ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
ఒత్తిడికి గురౌతున్న విద్యార్థులు
సంవత్సరాంతంలో వచ్చే పాఠశాల పరీక్షల సమయం, ఇండియాలోని చాలామంది పిల్లలకు అధిక ఒత్తిడిని కలిగిస్తుందని ముంబయికి చెందిన ఏషియన్ ఏజ్ నివేదిస్తుంది. కేవలం పరీక్షలకు ముందు హడావిడిగా ప్రిపేరవ్వడమూ, అలాగే మంచి మార్కులు సంపాదించుకోవాలనే తాపత్రయంతో కూడిన ఒత్తిడీ కొంతమందికి మరీ భరించలేనివవుతాయి, అంతేగాక మానసిక వైద్యుల దగ్గరికి వెళ్లేవారి సంఖ్య పరీక్షల సమయంలో రెండింతలవుతుంది. తమ పిల్లలు పరీక్షలు మంచిగా రాయాలనే చింతతో కొంతమంది తల్లిదండ్రులు అన్ని రకాల వినోదాన్నీ అరికడతారు. “తల్లిదండ్రులు తమ పిల్లల్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తారు. దానికి తోడు ఇతర విద్యార్థులతో పోటీ ఉండనే ఉంటుంది” అని వి. కె. మన్‌డ్ర అనే మానసిక వైద్యుడు పేర్కొన్నాడు. “పిల్లవాడ్ని కాస్త విశ్రాంతి తీసుకోనిచ్చినప్పుడు అది వాడి మనస్సును సేదదీర్చి, మరింత చక్కగా చదువుకునేందుకు సహాయం చేస్తుందని” చాలామంది తల్లిదండ్రులు గ్రహించరని కూడా ఆయన జతచేస్తున్నాడు. పరీక్షల ఒత్తిడి “చివరికి ఒకటి నుండి ఏడవ తరగతి విద్యార్థుల వరకూ కూడా వ్యాపించిందని” డా. హరీష్ షెట్టి పేర్కొంటున్నాడు.
(g00 11/22)
పందులు పట్టణానికి వెళ్లడం
సాధారణంగా బెదురుతూ అడవుల్లో ఉండే అడవి పందులు, నగరాలు తమకు పుష్కలమైన ఆహారాన్నే గాక వేటగాళ్ల నుండి రక్షణను కూడా కల్పిస్తాయని తెలుసుకున్నాయని జర్మన్ వారపత్రికయైన డై వోక్ చెప్తుంది. అడవి పందులు చివరికి బెర్లిన్ నగరంలో తమ పిల్లల్ని కన్నాయి కూడా. ఆకలితో ఉన్న ఈ జంతువులు కేవలం అడవి ప్రాంతాలకు లేక బహిరంగ పార్కులకు మాత్రమే పరిమితం కావు. ఇవి ఇతరుల తోటల్లోకి కూడా వెళ్లి దుంపలను తినేస్తాయి. దాదాపు 350 కిలోల వరకూ బరువుండగల ఈ పందులు చాలామంది పౌరులను భయపెట్టేశాయి, కొన్ని సందర్భాల్లో ప్రజలు భద్రత కోసం చెట్లపైకి, టెలిఫోన్ బూతుల్లోకి పారిపోయారు. ఈ జంతువులు లెక్కలేనన్ని ట్రాఫిక్ ఏక్సిడెంట్లకు కారణమయ్యాయి. ఉద్యోగం నుండి ఇంటికి తిరిగి వచ్చిన చాలామంది గృహస్థులు బిరుసైన వెంట్రుకలుండే ఈ దోపిడీదారులను ఎదుర్కొన్నారు. “నా కారుకు, నా ఇంటి తలుపుకు మధ్య దాదాపు 20 పందులు నిలబడి ఉంటే నేను ఇంట్లోకి ఎలా ప్రవేశించగలను?” అని ఒక వ్యక్తి అడిగాడు.
