కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మధ్యధరా మంక్‌ సీల్‌లు అవి బ్రతుకుతాయా?

మధ్యధరా మంక్‌ సీల్‌లు అవి బ్రతుకుతాయా?

మధ్యధరా మంక్‌ సీల్‌లు అవి బ్రతుకుతాయా?

గ్రీసులోని తేజరిల్లు! రచయిత

అవి గ్రీసులోని సముద్రతీరాల్లో సూర్యుడి వెచ్చదనాన్ని ఆనందిస్తున్నట్లుగా హోమర్‌ తాను వ్రాసిన ఒడిస్సీ అనే పురాణగాథలో చిత్రీకరించాడు. ప్రాచీన ఆసియా మైనరులోని ఒక నగరం ఒకసారి వాటి బొమ్మల్ని నాణాలపై ముద్రించింది. మధ్యధరా, నల్ల సముద్రాల జలాల్లో ఒకప్పుడవి కుప్పలుతెప్పలుగా ఉండేవి. అయితే నేడు మధ్యధరా మంక్‌ సీల్‌లనబడే ఈ పిరికి జీవులు మీకు కనబడే అవకాశాలు తక్కువ.

బొచ్చు ఉన్న మిగతా సస్తనజాతి సముద్రప్రాణుల విషయంలో జరిగినట్లే మధ్యధరా మంక్‌ సీల్‌ కూడా 18, 19వ శతాబ్దాల్లో విపరీతంగా వేటాడబడింది. వాటి బొచ్చు, వాటి మాంసంతోపాటు వాటి నుండి వచ్చే నూనె వంటివాటి కోసం వేలాది మూగజీవులు చంపబడ్డాయి.

దాని ఫలితంగా ఏర్పడిన నష్టం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మధ్యధరా మంక్‌ సీల్‌లు కేవలం 379 నుండి 530 మాత్రమే మిగిలివున్నాయని అంచనా వేయబడుతోంది. ఇలాగే కొనసాగితే బహుశా అవి అంతరించిపోవడానికి ఎంతో కాలం పట్టదు. అయితే, మోనాకస్‌ గార్డియన్‌ అనే పత్రిక నివేదిస్తున్నట్లుగా ఈ జనాభా అంచనాల శాస్త్రం “చాలా తప్పుడు శాస్త్రం” అని కూడా చెప్పాల్సిందే.

ఏవైనా చర్యలు తీసుకోలేనంత సమయం మించిపోయినట్లేనా? మంక్‌ సీల్‌లను కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి?

చాలా కష్టతరమైన పోరాటం

మంక్‌ (సన్యాసి) సీల్‌కు ఆ పేరు బహుశ కొన్ని మతవర్గాల వారు ధరించే విలక్షణమైన దుస్తుల రంగూ వాటి బొచ్చురంగూ ఒకటే కావడం మూలంగా వచ్చివుండవచ్చు. అవి ఎక్కువగా ఏజీయన్‌ సముద్రంలోని నార్దరన్‌ స్పోరడీస్‌ దీవుల్లోని సముద్ర గుహల్లోను దుర్భేద్యమైన కొండల్లోను నివసిస్తాయి. వాయవ్య ఆఫ్రికా సముద్రతీరాల్లోను, పోర్చుగల్‌కు చెందిన డెజర్టెష్‌ దీవుల సముద్రతీరాల్లోను చిన్న చిన్న సమూహాలు కనిపిస్తాయి. ఇవి మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి, దాదాపు 275 కిలోలు బరువుంటాయి. ప్రపంచంలోని అతి పెద్ద సీల్‌ జాతుల్లో మంక్‌ సీల్‌ ఒకటి.

బల్బు ఆకారంలో తల, తలపై వెండిలా మెరిసే బొచ్చు, నల్లరాయి రంగులో కళ్ళు, పెద్ద ముక్కు పుటాలున్న ముట్టె, చెవుల స్థానంలో రెండు చిన్న నిలువుకోతలు, వేలాడుతుండే గట్టి మీసాలు, ముడుతలు ముడుతలుగా వేలాడే మెత్తని గడ్డాలు వీటి విలక్షణమైన రూపురేఖలు. శరీరంపై నల్లని లేదా చాక్లెట్‌-బ్రౌన్‌ రంగులో కురచగా బొచ్చు ఉంటుంది, పొట్ట భాగంలోని బొచ్చు కాస్త లేత రంగుల్లో ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా, అప్పుడే పుట్టిన సీల్‌ పిల్లల వీపులపై పొడవైన నల్లని బొచ్చు, వాటి పొట్టలపై తెల్లని బొచ్చు ఉంటుంది.

