కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

నొప్పిలేని గుండెపోటు

గుండెపోటుకు అతి సాధారణ సూచన ఛాతీలో గట్టిగా నొక్కిపట్టినట్లనిపించే నొప్పి. ఈ సూచన విషయంలో అనేకులు అప్రమత్తంగా ఉంటారు. అయితే, “రోగుల్లో మూడింట ఒక వంతు మందికి గుండెపోటు వచ్చినప్పుడు, ఛాతీలో నొప్పి ఉండదన్న విషయం” చాలా మందికి తెలియదని టైమ్‌ అనే పత్రిక నివేదిస్తోంది. “ఛాతీలో నొప్పి లేకుండా గుండెపోటు వచ్చిన వారు సగటున రెండు గంటల దాకా ఆసుపత్రికి ఎందుకు వెళ్ళర”న్నది వివరించేందుకు ఈ వాస్తవం సహాయపడుతుందని ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం చెబుతోంది. అయితే, చికిత్సను చేయించుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా ప్రాణానికి ప్రమాదమే. మీరు దేనిని కనిపెట్టాలి? “మరో పెద్ద సూచన బహుశా, ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండడమే కావచ్చు” అని టైమ్‌ చెబుతోంది. కడుపులో వికారంగా ఉండడం, విపరీతంగా చెమటలు పట్టడం, “‘గుండెలో మంట’లాంటిది ఏమైనా ఉంటే అది మీరు నడుస్తున్నప్పుడు లేదా శారీరకంగా కష్టపడుతున్నప్పుడు విపరీతంగా పెరగడం” వంటివి మరితర సూచనలు కావచ్చు అని ఆ ఆర్టికల్‌ చెబుతోంది.

(g01 1/22)

అంటుకునే కాలివ్రేళ్ళు

ఇంటి కప్పు లోపలి ఉపరితలం అద్దంలా నున్నగా ఉన్నప్పటికీ, బల్లులు దాని మీద సులభంగా పరిగెత్తగలుగుతాయి. అవి అలా ఎలా పరిగెత్తగలుగుతాయి? ఆ ప్రశ్నకు జవాబిచ్చేందుకు దశాబ్దాలుగా ప్రయత్నించిన శాస్త్రజ్ఞులు, తామిప్పుడు దానిని వివరించగలమని అనుకుంటున్నారు. “బల్లుల పాదాలపై ఉండే చిన్న చిన్న రోమాలు లేదా సీటలు ఉపరితలానికి రాసుకున్నప్పుడు అంటుకునే శక్తి వస్తుంది. ఆ శక్తి మనకు ఆశ్చర్యాన్ని కల్గించేంతగా ఉంటుంది. ప్రతి చిన్న రోమం నుండి మరికొన్ని చిన్న చిన్న రోమాలు మొలుస్తాయి. వాటిని స్పాట్యులాలు అంటారు. ఉపరితలంపై బల్లి పాదాన్ని మోపినప్పుడు, దాని పాదానికి ఉన్న దాదాపు వందకోట్ల స్పాట్యులాలు ఉపరితలానికి గట్టిగా అంటుకుంటాయి దానితో అక్కడున్న పరమాణువుల మధ్య చర్య . . . మొదలవుతుండవచ్చు” అని శాస్త్రజ్ఞులూ ఇంజనీర్ల ఒక జట్టు నిర్ధారించిందని సైన్స్‌ న్యూస్‌ అనే పత్రిక నివేదిస్తుంది. బల్లి తన కాలి వ్రేళ్ళను ఉపరితలంపై మోపే విధానం, “ఆ చిన్న రోమాలు ఉపరితలాన్ని నొక్కిపట్టుకునేందుకూ, అలాగే వాటిని ఉపరితలానికి సమాంతరంగా లాగేందుకూ” సహాయపడుతుందని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విధంగా, “ఒక్కో రోమం పట్టు, మామూలుగా నొక్కి పట్టేదానితో పోల్చి చూస్తే 10 రెట్లు ఎక్కువ” బలంగా మారుతుందని ఆ పత్రిక చెబుతుంది.

