలో, పశ్చిమానికి చెందిన వైద్య పుస్తకంలో ఉండే దాదాపు అన్ని విషయాలు ఉంటాయి, అయితే ఇది ఎప్పుడు వ్రాయబడిందనే దాని గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి. దానిలో రోగ నిర్ధారణ, రోగలక్షణాలు, రోగ కారకాలు, చికిత్స, రోగాలను అరికట్టే విధానం మాత్రమే గాక శరీర నిర్మాణశాస్త్రం, శరీర విధులు కూడా చర్చించబడ్డాయి.

ఆగ్నేయాసియాకు చెందిన అనేక కళల విషయంలోలాగే, చైనీయుల వైద్య సిద్ధాంత ఆచరణలపై ఇన్‌-యాంగ్‌ మత సిద్ధాంతం ఎంతో ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించింది. ఇక్కడ ఇన్‌ చల్లదనానికీ యాంగ్‌ వెచ్చదనానికీ ప్రాతినిధ్యం వహిస్తాయి​—అవి ఇంకా అనేక వ్యతిరేక లక్షణాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. * అంతేగాక, రోగనిర్ధారణ కోసం, చికిత్స కోసం ఆక్యుపంక్చర్‌తో సంబంధం కల్గివున్న శరీరంపైనుండే మెరీడియన్‌ పాయింట్లను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రోగిలో ఏర్పడిన ఇన్‌-యాంగ్‌ అసమతౌల్యాన్ని సరిచేసేందుకు చల్లని పదార్థాలనీ లేక వేడి పదార్థాలనీ పరిగణించబడే మూలికలు, ఆహారపదార్థాలు ఇవ్వబడతాయి.

ఉదాహరణకు, జ్వరంవున్న వ్యక్తికి వేడి ఉన్నట్లుగా పరిగణించబడుతుంది, కాబట్టి చల్లదనాన్ని కల్గిస్తాయని చెప్పబడే మూలికలు అతనికి ఇవ్వబడతాయి. ఇన్‌-యాంగ్‌ ఇప్పుడిక ప్రత్యేకంగా ప్రస్తావించబడక పోయినప్పటికీ, ఒక రోగికి ఎలా చికిత్స చేయాలనేది నిశ్చయించడానికి ఇప్పటికీ అవే సూత్రాలు ఉపయోగించబడుతున్నాయి. అయితే చైనీయుల వైద్యుడు ఎలా రోగ నిర్ధారణ చేస్తాడు? మూలికల దుకాణం ఎలా ఉంటుంది? అది తెలుసుకోవడానికి, క్వాక్‌ కిట్‌ను ఆయన స్నేహితుడు వెళ్లమని సిఫారసు చేసిన దుకాణానికి ఆయనతోపాటు మనం కూడా ఎందుకు వెళ్లకూడదు?

అసాధారణమైన మూలికల దుకాణం

ఆశ్చర్యం! ఈ రోజు క్వాక్‌ కిట్‌, వైద్యుడ్ని చూడడానికి వేచివుండవలసి వస్తుంది. ఫ్లూ లేక జలుబు మహమ్మారిలా వ్యాపించినట్లు ఉంది, అందుకే ఆయనకంటే ముందు ఇంకా ఇద్దరు రోగులు అక్కడున్నారు. వేచివుండే సమయంలో మనం దుకాణం అంతా అలా తిరిగి చూద్దాం.

మనం లోపలికి వెళ్లగానే మన అవధానాన్ని చూరగొనే మొదటి విషయాలు, ద్వారం దగ్గరే తెరిచివున్న డబ్బాల్లో వేసివుంచిన ఎండబెట్టిన పదార్థాలు అంటే, పుట్టగొడుగులు, స్కలాప్‌లు, నత్తలు, అత్తిపళ్లు, కాయలు, ఇతర తిండి పదార్థాలు వంటివి. అవును ఇక్కడ తిండి పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని ప్రిస్క్రిప్షన్‌లో భాగమై ఉండవచ్చు.

