కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నర్సులు వాళ్లు మనకెందుకు అవసరం?

నర్సులు వాళ్లు మనకెందుకు అవసరం?

నర్సులు వాళ్లు మనకెందుకు అవసరం?

“అతి కష్టతరమైన కళల్లో ఒకటి నర్సింగ్‌. దయ ఒక ప్రేరకంగా పనిచేయవచ్చు, కానీ పని చేయటానికి మాకున్న ఏకైక శక్తి, జ్ఞానమే.” ​—మేరీ అడలాయిడ్‌ నట్టింగ్‌, 1925, ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి నర్సింగ్‌ ప్రొఫెసర్‌.

నర్సింగ్‌కు వేల సంవత్సరాల పూర్వచరిత్ర ఉంది, చివరికి బైబిలు కాలాల్లో కూడా అలాంటి సేవ జరిగేది. (1 రాజులు 1:2-4) చరిత్ర అంతటిలో, చాలామంది పేరెన్నికగన్న స్త్రీలు నర్సులుగా రోగులకు సేవచేశారు. ఉదాహరణకు, హంగేరీ దేశస్థురాలూ, రాజైన ఆండ్రూ II కుమార్తె అయిన ఎలిజబెత్‌ను (1207-31) తీసుకోండి. ఆమె 1226లో ఏర్పడిన కరువు సమయంలో ఆహార పంపిణీని వ్యవస్థీకరించింది. ఆ తర్వాత, ఆమె ఆసుపత్రులను నిర్మించడానికి ఏర్పాట్లు చేసి, అక్కడామె కుష్ఠురోగుల గురించి శ్రద్ధ తీసుకుంది. ఎలిజబెత్‌ కేవలం 24 సంవత్సరాల వయస్సులోనే మరణించింది, ఆమె తన స్వల్ప జీవితకాలంలోని చాలా సమయాన్ని రోగులకు సేవచేయడంలోనే గడిపింది.

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ పేరును ప్రస్తావించకుండా నర్సింగ్‌ చరిత్రను గురించి మాట్లాడడం అసాధ్యం. ధైర్యవంతురాలైన ఈ ఆంగ్లేయ వనిత 38 మంది నర్సుల బృందంతో కలిసి, 1853-56 వరకు జరిగిన క్రిమ్యన్‌ యుద్ధ కాలంలో కాన్‌స్టాంటినోపుల్‌ పరిసర ప్రాంతమైన స్కూటేరీలో ఉన్న సైనిక ఆసుపత్రిని పునర్వ్యవస్థీకరించింది. ఆమె అక్కడికి చేరుకునే సరికి, మరణాల రేటు దాదాపు 60 శాతం వరకూ ఉండేది; 1856లో ఆమె అక్కడి నుండి వెళ్లిపోయే సమయానికి అది 2 కన్న తక్కువ శాతానికి తగ్గిపోయింది.​—6వ పేజీలోని బాక్సును చూడండి.

ఆమె నర్సింగ్‌పై బలమైన ప్రభావాన్ని చూపించినదేమిటంటే, జర్మనీలోని కైసర్స్‌వర్ట్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొటెస్టెంట్‌ డీకొనెసెస్‌ అనే సంస్థే. క్రిమ్యకు వెళ్లక ముందు నైటింగేల్‌ ఆ ఇన్‌స్టిట్యూట్‌కి హాజరైంది. కొంతకాలానికి, పేరెన్నికగన్న ఇతర నర్సింగ్‌ సంస్థలు వృద్ధి చెందాయి. ఉదాహరణకు, 1903లో ఆగ్నస్‌ కార్ల్‌ అనే స్త్రీ, జర్మన్‌ నర్సుల కోసం ప్రొఫెషనల్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించింది.

నేడు నర్సులు, వృత్తిపరంగా చూస్తే మన ఆరోగ్య సంరక్షణ విధానంలో అత్యంత పెద్ద పాత్రను పోషిస్తున్న గుంపుగా రూపొందుతున్నారు. ప్రస్తుతం 141 దేశాల్లో 90,00,000 కన్నా ఎక్కువమంది నర్సులు, మంత్రసానులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిస్తుంది. వారెంతటి ప్రాముఖ్యమైన పనిని నిర్వర్తిస్తున్నారో కదా! నర్సులు, “రోగులను రక్షించడానికి ప్రాముఖ్యమైన శ్రద్ధనూ, జ్ఞానాన్నీ, నమ్మకాన్నీ [తమ పనిలో] సమ్మిళితం చేస్తారు” అని ది అట్లాంటిక్‌ మంత్లీ పేర్కొంటుంది. కాబట్టి మనం నర్సుల గురించి సబబుగానే ఇలా అడగవచ్చు, వాళ్లు లేకపోతే మనమేమి చేస్తాం?