మంక్‌ సీల్‌ సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉండడంతో మనుగడ కోసం చేసే వాటి పోరాటం మరింత కష్టతరమౌతుంది. ఆడ సీల్‌లు సంవత్సరానికి ఒక్కటికి మించి పిల్లల్ని కనవు. ఇంకా ఘోరమేమిటంటే యుక్తవయస్సుకు చేరుకున్న ఆడ సీల్‌లన్నీ ప్రతీ సంవత్సరమూ పిల్లల్ని కనవు.

జనన రేట్లు తక్కువగా ఉండడమే పూర్తి పరిస్థితిని వివరించదు. న్యూయార్క్‌ అక్వేరియమ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషన్‌ వద్ద జనరల్‌ క్యూరేటర్‌గా ఉన్న డాక్టర్‌ డెన్నిస్‌ థోనీ ఇలా అంటున్నాడు: “మధ్యధరా మంక్‌ సీల్‌లలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది, కానీ అంతే సంతానోత్పత్తి రేటు ఉన్న హార్బర్‌ సీల్‌ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీన్ని బట్టి మంక్‌ సీల్‌ల జనాభా పడిపోవడానికి వేరే కారకాలున్నాయన్నది స్పష్టమౌతోంది.”

దాడినెదుర్కొంటున్నాయి

మీ ఇంటికి నిప్పంటుకుంటే దాని వల్ల రాగల నష్టాన్ని ఊహించుకోండి. మీ ఆస్తంతా​—ఫర్నీచరూ, బట్టలూ, మీరు ప్రియంగా ఎంచే వస్తువులూ, మరితర ప్రీతికరమైన జ్ఞాపికలు సమస్తం నాశనమౌతాయి. మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మధ్యధరా మంక్‌ సీల్‌ల గృహం విషయంలో చెప్పాలంటే సరిగ్గా అలానే జరిగింది. కాలుష్యం, టూరిజమ్‌, పరిశ్రమలు, మరితర మానవ కార్యకలాపాలు ఈ సీల్‌ల ప్రకృతి ఆవాసాన్ని చాలా మట్టుకు నాశనం చేసిపారేశాయి.

అంతేగాక, ప్రజలు చేపల్ని అతిగా పట్టడం మూలంగా మంక్‌ సీల్‌లకు ఆహార కొరత ఏర్పడింది. జంతుశాస్త్రజ్ఞురాలైన డాక్టర్‌ సూజన్‌ కెన్నెడీ-స్టాస్కోప్ఫ్‌ ఇలా అంటుంది: “సీల్‌లు వేటాడే ప్రాణుల సంఖ్య పడిపోయినప్పుడు అవి ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగించాల్సివస్తోంది.” మంక్‌ సీల్‌లు తమ ఆవాసాలను, అంటే తమ గృహాలను కోల్పోవడమే కాక, తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా విపరీతంగా కష్టపడాల్సివస్తోంది!

అతిగా చేపలు పట్టడం మూలంగా అప్పుడప్పుడు సీల్‌లు చేపల కోసం పెట్టిన వలల్లో చిక్కుకుపోయి ఊపిరందక చనిపోవడం కూడా జరుగుతుంది. అయితే అంతకన్నా తరచుగా జాలర్లే సీల్‌లను చంపేయడం జరుగుతోంది. ఎందుకని? ఎందుకంటే చేపల వలల్లోంచి ఆహారాన్ని ఎలా దొంగిలించాలో సీల్‌లు నేర్చేసుకున్నాయి. ఆ ప్రయత్నంలో అవి వలల్ని పాడు చేస్తున్నాయి. అలా, సంఖ్యాపరంగా తగ్గిపోతున్న చేపల కోసం మానవుడు నోరులేని ఈ జీవులతో పోటీ పడుతున్నాడు. ఈ పోటీ ఒకవైపే బలంగా ఉండడంతో మంక్‌ సీల్‌లు అంతరించిపోయే ప్రమాదంలో పడుతున్నాయి.

