కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ వివాహాన్ని కాపాడుకోవడం సాధ్యమే!

మీ వివాహాన్ని కాపాడుకోవడం సాధ్యమే!

మీ వివాహాన్ని కాపాడుకోవడం సాధ్యమే!

భార్యాభర్తలకు ప్రయోజనాన్ని చేకూర్చగల ఆచరణాత్మకమైన సలహాలు బైబిలులో సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు, ఎందుకంటే బైబిలును ప్రేరేపించిన వ్యక్తే వివాహ ఏర్పాటుకు ఆరంభకుడు.

వివాహాన్ని గురించి బైబిలు ఒక వాస్తవిక చిత్రాన్ని అందిస్తుంది. భార్యాభర్తలకు “శ్రమలు” కలుగుతాయని లేక, న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ అనువదించినట్లుగా “బాధను, దుఃఖాన్ని” అనుభవిస్తారని అది అంగీకరిస్తుంది. (1 కొరింథీయులు 7:28) అయితే, వివాహం ఆనందాన్ని ఉత్తేజాన్ని అందిస్తుందనీ అందించాలనీ కూడా బైబిలు చెబుతుంది. (సామెతలు 5:18, 19) ఈ రెండు విషయాలూ పరస్పర విరుద్ధమైనవేమీ కావు. గంభీరమైన సమస్యలు ఉన్నప్పటికీ దంపతులు సన్నిహితమైన ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని అనుభవించగలరని చూపిస్తున్నాయంతే.

మీ వివాహంలో ఇది కొరవడుతుందా? మీ అనుబంధంలో ఒకప్పుడున్న సాన్నిహిత్యాన్నీ ఆనందాల్నీ బాధలు, నిరాశలు దిగమ్రింగేస్తున్నాయా? మీ వివాహం సంవత్సరాల తరబడి ప్రేమరహిత స్థితిలో ఉన్నప్పటికీ మీరు కోల్పోయినదాన్ని తిరిగి పొందగలరు. అయితే, మీరు వాస్తవిక దృక్పథంతో ఉండాలి. అపరిపూర్ణులైన ఏ స్త్రీ పురుషుడు కూడా పరిపూర్ణమైన వివాహబంధాన్ని ఏర్పర్చుకోలేరు. అయినా, ప్రతికూల ప్రభావాల్ని మార్చడానికి మీరు తీసుకోగల చర్యలు కొన్ని ఉన్నాయి.

ఈ క్రింది సమాచారాన్ని మీరు చదువుతుండగా, మీ వివాహానికి ప్రత్యేకంగా ఏ విషయాలు వర్తిస్తాయో గుర్తించడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామిలోని లోపాలపై దృష్టిని కేంద్రీకరించడానికి బదులుగా, మీరు ఆచరణలో పెట్టగల కొన్ని సూచనల్ని ఎంపిక చేసుకుని ఆయా లేఖనాధార సలహాల్ని అన్వయించుకోండి. ఆశావాదానికి మీరు అనుకున్నదానికన్నా ఎక్కువే ఆస్కారముందని మీరు కనుగొనవచ్చు.

మొట్టమొదటిగా మనం వైఖరి అనే అంశాన్ని చర్చిద్దాం, ఎందుకంటే నిబద్ధతపట్ల మీ దృక్కోణం, మీ జీవిత భాగస్వామిపట్ల మీకున్నటువంటి భావాలు అతి ప్రాముఖ్యమైనవి.

నిబద్ధతపట్ల మీ దృక్కోణం

మీరు మీ వివాహబంధాన్ని సరిచేసుకోవడానికి కృషి చేయాలనుకుంటే శాశ్వతకాలం కలిసివుండాలనే దృక్కోణం ప్రాముఖ్యం. ఎంతైనా, ఇద్దరు మానవుల్ని విడదీయరాని విధంగా జతచేసివుంచడానికే కదా దేవుడు వివాహ ఏర్పాటును రూపొందించాడు! (ఆదికాండము 2:24; మత్తయి 19:4, 5) ఉద్యోగ విషయంలోనో అపార్ట్‌మెంట్‌ విషయంలోనో ఏర్పర్చుకున్న కాంట్రాక్టును రద్దుచేసుకుని చక్కా బయటికి నడిచి పోవడంలాంటిది కాదు మీ భార్య/భర్తతో మీకున్న సంబంధం. దానికి విరుద్ధంగా వివాహం చేసుకుంటున్నప్పుడు మీరు మీ భాగస్వామికి ఏమొచ్చినా సరే అంటిపెట్టుకుని ఉంటానని లాంఛనప్రాయంగా వాగ్దానం చేశారు. నిబద్ధతతో కూడిన లోతైన భావాలు కలిగివుండడం యేసుక్రీస్తు దాదాపు 2000 సంవత్సరాల క్రితం చెప్పినదానికి అనుగుణ్యంగా ఉంటుంది: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడ[దు].”​—మత్తయి 19:6.

