కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేదన నుండి అనస్థీషియాకు

వేదన నుండి అనస్థీషియాకు

వేదన నుండి అనస్థీషియాకు

పద్దెనిమిది వందల నలభైలకు ముందు, రోగులు ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లేటప్పుడు వ్యాకులపడేవారు కాదు. వాళ్లు భయంతో వణికిపోయేవారు! ఎందుకు? ఎందుకంటే అప్పట్లో అనస్థీషియా లేదు. “మేము బాధను జయించాము” అనే తన పుస్తకంలో డెనిస్‌ ఫ్రాడిన్‌ ఇలా చెప్తున్నాడు: “శస్త్రచికిత్స చేసే వైద్యులు సాధారణంగా రెండు చేతుల్లో రెండు విస్కీ సీసాలతో ఆపరేషన్‌ థియేటర్‌లోకి ప్రవేశించేవారు​—ఒకటి రోగి కోసం, మరొకటి రోగి వేసే కేకలను సహించగలిగేలా వైద్యుని కోసం.”

రోగికి “మత్తెక్కించడం”!

శస్త్రచికిత్స సమయంలో కలిగే బాధను తగ్గించడానికి వైద్యులు, దంతవైద్యులు, రోగులు దాదాపు ఎలాంటి ప్రయత్నాలైనా చేసేవారు. చైనా, భారతదేశ వైద్యులు గంజాయి వంటి మత్తుపదార్థాలను ఉపయోగించేవారు. నల్లమందు, అలాగే మద్యం కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించబడేవి. “అనస్థీషియా” (సంవేద నాశనం) అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తిగా పేరుపొందిన డైయస్కోర్‌డీజ్‌ అనే ఒక ప్రాచీన గ్రీకు వైద్యుడు మాండ్రేక్‌ల నుండి, ద్రాక్షామద్యం నుండి తయారు చేయబడిన ద్రవాలకు అనస్థెటిక్‌ శక్తులు ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాతి కాలాల్లో కొంతమంది వైద్యులు హిప్నాటిజమ్‌ను కూడా ఉపయోగించి చూశారు.

అయినప్పటికీ, బాధనుండి విముక్తి అంత సంతృప్తికరంగా లభించలేదు. కాబట్టి, శస్త్రచికిత్స చేసే వైద్యులు, దంతవైద్యులు తమకు సాధ్యమైనంత త్వరగా శస్త్ర చికిత్సను పూర్తిచేసేవారు; నిజానికి, వాళ్లు శస్త్ర చికిత్స చేసే వేగాన్ని బట్టి వాళ్ల గ్రేడు నిర్ణయించబడేది. కానీ అతివేగంగా శస్త్రచికిత్స చేసే వైద్యుడు మరింత ఎక్కువ నొప్పి కలగడానికి కారణమయ్యేవాడు. ఫలితంగా, ప్రజలు శస్త్రచికిత్స చేయించుకోవడం మూలంగా లేక పళ్లు పీకించుకోవడం మూలంగా కలిగే బాధను భరించడం కన్నా వాపుల దగ్గర నుంచి నోటిలోని పళ్లు పూర్తిగా పుచ్చిపోవడం వరకూ అన్ని రకాల బాధలను భరించడానికే సాధారణంగా ఇష్టపడేవారు.

తియ్యని విట్రాయిల్‌, లాఫింగ్‌ గ్యాస్‌

1275లో, స్పానిష్‌ వైద్యుడైన రేమండ్‌ లల్లస్‌ రసాయనాలతో పరీక్షలు చేస్తూ ఒక బాష్పశీలమైన మండే ద్రవాన్ని తయారు చేసి దాన్ని తియ్యని విట్రాయిల్‌ అని పిలిచాడు. స్విస్‌ దేశంలో జన్మించిన, 16వ శతాబ్దానికి చెందిన, సాధారణంగా పారాసెల్సస్‌ అని పిలవబడిన ఒక వైద్యుడు కోడిపిల్లలు తియ్యని విట్రాయిల్‌ను పీల్చుకునేలా చేసి, అవి నిద్రలోకి జారుకోవడమే గాక వాటికి నొప్పి తెలియకపోవడాన్ని కూడా గమనించాడు. ఆయనకు ముందు లల్లస్‌ చేసినట్లుగా, ఆయన మానవులపై ప్రయోగాలు జరపలేదు. జర్మన్‌ రసాయనశాస్త్రవేత్త అయిన ఫ్రోబేనియస్‌ 1730లో, ఈ ద్రవానికి ప్రస్తుతమున్న పేరును అంటే ఈథర్‌ అనే పేరును పెట్టాడు, ఆ గ్రీకు పదానికి “స్వర్గలోక సంబంధమైన” అని భావం. కానీ 112 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత గానీ ఈథర్‌కున్న అనస్థెటిక్‌ శక్తులను పూర్తిగా గ్రహించడం జరగలేదు.

