కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు నా ప్రార్థనలు వింటాడా?

దేవుడు నా ప్రార్థనలు వింటాడా?

యువత ఇలా అడుగుతోంది . . .

దేవుడు నా ప్రార్థనలు వింటాడా?

“నేను దేని గురించైనా సరే ప్రార్థన చేస్తాను, ఎందుకంటే యెహోవా నా స్నేహితుడు, నాకేదైనా సమస్య వస్తే ఆయన సహాయం చేస్తాడని నాకు తెలుసు.”​—ఆండ్రీయా.

ఆండ్రీయా అనే ఈ అమ్మాయికి దేవుడు తన ప్రార్థనలను వింటాడని గట్టి నమ్మకం ఉంది. కానీ యౌవనస్థులందరికీ అలాంటి నమ్మకం లేదు. తాము దేవుణ్ణి సమీపించలేనంత దూరంలో ఉన్నామని కొందరు భావిస్తారు. దేవుడు అసలు తమను పట్టించుకుంటాడా, ప్రార్థన చేయడం అసలు ప్రయోజనకరమేనా అని కూడా వారు తలస్తుంటారు.

ప్రార్థనలోని రహస్యమేమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, అది దేవునితో నిజమైన స్నేహాన్ని కలిగివుండడమే. కీర్తనకర్త ఇలా ప్రార్థించాడు: “నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు.” (కీర్తన 9:10) మీ విషయమేమిటి? మీరు ఆయనకు ప్రార్థించేంతగా, ఆయన మీ ప్రార్థనలు వింటాడని నమ్మేంతగా ఆయన గురించి మీరు ఎరుగుదురా? ఇంకా చదవడానికి ముందు మీరు “దేవుని గురించి మీకెంత వరకు తెలుసు?” అన్న శీర్షిక ఉన్న బాక్సులోని ప్రశ్నలకు జవాబులివ్వడానికి ప్రయత్నించండి. ఎన్నింటికి మీరు జవాబివ్వగలరు?

దేవుని గురించి మీకెంత వరకు తెలుసు? జవాబులు 13వ పేజీలో

1. దేవుని పేరేమిటి, దానర్థం ఏమిటి?

2. దేవుని నాలుగు ప్రధాన లక్షణాలేమిటని బైబిలు వెల్లడిస్తోంది?

3. మానవజాతి పట్ల దేవుడు చూపిన ప్రేమకు అత్యంత గొప్ప వ్యక్తీకరణ ఏమిటి?

4. మనం దేవునితో స్నేహాన్ని ఎలా ఆనందించవచ్చు?

5. మనం ప్రార్థించేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి?

ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవడానికి ముందు ఇప్పుడే కనీసం కొన్నింటికైనా మీరు జవాబులు చెప్పగలిగారా? చెప్పినట్లైతే, దేవుని గురించి చాలామందికి తెలిసిన దానికన్నా మీకు ఎక్కువే తెలుసు. లేదా, బహుశ ఆయన గురించి ఇంకా ఎక్కువగా మరింత సన్నిహితంగా తెలుసుకోవలసిన అవసరం ఉందని మీ జవాబులు వెల్లడిచేస్తుండవచ్చు. (యోహాను 17:3) ఆ లక్ష్యం దిశగా, ‘ప్రార్థన ఆలకించువాని’ గురించి బైబిలు మనకు బోధించే వాటిలో కేవలం కొన్ని విషయాలను పరిశీలించండి.​—కీర్తన 65:2.

దేవుడు నిజమైన వ్యక్తి

మొట్టమొదటిగా, దేవుడు ఏదో అశరీర శక్తి కాదని అర్థం చేసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఆయన యెహోవా అనే పేరుగల ఒక వ్యక్తి. (కీర్తన 83:18) హీబ్రూలో ఆ పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమి అవ్వాల్సిన అవసరం ఉందో అది ఆయన అవ్వగలడు. అశరీర శక్తి ఎంత అపరిమితమైనదైనా అలా అవ్వలేదు! కాబట్టి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీరేదో అశరీర శక్తితోనో లేదా గాలిలోకో మాట్లాడడం లేదని గట్టి నమ్మకం కలిగివుండవచ్చు. మీరొక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఆయన మీ ప్రార్థనలు వినగలడు, ప్రతిస్పందించగలడు కూడా.​—ఎఫెసీయులు 3:20.