(g00 11/22)
మీ పేరు మీదుగా క్రొత్త జాతులకు పేర్లు పెట్టడం
“అన్నీ ఉన్నట్లున్న మీకిష్టమైన ఒక వ్యక్తికి ఏదైనా ఆసాధారణమైన బహుమతి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా?” అని సైన్స్ పత్రిక అడుగుతుంది. “సహాయం అందుబాటులో ఉంది. బయోడైవర్సిటీ రీసెర్చ్‌కు మీరు కొంత విరాళం ఇస్తే, మునుపు తెలియని పూలమొక్కల, లేక దోమల, లేక సముద్రచరాల జాతికి మీకిష్టమైన వ్యక్తి పేరు మీదుగా పేరు పెట్టవచ్చు, ఇక నిరంతరం అది వైజ్ఞానిక సాహిత్యంలో అలాగే రికార్డు చేయబడి ఉంటుంది.” లేదా మీ పేరు మీదుగా కూడా వాటికి పేరు పెట్టవచ్చు. ఉనికిలో ఉన్న జాతుల్లో పదవ వంతు లేదా అంతకన్నా తక్కువ జాతులు మాత్రమే నేడు వైజ్ఞానిక సాహిత్యంలో వివరించబడ్డాయని ఇటీవలి పరిశోధన సూచిస్తుంది. సేకరించబడిన వేలాది జాతులు, పేర్లు పెట్టబడి వైజ్ఞానిక పత్రికల్లో వర్ణించబడేందుకు ఎదురుచూస్తూ పురావస్తు ప్రదర్శనశాల అలమారాల్లో పేర్లు లేకుండా మూలుగుతున్నాయి. అయితే ప్రజలు ఇప్పుడు వెబ్‌సైట్‌కు వెళ్లి ప్రచురించబడేందుకు సిద్ధంగా ఉన్న, వివరణ కల్గి పేరు లేకుండా ఉన్న జాతుల చిత్రాలను చూడవచ్చు. తర్వాత 2,800 అమెరికా డాలర్లు లేక అంతకన్నా ఎక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వారు తమకిష్టమైన ఒక జాతికి ఒక లాటిన్ పేరును పెట్టవచ్చు. దీనిద్వారా, బయోపాట్ అనే సంస్థ పశువుల వృక్షాల వర్గీకరణ కోసం, క్రొత్త జాతుల సంరక్షణ కోసం విరాళాలు సేకరించాలని ఆశిస్తోంది.
(g00 11/8)
టీనేజ్ వివాహాలు
ఇండియాలో వివాహితులైన వారిలో దాదాపు 36 శాతం మంది 13 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు వారేనని ఇటీవల నిర్వహించబడిన నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే చెప్తుంది. ఆ అధ్యయనం, 17 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సులోవున్న 64 శాతం మంది అమ్మాయిలు ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చారనీ లేక గర్భవతులయ్యారనీ కనుగొన్నదని ముంబయికి చెందిన ఏసియన్ ఏజ్ వార్తాపత్రిక నివేదిస్తుంది. ఆ నివేదిక, 20 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సులోని తల్లుల కంటే 15 నుండి 19 సంవత్సరాల వయస్సులో ఉన్న యౌవనస్థులైన తల్లులు గర్భధారణ మూలంగా మరణించే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉందని పేర్కొంటుంది. అంతేగాక, 15 నుండి 24 సంవత్సరాల వయస్సులోవున్న యౌవనస్థుల్లో లైంగికపరంగా సోకే వ్యాధులు గత కొద్ది సంవత్సరాల్లో రెండింతలయ్యాయి. జ్ఞానరాహిత్యమూ, లైంగిక విషయాలకు సంబంధించి తోటివారి నుండి మాధ్యమాల నుండి లభించే తప్పుడు సమాచారమూ, పెరుగుతున్న సమస్యలకు కారణమని నిపుణులు అంటున్నారు.