వాటి వెనుక, ఇరుగ్గా ఉన్న ఆ దుకాణంలో ఇరువైపులా అద్దాల అలమారాల్లో ఉన్నవాటిని మనం చూడవచ్చు. వీటిలో చాలా అరుదైన లేక ప్రత్యేకమైన మూలికలు, లవణాలు, ఎండబెట్టిన జంతువుల భాగాలు ఉన్నాయి, అవి ఎంతో ఖరీదైనవి. దగ్గరగా వెళ్లి చూస్తే, మనకు జింక కొమ్ములు, ముత్యాలు, ఎండబెట్టిన బల్లులు, నీటి గుర్రాలు అలాగే ఇతర అనేక అసాధారణమైన పదార్థాలు కనిపిస్తాయి. ఇటీవలి సంవత్సరాల వరకు, ఖడ్గమృగం కొమ్ములు, ఎలుగుబంటి పిత్తాశయాలు, ఇటువంటి అనేక ఇతర జంతువుల శరీర భాగాలు అలాంటి స్థలాల్లో కనిపించేవి, కాని ఇప్పుడు అవి నిషేధించబడ్డాయి.

దుకాణంలోని మరో మూల జలుబు, కడుపు జబ్బులు వంటి సాధారణ రోగాలకు మిశ్రిత మూలికల పాకెట్లు, అలాగే సీసాల్లో నింపబడి చైనా నుండి వచ్చిన మూలికా మందులు మనకు కనిపిస్తాయి. మీ సమస్య ఏమిటో దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తికి చెప్తే చాలు, అతడు మీకు ఆ సీసాల్లోని మందునైనా సిఫారసు చేస్తాడు లేక మిశ్రిత మూలికల పాకెట్‌నైనా ఇచ్చి, దాన్ని ఇంటి దగ్గర ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్తాడు.

దుకాణాదారుని వెనుకనున్న గోడకు ఒక వైపున, అలమారాల్లో ఉంచబడిన పొడవైన గాజు జాడీలను చూస్తాము, వాటిలో వివిధ రకాలైన ఎండబెట్టిన వేర్లు, ఆకులు, రెమ్మలు ఉన్నాయి. ఇవి ఖాతాదారులకు బాగా తెలిసిన మూలికలు. వీటిని తీసుకువెళ్లి వారు తమకు తాము మందులు తయారు చేసుకుంటారు లేక వంటకు ఉపయోగించుకుంటారు. దుకాణానికి మరో వైపున పైకప్పు నుండి నేల వరకూ ఉండి ఎన్నో అరలున్న అలమారా ఉంది, దాని అరలు ఎంతో ఉపయోగించినట్లు చాలా పాతబడి ఉన్నాయి. దాన్ని బీట్జీగ్వా లేక “వంద బిడ్డల అలమార” అని పిలుస్తారు, ఎందుకంటే ఈ విధమైన మూలికల అలమారాలో వంద లేదా అంతకన్నా ఎక్కువ అరలు ఉంటాయి. ఈ అరలు సాధారణ చికిత్స కోసం ఉపయోగించే మూలికలను త్వరగా తీసుకోవడానికి అనువుగా ఉంటాయి, మరీ ఎక్కువగా ఉపయోగించే మందులు చేతికి అందుబాటులో ఉండే అరల్లో ఉంటాయి. ఈ అరలపై పేర్లు వ్రాసి ఉండక పోవడం అసాధారణం ఏమీ కాదు. ప్రతి మూలికా ఎక్కడుందో అనుభవజ్ఞులైన సహాయకులకు కచ్చితంగా తెలుసు.

ఆ సహాయకుడు తాను వైద్యం చేస్తున్న ఆ స్త్రీ కోసం మూలికలను ఎంత నైపుణ్యంగా తూకం వేస్తున్నాడో గమనించండి. ఆయన ఒక సున్నితమైనదీ అదే సమయంలో కచ్చితమైనదీ అయిన త్రాసును ఉపయోగిస్తున్నాడు​—ఈ త్రాసులో ఒక అడ్డకర్రకు ఒక వైపున మూడు తాళ్లతో వ్రేలాడుతున్న పళ్లెం, మరో వైపున కదల్చటానికి వీలయ్యే తూనికరాళ్లు ఉంటాయి. కొన్ని మూలికలు మరీ ఎక్కువగా తీసుకుంటే మరణకరం కాగలవని అతనికి తెలుసు, కాబట్టి అతడు తూచి ఇచ్చేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అన్నిటినీ తూకం వేయరు. ఇప్పుడతడు వివిధ అరల్లో నుండి రకరకాల మూలికలు గుప్పెడు తీసుకుని, వాటిని పొట్లం చుట్టే కాగితం మీద పెట్టడం మనం చూడవచ్చు. అవును, మీరు అనుకుంటున్నది కరెక్టే, ఈ ప్రిస్క్రిప్షన్‌లో సికాడా తోళ్లు కూడా ఉన్నాయి. అతడు వాటిని పొట్లం చుడుతూ, వాటితో కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఆ స్త్రీకి చెబుతున్నాడు.