మంక్‌ సీల్‌లు ఆహారపు గొలుసులో దాదాపు అగ్ర భాగంలో ఉండడం మూలంగా, ఈ సముద్ర క్షీరదం “సూచక జాతి” అని కొందరు శాస్త్రజ్ఞులు వర్ణిస్తున్నారు. అంటే, ఇవి క్షేమంగా లేకపోయినట్లైతే, ఆహారపు గొలుసులోని మిగతా భాగం కూడా అంత క్షేమంగా ఉన్నట్లు కాదు అనడానికి చక్కని సూచన అని అర్థం. ఇది గనుక నిజమైతే, ఇలా కొనసాగడం మధ్యధరా ప్రకృతి ఆవరణ వ్యవస్థకు మంచిది కాదు, ఎందుకంటే మంక్‌ సీల్‌ యూరప్‌లో అంతరించిపోతున్న జంతు జాతుల్లోనే అతి ప్రాముఖ్యమైనదిగా ఉంది.

అవి మనగల్గుతాయా?

విచిత్రమైన విషయం ఏమిటంటే, మధ్యధరా మంక్‌ సీల్‌లకు అతి గొప్ప ముప్పును తెచ్చిపెట్టేది మానవుడే, కానీ అదే సమయంలో మానవుడే వాటి అతి గొప్ప మద్దతుదారుడు. సీల్‌లను కాపాడడానికి ప్రైవేటు, ప్రభుత్వ ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటి నిమిత్తం ఆశ్రయ ప్రాంతాలు నిర్ణయించబడ్డాయి. ఈ అద్భుతమైన జీవులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి అనేకమైన క్షేత్ర అధ్యయనాలు నిర్వహించబడ్డాయి.

1988లో హెల్లెనిక్‌ సొసైటీ ఫర్‌ ద స్టడీ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ద మెడిటెర్రేనియన్‌ మంక్‌ సీల్‌ (MOm) స్థాపించబడింది. MOmలోని పరిశోధకులు మంక్‌ సీల్‌ల ఆవాస ప్రాంతాల్ని క్రమంగా సందర్శించి వాటి సంఖ్యల్ని ఎప్పటికప్పుడు వ్రాసిపెట్టుకుంటూ వాటిని సంరక్షించడానికి ఉపయోగపడే మరితర సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు.

ఆరక్షిత ప్రాంతాల్లో గార్డుల జట్టు ఒకటి స్పీడ్‌బోట్లను ఉపయోగిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ జట్టు నార్దరన్‌ స్పోరడీస్‌ దీవుల్లోని ఆలోనీసోస్‌ వద్దనున్న గ్రీస్‌ నేషనల్‌ మెరీన్‌ పార్క్‌ను సందర్శించే పర్యాటకులకు, జాలర్లకు కావాల్సిన సమాచారాన్నీ నిర్దేశాల్నీ కూడా అందిస్తుంది. జబ్బుపడిన లేక గాయపడిన సీల్‌లు కనబడితే ఈ జట్టు కావాల్సిన వెటర్నరీ సదుపాయాల్నీ, MOm పునరావాస కేంద్రానికి రవాణా సౌకర్యాల్నీ కల్పిస్తుంది.

అనాథలుగా వదిలివేయబడిన, జబ్బుపడిన, గాయపడిన సీల్‌ పిల్లలు ఉండడానికి వసతుల్ని కూడా సీల్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్‌ కల్పించగలదు. వీటికి చికిత్స చేసి తమ స్వంతగా జీవించగల్గేంత వరకు వాటిపట్ల శ్రద్ధ వహిస్తారు. ఇప్పటి వరకూ చూస్తే ఫలితాలు బాగానే ఉన్నాయి. వీటి సంఖ్య ఎన్నో సంవత్సరాలపాటు విపరీతంగా పడిపోతూ వచ్చిన తరువాత, నార్దరన్‌ స్పోరడీస్‌లోని మంక్‌ సీల్‌ల సంఖ్య పెరుగుతున్న సూచనలు ఇప్పుడు కనబడుతున్నాయి.

ఈ ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతాయా? కాలమే చెప్పాలి. అయితే, ఈ జాతి జంతువులు బ్రతకాలంటే ఇంకా చాలా పని చేయాల్సివుందని స్పష్టంగా కనబడుతుంది. స్మిత్సోనియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ వైల్డ్‌ తేజరిల్లు!తో ఇలా అన్నాడు: “మొత్తంగా చూస్తే సముద్రజీవాల పరిస్థితి అంత బాగా లేదు. సమస్యేమిటంటే, సముద్రాంతర్భాగంలో అసలు ఏమి ఉందో మనకు అంతగా తెలీదు, ఇక వాటిని సంరక్షించే మాట చెప్పనే అక్కర్లేదు.”(g01 3/8)

[17వ పేజీలోని బాక్సు]

ప్రమాదంలో వీటి బంధువులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే సముద్రాల్లో కూడా మంక్‌ సీల్‌లు కనబడతాయి, కానీ ఇవి కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. నేషనల్‌ జియాగ్రఫిక్‌ పత్రిక చెప్పేదాని ప్రకారం కరీబియన్‌, లేదా వెస్ట్‌ ఇండియన్‌ మంక్‌ సీల్‌ అనేది “కొలంబస్‌ పశ్చిమార్థ గోళంలో చూసిన మొట్టమొదటి సీల్‌. సముద్ర తీరాల్లో ఉండడానికి ఇష్టపడే ఇవి చాలా సులభంగా పట్టుబడతాయి, కొద్ది కాలంలోనే పెద్ద సంఖ్యలో మంక్‌ సీల్‌లు వధకు గురయ్యాయి. . . . నమోదు చేయబడిన చివరి కరీబియన్‌ మంక్‌ సీల్‌ 1952లో కనబడింది.”

హవాయియన్‌ ఐలాండ్స్‌ నేషనల్‌ వైల్డ్‌లైఫ్‌ రెఫ్యూజ్‌లో భాగమైన ఫ్రెంచ్‌ ఫ్రైగేట్‌ షోల్స్‌ ద్వీపసముదాయం మాత్రమే ప్రస్తుతం హవాయియన్‌ మంక్‌ సీల్‌లు అంటే లైసాన్‌ మంక్‌ సీల్‌లకు ఆశ్రయస్థానాలుగా ఉన్నాయి. అయితే, ఇక్కడ జీవిస్తున్న దాదాపు 1,300 సీల్‌లను సంరక్షించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి “సమస్యల్లో కూరుకుపోయివున్నాయి.”

1997 వసంతకాలం నుండి ఇప్పటి వరకు, వాయవ్య ఆఫ్రికాలోని మారిషానియా తీరంలో జీవిస్తున్న 270 మధ్యధరా మంక్‌ సీల్‌లలో ముప్పావు వంతు సీల్‌లు ఒక మహమ్మారి బారినపడి చనిపోయాయి. సైన్స్‌ న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం చూస్తే, పరీక్ష చేయబడినప్పుడు చాలా సీల్‌లలో “డాల్ఫిన్‌ మోర్బిలివైరస్‌ ఉంది, ఇది కుక్కల్లో పిచ్చిని కలుగజేసే వైరస్‌ను పోలివుంది.”

[16వ పేజీలోని చిత్రాలు]

బల్బు ఆకారంలో తల పెద్ద ముక్కు పుటాలు వంటి ఎన్నో విశిష్టమైన రూపురేఖలు మంక్‌ సీల్‌లలో ఉన్నాయి

సీల్‌లను కాపాడేందుకు కొన్ని ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయి

[చిత్రసౌజన్యం]

Panos Dendrinos/HSSPMS

[17వ పేజీలోని చిత్రాలు]

సంవత్సరాల తరబడి విపరీతంగా తగ్గుతూ వచ్చిన మంక్‌ సీల్‌ల సంఖ్య, ఇప్పుడు నార్దరన్‌ స్పోరడీస్‌లో పెరుగుతున్న సూచనలు కన్పిస్తున్నాయి

[చిత్రసౌజన్యం]

P. Dendrinos/MOm

D. Kanellos/MOm

[17వ పేజీలోని చిత్రాలు]

హవాయియన్‌ మంక్‌ సీల్‌

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

Panos Dendrinos/HSSPMS