(g00 11/22)
ఒక జబ్బుకు మారుగా మరో జబ్బు
“ముఫ్పై సంవత్సరాల క్రితం, ప్రతి ఐదుగురు ఐగుప్తీయుల్లో ముగ్గురు బిల్హర్‌జ్యాతో, అంటే నీటి నత్తల్లో ఉండే పరాన్నజీవుల మూలంగా కల్గే దుర్భరమైన వ్యాధితో బాధపడ్డారని” ది ఎకానమిస్ట్ పేర్కొంటుంది. ఆధునిక మందులను వాడమని చేయబడిన బిల్హర్‌జ్యా వ్యతిరేక ప్రచారాలు ఆ ముప్పును ఎంతగానో తగ్గించాయి. అయితే, చేయబడిన తొలి ప్రచారాల్లో ఒకటి, “ఈజిప్టు యొక్క ప్రముఖ ఆరోగ్య సమస్యగా ఉన్న బిల్హర్‌జ్యా రోగం స్థానాన్ని ఆక్రమించిన, ఎంతో ప్రాణాంతకమైన వైరస్ అయిన హెపటైటిస్-సికి లక్షలాది మంది ప్రజలు గురయ్యేలా చేసిందని” ఇప్పుడనిపిస్తుంది. దానికి కారణమేమిటంటే, బిల్హర్‌జ్యాకు చికిత్స చేయడానికి ఉపయోగించబడిన సూదులను “వాడుకగా పునరుపయోగించేవారు, వాటిని ఎప్పుడో గానీ స్టెరిలైజ్ చేసేవారు కాదు. . . . విజ్ఞానశాస్త్రవేత్తలు 1988 నాటి వరకూ రక్తం ద్వారా వచ్చే హెపటైటిస్-సిని (హెచ్.సి.వి.) గుర్తించనేలేదు” అని ఆ పత్రిక చెప్తుంది. “ప్రపంచలోకెల్లా అత్యధికంగా హెపటైటిస్-సికి గురౌతున్నవారు”
ఈజిప్టులోనే ఉన్నారని ఆ సర్వే ఇప్పుడు చూపిస్తుంది. దాదాపు 11 మిలియన్ల మంది ఈజిప్షియన్‌లకు అంటే దాదాపు ప్రతి ఆరుమందిలో ఒకరికి ఈ వ్యాధి ఉందనీ, 70 శాతం కేసుల్లో ఇది తీవ్రమైన కాలేయ సంబంధ వ్యాధిగా పరిణమిస్తుందనీ, 5 శాతం మందిలో ఇది ప్రాణాంతకం కాగలదనీ చెప్పబడుతుంది. ఆ ఆర్టికల్ దీన్ని, “డాక్టర్ల ద్వారా ఇతరులకు సోకేలా చేయబడిన అతిగొప్ప ఏకైక వ్యాధి” అని పిలుస్తూ, ఇంకా ఇలా జతచేస్తుంది: “ఒక ఓదార్పుకరమైన విషయం ఏమిటంటే, సామూహిక ప్రచారాలు జరిగి ఉండకపోతే బిల్హర్‌జ్యా మూలంగా ఇంకా ఎక్కువమంది ప్రజలు చనిపోయి ఉండేవారు.”(g00 11/22)
బాల వంచితులు
“ప్రతిరోజు, . . . ఐదు సంవత్సరాల లోపు వయస్సున్న 30,500 మంది మగపిల్లలు ఆడపిల్లలు, అరికట్టగల అనేక కారణాల మూలంగా మరణిస్తున్నారు” అని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి, ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2000 అనే తన నివేదికలో చెప్తుంది. “గత దశాబ్దంలో, సాయుధ పోరాటాల్లో రెండు మిలియన్లమంది పిల్లలు చంపబడినట్లు, ఆరు మిలియన్లమంది గాయపడినట్లు లేక వికలాంగులైనట్లు, ఇంకా అనేక మిలియన్లమంది మానవ హక్కుల దుర్వినియోగానికి బాధితులైనట్లు అంచనా వేయబడుతుందని” ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక నివేదిస్తుంది. పదిహేను మిలియన్ల కన్నా ఎక్కువమంది పిల్లలు నిరాశ్రయులయ్యారు, ఒక మిలియన్ కన్నా ఎక్కువమంది తమ తల్లిదండ్రుల నుండి వేరైపోయారు లేక దిక్కులేని వారైపోయారు. అంతేగాక, 5 నుండి 14 సంవత్సరాల మధ్యవయస్సులోని కనీసం 250 మిలియన్ల మంది పిల్లలు బలవంతపు కార్మికులుగా పనిచేస్తున్నారనీ, వారిలో 20 శాతం మంది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారనీ చూపిస్తున్న అంతర్జాతీయ శ్రామిక సంస్థ చేసిన అధ్యయనాల గురించి ఆ నివేదిక పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ మంది పిల్లలు వ్యభిచారులుగా పనిచేయడానికి బలవంత పెట్టబడుతున్నారు, ప్రతి నెల 2,50,000 మంది పిల్లలకు హెచ్.ఐ.వి. సోకుతోంది. 130 మిలియన్ల మంది పాఠశాలకు వెళ్లడం లేదు, వారిలో రెండింట మూడొంతుల మంది అమ్మాయిలే.