యౌవనస్థురాలైన డయానా ఇలా అంటోంది: “నేనెక్కడున్నా యెహోవా వింటాడని నాకు తెలుసు.” ఆ నమ్మకం మీలో ఏర్పడాలంటే, దేవుడు మీకు నిజమైన వ్యక్తిగా ఉండాలి! ‘దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడని నమ్మవలెను’ అని చెబుతోంది బైబిలు.​—హెబ్రీయులు 11:6.

జ్ఞానానికి శక్తికి మూలము

దేవుడు మనకు నిజంగా సహాయం చేయగలడు, ఎందుకంటే ఆయన దగ్గర సంభ్రమాశ్చర్యాలను కలిగించే శక్తి ఉంది. ఆ శక్తి అపరిమితమైనది, మన చుట్టూ ఉన్న విశ్వ పరిమాణం ఎంత పెద్దగా ఉందో ఎంత సంక్లిష్టంగా ఉందో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నక్షత్రాల సంఖ్య కోటాను కోట్లుగా ఉన్నా వాటిలో ప్రతి నక్షత్రం పేరు యెహోవాకు తెలుసని బైబిలు చెబుతోంది! అంతే కాదు, ఆ నక్షత్రాల్లో నిబిడీకృతమై ఉన్న శక్తి అంతటికీ ఆయనే మూలం. (యెషయా 40:25, 26) అదెంత అద్భుతకరమైన విషయమో కదా? ఈ వాస్తవాలెంత విస్మయం గొలిపేవైనప్పటికీ “ఈ కార్యములన్నియు అతని శక్తికి సూచకములు మాత్రమే” అని బైబిలు చెబుతోంది!​—యోబు 26:14, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము.

యెహోవా అపరిమితమైన జ్ఞానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోండి. ఆయన ఆలోచనలు “అతిగంభీరములు” అని బైబిలు అంటోంది. (కీర్తన 92:5) మానవులను చేసింది ఆయనే, గనుక మన గురించి మనకన్నా ఆయనే బాగా అర్థం చేసుకోగలడు. (కీర్తన 100:3) ఆయన “యుగయుగములు” ఉనికిలో ఉన్నవాడు గనుక ఆయన అనుభవానికి అవధుల్లేవు. (కీర్తన 90:1, 2) ఆయన అవగాహనకు మించినదేదీ లేదు.​—యెషయా 40:13, 14.

యెహోవా ఆ శక్తినీ ఆ జ్ఞానాన్నీ ఎలా ఉపయోగిస్తాడు? 2 దినవృత్తాంతములు 16:9 ఇలా చెబుతోంది: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” దేవుడు పరిష్కరించలేనంతటి లేదా తాళుకోవడానికి సహాయం చేయలేనంతటి సమస్య అంటూ ఏదీ లేదు. కేలా అనే అమ్మాయి ఇలా గుర్తు తెచ్చుకుంటోంది: “ఇటీవల మా కుటుంబం చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంది, నేను యెహోవాకు ప్రార్థన చేశాను. ఆయన ఆ పరిస్థితులను, సమస్యలను, భావోద్రేకాలను సహించడానికి సహాయం చేశాడని నేనిప్పుడు అనుకుంటున్నాను. ఆయనే లేకపోయుంటే మేము వాటిని సహించగలిగేవాళ్ళం కాదు.” మీరు దేవునితో మాట్లాడినప్పుడు జ్ఞానానికి మూలమైన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అంతకంటే శ్రేష్ఠమైనదేమీ లేదు!

న్యాయవంతుడు, ప్రేమపూర్ణుడు అయిన దేవుడు

కానీ దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని మీకెలా తెలుసు? ఎలాగంటే, యెహోవా తనను తాను కేవలం అపరిమితమైన శక్తి ద్వారా, లోతైన జ్ఞానం ద్వారా, లేదా స్థిరమైన న్యాయం ద్వారా మాత్రమే గుర్తింపజేసుకోవడం లేదు. బదులుగా, యెహోవా ప్రాథమికంగా ప్రేమ అనే తన లక్షణం ద్వారా తెలియజేసుకుంటున్నాడు. “దేవుడు ప్రేమయై యున్నాడు” అని 1 యోహాను 4:8, అధస్సూచి చెబుతోంది. (ఇటాలిక్కులు మావి.) ఆ గొప్ప ప్రేమే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడనడానికి ఆధారంగా ఉంది. మనం నిత్యజీవాన్ని పొందేలా తన కుమారుణ్ణి విమోచన క్రయధన బలిగా ఇవ్వడమే ఆయన ప్రేమకు అతి గొప్ప వ్యక్తీకరణ.​—యోహాను 3:16; 1 యోహాను 4:9, 10.