ఎవరైనా ఇలా అనవచ్చు, ‘కానీ చూడండి, మేమిద్దరం ఇంకా కలిసే ఉన్నాం. మాకు నిబద్ధతా భావాలు ఉన్నాయని ఇది చూపించడం లేదా?’ కావచ్చేమో. అయితే, ఈ ఆర్టికల్‌ల పరంపర తొలిభాగంలో చెప్పినట్లుగా కలిసి జీవించే కొందరు దంపతులు సమస్యల వలయాల్లో, ప్రేమరహిత వివాహబంధాల్లో చిక్కుకుపోయివున్నారు. కానీ మీ లక్ష్యం మీ వివాహాన్ని ఆనందదాయకంగా చేసుకోవడమే గాని, కేవలం సహించదగినదిగా చేసుకోవడం మాత్రమే కాదు. కేవలం వివాహ వ్యవస్థ పట్ల మాత్రమే కాక, ప్రేమిస్తాననీ ప్రియంగా ఎంచుతాననీ ప్రమాణం చేసిన వ్యక్తి పట్ల కూడా యథార్థతతో ఉంటున్నట్లు నిబద్ధతలో ప్రతిబింబించాలి.​—ఎఫెసీయులు 5:33.

మీరు మీ భార్య/భర్తతో అనే మాటల్లోనే మీ నిబద్ధత ఎంత లోతైనదిగా ఉందో వెల్లడికాగలదు. ఉదాహరణకు, వాగ్వివాదం జరుగుతున్నప్పుడు కోపంలో కొందరు భర్తలు భార్యలు, “నేన్నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను!” లేక, “నేనంటే విలువిచ్చే వ్యక్తిని నేను వెదుక్కుంటాను!” అని దూకుడుగా అనేస్తారు. అలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు వారు నిజంగానే అలా చేయనుద్దేశించకపోయినా, ద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉందనీ, అలా అనే వ్యక్తి దాని గుండా బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడనీ సూచిస్తూ అవి నిబద్ధతను బలహీనపరుస్తాయి.

మీ వివాహంలో ప్రేమాభిమానాల్ని తిరిగి నెలకొల్పుకోవాలంటే మీ సంభాషణల్లో నుండి అలాంటి బెదిరింపుల్ని తొలగించుకోండి. ఆలోచించండి, మీరు మీ అపార్ట్‌మెంటును ఏ రోజునైనా ఖాళీ చేయాల్సి వస్తుందని మీకు తెలిస్తే దాన్ని చక్కగా అలంకరిస్తారా? అలాంటప్పుడు, నిలిచివుండబోని వివాహాన్ని మెరుగుపర్చుకోవడానికి మీ జీవితభాగస్వామి కృషిచేయాలని మీరెందుకు ఆశించడం? పరిష్కారాల కోసం మీరు పూర్ణహృదయంతో కృషిచేస్తానని మీ మనస్సులో నిర్ధారించుకోండి.

తన భర్తతో సంక్షోభభరితమైన కాలాన్ని గడిపిన తర్వాత ఒక భార్య అలా చేసింది. “నేనాయన్ని ఎన్నోసార్లు అయిష్టపడినా, మా సంబంధాన్ని తెంచేసుకోవడం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు” అని అంటుందామె. “లోపాలెక్కడ ఉన్నా ఏదో ఒకవిధంగా వాటిని సరిదిద్దుకోవాలనే మేం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు, ఎంతో వేదనభరితమైన రెండు సంవత్సరాల తరువాత మేమిప్పుడు మళ్ళీ ఎంతో సంతోషంగా కలిసి ఉన్నామని నేను నిజాయితీగా చెప్పగలను.”

అవును, నిబద్ధతకు కలిసికట్టుగా కృషిచేయడం అవసరం​—కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదుగానీ ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయడం అందులో ఇమిడివుంది. అయితే ఈ సమయంలో కేవలం బాధ్యత మాత్రమే మీ వివాహాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుందని మీరు భావిస్తుండవచ్చు. అలాగైతే మీరు నిస్పృహకు లోనుకావాల్సిన అవసరం లేదు. మీ ప్రేమను మళ్ళీ పునరుజ్జీవింపజేయడం సాధ్యం కావచ్చు. ఎలా?