రోగి కోలుకోవడంలో నర్సు పాత్ర

ఒక ఎన్‌సైక్లోపీడియా “అనారోగ్య పరిస్థితి నుంచిగానీ, గాయం నుంచిగానీ కోలుకునేందుకు, లేదా సాధ్యమైనంత ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు నర్సు రోగికి సహాయాన్ని అందించే ప్రక్రియ”నే నర్సింగ్‌ అని నిర్వచించింది.

అయితే, ఆ ప్రక్రియలో ఇంకా ఎక్కువే ఇమిడివుంది. నాడిని పరీక్షించడం, రక్తపోటు చూడడం వంటి సాధారణ టెస్టులను చేసుకుపోవడంకన్నా ఎక్కువే చేరివుంది. రోగి కోలుకోవడంలో నర్సు ఒక సమగ్రమైన పాత్ర నిర్వహిస్తుంది. ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ మెడిసిన్‌ చెప్తున్న దాని ప్రకారం, “నర్సు రోగికున్న అనారోగ్యం కంటే ఆ అనారోగ్యానికి రోగి ఎలా ప్రతిస్పందిస్తాడనే దాని గురించే ఎక్కువ శ్రద్ధ కల్గివుంటుంది. శారీరక బాధ యొక్క తీవ్రతను తగ్గించడానికి, మానసిక వేదన నుండి ఉపశమనాన్నివ్వడానికి, వీలైతే ఇతర రోగాల్లోకి దింపకుండా జాగ్రత్త వహించడానికి నర్సు అంకితమౌతుంది.” అంతేగాక నర్సు, “అవగాహనతో కూడిన శ్రద్ధ”ను చూపిస్తుంది. అందులో “రోగికున్న భయాందోళనల గురించి సహనంతో వినడం, భావోద్వేగపరమైన మద్దతునూ ఓదార్పునూ ఇవ్వడం ఇమిడి ఉంటాయి.” ఒక రోగి మృత్యుముఖానికి చేరువైనప్పుడు, “అంతగా కలతకు గురికాకుండానూ, ఇనుమడించిన ఆత్మగౌరవంతోనూ మృత్యువును ఎదుర్కొనేలా రోగికి సహాయపడడమే” నర్సు నిర్వహించవలసిన పాత్ర అని ఆ పుస్తకం పేర్కొంటుంది.

చాలామంది నర్సులు కేవలం విధి నిర్వహణ కంటే ఎక్కువే చేస్తారు. ఉదాహరణకు ఎలెన్‌ డి. బార్‌, న్యూయార్క్‌ నగరంలోని మాంటిఫీయర్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేసినప్పటి తన అనుభవాన్ని గురించి వ్రాసింది. ఆమె శస్త్రచికిత్సకుల బృందంతో ఉదయం చేసే రౌండ్స్‌ను త్వరత్వరగా ముగించేస్తూ వెళ్లిపోవడానికి ఇష్టపడేదికాదు. “నాకు రోగులతో కాస్త సమయం గడపాలని ఉండేది. శ్వాస ప్రక్రియ సంబంధంగా వారు చేసే ఎక్సర్‌సైజులలో వారితో కలిసి పనిచేయాలనీ, ఇటూ అటూ నడవడంలో సహాయం చేయాలనీ, గాయాలను శుభ్రపర్చి ఎప్పటికప్పుడు కట్టు కట్టాలనీ, వారి ప్రశ్నలకు సమాధానమివ్వాలనీ, వారికి విషయాలను వివరిస్తూ, వ్యక్తిగతంగా కొంత ఓదార్పునివ్వాలనీ నేను కోరుకునేదాన్ని. రోగులతో సన్నిహిత సహవాసం ఏర్పరచుకోవడాన్నీ, సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడాన్నీ నేను ఇష్టపడతాను” అని ఆమె వ్రాస్తోంది.

ఆసుపత్రిలో రోగిగా సమయం గడిపిన ఎవరైనా సరే నిస్సందేహంగా, అలాంటి స్వయం త్యాగపూరిత స్ఫూర్తినే చూపించిన దయగల నర్సును గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేరు. అయితే నిపుణతగల నర్సు కావడానికి ఏమి అవసరం?

(g00 11/8)

[3వ పేజీలోని చిత్రం]

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌

[చిత్రసౌజన్యం]

Courtesy National Library of Medicine