(g01 1/22)

టీవీని వీక్షించడంలో బ్రిటన్‌వారిదే మొదటిస్థానం

“బ్రిటన్‌వారిలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది వారానికి ఎన్ని గంటలు పని చేస్తారో అన్ని గంటలు టీవీ చూడడానికీ వెచ్చిస్తారు” అని లండన్‌కు చెందిన ది ఇండిపెండెంట్‌ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, బ్రిటన్‌లో సగటు వ్యక్తి ప్రతి వారం 25 గంటలు టీవీ చూడడానికి వెచ్చిస్తాడు. బ్రిటన్‌వారిలో 21 శాతం మంది టీవీని చూడడానికి వారానికి 36 కన్నా ఎక్కువ గంటలను వెచ్చిస్తారు. “యౌవనస్థులు మాత్రమే కాక, స్త్రీలు పురుషులు పెద్ద వయస్కులు కూడా టీవీని ఎక్కువ సమయం చూస్తున్నారని కనుగొనబడింది” అని ఆ వార్తాపత్రిక చెబుతుంది. వారానికి 30 గంటలు టీవీ చూడడానికి వెచ్చించే ఒక కుటుంబం, “వాస్తవాలను తాత్కాలికంగా మర్చిపోవడానికి కావలసినంత వినోదాన్ని” టీవీ “ఇచ్చిందని” చెప్పింది. అంత విపరీతంగా టీవీ చూసే అలవాటున్నవారు దాని పర్యవసానాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. 20 దేశాలను అధ్యయనం చేసినప్పుడు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, “టీవీ చూసేవారి లిస్టులో మొదట్లో ఉంది,” అయితే, “అక్షరాస్యతకు సంబంధించిన లిస్టులో మూడు అత్యంత ప్రధానమైన కొలమానాల ప్రకారం చూస్తే, బ్రిటన్‌ చివర్లో ఉంది” అని లండన్‌కు చెందిన ద గార్డియన్‌ వీక్‌లీ నివేదిస్తుంది.

(g01 1/22)

మానవుని ఆప్త మిత్రుడేనా?

మెక్సికో నగరానికి చెందిన ఎల్‌ యూనివర్సల్‌ అనే వార్తాపత్రికలోని ఒక నివేదిక ప్రకారం, పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను కుక్క దగ్గర వదిలేస్తే వాళ్లు కుక్క కాటుకు గురయ్యే ప్రమాదముంది. “ఎక్కువ సందర్భాల్లో పిల్లలే కుక్కని మొదట నొప్పిస్తారు, కుక్కలు స్వరక్షణార్థం పిల్లలను కరుస్తాయి” అని ఆ నివేదిక చెబుతుంది. మెక్సికోలోని ఒక ఆసుపత్రి, గత ఐదు సంవత్సరాల్లో కుక్క కాటుకు గురైన 426 మంది పిల్లలకు చికిత్స చేసింది. ఈ పిల్లల్లో 12 శాతం మందికి కుక్క కరిచినచోట, శాశ్వతంగా హాని కల్గడమో అంగ వైకల్యమేర్పడడమో జరిగింది. ఆ నివేదిక, కుక్కలన్నింటిని గురించిన ప్రాథమిక నియమాలను పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు బోధిస్తుంది. ఆ నియమాలేమిటంటే: వాటి ఆట వస్తువులను గానీ, అవి ఆహారం తినే పాత్రలను గానీ, వాటి ఇంటిని గానీ ముట్టుకోకూడదు; కుక్క తింటున్నప్పుడు గానీ, నిద్రపోతున్నప్పుడు గానీ దాని దగ్గరికి పోకూడదు; దాని తోకను పట్టుకుని లాగడం గానీ దాని మీద ఎక్కి కూర్చుని సవారీ చేయటానికి ప్రయత్నించడం గానీ చేయకూడదు.

(g01 3/8)