మీ భార్యకు/భర్తకు ఘనతనివ్వడం

బైబిలు ఇలా చెబుతుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా . . . ఉండవలెను.” (హెబ్రీయులు 13:4; రోమీయులు 12:10) ఇక్కడ ‘ఘనత’ అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క కొన్ని రూపాలు బైబిలులో కొన్నిచోట్ల “ఘనతనొందిన” అని, “ప్రియమైనదిగా ఎంచు” అని, “వెలగల” అని అనువదించబడ్డాయి. మనం దేన్నైనా చాలా విలువైనదిగా ఎంచినప్పుడు మనం దాని పట్ల శ్రద్ధ వహించడానికి ఎంతో శ్రమపడతాము. ఉదాహరణకు, ఒక ఖరీదైన కారు ఉన్న వ్యక్తి విషయంలో అది వాస్తవమని మీరు గమనించే ఉంటారు. అదెప్పుడూ మిలమిలా మెరిసిపోతుండేలా మంచి కండీషన్‌లో ఉండేలా ఆయన చూస్తాడు. ఆయనకు, తన క్రొత్త కారు మీద చిన్న గీత పడినా అది పెద్ద యాక్సిడెంట్‌తో సమానమే! మరి కొందరు తమ ఆరోగ్యం విషయంలో అలాంటి జాగ్రత్తలే తీసుకుంటారు. ఎందుకని? ఎందుకంటే వారు తమ సంక్షేమానికి చాలా విలువ ఇస్తారు, అందుకని దాన్ని అలాగే కాపాడుకోవాలని కోరుకుంటారు.

మీ వివాహానికి కూడా అలాంటి కాపుదలతో కూడిన శ్రద్ధనే చూపించండి. ప్రేమ “అన్నిటిని నిరీక్షించును” అని బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 13:7) ఓటమినంగీకరించేసే వైఖరి కలిగివుండడానికి బదులుగా​—బహుశా “మేము నిజంగా ప్రేమలో ఎప్పుడూ పడలేదు” అనో, “మేం చాలా చిన్న వయస్సులోనే పెళ్ళిచేసేసుకున్నాము” అనో, “మేం చేస్తున్నదేంటో మేమర్థం చేసుకోలేకపోయాం” అనో అంటూ మెరుగయ్యే సాధ్యత ఏమాత్రం లేదని తీసిపారేయడానికి బదులుగా మంచి జరుగుతుందని నిరీక్షిస్తూ పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి ఎందుకు కృషిచేయకూడదు, ఫలితాల కోసం ఓపికగా ఎందుకు వేచివుండకూడదు? “నా క్లయింట్లలో చాలామంది ‘నేనింక తాళుకోలేను’ అనడం నేను వింటుంటాను” అని ఒక వివాహసలహాదారు అంటుంది. “ఏయే అంశాల్లో మెరుగుపర్చుకోవల్సిన అవసరం ఉందో చూడడానికిగాను తమ సంబంధాన్ని విశ్లేషించడానికి బదులు, వారు మరీ ఎక్కువగా శ్రమపడాల్సివస్తుందంటూ పూర్తి వివాహ ఏర్పాటునే తొందరపాటుతో త్యజించేస్తారు. చివరికి తామిద్దరికీ ఉన్న ఒకేరకమైన విలువల్నీ, తామిద్దరూ జాగ్రత్తగా నిర్మించుకున్న చరిత్రనూ, భవిష్యత్తు కోసమైన ఆశల్నీ అన్నింటినీ విడనాడతారు.”