(g00 11/8)
చైనాకు చెందిన వన్యప్రాణుల ఆహారపదార్థాలు
“మారుతున్న జీవనశైలీ, ఆహారపుటలవాట్ల వల్ల” చైనాలోని వన్యప్రాణులకు ముప్పువాటిల్లుతోందని డౌన్ టు ఎర్త్ పత్రిక పేర్కొంటుంది. కొన్నిరకాలైన ఆహార పదార్థాల కన్నా నిర్దిష్టమైన కొన్ని రకాలు, ఆరోగ్యవంతమైనవనే పెరుగుతున్న నమ్మకం వల్ల విచిత్రమైన ఆహారపదార్థాలకు డిమాండు పెరుగుతోంది. వాటిలో పాములు ప్రముఖ స్థానంలో ఉన్నాయి, విషం లేని పాములకన్నా విషపూరితమైన పాముల ఖరీదు రెండింతలు ఎక్కువగా ఉంటోంది. అడవి పందులు, గండు పిల్లులు, బోదురుకప్పలు, కప్పలు, కొండచిలువలు, పాంగోలిన్‌లు, టిబెటన్ లేళ్లు, అరుదైన పక్షులు వంటివన్నీ ఎంతో ప్రియంగా తినే పదార్ధాల లిస్టులో ప్రముఖ స్థానంలో ఉన్నాయి, ఇవన్నీ చైనా అంతటిలోనూ హోటళ్ల మెనూల్లో కనిపిస్తాయి. ఈ ప్రాణుల్లో అనేకం అంతరించిపోతున్న జాతుల పట్టికలో ఉన్నాయి, కాబట్టి అవి ప్రభుత్వ భద్రతను పొందడానికి యోగ్యత ఉన్న జీవులు. అయినప్పటికీ, కొన్ని హోటళ్ల ఓనర్లు తాము అందజేస్తున్నవి నిజంగా వన్యప్రాణులేననీ, ఇళ్లలో పెంచబడినవో లేక కృత్రిమంగా పెంచబడినవో కావని తమ వినిమయదార్లకు హామీ ఇస్తూ సైన్ బోర్డులు పెడతారు. స్వ-శైలిగల భోజన ప్రియులనుండి వన్యప్రాణిని కాపాడేందుకు చైనా ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టి, “వన్యప్రాణులను తినడానికి నిరాకరించండి” అనే నినాదాలను ఉపయోగిస్తోంది.
(g00 11/8)
పొగ త్రాగేవారైనా కాకపోయినా, కాలుష్యం మాత్రం అనివార్యం
ఇండియాలోని పొగత్రాగే పిల్లల్లో చాలామంది అతి చిన్న వయస్సు నుండే ఆ అలవాటును ఏర్పరచుకుంటారని ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇచ్చిన ఒక నివేదిక తెలియజేస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలేని, వీధుల్లో నివసించే పిల్లలు సగటున, 8 సంవత్సరాల వయస్సులో పొగత్రాగడం మొదలు పెడితే సంరక్షకులు ఉన్న, పాఠశాలలకు వెళ్లే పిల్లలు 11 సంవత్సరాల వయస్సులో మొదలు పెడతారు. అయితే, తల్లిదండ్రుల మంచి సంరక్షణ క్రింద ఉండి ఎన్నడూ పొగత్రాగని పిల్లలు రోజుకు రెండు సిగరెట్ పెట్టెలు త్రాగడానికి సమానమైన కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారని ముంబయిలో చేయబడిన మరో సర్వే చూపిస్తుంది! ది ఏసియన్ ఏజ్ వార్తాపత్రికలో నివేదించబడినట్లుగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషితమైన ప్రముఖ ఐదు నగరాల్లో ముంబయి, ఢిల్లీ కూడా ఉన్నాయి. ముంబయి వీధుల్లో దాదాపు 9,00,000 వాహనాలు ఎడతెరిపి లేకుండా తిరుగుతుండడం వల్ల, ప్రతి రోజు మరో 3,00,000 వాహనాలు నగరంలోకి వస్తూ పోతూ ఉండడం వల్ల, వాయు కాలుష్యం రేటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిస్తూ విధించిన పరిమితుల కన్నా 600 నుండి 800 వందల వరకూ అధికంగా ఉన్నట్లు నివేదించబడుతుంది.
