కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమరహిత వివాహబంధంలో బందీలు

ప్రేమరహిత వివాహబంధంలో బందీలు

ప్రేమరహిత వివాహబంధంలో బందీలు

“విడాకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న సమాజంలో, సంతోషరహితంగా ఉన్న వివాహాలు విడాకులకు దారి తీసే సాధ్యతే కాదు, మరిన్ని వివాహాలు సంతోషరహితమయ్యే సాధ్యత కూడా ఉంది.”​—కౌన్సిల్‌ ఆన్‌ ఫామిలీస్‌ ఇన్‌ అమెరికా.

జీవితంలోని ఆనందానికి, అలాగే క్షోభకు మూలం ఒకటేనని చెబుతారు​—అదే వివాహం. అది మానసిక ఉత్తేజాన్నీ అలాగే మనఃక్లేశాన్నీ కూడా కలిగించగలదు. అంతటి సుఖాన్నీ దుఃఖాన్నీ కలుగజేయగల శక్తి నిజంగా జీవితంలో చాలా కొద్ది వాటికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రక్కన ఉన్న బాక్సు సూచిస్తున్నట్లుగా చాలామంది దంపతులు మనోవేదననే ఎక్కువగా అనుభవిస్తున్నారని అర్థం అవుతుంది.

కానీ విడాకుల గణాంకాలు కేవలం సమస్యలోని కొంతభాగాన్ని మాత్రమే వెల్లడిచేస్తాయి. ఒక వివాహం విడాకులకు దారితీస్తుంటే అదే సమయంలో లెక్కలేనన్ని వివాహబంధాలు బంధాలుగానైతే ఉంటున్నాయి గానీ సమస్యల వలయాల్లో చిక్కుకుపోయి ఉంటున్నాయి. “మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది, కానీ గత 12 ఏళ్ళుగా పరిస్థితి దుర్భరంగా ఉంటోంది” అని 30 ఏండ్ల క్రితం వివాహమైన ఒక స్త్రీ తన గోడును వెళ్ళబోసుకుంటుంది. “నా భర్త నా భావాలపట్ల ఏమాత్రం ఆసక్తిని చూపించడంలేదు. భావోద్వేగపరంగా ఆయన నా బద్ధ శత్రువని చెప్పవచ్చు” అంటుందామె. అదే విధంగా, 25 సంవత్సరాల నుండి వివాహితుడిగా ఉన్న ఒక భర్త ఇలా విలపిస్తున్నాడు: “తను నన్నిక ప్రేమించడం లేదని నా భార్య నాతో అన్నది. ఖాళీ టైమ్‌లో ఎవరి దారి వారు చూసుకుంటూ కేవలం రూమ్మేట్లుగా జీవిస్తే మాత్రమే పరిస్థితిని సహించడం సాధ్యమని ఆమె అంటుంది.”

అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కొందరు తమ వివాహానికి చరమగీతం పలుకుతారన్నది నిజమే. కానీ ఇతరులనేకులు విడాకులు తీసుకోవాలని ఏమాత్రం అనుకోరు. ఎందుకని? డా. కరేన్‌ కైజర్‌ చెబ్తున్నదాని ప్రకారం తమకు పిల్లలున్న కారణంగా, సమాజంలో తమపై మచ్చ పడుతుందన్న కారణంగా, ఆర్థిక సమస్యలు, స్నేహితులు, బంధువులు, మతపరమైన నమ్మకాలు వంటి కారణాల మూలంగా దంపతులు కలిసివుంటారు, చివరికి ప్రేమరహిత స్థితిలోనైనా సరే కలిసేవుంటారు. “చట్టబద్ధంగా విడాకులు తీసుకునే అవకాశం లేకపోయేసరికి, వీరు భావోద్వేగపరంగా అప్పటికే విడాకులు తీసేసుకుని తమతమ వివాహ భాగస్వాములతో ఉండిపోవడానికే నిర్ణయించుకుంటారు” అని ఆమె అంటుంది.

వివాహబంధం క్షీణదశలో ఉన్న ఒక జంట అసంతృప్తితో నిండిన జీవితంతో సరిపెట్టుకుంటూ అలాగే కొనసాగాలా? విడాకులకు ఏకైక ప్రత్యామ్నాయం ప్రేమరహిత వివాహజీవితమేనా? కల్లోలభరిత వివాహాలనేకం, విడిపోవడం మూలంగా కలిగే మానసిక వ్యధ నుండే గాక ప్రేమరహిత దుస్థితి నుండి కూడా రక్షించబడగలవని అనుభవం చూపిస్తుంది.

(g01 1/8)

[3వ పేజీలోని బాక్సు]

ప్రపంచవ్యాప్తంగా విడాకులు

అమెరికా: 1970వ సంవత్సరం మొదలుకొని, వివాహం చేసుకునేవారు కలిసివుండే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయి.

ఆస్ట్రేలియా: 1960ల తొలిభాగంతో పోలిస్తే ఇప్పుడు విడాకులు దాదాపు నాలుగింతలు పెరిగాయి.

కెనడా మరియు జపాన్‌: దాదాపు మూడింట ఒక వంతు వివాహాల్ని విడాకులు ప్రభావితం చేస్తుంటాయి.

జింబాబ్వే: ప్రతి 5 వివాహాల్లో 2 విడాకులకు దారితీస్తుంటాయి.

బ్రిటన్‌: అంచనాల ప్రకారం, 10 వివాహాల్లో 4 విడాకులకు దారితీస్తుంటాయి.