కావలసినంత సేపు నిద్రపోవడం

“ప్రమాదకరమైనంతగా నిద్రలేమివున్న సమాజం మనది” అని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియాకు చెందిన మనశ్శాస్త్రవేత్తయైన స్టేన్‌లీ కోరన్‌ అంటున్నారు. త్రీ మైల్‌ ఐలండ్‌లో న్యూక్లియర్‌ ప్రమాదం జరగడానికీ, ఎక్సోన్‌ వాల్డీజ్‌ చమురు ఒలికిపోవడానికీ నిద్ర తక్కువ కావడమే పాక్షిక కారణమని చెప్పబడుతుంది. నిద్ర మత్తు వల్ల ఉత్తర అమెరికాలో ప్రతి సంవత్సరం 1,00,000 కన్నా ఎక్కువ కారు ప్రమాదాలు జరుగుతున్నాయి అని కెనడాలోని మ్యాక్లీన్స్‌ అనే పత్రిక నివేదిస్తుంది. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన నిద్రకు సంబంధించిన విషయాల్లో నిపుణుడైన డా. విల్యమ్‌ డెమెంట్‌, “తమకు ఎంత నిద్ర అవసరమన్నది ప్రజలు నిజంగా అర్థం చేసుకోరు” అని హెచ్చరిస్తున్నాడు. నిద్ర బాగా పట్టాలంటే, రాత్రి పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేయాలి; ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రకుపక్రమించడమూ, నిద్రలేవడమూ చేయాలి; మీ పడకగదిలో టీవీని గానీ కంప్యూటర్‌ని గానీ ఉంచకూడదు; కఫీన్‌, మద్యం, పొగాకు మొదలైనవి ఉపయోగించవద్దు; మీరు పడక మీద ఉన్నప్పుడు మీ పాదాలకు వెచ్చదనం కోసం సాక్సులు వేసుకోండి. పడక మీదకు వెళ్ళడానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి; ప్రతిరోజూ వ్యాయామం చేయండి​—⁠కానీ మరీ పడుకోవడానికి ముందు చేయకండి అని పరిశోధకులు సూచిస్తున్నారు. చివరికి, “మీకు నిద్ర రానట్లయితే, లేచి ఏమైనా చేయండి. మీరు అలసిపోయినప్పుడు మాత్రమే పడక మీదకు వెళ్ళండి, మామూలుగా రోజూ మేల్కొనే సమయంలోనే మేల్కొనండి” అని మ్యాక్లీన్స్‌ పత్రిక అంటోంది.

(g01 3/8)

వంటగదిని శుభ్రంగా ఉంచడం

ఎప్పుడూ బిజీగా ఉండే వంటగదిలో కంటికి కనిపించకుండా ఉండి, రోగాలకు కారణమయ్యే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా “పోరాడేందుకు [మామూలు] బ్లీచ్‌ను వాడడమే శ్రేష్ఠం” అని కెనడాలోని వానకోవర్‌ సన్‌ అనే వార్తాపత్రిక చెబుతుంది. ఆ వివేదిక ఇస్తున్న సూచనలు: ప్రతిరోజు 4 లీటర్ల గోరు వెచ్చని నీటికి దాదాపు 30 మిల్లీలీటర్ల బ్లీచ్‌ని కలపండి. వేడినీళ్ళలో కలపకండి, వేడినీళ్ళలో కలిపితే బ్లీచ్‌ ఆవిరై పోతుంది. శుభ్రమైన బట్టను తీసుకుని బ్లీచ్‌ కలిపిన నీళ్ళతో వంటగదిలోని ఉపరితలాలను తుడవండి. తర్వాత ఆ ఉపరితలాలను గాలికి ఆరనివ్వండి. బ్లీచ్‌ ఎక్కువసేపు తగిలితే, ఎక్కువ సూక్ష్మజీవులు చనిపోతాయి. గిన్నెలను వేడిగా ఉన్న సబ్బు నీళ్ళతో కడిగి, బ్లీచ్‌ నీళ్ళలో కొన్ని నిమిషాలు నానబెట్టి ఉంచడం ద్వారా గిన్నెల మీద సూక్ష్మజీవులు లేకుండా చేయండి. గిన్నెలు ఆరిన తర్వాత వాటి మీద రసాయనాలేమీ ఇక ఉండవు. వంటగదిని శుభ్రం చేసే స్పాంజీలను, గిన్నెలను తుడిచే బట్టలను, గిన్నెలను తోమే బ్రష్‌లను ప్రతిరోజూ కడిగి బ్లీచ్‌ నీళ్ళలో కొన్ని నిమిషాల పాటు ఉంచండి. మీ చేతుల ద్వారా భోజన పదార్థం మలినం కాకుండా ఉండేందుకు చేతులను శుభ్రంగా కడుక్కోండి, ముఖ్యంగా గోళ్ళ క్రింద మురికి లేకుండా శుభ్రంగా కడుక్కోండి.

(g01 3/8)