మీరు మీ జీవితభాగస్వామితో కలిసి ఎటువంటి చరిత్రను నిర్మించుకున్నారు? మీ అనుబంధంలో కొన్ని కష్టకాలాలున్నప్పటికీ, మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపిన సందర్భాలు, సాధించిన కార్యాలు, జంటగా ఎదుర్కొన్న సవాళ్ళు తప్పకుండా ఉండివుంటాయి. ఆ సందర్భాలను గురించి తలపోయండి, మీరు మీ సంబంధాన్ని మెరుగుపర్చుకోవడానికి నిజాయితీగా కృషిచేస్తూ మీ వివాహానికీ వివాహ భాగస్వామికీ ఘనతనివ్వండి. వివాహ భాగస్వాములు ఒకరి పట్ల ఒకరు ఎలా వ్యవహరిస్తారన్న విషయంలో యెహోవా దేవుడు ఎంతో ఆసక్తిని కలిగివున్నాడని బైబిలు చూపిస్తుంది. ఉదాహరణకు, ప్రవక్తయైన మలాకీ రోజుల్లో ఇశ్రాయేలులో చిన్న చిన్న కారణాలకే తమ భార్యలకు విడాకులిచ్చేస్తున్న భర్తలను యెహోవా తీవ్రంగా ఖండించాడు. (మలాకీ 2:13-16) తమ వివాహం యెహోవా దేవునికి ఘనతను తీసుకురావాలని క్రైస్తవులు కోరుకుంటారు.

సంఘర్షణ​—ఎంత తీవ్రమైనది?

ప్రేమరహిత వివాహాలకు ఒక ముఖ్య కారకం భార్యాభర్తలకు సంఘర్షణలతో వ్యవహరించే సామర్థ్యం లేకపోవడమన్పిస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులూ పూర్తిగా ఒకేలా ఉండరు కాబట్టి అన్ని వివాహాల్లోనూ అప్పుడప్పుడూ అభిప్రాయభేదాలు వస్తుంటాయి. కానీ ఎప్పుడు చూసినా కీచులాడుకుంటూ ఉండే దంపతులు కొన్ని సంవత్సరాల తర్వాత తమ మధ్య ప్రేమ చల్లారిపోయిందని గుర్తించవచ్చు. చివరికి వారు, ‘మా జోడీ సరైనది కాదంతే. మేమెప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటాము!’ అని ఒక ముగింపుకు వచ్చేస్తారు.

అయితే కేవలం సంఘర్షణలే వివాహానికి చిచ్చుగా పరిణమించాల్సిన అవసరం లేదు. ప్రశ్నేమిటంటే, సంఘర్షణ వచ్చినప్పుడు దానితో ఎలా వ్యవహరించడం జరుగుతోంది? విజయవంతమైన వివాహాల్లో భార్యాభర్తలు తమ సమస్యల్ని గురించి చర్చించడం నేర్చుకున్నారు, ఒక డాక్టరు చెప్పినట్లుగా వారు “సన్నిహిత శత్రువులు” కాలేదు.

“నాలుక వశము”లో ఉన్నవి

మీకూ మీ జీవిత భాగస్వామికీ మీ సమస్యల గురించి చర్చించుకోవడం వచ్చునా? వాటిని గురించి చర్చించడానికి ఇద్దరూ ఇష్టపడాలి. దానికి నిజంగా నైపుణ్యం అవసరం​—దాన్ని నేర్చుకోవడం సవాలుదాయకంగా ఉండగలదు. ఎందుకని? ఒక కారణం ఏమిటంటే, మనమందరమూ అపరిపూర్ణులమే గనుక, మనలో ప్రతి ఒక్కరమూ అప్పుడప్పుడు ‘మాటయందు తప్పుతూ’ ఉంటాము. (యాకోబు 3:2) అంతేగాక, తల్లిదండ్రులు తమ కోపాన్ని చాలా తరచుగా వ్యక్తం చేసిన గృహాల్లో కొందరు పెరిగారు. ఒక విధంగా చెప్పాలంటే, కోపంతో ఎగిరిపడడం, దూషణకరంగా మాట్లాడడం చాలా సహజమని నమ్మేలా వీరికి పిన్నవయస్సు నుండే శిక్షణ లభించింది. అలాంటి వాతావరణంలో పెరిగిన ఒక పిల్లవాడు ‘కోపిష్ఠిగా’ “ముంగోపి”గా తయారయ్యే అవకాశం ఉంది. (సామెతలు 29:22) అలాగే, అలాంటి పెంపకంలో పెరిగిన అమ్మాయి “నిష్ఠురమైన మాటలు మాట్లాడేదిగా కోపిష్ఠిగా” తయారుకావచ్చు. (సామెతలు 21:19, ద బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌) చాలా బలంగా పాతుకుపోయిన ఆలోచనా విధానాల్నీ, ప్రవర్తననూ పెరికివేయడం కష్టంగా ఉండవచ్చు. *