ఈ మధ్యలో, అంటే 1772లో ఆంగ్ల విజ్ఞానశాస్త్రవేత్త అయిన జోసెఫ్‌ ప్రీస్ట్‌లీ నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువును కనిపెట్టాడు. మొదట్లో ఈ వాయువును చిన్న మొత్తంలో తీసుకున్నా అది మరణకరం కాగలదని ప్రజలు తలంచేవారు. అయితే, 1799లో బ్రిటీష్‌ రసాయన శాస్త్రవేత్తా కల్పనకర్తా అయిన హంప్రీ డేవీ విషయాన్ని తేల్చేందుకు తనపైనే పరీక్షలు జరుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగిస్తూ, నైట్రస్‌ ఆక్సైడ్‌ ఆయనకు నవ్వు తెప్పించింది, దానితో ఆయన దానికి లాఫింగ్‌ గ్యాస్‌ అని ముద్దుపేరు పెట్టాడు. డేవీ నైట్రస్‌ ఆక్సైడ్‌కు ఉండగల అనస్థెటిక్‌ లక్షణాల గురించి వ్రాశాడు, కానీ ఆ సమయంలో ఎవరూ దానిపై పరిశోధనను ముందుకు కొనసాగించలేదు.

ఈథర్‌, లాఫింగ్‌ గ్యాస్‌ పార్టీలు

లాఫింగ్‌ గ్యాస్‌ ప్రభావంతో డేవీ చేసిన చిలిపి పనులు ప్రసిద్ధి గాంచాయి, ఆయన తాత్కాలికంగా ఆ గ్యాస్‌కు బానిస అయ్యాడు. త్వరలో సరదా కోసం దాన్ని పీల్చుకోవడమన్నది ప్రజాదరణ పొందింది. సంచారక కళాకారులు తమ కార్యక్రమాల్లో భాగంగా, ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నైట్రస్‌ ఆక్సైడ్‌ను పీల్చుకోమని పిలిచేవారు. ఆ గ్యాస్‌ నిగ్రహాన్ని కోల్పోయేలా చేసేది, దానితో వాళ్లు చేసే అదుపులేని చిలిపి పనులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవి.

అదే సమయంలో, ఈథర్‌ను వినోదం కోసం ఉపయోగించడం కూడా ప్రజాదరణ పొందింది. అయితే, ఈథర్‌ మత్తులో ఉన్న తన స్నేహితులు తడబడుతూ నడుస్తూ తమకు తాము గాయాలు చేసుకున్నప్పుడు వాళ్లకు నొప్పి తెలియలేదని అమెరికాకు చెందిన క్రాఫోర్డ్‌ డబ్ల్యూ. లాంగ్‌ అనే ఒక యౌవన వైద్యుడు ఒకరోజు గమనించాడు. ఆయన వెంటనే శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించడానికి దానికున్న లక్షణాల గురించి ఆలోచించాడు. అదే సమయంలో, ఆ “ఈథర్‌ వినోద పార్టీలు”లో ఒకదాంట్లో పాల్గొన్న జేమ్స్‌ వినేబుల్‌ అనే విద్యార్థికి రెండు చిన్న ట్యూమర్‌లు ఉండేవి, ఆయన వాటిని తీయించేసుకోవాలని అనుకుంటుండేవాడు. కానీ శస్త్రచికిత్స వల్ల కలిగే నొప్పికి భయపడి, వినేబుల్‌ తన ఆపరేషన్‌ను వాయిదా వేస్తూ ఉండేవాడు. కాబట్టి ఈథర్‌ ప్రభావం క్రింద ఉన్నప్పుడు ఆపరేషన్‌ చేయించుకోమని లాంగ్‌ ఆయనకు సలహా ఇచ్చాడు. వినేబుల్‌ దానికి అంగీకరించడంతో 1842 మార్చి 30న ఆయనకు నొప్పి లేకుండా ఆపరేషన్‌ చేయడం జరిగింది. అయితే, 1849 వరకూ లాంగ్‌ తాను కనుగొన్న విషయాన్ని ప్రకటించలేదు.

దంత వైద్యులు కూడా అనస్థీషియాను కనుగొనడం

1844 డిసెంబరులో, అమెరికాకు చెందిన హొరేస్‌ వెల్స్‌ అనే దంతవైద్యుడు ఒక సంచార వినోద ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యాడు, అక్కడ గార్డనర్‌ కోల్టన్‌ అనే ఒక వ్యక్తి నైట్రస్‌ ఆక్సైడ్‌ను ప్రదర్శించి చూపాడు. వెల్స్‌ ఆ వాయువును పీల్చుకోడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు గానీ, ఆయన జరుగుతున్నది తెలియనంత అపస్మారక స్థితిలోకి జారిపోలేదు. ఎందుకంటే తనతోపాటు పాల్గొంటున్న మరో వ్యక్తి కాళ్లు ఒక బెంచికి కొట్టుకుని రక్తం కారుతున్నప్పటికీ అతనికి నొప్పి తెలియకపోవడాన్ని ఆయన గమనించగలిగాడు. ఆ రాత్రి తన దంతవైద్యంలో నైట్రస్‌ ఆక్సైడ్‌ను ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నాడు​—అయితే దాన్ని ముందుగా తనపై ప్రయోగించుకున్న తర్వాతనే. గ్యాస్‌ను గార్డనర్‌ కోల్టన్‌ సరఫరా చేసేలా, తోటి దంతవైద్యుడైన జాన్‌ రిగ్స్‌ తనకు బాధ కల్గిస్తున్న జ్ఞానదంతాన్ని తొలగించేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నాడు. దంతాన్ని విజయవంతంగా తొలగించడం జరిగింది.

తాను కనుగొన్న విషయాన్ని తన తోటి వారి ఎదుట ప్రదర్శించడం ద్వారా దాన్ని అందరికీ తెలిసేలా చేయాలని వేల్స్‌ నిర్ణయించుకున్నాడు. కానీ ఆయన చాలా కంగారు పడిపోయి తగినంత గ్యాస్‌ను ఉపయోగించలేదు, దానితో దంతాన్ని బయటికి లాగినప్పుడు రోగి బిగ్గరగా కేకలు వేశాడు. వెంటనే వేల్స్‌ ప్రేక్షకులు ఆయనను అపహాస్యం చేశారు. కానీ వాళ్లు రోగిని ప్రశ్నించి ఉండవలసింది, ఎందుకంటే తాను బిగ్గరగా కేకలు వేసినప్పటికీ తనకు నొప్పి అంతగా తెలియలేదని ఆ రోగి వేల్స్‌ ఎదుట ఒప్పుకున్నాడు.

1846 సెప్టెంబరు 30న, అమెరికాకు చెందిన తోటి దంతవైద్యుడైన విలియమ్‌ మోర్టన్‌, ఈథర్‌ ప్రభావం క్రింద ఉన్న ఒక రోగి దంతాన్ని నొప్పి లేకుండా తొలగించాడు, 1842లో లాంగ్‌ కూడా అదే ఈథర్‌ను ఉపయోగించాడు. మోర్టన్‌ తాను ఉపయోగించిన ఈథర్‌ను ప్రముఖ రసాయన శాస్త్రవేత్త అయిన చార్లెస్‌ థామస్‌ జాక్‌సన్‌ సహాయంతో తయారు చేశాడు. లాంగ్‌లా కాకుండా, మోర్టన్‌ శస్త్రచికిత్స చేయించుకుంటున్న ఒక రోగిపై ఈథర్‌ చూపించే అనస్థెటిక్‌ లక్షణాలను బహిరంగంగా ప్రదర్శించడానికి ఏర్పాటు చేశాడు. మస్సాచుసెట్స్‌లోని బోస్టన్‌లో, 1846 అక్టోబర్‌ 16న మోర్టన్‌ రోగికి అనస్థీషియా ఇచ్చాడు. తర్వాత శస్త్రచికిత్సకుడైన డా. వారెన్‌ శస్త్రచికిత్స చేసి, రోగి దవడ క్రింది నుండి ఒక గడ్డను తొలగించాడు. శస్త్రచికిత్స విశేషంగా విజయవంతమయ్యింది. త్వరలోనే ఆ విషయం అమెరికా, యూరప్‌లలో దావాగ్నిలా వ్యాపించింది.

తదుపరి ఆవిష్కరణలు

ఉత్తేజభరితమైన ఈ ఆవిష్కరణల ఫలితంగా, వివిధ వాయువులతో పరీక్షలు జరపడం కొనసాగింది. క్లోరోఫామ్‌ 1831లో కనుగొనబడింది, అది 1847లో విజయవంతంగా ఉపయోగించబడింది. కొన్ని ప్రాంతాల్లో అది త్వరలోనే అందరూ కోరుకునే అనస్థెటిక్‌ అయ్యింది. త్వరలోనే క్లోరోఫామ్‌ ప్రసవ సమయంలో స్త్రీలకు ఇవ్వడం ప్రారంభమైంది, 1853 ఏప్రిల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన విక్టోరియా రాణికి కూడా ఇవ్వడం జరిగింది.

అయితే దుఃఖకరంగా, సాధారణ అనస్థీషియా చరిత్ర ఒక విధంగా మరుగున పడిపోయింది. లాంగ్‌, వేల్స్‌, మోర్టన్‌ లేక మోర్టన్‌కు సహాయం చేసిన రసాయనశాస్త్రవేత్త అయిన జాక్‌సన్‌, ఈ నలుగురిలో ఎవరికి అనస్థీషియాను కనుగొన్న ఖ్యాతి (రసాయన సమ్మేళనాలను కనుగొన్న ఖ్యాతి కాదుగానీ) దక్కాలనేదాని గురించి తీవ్రమైన వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. ఎటువంటి ఏకాభిప్రాయానికీ చేరుకోకపోయినా, చాలామంది ఆ నలుగురు వ్యక్తులూ చేసిన దాన్ని గుర్తిస్తారు.

ఈ మధ్యకాలంలో, సాధారణ అనస్థీషియా రంగంలో, అంటే తరచూ ప్రాంతీయ అనస్థీషియా అని పిలువబడే రంగంలో ఎన్నో అభివృద్ధులు జరిగాయి. శరీరంలో శస్త్రచికిత్స చేయాల్సిన భాగానికి బాధ తెలియకుండా దానికి మాత్రమే అనస్థీషియానిచ్చినప్పుడు, రోగులను స్మారక స్థితిలో ఉండేలా చేసే అనస్థీషియా పద్ధతులు ఉపయోగంలోకి వచ్చాయి. ఈ రోజుల్లో, దంతవైద్యులు దంతాలపై, చిగుర్లపై పనిచేసేటప్పుడు సాధారణంగా ప్రాంతీయ అనస్థీషియానే ఉపయోగిస్తున్నారు, చిన్న చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు, ఉద్వేగాఘాతం వల్ల కలిగిన నష్టాన్ని సరిచేసేటప్పుడు వైద్యులు వాటిని ఉపయోగిస్తున్నారు. అనస్థీషియాలజిస్టులు సాధారణంగా ప్రసవించే స్త్రీలకు ప్రాంతీయ అనస్థీషియాలను ఇస్తున్నారు.

సమయం గడుస్తుండగా, అనస్థీషియాలజీ ఒక ప్రత్యేకమైన వైద్య విభాగంగా వృద్ధి చెందింది. ఆధునిక అనస్థీషియాలజిస్టులు రోగులను శస్త్రచికిత్స కోసం సిద్ధం చేయడంలో భాగం వహిస్తారు. వాళ్లు అధునాతన పరికరాలను ఉపయోగించి, ఆమ్లజనితో సహా అనేక రకాలైన రసాయనాల మిశ్రమాలైన సంక్లిష్ట అనస్థెటిక్‌లను ఉపయోగించి అనస్థీషియా ఇస్తారు. వాస్తవానికి, తమ వైద్యుడు అనస్థెటిక్‌ గ్యాస్‌లను ఉపయోగించాడని కూడా చాలామంది రోగులకు తెలియకపోవచ్చు, ఎందుకంటే తరచూ, నరాల ద్వారా ముందు అనస్థీషియా ఇచ్చిన తర్వాతనే వైద్యులు వాటిని ఉపయోగిస్తారు. శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత నొప్పిని నివారించే విషయంలో కూడా అనస్థీషియాలజిస్టుల హస్తం ఉంటుంది.

కాబట్టి మీకు ఎప్పుడైనా శస్త్రచికిత్స చేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడితే, మరీ ఎక్కువగా కలవరపడకుండా ఉండడానికి ప్రయత్నించండి. దాదాపు రెండు శతాబ్దాల క్రితం ఆపరేషన్‌ బల్లపై మీరు పడుకుని ఉన్నట్లుగా ఊహించుకోండి. తలుపు తెరుచుకుంటుంది, శస్త్రచికిత్స చేసే మీ వైద్యుడు రెండు సీసాల విస్కీ తీసుకుని లోపలికి వస్తాడు. వెంటనే మీకు ఆధునిక అనస్థీషియాలజిస్టుల అధునాతన పరికరాలు ఆపద్బాంధవుల్లా అనిపిస్తాయి, కాదంటారా?

(g00 11/22)

[22వ పేజీలోని బాక్సు]

ఆక్యుపంక్చర్‌ తూర్పు నుండి నొప్పి నివారణ

ఆక్యుపంక్చర్‌ అన్నది ప్రాచీన చైనీయుల చికిత్స, అది నొప్పిని నివారిస్తుందని చెప్పబడుతుంది. ఆక్యుపంక్చర్‌ వైద్యులు శరీరంలోని నిర్దిష్టమైన పాయింట్లలో (స్థలాల్లో) సూదులు గుచ్చుతారు, చికిత్స చేయబడవలసిన ప్రాంతానికి చాలా దూరంలో అలా గుచ్చుతారు. సూదులను ఒకసారి లోపలికి గ్రుచ్చిన తర్వాత వాటిని గుండ్రంగా త్రిప్పడం లేక తక్కువ వోల్టేజి విద్యుత్‌కు వాటిని కనెక్ట్‌ చేయడం వంటివి చేయవచ్చు. ఆక్యుపంక్చర్‌ “చైనాలో శస్త్రచికిత్స సమయంలో అనస్థెటిక్‌గా సాధారణంగా ఉపయోగించబడుతుంది. పూర్తిగా స్పృహలో ఉండి కేవలం ఒక భాగంలో మాత్రమే ఆక్యుపంక్చర్‌ ద్వారా అనస్థీషియా ఇవ్వబడిన చైనా రోగులపై ఎంతో సంక్లిష్టమైన (సాధారణంగా చాలా బాధాకరంగా ఉండే) శస్త్రచికిత్సలు చేయబడడాన్ని పాశ్చాత్య సందర్శకులు చూశారు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది.

ఆక్యుపంక్చర్‌ను ఎంతో నైపుణ్యంగల, వైద్యపరంగా తర్ఫీదు పొందిన వైద్యుడే చేయాలి. ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చెప్తున్నదాని ప్రకారం, “ఆక్యుపంక్చర్‌ సూదులు గుండెలోకి లేక ఊపిరి తిత్తుల్లోకి గుచ్చబడినప్పుడు గంభీరమైన ప్రమాదాలు జరిగాయి, స్టెరిలైజ్‌ చేయని సూదులను వాడితే హెపటైటిస్‌, ఇన్‌ఫెక్షన్‌ ఇంకా అలాంటి ఇతర క్లిష్టపరిస్థితులు ఏర్పడవచ్చు.” అయితే శస్త్రచికిత్సల వల్ల ప్రమాదాలు ఉన్నట్లే, సాధారణ అనస్థీషియాను ఉపయెగించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి​—అదెలాంటి అనస్థీషియా అయినా సరే.

[21వ పేజీలోని చిత్రం]

అనస్థీషియా ఒక ప్రత్యేకమైన వైద్య విభాగంగా తయారైంది

[చిత్రసౌజన్యం]

Courtesy of Departments of Anesthesia and Bloodless Medicine and Surgery, Bridgeport Hospital - CT

[19వ పేజీలోని చిత్రసౌజన్యం]

Pages 2 and 19: Reproduced from Medicine and the Artist (Ars Medica) by permission of the Philadelphia Museum of Art/Carl Zigrosser/ Dover Publications, Inc.