మూలికల మందులను వివిధ రకాలుగా సిద్ధం చేసి తీసుకుంటారు. కొన్ని పొడి రూపంలో దొరుకుతాయి. రోగి వాటిని వేడి నీళ్లలో కరిగించి ఆ కషాయం త్రాగుతాడు. మరికొన్ని ముద్దగా ఉంటాయి. వాటిని తేనెతోగానీ మరేవైనా మత్తు పానీయాలతోగానీ తీసుకోవాలి. అయితే, సర్వసాధారణమైన పద్ధతిని అనుసరించమని ఈ స్త్రీకి చెప్పడం జరిగింది, అదే కషాయం. అంటే ఆమె ఈ మూలికలను ఒక కుండలో దాదాపు ఒక గంటపాటు మరగ బెడుతుంది. ఆ తర్వాత తయారైన మిశ్రమాన్ని ఆమె కొన్ని గంటలకొకసారి చొప్పున క్రమంగా త్రాగుతుంది. ఆ స్త్రీ ఆ తర్వాత అదే మిశ్రమం ఇంకా కావాలనుకుంటే, ఆమె దుకాణానికి మళ్లీ వెళ్లవలసిందే.

క్వాక్‌ కిట్‌ వైద్యుని దగ్గరికి వెళ్లే సమయం వచ్చింది. వైద్యుడు ఆయన రక్తపోటును చూడడు లేక గుండె స్పందనను చూడడు. కానీ ఆయన రోగలక్షణాలు ఏమిటో చెప్పమని మాత్రం క్వాక్‌ కిట్‌ను అడుగుతాడు. ఆయన బాగా నిద్రపోతున్నాడా? తీసుకున్న ఆహారం సరిగ్గా అరుగుతోందా, ఆకలి, మలవిసర్జన, శరీర ఉష్ణోగ్రత, చర్మ స్థితి, రంగు ఎలా ఉన్నాయి? వైద్యుడు ఆయన కళ్లను దగ్గరగా పరిశీలిస్తాడు, ఆయన నాలుకపైని వివిధ ప్రాంతాలను పరిశీలిస్తాడు. ఇప్పుడు వైద్యుడు క్వాక్‌ కిట్‌ కుడి చెయ్యి నాడి ఎడమ చెయ్యి నాడి ఎలా కొట్టుకుంటుందో మణికట్టుపై వేర్వేరు చోట్ల, వివిధ రకాలుగా ఒత్తిడి కలుగజేస్తూ పరిశీలిస్తున్నాడు, ఈ పద్ధతి ద్వారా వివిధ అవయవాల, శరీరంలోని వివిధ భాగాల స్థితి ఎలా ఉందో తెలుస్తుందని విశ్వసించబడుతుంది. అంతెందుకు, వైద్యుడు చివరికి తనకు అసాధారణమైన వాసనలు ఏవైనా వస్తున్నాయేమో కూడా గమనిస్తాడు! తుది నిర్ణయం? క్వాక్‌ కిట్‌కు ఫ్లూ ఉందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఆయనకు పూర్తి విశ్రాంతి కావాలి, అంతేగాక ద్రవపదార్థం ఎక్కువగా తీసుకుంటూ వైద్యుడు ఇచ్చే మందును కాచుకుని త్రాగాలి. తత్ఫలితంగా వచ్చే మూలికల కషాయం చాలా చేదుగా ఉంటుంది, కానీ అది ఆయన కోలుకునేలా చేస్తుంది. ఏ ఆహారపదార్థాలు తీసుకోకూడదో చెప్పడమే గాక మందు వేసుకున్న తర్వాత ఎండు పండ్లను తినమని వైద్యుడు చెబుతాడు, అది క్వాక్‌ కిట్‌ నోటి చేదును పోగొట్టి కమ్మగా ఉండేలా చేస్తుంది.