(g00 11/8)
పక్షులకు ప్రమాదకరం
“ఉత్తర అమెరికాలోని ఆఫీసు భవనాలు, సమాచార భవంతులు నిశ్శబ్ద హంతకులని” కెనడాలోని టోరంటోకు చెందిన ద గ్లోబ్ అండ్ మెయిల్ అంటుంది. “ఇళ్ల కిటికీలతో సహా ఈ భవనాలకు గుద్దుకుని ఈ ఖండంపై సాలీనా 100 మిలియన్ల పక్షులు మరణిస్తున్నాయని విశ్వసించబడుతుంది.” రాత్రుల్లో వెలుగుతూ ఉండే ఆఫీసు లైట్లు వలసవెళ్లే పక్షుల నావిక ప్రావీణ్యాన్ని వివరించనశక్యమైన విధంగా గందరగోళం చేస్తున్నాయి. ఈ సమస్య చాలా విస్తృతమైనదని నిపుణులు చెబుతున్నారు. “దీనికి సంబంధించిన ఉదాహరణలు లేని స్థలమంటూ మొత్తం ఖండంలో, దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఉన్నట్లు నాకు తెలియదు” అని పక్షిశాస్త్ర ప్రవీణుడైన డేవిడ్ విల్లార్డ్ పేర్కొంటున్నాడు. టోరంటోకు చెందిన ఫాటల్ లైట్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ వంటి వర్గాలు, రాత్రుల్లో లైట్లు ఆర్పివేసే విషయం గురించి ఆఫీసుల్లో పనిచేసేవారికి బోధించడానికి కృషి చేస్తున్నాయి.
అంతేగాక, ప్రజలను డిస్కోలకు, ఇతర వినోద కార్యక్రమాలకు ఆకర్షించేందుకు ఆకాశంలో వెలుగులు విరజిమ్మే స్పాట్‌లైట్లయిన “స్కై-బీమర్లు” నిశాచర జీవులను దారి మళ్లిస్తున్నాయని జర్మన్ వార్తాపత్రిక అయిన ఫ్రాంక్‌ఫర్టర్ అల్జెమీన్ జీటంగ్ నివేదిస్తుంది. పక్షుల, గబ్బిలాల సున్నితమైన నావిక ప్రావీణ్యాన్ని లైట్లు పాడు చేస్తాయి. గందరగోళంలో, పక్షులు వలస వెళ్లే తమ సహజ ప్రవృత్తికి భంగం కల్గించుకుంటున్నాయనీ, తమ దిశను మార్చుకుంటున్నాయనీ, వ్యాకులతతో కేకలు వేస్తున్నాయనీ, లేక తాము వలస వెళ్లడాన్ని మొత్తానికే మానుకుంటున్నాయనీ తెలుస్తోంది. కొన్నిసార్లు పక్షులు తప్పుదోవ పట్టిపోయి, గంటల తరబడి ఆకాశంలో గింగిరాలు తిరిగి అలసిపోయి భూమిపైకి చేరుకుంటున్నాయి, బలహీనమైపోయిన పక్షులు మరణిస్తున్నాయి కూడా. ఫ్రాంక్‌ఫర్ట్‌లోని పక్షుల సంరక్షణా ఇన్‌స్టిట్యూట్ “స్కై-బీమర్ల” నిషేధాన్ని కోరుతోంది.
(g00 11/8)