దేవుడు ప్రేమయై ఉన్నాడు గనుక ఆయన మిమ్మల్ని అలక్ష్యం చేస్తాడనీ లేదా మీతో అన్యాయంగా ప్రవర్తిస్తాడనీ భయపడాల్సిన అవసరం లేదు. “ఆయన చర్యలన్నియు న్యాయములు” అని ద్వితీయోపదేశకాండము 32:4 చెబుతోంది. మీ పట్ల దేవునికి గల ప్రేమ ఆయన మీ ప్రార్థనలను వింటాడనడానికి గట్టి హామీగా ఉంది. దాని మూలంగా మన వ్యక్తిగతమైన ఆలోచనలను, లోతైన భావాలను ఆయనతో పంచుకోవడానికి మనం నిస్సంకోచంగా సిద్ధపడతాము.​—ఫిలిప్పీయులు 4:6, 7.

దేవునితో స్నేహం

నిజానికి తనతో మాట్లాడమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. మనకు అపరిచయస్థుడిగా ఉండిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. బదులుగా మానవ చరిత్రంతటిలో ప్రజలు తనతో స్నేహం చేయాలని ఆయన ఆహ్వానించాడు. దేవునితో స్నేహం చేసినవారిలో, ఆయన హృదయానికి అంగీకృతులైన వారిలో స్త్రీలు, పురుషులు, పెద్దవారు పిన్న వయస్కులవారు అందరూ ఉన్నారు. వారిలో అబ్రాహాము, దావీదు రాజు, యేసు తల్లి అయిన మరియ వంటివారున్నారు.​—యెషయా 41:8; లూకా 1:26-38; అపొస్తలుల కార్యములు 13:22.

మీరు కూడా యెహోవా స్నేహితుల్లో ఒకరు కాగలరు. అయితే, అలాంటి స్నేహానికి అర్థం, కేవలం మీకేదైనా కోరిక కలిగినప్పుడో లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడో అల్లావుద్దీన్‌ అద్భుత దీపపు భూతాన్ని పిలిచినట్లుగా ఆయనను పిలవడం కాదు. మన ప్రార్థనలు కేవలం మన అవసరాల చుట్టే తిరగకూడదు. మనకు దేవుని స్నేహం కావాలంటే కేవలం మన చిత్తం పట్ల మాత్రమే కాక ఆయన చిత్తం పట్ల కూడా ఆసక్తిని పెంపొందించుకోవాలి, అంతేకాదు ఆయన చిత్తాన్ని చేయాలి కూడా. (మత్తయి 7:21) అందుకే తమ ప్రార్థనలు దేవునికి ప్రాముఖ్యమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలని యేసు తన శిష్యులకు నేర్పించాడు. ఆయనిలా అన్నాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి,​—పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9, 10) మన ప్రార్థనల్లో స్తుతులు కృతజ్ఞతలు కూడా మెండుగా ఉండాలి!​—కీర్తన 56:12; 150:6.

అయితే మన అవసరాలు లేదా కోరికలు చాలా అల్పం లేదా చిన్నవని వాటి గురించి ప్రార్థించకూడదని మనమెప్పుడూ తలంచకూడదు. “నేను స్వేచ్ఛగా మాట్లాడదామని ప్రయత్నించాను, కానీ కొన్నిసార్లు మరీ సామాన్య విషయాల గురించి ప్రార్థిస్తూ దేవునికి విసుగు తెప్పించకూడదని భావించాను” అని స్టీవ్‌ అంటున్నాడు. మీరా విధంగా భావించడం ప్రారంభించినప్పుడు యేసు తన శిష్యులకు ఏమి బోధించాడో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి: “అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. . . . మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6, 7) ఈ మాటలు నిశ్చయతను కలిగించేలా లేవా?