దానితో క్వాక్‌ కిట్‌ తన మూలికల పొట్లం తీసుకుని వెళ్లిపోతాడు. వైద్యుని దగ్గరికి వెళ్లడానికీ, మందులకూ ఆయనకు మొత్తం కలిపి 20 అమెరికా డాలర్లే ఖర్చయ్యాయి, చాలా చౌక. ఆ మూలికలు అద్భుతంగా నయంచేయక పోయినప్పటికీ, క్వాక్‌ కిట్‌ కొద్ది రోజుల్లో బాగవుతాడు. అయితే ఆయన ఎక్కువ తీసుకుంటే మంచిదని భావిస్తూ, ఇతరులు కొంతమంది చేసిన పొరపాటునే చేయకూడదు. కొన్ని మూలికలను మోతాదుకు మించి తీసుకున్నందుకు తీవ్రమైన రియాక్షన్లతో బాధపడిన వారి గురించి వినడం అసాధారణమైన విషయమేమీ కాదు.

కొన్ని దేశాల్లో మూలికలను గానీ చైనీయుల సాంప్రదాయక వైద్యం చేసేవారిని గానీ క్రమబద్ధీకరించేందుకు చాలా తక్కువ ప్రమాణాలు ఉన్నాయి లేక అసలు ప్రమాణాలే లేవు. ఇది, దొంగ వైద్యులకు మార్గాన్ని తెరవడమే గాక ప్రమాదకరమైన మూలికా కషాయాలను మందులని ఇతరులకు అమ్మడానికి కూడా కారణమయ్యాయి. సాంప్రదాయక చైనీయుల వైద్యుడ్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఆసియాలోని చాలామంది రోగులు తమ బంధువులు, సన్నిహిత స్నేహితుల సిఫారసులపై ఆధారపడతారన్నది అర్థం చేసుకోదగినదే.

మూలికలతో చేసినదైనా లేక పశ్చిమ వైద్యమైనా సరే ఏ చికిత్సా ప్రతి రోగాన్నీ బాగుచేయలేదు. అయినప్పటికీ, చైనీయుల మందుల దుకాణమూ, దాని సాంప్రదాయక వైద్యమూ ఆసియాలోని జీవనంలో ఒక అంతర్గత భాగంగా కొనసాగుతున్నాయి.

(g00 11/8)

[అధస్సూచీలు]

^ ఆరోగ్య సమస్యలకు తేజరిల్లు! ఏ నిర్దిష్టమైన వైద్య పద్ధతినీ సిఫారసు చేయడం లేదు. క్రైస్తవులు తాము తీసుకునే ఏ చికిత్స అయినా సరే బైబిలు సూత్రాలను వ్యతిరేకించేదై ఉండకుండా జాగ్రత్త వహించాలి.

^ చవు రాజవంశావళికి ముందు, ప్రసిద్ధ పరిపాలకుడైన పసుపువర్ణ చక్రవర్తి, సా.శ.పూ. 2697 నుండి 2595 వరకు పరిపాలించినట్లు చెప్పబడుతుంది. అయితే, సుమారుగా సా.శ.పూ. 1100 నుండి 250 వరకు సాగిన చవు రాజ్యం అంతమైపోయే వరకూ నే జింగ్‌న వ్రాతరూపంలో పెట్టడం జరగలేదని చాలామంది పండితులు నమ్ముతారు.

^ “ఇన్‌” అనే చైనా భాష అక్షరానికి, అక్షరార్థంగా “నీడ” అని భావం, అది చీకటికి, చల్లదనానికి, స్త్రీత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. “యాంగ్‌” దానికి పూర్తి వ్యతిరేకం, అంటే వెలుగుకు, వెచ్చదనానికి, పురుషత్వానికి ప్రతీక.

[23వ పేజీలోని చిత్రాలు]

ఎండబెట్టిన నీటి గుర్రాలతో సహా అసాధారణమైన రకాలను మూలికల దుకాణంలో చూడవచ్చు

[24వ పేజీలోని చిత్రాలు]

ఎండబెట్టిన వేర్లను, ఆకులను, రెమ్మలను జాగ్రత్తగా తూకం వేస్తారు