కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని దారిలోనే ఆపేసే చెట్టు

మిమ్మల్ని దారిలోనే ఆపేసే చెట్టు

మిమ్మల్ని దారిలోనే ఆపేసే చెట్టు

ఈక్వెడార్‌లోని తేజరిల్లు! రచయిత

ఈక్వెడార్‌ తీరపు సమతల ప్రాంతంలో డిసెంబర్‌ మధ్యలో కురవవలసిన వర్షాలు ఇంకా మొదలవ్వలేదు. బారుగా ఉన్న వాలైన కొండల మీద ఉన్న పచ్చిక దుమ్ము పట్టడం వల్ల అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. పైన ఆకాశంలో బూడిద రంగులోని మేఘాలు కమ్ముకొని మబ్బుమబ్బుగా ఉన్న ఆ రోజున ప్రయాణికుల ఒక గుంపు పశ్చిమ దిశనున్న పసిఫిక్‌ మహాసముద్రం వైపుకు హైవే మీదుగా ప్రయాణం చేస్తోంది. అకస్మాత్తుగా వాళ్ళందరి కళ్ళూ రోడ్డు ప్రక్కనున్న ఒక చెట్టుమీద పడ్డాయి. వెంటనే వాళ్ళ కారును అక్కడ ఆపారు. వాళ్ళు చూసింది ఏమి చెట్టు?

అది పూలతో నిండివున్న గయకాన్‌ చెట్టు! అక్కడ ఆవరించివున్న నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ, “ఆహా ఎంత బాగుంది! ఇంత తేజోవంతమైన రంగును మీరు ఇంతకు ముందెప్పుడైనా చూశారా? గులాబి రంగు, వంకాయ రంగు, ఎరుపు రంగు, నారింజ రంగుల పువ్వులను పూసే అనేక చెట్లను చూశాను కానీ, మిరిమిట్లు గొలిపే పువ్వులుగల ఈ చెట్టు అందం వాటన్నింటినీ మించిపోతుంది!” అని వారిలో ఒకరన్నారు.

వాళ్ళు బంగారు వన్నెలో కనిపిస్తున్న ఆ అందాన్ని ఆస్వాదించి, అక్కడి నుండి ముందుకు వెళ్ళారు. అది ఆరంభం మాత్రమేనని వాళ్ళకు తెలియదు. వాళ్ళలా రోడ్డుమీద ఇంకొంత దూరం వెళ్ళాక, ఒకదాని తర్వాత మరొకటి చొప్పున పూలతో నిండిన ఇంకా ఎన్నో గయకాన్‌ చెట్లను వాళ్ళు చూశారు. అక్కడి కొండల మీద బంగారు వన్నెలో సూర్యకాంతి పరుచుకున్నట్లుగా ఉంది! గయకాన్‌లు సంవత్సరానికొకసారి పూసే కాలమది. బోసిపోయినట్లుండే అడవులు అందంగా అలంకరించుకున్నట్లు పువ్వులతో ఆకర్షణీయమైన వర్ణంలో కనిపించే కాలమది.

అయితే, ఈ అందమైన పూల చెట్లు, ఒక్క దేశానికే పరిమితం కాలేదు. వాస్తవానికి, ఈ చెట్లు దక్షిణ, మధ్య అమెరికాల్లోని అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. ఈ చెట్ల పువ్వులు శంఖు ఆకారంలో ఉండడం వల్ల, అరగానే, గయకాన్‌ అమరిలో, గోల్డెన్‌ ట్రంపెట్‌, ట్రంపెట్‌ ట్రీ అనే పేర్లతో కూడా పిలువబడుతున్నాయి. వీటి శాస్త్రీయ నామం టాబెబూయ క్రిసంతా.

గయకాన్‌ చెట్టు మంచి కలపనిస్తుంది. సంవత్సరాలుగా దాని నుండి నాణ్యమైన కలప సామాగ్రిని తయారు చేస్తున్నారు. ఈ చెట్టు అలా ఉపయోగించబడుతూ ఇప్పుడు కరువైపోతున్నందు వల్ల, కొన్ని దేశాలు దీన్ని సంరక్షించేందుకుగాను కొన్ని నియమాలు పెట్టవలసి వచ్చింది. ఈ చెట్లు సంవత్సరానికి ఒక కాలంలో కేవలం కొన్ని రోజులే పువ్వులు పూస్తున్నా, అవి పూసినప్పుడు స్వదేశీయులేగాని విదేశీయులే గాని దాని అనుపమానమైన అందాన్ని చూసి ఆనందించేందుకే అలా నియమాలను పెట్టవలసివచ్చింది.

మనం నివసిస్తున్న అద్భుతమైన ఈ భూమికి శిల్పియైన అందరికన్నా గొప్ప కళాకారుడైన మన సృష్టికర్తకు సజీవ సన్మానముగా గయకాన్‌ చెట్టు ఉందనడంలో సందేహంలేదు. (g01 3/8)