కాబట్టి, సంఘర్షణతో వ్యవహరించడంలో ఒక వ్యక్తి తన ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి క్రొత్త మార్గాల్ని నేర్చుకోవడం ఇమిడివుంది. ఇది అల్పమైన విషయం కాదు, ఎందుకంటే ఒక బైబిలు సామెత ఇలా చెబుతుంది: “జీవమరణములు నాలుక వశము.” (సామెతలు 18:21) అవును, చిన్న విషయంగానే ధ్వనిస్తుండవచ్చు కానీ, మీరు మీ భార్యతో/భర్తతో ఎలా మాట్లాడతారు అన్నది మీ సంబంధాన్ని సర్వనాశనమూ చేయవచ్చు, దాన్ని కాపాడనూవచ్చు. “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు” అని మరో బైబిలు సామెత చెబుతుంది, కానీ “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.”—సామెతలు 12:18.

ఈ విషయంలో ప్రధానంగా మీ జీవిత భాగస్వామి దోషిగా ఉన్నప్పటికీ ఏదైనా అభిప్రాయభేదం వచ్చినప్పుడు మీరు ఏమి మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ మాటలు గాయపరుస్తాయా లేక అవి స్వస్థపరుస్తాయా? అవి కోపాన్ని రేకెత్తిస్తాయా లేక దాన్ని చల్లారుస్తాయా? “నొప్పించు మాట కోపమును రేపును” అంటుంది బైబిలు. దానికి విరుద్ధంగా “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.” (సామెతలు 15:1) అయితే, నొప్పించే మాటలు​—శాంతంగా పలికినా​—అగ్నికి ఆజ్యం పోస్తాయి.

నిజమే, ఏదైనా మీకు కలత కలిగించినప్పుడు మిమ్మల్ని మీరు వ్యక్తం చేసుకునే హక్కు మీకుంది. (ఆదికాండము 21:9-12) కానీ మీరు హేళనగా, అవమానకరంగా మాట్లాడకుండానే, సిగ్గుపరచకుండానే అలా చేయవచ్చు. మీకై మీరు ఖచ్చితమైన హద్దుల్ని నియమించుకోండి​—“నీవంటే నాకు అసహ్యం పుడుతుంది” లేక, “మనకసలు పెళ్ళి కాకపోయివుంటే ఎంత బాగుండునా అనుకుంటున్నాను” వంటి మాటలు మీ జీవిత భాగస్వామితో అనకుండా ఉండాలని తీర్మానించుకోండి. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు స్పష్టంగా వివాహాన్ని గురించే చర్చిస్తుండకపోయినా, ‘వాగ్వాదములు’ అలాగే “వ్యర్థవివాదములు” అని ఆయన పిలిచినవాటిలో చిక్కుకుపోవడాన్ని నివారించడం జ్ఞానయుక్తం. * (1 తిమోతి 6:4, 5) మీ భార్య/భర్త అలాంటి పద్ధతుల్ని ఉపయోగించినప్పుడు మీరూ అదేవిధంగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంత మట్టుకు శాంతిని వెంటాడండి.​—రోమీయులు 12:17, 18; ఫిలిప్పీయులు 2:14, 15.

కోపావేశాలు పెల్లుబికినప్పుడు మాటల్ని అదుపులో పెట్టుకోవడం కష్టమని ఒప్పుకోవల్సిందే. “నాలుక అగ్నియే” అని బైబిలు రచయితైన యాకోబు వ్రాస్తున్నాడు. “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.” (యాకోబు 3:6, 8) మరైతే కోపం రేగడం ప్రారంభమైనప్పుడు మీరేమి చేయవచ్చు? సంఘర్షణను రేకెత్తించడానికి బదులుగా దాన్ని రూపుమాపే విధంగా మీరు మీ భాగస్వామితో ఎలా మాట్లాడవచ్చు?

వాగ్వివాదాల్ని రూపుమాపడం

తన భార్య/భర్త చేసిన చర్యల కన్నా తన భావాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లైతే కోపాన్ని తగ్గించుకుని, వివాదాంశాల్ని పరిశీలించుకోవడం సులభంగా ఉంటుందని కొందరు కనుగొన్నారు. ఉదాహరణకు, “నీవు నన్ను గాయపర్చావు” లేక, “అలా అనకూడదని నీకు తెలీదూ?” అనడంకన్నా “నీవన్న మాటల మూలంగా నా మనస్సు గాయపడింది” అనడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక్క మాట, మీరెలా భావిస్తున్నారో వ్యక్తం చేస్తున్నప్పుడు మీ స్వరంలో నిష్ఠురము, క్రోధము ధ్వనించకూడదు. అవతలి వ్యక్తిపై దాడి చేయడానికి బదులుగా సమస్యేమిటో స్పష్టంగా చెప్పడమే మీ లక్ష్యమైవుండాలి.​—ఆదికాండము 27:46–28:1.