సూక్ష్మజీవులతో యుద్ధం సమర్థించబడడంలేదు

“అమెరికన్‌ వినియోగదారులు తప్పుడు మార్గనిర్దేశాన్ననుసరించి ఇంట్లోని సూక్ష్మజీవులపై యుద్ధం చేస్తున్నారు” అని యుఎస్‌ఎ టుడే నివేదిస్తుంది. ఆ వార్తా పత్రిక ప్రకారం, టఫ్ట్స్‌ యూనివర్సిటీ వైద్యుడూ సూక్ష్మజీవుల శాస్త్రజ్ఞుడూ అయిన స్టార్ట్‌ లీవీ, “సూక్ష్మజీవ నాశక ఉత్పత్తులు పెరగడం వల్ల . . . సూక్ష్మజీవులు సూక్ష్మజీవ నాశక సబ్బులనే కాక, చివరికి క్రిమినాశకాలను కూడా తట్టుకునే స్థితికి ఎదిగే ప్రమాదం ఉంది” అని చెబుతున్నారు. ఇంటినీ పరిసరాలనూ సూక్ష్మజీవులు లేకుండా చేసేందుకు సూక్ష్మజీవ నాశక ఉత్పత్తులను ఉపయోగించడమంటే, “ఈగను వెళ్ళగొట్టడానికి కలప సుత్తిని ఉపయోగించడమే” అని లీవీ అంటున్నారు. మరొకవైపు, ఇంటిని శుభ్రం చేసేందుకు బ్లీచ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వేడి నీళ్ళు, సబ్బు వంటి వాటిని ఉపయోగించడం వల్ల మురికి పోతుంది, అంతేకాక సూక్ష్మజీవ నాశక ఉత్పత్తులను ఎదిరించగల సూక్ష్మజీవులు తయారుకావు. “సూక్ష్మజీవులు మనకు మిత్రులే. వాటితో సమాధానంగా ఉండాలి” అని లీవీ అంటున్నారు.

(g01 1/22)

కీటకాలను చంపేందుకు జీతం

ఇండియాలోని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో, సుమారు 6,50,000 సాల్‌ చెట్లున్న అడవిని పాడు చేస్తున్న 2.5 సెంటీమీటర్ల పొడవున్న రెక్కలు గల హోప్లో అనే కీటకాలను నిర్మూలం చేసేందుకుగాను, వాటిని చంపే కార్యక్రమాన్ని అక్కడి అటవీశాఖ మొదలుపెట్టిందని ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిస్తుంది. ఈ కీటకాలు ఇటీవల చాలా పెరిగి, సాల్‌ చెట్ల ఉనికికే ప్రమాదంగా మారాయి. ఈ కీటకాలు చెట్ల బెరడుల్లోను కాండాల్లోను కన్నాలు వేస్తాయి. అలా, చెట్లు ఎండిపోయి చచ్చిపోతున్నాయి. ఈ కీటకాలను పట్టుకునేందుకు అటవీశాఖ “ట్రాప్‌ ట్రీ” పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ పద్ధతిలో, చిన్న సాల్‌ చెట్ల బోదెలను కొట్టి, వాటిని ఈ కీటకాలు కనిపించే చోట చెల్లా చెదరుగా వేస్తారు. ఆ బోదెల నుండి కారే ద్రవం ఈ కీటకాలను ఆకర్షించి వాటికి మత్తు కలిగిస్తాయి. అప్పుడు వాటిని పట్టుకోవడం సులభంగా ఉంటుంది. ఈ పనిని ఆ ప్రాంతంలోని అబ్బాయిలకు అప్పజెప్పారు. ఒక్కో కీటకానికి 75 పైసల చొప్పున వాళ్ళకు జీతం ఇవ్వబడుతుంది.

(g01 3/8)

పదవీ విరమణ విషాదం

తొందరగా పదవీ విరమణ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉండవచ్చు, కానీ భావోద్వేగాలతో చాలా బాధపడవలసి ఉంటుంది. మునుపు ప్రభుత్వోద్యోగులై ఉన్నవారు, ‘అసంతృప్తీ, తొందరగా చికాకుపడడం, అభద్రతా భావం, గుర్తింపు లేకపోవడం మొదలుకొని డిప్రెషన్‌, తమకు ఇక జీవితంలో చేయడానికి ఏమీ లేదన్న అనుభూతి వరకు’ అనేక సమస్యలు తమకున్నట్లు చెబుతున్నారని బ్రెజిల్‌లోని డీరీయో డ పెర్నుంబూకో నివేదిస్తుంది. వార్ధక్య వ్యాధుల నిపుణుడైన గీడో షాచ్‌నిక్‌ అభిప్రాయం ప్రకారం, “తొందరగా పదవీ విరమణ చేసిన పురుషులు అమితంగా త్రాగడం, స్త్రీలైతే మత్తుమందుల మీద ఆధారపడ్డం సాధారణమే.” తమ ఉద్యోగాన్ని వదులుకోవాలని అనుకుంటున్నవాళ్ళు, “అప్పులను నివారించుకోవాలి, తమ సామర్థ్యాలను ఇతర విషయాలకు ఉపయోగించుకోవాలి, అప్పుల ఊబిలో పడిపోకుండా ఉండేందుకు సలహాలను తీసుకోవాలి” అని గ్రాసా సాంటోస్‌ అనే మనశ్శాస్త్రవేత్త అంటున్నారు.

(g01 3/8)