కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయనంటే ఇష్టంలేదని ఎలా చెప్పగలను?

ఆయనంటే ఇష్టంలేదని ఎలా చెప్పగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

ఆయనంటే ఇష్టంలేదని ఎలా చెప్పగలను?

“ఈ వేసవి కాలంలో, మా సంఘంలోని ఒక సహోదరుడు నా మీద మనసు పడ్డాడు. నిజానికి నాకు ఆయనంటే ఇష్టం లేదు. సమస్య ఏమిటంటే, నాకిష్టం లేదన్న విషయాన్ని ఆయనను నొప్పించకుండా ఆయనకు చెప్పడమెలాగో నాకు తెలియదు.”​—ఎలిజబెత్‌. *

“నేను మీతో పరిచయాన్ని పెంచుకోవచ్చా?”అని యువకులెవరైనా మిమ్మల్ని అడిగారా? ఒక యువతిగా, * మీకు చాలా సంతోషమనిపించి ఉండవచ్చు, ఉబ్బి తబ్బిబ్బై ఉండవచ్చు, చాలా పులకరించిపోయి ఉండవచ్చు! మరొక వైపు, ఏమని జవాబు చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయుండవచ్చు.

మీరంటే నాకిష్టమని ఎవరైనా మీతో చెప్పినప్పుడు, మీకు భావోద్వేగపరమైన భావనలెన్నో కలగవచ్చు. ముఖ్యంగా పెళ్ళిచేసుకునే వయస్సు మీకున్నట్లయితే, అలా ఎవరైనా మీమీద ఆసక్తి చూపినప్పుడు ప్రతిస్పందించే స్థితిలో మీరు ఉన్నట్లయితే అలాంటి భావనలు మీకు కలగవచ్చు! * అయితే, మీరెలా ప్రతిస్పందిస్తారన్నది, మిమ్మల్ని అలా అడిగిన వ్యక్తి ఎవరన్న దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆయన భావోద్వేగపరంగా పరిణతి చెందిన వ్యక్తయితే, మీరు ఆయనవైపుకు ఆకర్షించబడితే, మీరంటే నాకూ ఇష్టమే అని జవాబివ్వడం సులభమవ్వవచ్చు. మీకు తగిన వరుడయ్యేందుకు కావలసిన యోగ్యతలు ఆయనకు లేకపోతే, అప్పుడేమిటి? లేదా ఆయనకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, మీకు ఆయన మీద ఆసక్తి కలగకపోతే అప్పుడేమిటి?

ఒకరితో కొన్నాళ్ళు డేటింగ్‌ చేసిన తర్వాత, తన జీవితాన్ని ఇకపై ఆయనతో గడపడం ఇష్టపడని ఒక యువతి విషయమే తీసుకోండి. అంతటితో డేటింగ్‌ ఆపేసే బదులు, ఆయనతో బయటికి వెళ్ళడాన్ని ఆమె అలా కొనసాగిస్తూనే ఉంది. “ఆయనంటే ఇష్టంలేదని ఎలా చెప్పగలను?” అని ఆమె ప్రశ్నిస్తుంది.

మీకు ఇష్టం లేనప్పుడు

పూర్వకాలంలోని వాళ్ళు, తమ తల్లిదండ్రులు ఎంపిక చేసినవారిని వివాహం చేసుకునేవారు. (ఆదికాండము 24:2-4, 8) కాని ఈనాడు, తమకు నచ్చినవారిని పెళ్ళి చేసుకునే స్వాతంత్ర్యం పాశ్చాత్య దేశాల్లో దాదాపు క్రైస్తవులందరికీ ఉంది. అయితే క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అన్నదే బైబిలు పెట్టే ఒక షరతు.​—1 కొరింథీయులు 7:39.