కాబట్టి, మీరు యెహోవాను గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో ప్రార్థనలో ఆయనను సమీపించడానికి అంత ఎక్కువగా కదిలించబడుతున్నట్లు, మీకాయన సహాయం చేయగలడూ, చేస్తాడూ అన్న నమ్మకం అంత ఎక్కువగా కలుగుతున్నట్లు గ్రహిస్తారు. కాబట్టి, మీరు దేవుణ్ణి సమీపించేటప్పుడు మీ మనోవైఖరి ఎలా ఉండాలి? మీరు గౌరవప్రదంగా, నమ్రతగా, నిస్వార్థంగా ఉండాలి. భూమ్మీదున్న ఎవరైనా ఉన్నతాధికారిని మీరు గర్వంగా అగౌరవంగా ఏదైనా కోరినప్పుడు ఆయన వింటాడని అనుకుంటున్నారా? అలాగే యెహోవా కూడా తానూ తన ప్రమాణాలూ గౌరవించబడాలని ఆశిస్తున్నాడనడంలో, అప్పుడే మీ ప్రార్థనలకు జవాబిస్తాడనడంలో ఆశ్చర్యపోవల్సిందేమీ లేదు.​—సామెతలు 15:29.

దైవభయం గల వేలాదిమంది యౌవనస్థులు తమ హృదయాలను యెహోవా ఎదుట కుమ్మరించడమెలాగో నేర్చుకున్నారు. (కీర్తన 62:8) “యెహోవా నా ప్రార్థనలు విని జవాబిచ్చినప్పుడు ఆయనింకా నా స్నేహితునిగానే ఉన్నాడని నాకు మరింత నమ్మకం కలుగుతుంది” అంటున్నాడు బ్రెట్‌. మీ విషయం ఏమిటి? మీరు కూడా దేవునితో అదే విధమైన సంబంధాన్ని ఎలా అనుభవిస్తూ ఆనందించగలరు? ఇద్దరు క్రైస్తవ యౌవనస్థులు ఇలా వ్యాఖ్యానించారు:

రేచెల్‌: “యెహోవాకు దగ్గర కావడానికి ఆయన వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నేననుకుంటున్నాను, అలాంటి అధ్యయనం పట్ల అపేక్షను పెంపొందించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.”​—1 పేతురు 2:1-3.

జెన్నీ: “యెహోవా సేవలో ఎంతగా నిమగ్నమై ఉంటే ఆయనకు అంత సన్నిహితంగా ఉన్న భావన కలుగుతుందని నేననుకుంటున్నాను.”​—యాకోబు 4:8.

మీరెప్పుడైనా, ప్రార్థించడం మూలంగా అసలేమైనా ఒరుగుతుందా అని సందేహించారా? ఒక క్రైస్తవ యౌవనస్థుడు ఇలా చెబుతున్నాడు: “దేవుడు నాతో మాట్లాడితే లేదా నాకేదైనా సందేశాన్ని పంపిస్తే నేను దేవునికి మరింత సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తాను.” మనం ప్రార్థన చేసిన తర్వాత యెహోవా మనకి వినిపించేటట్లుగా జవాబివ్వడు కదా, మరి నిజానికి ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది? రాబోయే మరో సంచికలో దాని గురించి చర్చించబడుతుంది.(g01 6/22)

[13వ పేజీలోని బాక్సు]

11వ పేజీలోని ప్రశ్నలకు జవాబులు

1.యెహోవా. “తానే కర్త అవుతాడు” అని అర్థం.

2.ప్రేమ, శక్తి, న్యాయము, జ్ఞానము.

3.ఆయన తన ఏకైక కుమారుడు మన కోసం చనిపోవడానికి ఆయనను పంపించాడు.

4.కేవలం మన స్వంత అవసరాలనే ఆలోచించకుండా, దేవుని చిత్తంలోను దాన్ని చేయడంలోను ఆసక్తిని కలిగివుండడం ద్వారా.

5.మనం నమ్రతగా, గౌరవపూర్వకంగా, నిస్వార్థంగా ఉండాలి.

[12వ పేజీలోని చిత్రాలు]

బైబిలును అధ్యయనం చేయడం, సృష్టినుండి నేర్చుకోవడం మనం దేవుని గురించి బాగా తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి