కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం క్రైస్తవ కూటాలకు వెళ్ళాలా?

మనం క్రైస్తవ కూటాలకు వెళ్ళాలా?

బైబిలు ఉద్దేశము

మనం క్రైస్తవ కూటాలకు వెళ్ళాలా?

“నేను చర్చికి వెళ్ళేవాడ్ని. కానీ ఇప్పుడు వెళ్ళడం లేదు.” “చర్చిలోనే కాదు, ఎక్కడుండైనా దేవుడ్ని ఆరాధించవచ్చని నేను అనుకుంటున్నాను.” “నాకు దేవుని మీదా బైబిలు మీదా విశ్వాసముంది. కానీ చర్చికి వెళ్ళాల్సిన అవసరముందని నేననుకోవడం లేదు.” ఇలాంటి వ్యక్తీకరణలను మీరు విన్నారా? నేడు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, చాలామంది అలా అంటున్నారు. ఒకప్పుడు చర్చికి వెళ్తూ ఉండిన ప్రజలు, ఇప్పుడది అంత అవసరమని అనుకోవడం లేదు. ఇంతకూ చర్చికి వెళ్ళే విషయం గురించి బైబిలు ఏమని చెబుతోంది?

“చర్చి,” “చర్చీలు” అనే పదాలు కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ 110 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తాయి. ఇతర అనువాదాలు కూడా ఈ పదాలను ఉపయోగిస్తున్నాయి. “చర్చి” అని అనువదించబడిన గ్రీకు పదానికున్న అక్షరార్థ భావం “రమ్మని పిలవడం” లేదా మరో మాటలో చెప్పాలంటే, ప్రజలను సమకూర్చడం. ఉదాహరణకు, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌లో అపొస్తలుల కార్యములు 7:38 మోషే “అరణ్యములోని చర్చిలో” ఉన్నట్లు చెబుతోంది. ఆయన, సమకూడిన ఇశ్రాయేలు జనాంగం మధ్యన ఉన్నాడనే ఆ లేఖనం చెబుతోంది. మరొక సందర్భంలో, యెరూషలేములోని క్రైస్తవ సమాజాన్ని సూచిస్తూ, “చర్చికి వ్యతిరేకంగా గొప్ప హింసాకాండ మొదలైంది” అని లేఖనం చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 8:1, ద జెరూసలేమ్‌ బైబిల్‌) పౌలు, తాను వ్రాసిన ఒక పత్రికలో, “[ఫిలెమోను] యింట ఉన్న చర్చికి” అంటే, అక్కడ సమకూడే స్థానిక సంఘానికి వందనములు తెలిపాడు.​—ఫిలేమోను 2, రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌.

స్పష్టంగా, బైబిలు “చర్చి” అనే పదాన్ని ఆరాధకుల గుంపును సూచించడానికే ఉపయోగించింది గానీ ఆరాధనా స్థలాన్ని సూచించేందుకు కాదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అలెగ్జాండ్రియాకు చెందిన, రెండవ శతాబ్దపు మత బోధకుడైన క్లెమెంట్‌, “నేను చర్చి అని పిలిచేది ఒక స్థలాన్ని కాదు, రక్షించబడేందుకు ఎన్నుకోబడినవారి సంఘాన్ని” అని వ్రాశాడు. అయినా, తమ ఆరాధన దేవుని ఎదుట అంగీకారయోగ్యమైనదిగా ఉండాలంటే, క్రైస్తవులు ఒక నిర్దిష్టమైన స్థలంలో లేదా బిల్డింగ్‌లో తప్పనిసరిగా హాజరవ్వాలా?

ఇశ్రాయేలు జనాంగపు ఆరాధన

మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదా పురుషులందరూ మూడు వార్షిక పండుగల కోసం నిర్దిష్టమైన స్థలంలో సమకూడాలి. అనేక మంది స్త్రీలూ, పిల్లలూ కూడా హాజరయ్యేవారు. (ద్వితీయోపదేశకాండము 16:16; లూకా 2:41-44) సమకూడిన ప్రజలకు కొన్ని సందర్భాల్లో యాజకులూ లేవీయులూ దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి బోధించేవారు. వారు “దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.” (నెహెమ్యా 8:8) సబ్బాతు సంవత్సరాల గురించి చెబుతూ, “మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను” అని దేవుడు నిర్దేశించాడు.​—ద్వితీయోపదేశకాండము 31:12.

యెరూషలేములోని ఆలయంలో మాత్రమే ఒక వ్యక్తి దేవునికి బలులను అర్పించడం గానీ యాజకుల నుండి నిర్దేశాలను పొందడం గానీ సాధ్యమయ్యేది. (ద్వితీయోపదేశకాండము 12:5-7; 2 దినవృత్తాంతములు 7:12) అయితే కాలక్రమేణా, ఇశ్రాయేలులో ఇతర ఆరాధనా స్థలాలు, అంటే సమాజ మందిరాలు స్థాపించబడ్డాయి. అవి లేఖనాలను చదివేందుకూ, ప్రార్థించేందుకూ ఉపయోగించబడే స్థలాలు. అయినప్పటికీ, యెరూషలేములోని ఆలయమే ముఖ్య ఆరాధన స్థలంగా ఉండేది. బైబిలు రచయితైన లూకా నివేదిక ఈ విషయాన్ని చక్కగా చిత్రీకరిస్తుంది. అన్న అనే వృద్ధ స్త్రీని లూకా పేర్కొన్నాడు. ఆమె “దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.” (లూకా 2:36, 37) దేవునికి సమర్పించుకున్న ఇతరులతోపాటు సత్యారాధన చేయడమనేది అన్న జీవితంలో ప్రథమ విషయంగా ఉండేది. దైవ భయంగల ఇతర యూదులు కూడా అదే పద్ధతిని అవలంబించారు.

క్రీస్తు మరణం తర్వాత సత్యారాధన

యేసు మరణం తర్వాత, ఆయన శిష్యులు ఇక మోషే ధర్మశాస్త్రం క్రిందా లేరు, ఆ ఆలయంలో ఆరాధించవలసిన అవసరమూ వాళ్ళకు లేదు. (గలతీయులు 3:23-25) అయినప్పటికీ, వారు ప్రార్థన చేయడానికీ, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికీ కలుసుకోవడం కొనసాగించారు. అందుకు వాళ్ళకు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు లేవు. ఇండ్లల్లో లేదా బహిరంగ స్థలాల్లో కలుసుకునేవారు. (అపొస్తలుల కార్యములు 2:1, 2; 12:12; 19:9; రోమీయులు 16:4, 5) మొదటి శతాబ్దపు క్రైస్తవ కూటాలు ఆచార సాంప్రదాయాలు గానీ, వైభవోపేతమైన ప్రదర్శనలు గానీ లేకుండా నిరాడంబరంగా ప్రశాంతంగా జరిగేవి.

రోమా సామ్రాజ్యంలో నైతికత దిగజారిన పరిస్థితుల్లో, క్రైస్తవ కూటాల్లో బోధించబడిన బైబిలు సూత్రాలు వజ్రాల్లా కాంతులీనేవి. మొదటిసారిగా కూటాలకు హాజరైన కొందరు అవిశ్వాసులు, “దేవుడు నిజముగా మీలో ఉన్నాడని” అనకుండా ఉండలేకపోయారు. (1 కొరింథీయులు 14:24, 25) అవును, దేవుడు నిజంగానే వారి మధ్య ఉన్నాడు. “గనుక సంఘములు [“చర్చీలు,” RS, JB] విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.”​—అపొస్తలుల కార్యములు 16:5.

ఆ కాలంలో ఒక క్రైస్తవుడు, అన్యమత దేవాలయాల్లో గానీ ఇతరులతో కలవకుండా స్వతంత్రంగా గానీ ఆరాధిస్తే ఆయనకు దేవుని అంగీకారముండేదా? బైబిలు ఈ విషయంలో స్పష్టమైన నిర్దేశాన్నిస్తోంది. ఆమోదించబడిన ఆరాధకులతో, అంటే యథార్థ ఆరాధకులతో ‘ఒక్కటే శరీరముగా’ రూపొందిన నిజమైన చర్చీలో లేదా సంఘంలో భాగమవ్వాలన్నదే ఆ నిర్దేశము. క్రైస్తవులని పిలవబడిన యేసు శిష్యులే యథార్థ ఆరాధకులు.​—ఎఫెసీయులు 4:4, 5; అపొస్తలుల కార్యములు 11:26.

నేటి విషయం ఏమిటి?

ఒక చర్చిలో ఆరాధించమని ప్రోత్సహించే బదులు, ‘ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే’ ప్రజలున్న, “జీవముగల దేవుని సంఘము”తో కలిసి ఆరాధించమని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. (యోహాను 4:24; 1 తిమోతి 3:15) దేవుడు ఆమోదించిన మతసంబంధ కూటాలు, ప్రజలకు ‘పరిశుద్ధమైన ప్రవర్తనను, భక్తిని’ గురించి నిర్దేశాలనివ్వాలి. (2 పేతురు 3:11, 12) అక్కడ హాజరై ఉన్నవారు, “మేలు కీడులను వివేచించ”గల పరిణతి చెందిన క్రైస్తవులుగా మారేందుకు ఆ కూటాలు సహాయపడాలి.​—హెబ్రీయులు 5:14.

యెహోవాసాక్షులు మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరిని అనుసరించేందుకు శ్రమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 91,400 కన్నా ఎక్కువ సంఘాలు బైబిలును అధ్యయనం చేసేందుకూ, ఒకరినొకరు ప్రోత్సహించుకునేందుకూ రాజ్య మందిరాల్లోనూ, ఇండ్లల్లోనూ, మరితర స్థలాల్లోనూ క్రమంగా సమకూడుకుంటున్నాయి. అలా సమకూడడం “సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, . . . ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని” అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలకు అనుగుణ్యంగా ఉంది.​—హెబ్రీయులు 10:24, 25.

(g01 3/8)