దానర్థం, మీమీద ఆసక్తిని చూపిస్తున్న లేదా మీరు కొంత కాలంగా డేటింగ్‌ చేస్తున్న తోటి విశ్వాసి ఎవరినైనా సరే మీరు పెళ్ళి చేసుకోవాలనా? బైబిలు చెబుతున్న మధ్య ప్రాచ్య గ్రామమైన షూనేములోని ఒక పల్లెటూరి యువతి ఉదాహరణనే తీసుకోండి. వారి రాజ్యానికి రాజైన సొలొమోను ఆమెను చూసి, ఆమెమీద గాఢమైన ప్రేమలోపడ్డాడు. ఆయన ఆమె వెంటపడినప్పుడు, ఆ యువతి ఆయనను తిరస్కరించడమే కాకుండా, “ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని” సొలొమోను రాజస్థానంలో ఆయనకు పరిచారము చేస్తున్న స్త్రీలను బతిమాలుకుంది. (పరమగీతము 2:7) ఇతరులు తనను భావోద్వేగపరంగా లొంగదీసుకోవడాన్ని వివేకవంతురాలైన ఆ కన్యక ఇష్టపడలేదు. ఆమె అప్పటికే సామాన్యుడైన ఒక గొఱ్ఱెలకాపరిని ప్రేమిస్తోంది కనుక, ఆమెకు సొలొమోను మీద ఆసక్తే కలగలేదు.

పెళ్ళి చేసుకోవడాన్ని గురించి ఆలోచిస్తున్నవారికి ఇది మంచి పాఠాన్ని నేర్పుతుంది: ఎవరి మీద పడితే వారి మీద మీకు ప్రేమ పుట్టదు. ఒక యువతికి ఒకరితో కొన్నాళ్ళు డేటింగ్‌ చేసిన తర్వాత కూడా, ఆయనమీద ప్రేమ పుట్టకపోవచ్చు. ఆమెలో అయిష్ట భావాలు కలగడానికి కారణం బహుశా ఆ వ్యక్తిలో స్పష్టంగా కనబడే కొన్ని బలహీనతలే కావచ్చు. లేదా ఆమె ఆయనవైపుకు అంతగా ఆకర్షించబడకపోవచ్చు. అలాంటి భావాలను నిర్లక్ష్యం చేయడం మూర్ఖత్వమే అవుతుంది. వాటిని నిర్లక్ష్యం చేసినంత మాత్రాన, అవి లేకుండా పోవు. * “ఆయన గురించి అనేక అనుమానాలు నా మదిలో తచ్చట్లాడుతుండేవి. అవి చిన్న చిన్న అనుమానాలు కావు. ఎంత పెద్దవంటే, నేను ఆయనతో ఉన్నప్పుడు అవి నాలో నిజంగా గొప్ప మానసిక సంఘర్షణను, భయాన్ని పుట్టించేవి” అని తామరా అనే యువతి తాను డేటింగ్‌ చేసిన ఒక యువకుడ్ని గురించి చెబుతోంది. ఆ అనుమానాల మూలంగా, అక్కడితో ఆపేయడమే మంచిదని ఆమె భావించింది.

ఇష్టం లేదని చెప్పడం ఎందుకంత కష్టం?

అయినప్పటికీ, మిమ్మల్ని ఇష్టపడే ఒక యువకునితో మీరంటే నాకిష్టం లేదని చెప్పడం మీకంత సులభమేమీ కాకపోవచ్చు. మొదట్లో పేర్కొన్న ఎలిజబెత్‌లా, మీరు ఆయన నొచ్చుకుంటాడేమో అని భయపడుతుండవచ్చు. నిజమే, మనం ఇతరుల భావాలకు విలువనిస్తూ, వాళ్ళను నొప్పించకుండా ఉండాలి. క్రైస్తవులు ‘జాలిగల మనస్సును, దయాళుత్వమును ధరించుకోవాలనీ’ ఇతరులు తమతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో, తాము కూడా ఇతరులతో అలాగే వ్యవహరించాలనీ బైబిలు ప్రోత్సహిస్తోంది. (కొలొస్సయులు 3:12; మత్తయి 7:12) అంటే ఆ యువకుడు నిరాశ చెందకూడదు లేదా నొచ్చుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన మీద మీకు ఇష్టమున్నట్లుగా నటిస్తుండాలని దాని అర్థమా? మీరు నిజానికి ఏమనుకుంటున్నారన్నది ఆయనకు ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుందనడంలో సందేహం లేదు. మీరు నిజాయితీగా ఉండకుండా, మీరేమనుకుంటున్నారన్నది తెలియజేయడాన్ని వాయిదావేయడం ఆయనను మరింత వ్యధకు గురిచేస్తుంది. ఆయన మీద జాలిపడి మీరు ఆయనను వివాహం చేసుకోవడం అంతకన్నా ఘోరం. జాలి, వివాహానికి బలమైన పునాది కాదు.

‘నేను ఆయన్ను పెళ్ళి చేసుకోకపోతే, నాకు ఇక పెళ్ళి జరగదేమో’ అన్న తలంపుతో బహుశా మీరు సతమతమవుతుండవచ్చు. టీన్‌ అనే పత్రికలోని ఒక ఆర్టికల్‌ చెబుతున్నట్లుగా, “ఆయన ‘నాకు తగినవాడు కాదు,’ అయినా, ఎవరో ఒకరులే, ఒంటరిగా మిగిలిపోవడం నాకెంతమాత్రం ఇష్టం లేదు” అని ఒక అమ్మాయి తనను తాను సమర్థించుకోవచ్చు. సాహచర్యం పొందాలన్న కోరిక చాలా బలంగా ఉంటుందన్నది ఒప్పుకోవలసిందే. అయితే, ఆ కోరిక నెరవేరడంలో మీ ప్రక్కన ఎవరో ఒకరు ఉండడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. అంటే మీరు నిజంగా ప్రేమించగల, లేఖనాలు చెబుతున్నటువంటి వివాహ బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యంగల ఒకరిని కనుగొనవలసి ఉంది. (ఎఫెసీయులు 5:33) కనుక, వివాహజతను నిర్ణయించుకునే విషయంలో తొందరపడకండి! అనేకులు తొందరపడి పెళ్ళి చేసుకున్నందుకు బాధపడుతున్నారు.

చివరికి, కొందరు యువతులు తాము డేటింగ్‌ చేస్తున్న యువకునిలో గంభీరమైన లోపాలున్నాయని స్పష్టంగా తెలిసినప్పటికీ, డేటింగ్‌ కొనసాగిస్తూనే ఉండవచ్చు. ‘ఆయనకు మరి కొంత సమయాన్నిస్తే, ఆయన తన పద్ధతులను మార్చుకోవచ్చు’ అని వాళ్ళు తమలో తాము వాదించుకుంటుండవచ్చు. అది నిజంగా అర్థవంతమైన వాదనేనా? ఎంత కాదన్నా చెడ్డ అలవాట్లూ, ప్రవర్తనా విధానాలూ వ్యక్తిత్వంలో చాలా బలంగా వేళ్ళూని ఉంటాయి, వాటిని మార్చుకోవడం చాలా కష్టమే. ఆయన అకస్మాత్తుగా అతి త్వరగా కొన్ని మార్పులు చేసుకున్నా, ఆ మార్పులు శాశ్వతంగా ఉంటాయన్న నిశ్చయతను మీరు నిజంగా కలిగివుండగలరా? అలాంటి ఒక పరిస్థితిలో, తనకూ, తనతో డేటింగ్‌ చేస్తున్న అబ్బాయికీ ఒకే రకమైన లక్ష్యాలు లేవని కరన్‌ అనే యువతి తెలుసుకున్నప్పుడు, అక్కడితో తెగతెంపులు చేసుకోవాలన్న వివేకవంతమైన నిర్ణయాన్ని తీసుకుంది. “నాకు చాలా బాధనిపించింది. ఎందుకంటే, నేను ఆయన అందానికి బాగా ఆకర్షించబడ్డాను. కానీ తెగతెంపులు చేసుకోవడమే సరైన పనని నాకు బాగా తెలుసు” అని ఆమె ఒప్పుకుంటోంది.

జాగ్రత్తగా వ్యవహరించండి

మీరంటే నాకిష్టం లేదని ఒకరితో చెప్పడం అంత సులభం కాదని ఒప్పుకోవలసిందే. అతి సున్నితమైన వస్తువులున్న ప్యాకెట్‌ని పట్టుకోవడంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో, ఈ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ క్రింద ఇవ్వబడిన సలహాలు మీకు సహాయకరంగా ఉండవచ్చు.

విషయాన్ని మీ తల్లిదండ్రులతో గానీ, సంఘంలోని పరిణతి చెందిన ఇతరులతో గానీ చర్చించండి. మీరు ఆశించేవి వాస్తవంగా ఎదురు చూడగల విషయాలేనా అన్నది నిర్ణయించుకోవడంలో వాళ్ళు మీకు సహాయపడవచ్చు.

స్పష్టంగా నిర్మొహమాటంగా తెలపండి. మీరెలా భావిస్తున్నారన్న విషయంలో ఆయనకు ఎలాంటి సందేహమూ ఉండకూడదు. “నాకిష్టం లేదండీ” అని చెప్పడం యువకులను నిరుత్సాహపర్చవచ్చు. అవసరమైతే, “నన్ను క్షమించండి. నాకు నిజంగానే మీమీద ఆసక్తి లేదు” అని, మీకిష్టంలేని విషయాన్ని కాస్త గట్టిగానే చెప్పవచ్చు. తాను ఇంకాస్త పట్టుదలగా ఉంటే మీరు మనస్సు మార్చుకోగలరేమోనన్న తలంపు ఆయనకు రాకుండా జాగ్రత్తపడండి. మీకు ఆయనంటే ఇష్టం లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం, ఆయన అయోమయంలో పడిపోకుండా, ఆయన తన నిరాశను అధిగమించడాన్ని సులభతరం చేస్తుంది.

నిజాయితీ, లౌక్యమూ సమతుల్యంగా ఉండాలి. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు” అని సామెతలు 12:18 చెబుతుంది. విషయాన్ని సూటిగా చెప్పడం ప్రాముఖ్యమే అయినప్పటికీ, మన మాటలు తప్పనిసరిగా ‘ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలవిగానూ కృపాసహితముగానూ’ ఉండాలని బైబిలు చెబుతోంది.​—కొలొస్సయులు 4:6.

మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. సదుద్దేశం గల స్నేహితులు, మీ నిర్ణయం వెనుక ఉన్న కారణాల గురించి బహుశా తెలియక, ఇంకొంత సమయం వేచి చూడమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తుండవచ్చు. కానీ చివరికి, మీరు అనుసరించవలసింది మీ నిర్ణయాన్నే గానీ, సదుద్దేశం గల మీ స్నేహితులను కాదు.

మీ మాటలకు అనుగుణ్యంగా ప్రవర్తించండి. మునుపు మీరిద్దరూ మంచి స్నేహితులై ఉండవచ్చు. అలాగైతే, అంతా మునుపటిలాగే కొనసాగాలని ఆశించడం సహజమే. కానీ, సాధారణంగా అలా జరగదు, సాధ్యమూ కాదు. ఆయనకు మీరంటే ఇష్టం కలిగింది. ఆయన ఆ భావాన్ని ప్రక్కనబెట్టి, ఇప్పుడు ఆ ఇష్టం లేనట్లు నటించాలంటే జరిగే పనేనంటారా? ఒకరితోనొకరు స్నేహంగా వ్యవహరించడం మంచిదే అయినప్పటికీ, ఫోనులో మాట్లాడుకుంటూ ఉండడమూ, లేదా కలిసి సామూహిక సందర్భాల్లో ఎక్కువ సేపు ఉండడమూ ఆయన బాధను మరింత తీవ్రతరం చేస్తుంది. మీరు ఆయన భావోద్వేగాలతో ఆటలాడుకున్నట్లవుతుంది, ఆయనతో నిర్దయగా వ్యవహరించినట్లవుతుంది.

ఒకరితోనొకరు “సత్యమే మాటలాడవలెను” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు బోధించాడు. (ఎఫెసీయులు 4:25) ఆ విధంగా చేయడం చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ, మీరిద్దరూ ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేందుకు అది సహాయపడుతుంది. (g01 3/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ ఈ అర్టికల్‌ని, యువతులను సంబోధిస్తూ వ్రాస్తున్నప్పటికీ, ఇందులో చర్చిస్తున్న సూత్రాలు యువకులకు కూడా వర్తిస్తాయి.

^ మరీ చిన్నప్పుడే, డేటింగ్‌ చెయ్యడంలోగల ప్రమాదాల గురించి తేజరిల్లు! జనవరి 22, 2001 (ఆంగ్లం) సంచికలో చర్చించబడింది.

^ “యువత ఇలా అడుగుతోంది . . . ఇక్కడితో తెగతెంపులు చేసుకోవాలా?” అనే ఆర్టికల్‌ తేజరిల్లు! జూలై 22, 1988 (ఆంగ్లం)లో కనిపిస్తుంది.

[19వ పేజీలోని బ్లర్బ్‌]

ఎవరి మీదంటే వాళ్ళ మీద మీకు ఇష్టం కలుగదు

[20వ పేజీలోని చిత్రం]

మీరు మీ భావాలను స్పష్టంగా, సూటిగా వ్యక్తీకరించండి