దానికి తోడు, “మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయం ఉందని ఎల్లప్పుడు గుర్తుంచుకోండి. (ప్రసంగి 3:7) ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరూ వినలేరు, ఏమీ ఒరగదు. కాబట్టి వినాల్సిన వంతు మీదైనప్పుడు “వినుటకు వేగిరపడువా[రు]ను, మాటలాడుటకు నిదానించువా[రు]ను” అయివుండండి. అదే విధంగా, “కోపించుటకు నిదానించువా[రు]నై” ఉండడం కూడా చాలా ప్రాముఖ్యం. (యాకోబు 1:19) మీ భార్య/భర్త అనే ప్రతి కఠినమైన మాటనూ మీరు అక్షరార్థంగా తీసుకోవద్దు; అలాగే “ఆత్రపడి కోపపడవద్దు.” (ప్రసంగి 7:9) బదులుగా, మీ భాగస్వామి మాటల వెనుకనున్న భావాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. “ఒకని సుబుద్ధి [“అంతర్దృష్టి” NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును” అని చెబుతుంది బైబిలు. (సామెతలు 19:11) అంతర్దృష్టి భార్యకు లేక భర్తకు పలాని అభిప్రాయభేదానికి అడుగున అసలు ఏముందో చూడడానికి సహాయపడుతుంది.

ఉదాహరణకు, తన భర్త తనతో సమయం గడపడం లేదన్న భార్య ఫిర్యాదు బహుశా కేవలం గంటల గురించో లేక నిమిషాల గురించో కాకపోవచ్చు. దానికి చాలామట్టుకు కారణం ఆమె భావాల్ని లక్ష్యపెట్టడం లేదనో లేక వాటిని గుణగ్రహించడం లేదనో కావచ్చు. అదేవిధంగా, ఒక భర్త తన భార్య కనబడిందే తడవు ఏదైనా వస్తువును కొనేసినప్పుడు ఆయన పడే బాధ బహుశా కేవలం రూపాయల గురించో లేక నయాపైసల గురించో కాకపోవచ్చు. తాను లేకుండానే దాన్ని కొనాలన్న నిర్ణయం తీసుకోవడాన్ని గురించే కావచ్చు. అంతర్దృష్టి ఉన్న భార్యాభర్తలు లోపలికంటా శోధించి సమస్యకు మూలకారకాన్ని కనుగొంటారు.​—సామెతలు 16:23, NW.

చెప్పడం చేయడం కన్నా సులభమా? అవును నిజమే! కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినప్పటికీ నిర్దయతో కూడిన మాటలు నోట్లోనుండి బయటికి వస్తాయి, కోపావేశాలు పెల్లుబుకుతాయి. ఇలా జరగడం ప్రారంభమైనప్పుడు, “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము” అని చెప్తున్న సామెతలు 17:14 లోని సలహాని మీరు అనుసరించాల్సి రావచ్చు. భావావేశాలు కాస్త చల్లబడేంత వరకు చర్చను వాయిదా వేయడంలో తప్పేమీ లేదు. పరిస్థితులు చేతులు దాటిపోకుండా ఉంచుతూ మాట్లాడడం కష్టంగా ఉంటుంటే, పరిణతి చెందిన ఒక స్నేహితుడు మీ ఇద్దరితోపాటు కూర్చుని, మీరు మీ విభేదాల్ని పరిష్కరించుకోవడానికి మీకు సహాయం చేయనివ్వడం శ్రేయస్కరం కావచ్చు. *

వాస్తవిక దృక్కోణం కలిగివుండండి

వివాహానికి ముందు కలిసి సమయం గడుపుతున్నప్పుడు ఊహించుకున్న విధంగా మీ వివాహం ఉండనట్లైతే నిరాశ చెందకండి. నిపుణుల ఒక బృందం ఇలా చెబుతుంది: “అత్యధికుల విషయంలో వివాహం అత్యానందభరితమైనదిగా లేదు. అది కొన్నిసార్లు అద్భుతమనిపించవచ్చు, మరి కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉండవచ్చు.”

అవును, కథల పుస్తకాల్లో ఉన్నట్లుగా వివాహం రొమాన్స్‌తో కూడినదిగా ఉండకపోవచ్చు, కానీ అదే సమయంలో అది విషాదభరిత గాథగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు సహించక తప్పని సమయాలు కూడా ఉంటాయి, అయినా మీ విభేదాల్ని ప్రక్కకు పెట్టి, కలిసివుండడంలోని ఆనందాన్ని అనుభవించే సందర్భాలు, సరదాగా గడిపే సమయాలు, స్నేహితులుగా కలిసి మాట్లాడుకునే సమయాలు కూడా ఉంటాయి. (ఎఫెసీయులు 4:1, 2; కొలొస్సయులు 3:13) మీ మధ్య ఒకప్పుడున్న ప్రేమజ్వాలను తిరిగి రగిలించడం ఇలాంటి సమయాల్లోనే మీకు సాధ్యమౌతుంది.

గుర్తుంచుకోండి, ఇద్దరు అపరిపూర్ణ మానవులకు ఒక పరిపూర్ణ వివాహజీవితాన్ని అనుభవించడం సాధ్యం కాదు. కానీ వారు తగినంత ఆనందాన్ని అనుభవించగలరు. నిజానికి, కష్టాలున్నప్పటికీ మీ ఇద్దరి మధ్యనున్న సంబంధం నుండి మీరు అపారమైన సంతృప్తిని పొందవచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం: మీరూ మీ జీవితభాగస్వామి గట్టి కృషిచేస్తే, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉంటే, అవతలివ్యక్తి ప్రయోజనాన్ని కోరితే, మీ వివాహం కాపాడబడగలదని నమ్మడానికి తగిన కారణం ఉంది.​—1 కొరింథీయులు 10:24.

(g01 1/8)

[అధస్సూచీలు]

^ తన భార్యతో/భర్తతో కఠినంగా మాట్లాడడానికి తల్లిదండ్రుల ప్రభావం ఒక సాకు కాకూడదు. అయితే, అలాంటి వైఖరి ఎంతగా వ్యక్తిత్వంలో నాటుకుపోగలదో దాన్ని పెకిలించివేయడం ఎంత కష్టంగా ఉంటుందో వివరించడం సహాయకరంగా ఉండవచ్చు.

^ “వ్యర్థవివాదములు” అని అనువదించబడిన మూల గ్రీకు పదాన్ని “పరస్పర వేధింపులు” అని కూడా అనువదించవచ్చును.

^ యెహోవాసాక్షులకు సంఘ పెద్దల ఏర్పాటు ఉంది. వివాహితుల వ్యక్తిగత వ్యవహారాల్లో కలుగజేసుకోవడం వారి పని కానప్పటికీ, విపద్దశలో ఉన్న దంపతులకు పెద్దలు సేదదీర్పునిచ్చే సహాయకంగా ఉండగలరు.​—యాకోబు 5:14, 15.

[12వ పేజీలోని బ్లర్బ్‌]

మీ మాటలు గాయపరుస్తాయా లేక స్వస్థపరుస్తాయా?

[10వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

బంతిని సుతారంగా వేయండి

బైబిలు ఇలా చెబుతుంది: “మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) ఇది వివాహంలో నిశ్చయంగా వర్తిస్తుంది! దృష్టాంతంగా చెప్పాలంటే: బంతాటలో మీరు అవతలి వ్యక్తి బంతిని సులభంగా పట్టుకునేలా వేస్తారు. మీ భాగస్వామికి దెబ్బ తగిలేంత బలంతో దాన్ని విసిరికొట్టరు. అదే సూత్రాన్ని మీ భార్యతో/భర్తతో మాట్లాడడానికి అన్వయించండి. నిష్ఠురపెట్టే మాటలు మీ నోటి నుండి దూసుకు వస్తే అవి కేవలం హానిని మాత్రమే చేయగలవు. దానికి బదులుగా, మృదువుగా మాట్లాడండి​—కృపాసహితంగా మాట్లాడండి​—అప్పుడు మీ భాగస్వామి మీరు చెప్పే విషయాన్ని చక్కగా గ్రహిస్తారు.

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

మధురస్మృతుల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి!

గతకాలంలోని ఉత్తరాలను కార్డులను చదవండి. ఫోటోలు చూడండి. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘నన్ను నా భార్య/భర్త వైపుకు ఆకర్షించిందేమిటి? నేను ఎంతగానో మెచ్చుకున్న లక్షణాలేమిటి? మేమిద్దరమూ ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాము? మేమిద్దరమూ ఎలాంటి సందర్భాల్లో హృదయపూర్వకంగా నవ్వుకున్నాము?’ అటుతర్వాత వీటి గురించి మీ జతతో మాట్లాడండి. “నీకు గుర్తుందా, ఆ రోజు . . . ?” అని ప్రారంభమయ్యే సంభాషణ, మీరూ మీ భాగస్వామి ఒకప్పుడు పంచుకున్న భావాల్ని పునరుజ్జీవింప చేసుకోడానికి సహాయపడవచ్చు.

[12వ పేజీలోని బాక్సు]

వేరే భార్య/భర్త​—అవే సమస్యలు

ప్రేమరహిత వివాహంలో కూరుకుపోయినట్లు భావించే కొందరు దంపతులు, మరో భాగస్వామితో తిరిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న శోధనకు లోనౌతారు. కానీ బైబిలు వ్యభిచారాన్ని ఖండిస్తుంది, ఈ పాపంలో పడే వ్యక్తి “కేవలము బుద్ధిశూన్యుడు [“బుద్ధిలేని మూర్ఖుడు,” న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌],” ‘స్వనాశనమును కోరువాడు’ అని చెబుతుంది. (సామెతలు 6:32) చివరికి, పశ్చాత్తాపం చెందని వ్యభిచారి దేవుని అనుగ్రహాన్ని కోల్పోతాడు​—ఇది మనకు సంభవించగల ఘోరాతి ఘోరమైన వినాశనం.​—హెబ్రీయులు 13:4.

వ్యభిచార మార్గంలో ఉన్న ఘోరమైన బుద్ధిహీనత వేరే ఇతర మార్గాల్లో కూడా ప్రదర్శితమౌతుంది. ఒకటేమిటంటే, వేరే స్త్రీని పెళ్ళి చేసుకునే వ్యభిచారి, తన తొలి వివాహాన్ని పట్టి పీడించిన అవే సమస్యల్ని ఎదుర్కోవచ్చు. డా. డయేన్‌ మెడ్‌వెడ్‌ పరిగణలోనికి తీసుకోవల్సిన మరో విషయాన్ని చూపిస్తుంది: “మీ గురించి మీ క్రొత్త భార్య/భర్తకు తెలిసే మొట్టమొదటి విషయం, మీరు విశ్వాసఘాతుకం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నదే. ఘనంగా దృష్టిస్తానని వాగ్దానం చేసిన వ్యక్తిని మీరు మోసం చేయగలరని ఆమెకు లేదా ఆయనకు తెలుసు. సాకులు చెప్పడంలో మీరు నైపుణ్యం సాధించారని తెలుసు. నిబద్ధత నుండి వీడిపోయే సాధ్యత ఉందని తెలుసు. శారీరక ఆనందం లేదా అహాన్ని తృప్తిపర్చడం వంటివి మీపై ఎరగా ఉపయోగిస్తే మీరు పడిపోతారని తెలుసు. . . . మీరు మళ్ళీ ప్రలోభానికి గురికారని భార్య/భర్త నెంబరు రెండుకి ఎలా తెలుసు?”

[14వ పేజీలోని బాక్సు]

బైబిలు సామెతలలోని జ్ఞానయుక్తమైన మాటలు

సామెతలు 10:19: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.”

మీరు అశాంతిగా ఉన్నప్పుడు మీరు ఉద్దేశించని మాటల్ని కూడా అనేసే అవకాశం ఉంది​—తర్వాత పశ్చాత్తాపపడతాం.

సామెతలు 15:18: “కోపోద్రేకియగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.”

శూలాల్లా గుచ్చుకునే ఆరోపణలు చేసినప్పుడు మీ భార్య/భర్త తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది, అలాకాక ఓర్పుగా వినడం మీ ఇద్దరూ ఒక పరిష్కారానికి రావడానికి సహాయం చేస్తుంది.

సామెతలు 17:27: “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.”

మీలో కోపం పెల్లుబుకుతుందని గ్రహించినప్పుడు పెద్ద యుద్ధం జరగడాన్ని నివారించడానికిగాను మౌనంగా ఉండిపోవడం మంచిది.

సామెతలు 29:11: “బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును, జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.”

ఆత్మనిగ్రహం ఎంతో ఆవశ్యకం. నిగ్రహాన్ని కోల్పోయి కఠినమైన మాటలు మాట్లాడడం మీ జతకు మిమ్మల్ని దూరం చేయడానికి మించి సాధించేదేమీ లేదు.